TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
హైవేమీద ఓల్డ్ మోడల్ అంబాసిడర్ కారు వేగంగా పరుగులు తీస్తూంది. డ్రయివింగ్ సీట్లో రాకా వున్నాడు. రాంబాబు విండో దగ్గర కూర్చున్నాడు. మధ్యలో దీప కూర్చుని వుంది. వెనకాల చిన్నారావ్ కూర్చున్నాడు. రాంబాబు, చిన్నారావ్ లకి తెగ ఆనందంగా వుంది. దీప తమ చేతికి అంత ఈజీగా దొరుకుతుందని వాళ్ళు వూహించనేలేదు.. అంతా రాకా చలవే.
“చాలా థాంక్స్ రాకా" అన్నాడు రాంబాబు. అప్పటికి అలా ఎన్నిసార్లు అన్నాడో లెక్కేలేదు.
“ఎన్నిసార్లు చెప్తావు" అన్నాడు రాకా.
“మరి నీవల్లే మా లైఫ్ సెటిల్ కాబోతూంది. ఇప్పుడు దీపని కమీషనర్ గార్కి అప్పగించి, మేము నిర్దోషులమని నిరూపించుకుంటాం. వాళ్ళ ముద్దుల కూతురి ప్రాణాలు కాపాడినందుకు మాకు ప్రమోషన్ కూడా ఇవ్వొచ్చు... ఆ తర్వాత మా ఇద్దరి పెళ్ళిళ్ళు" అన్నాడు చిన్నారావ్.
“పాపం... మంగులుగాడు దీప ద్వారా పదిలక్షలు వస్తాయని ఆశ పెట్టుకున్నాడు, ఇప్పుడు వాడు డెన్ లో భోరున ఏడుస్తూ వుండి వుంటాడు" అన్నాడు రాంబాబు.
“మన రాకా తన్నిన తన్నులకి వాడికి ఏడ్చే ఓపికైనా వుందో. లేదో?” అన్నాడు చిన్నారావ్. రాకా ఘొల్లున నవ్వాడు. అతని నవ్వుతో రాంబాబు, చిన్నారావ్ లు కూడా శృతి కలిపారు. వాళ్ళు అలా నవ్వుతుండగానే కారు జర్క్ లు ఇస్తూ స్లో అయిపోయి రోడ్డుమీద ఆగిపోయింది.
“అయ్యో... ఆగిపోయిందే!” అన్నాడు చిన్నారావ్. రాకా కారు స్టార్ట్ చెయ్యాలని ఐదునిముషాల పాటు ప్రయత్నించాడు. కానీ కారు స్టార్ట్ కాకుండా మొండికేసింది. “కారు స్టార్ట్ కావడం లేదే! ఇప్పుడెలా?” అన్నాడు రాంబాబు.
“ఏం ఫరవాలేదు... కాస్త తోస్తే స్టార్ట్ అవుతుంది... “అన్నాడు రాకా.
రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ కారు దిగి వెనుకనుండి తొయ్యడం మొదలుపెట్టారు . కాస్త దూరం తోశాక కారు స్టార్ట్ అయ్యింది. “హమ్మయ్య" అనుకుంటూ ఇద్దరూ చేతులు దులుపుకున్నారు. కారు ముందుకు ఉరికింది. కొన్నిగజాల దూరం వెళ్ళి కారు ఆగుతుందని చూశారు రాంబాబు, చిన్నారావ్ లు కానీ వాళ్ళు ఊహించిన విధంగా కారు ఆగలేదు. రివ్వున ముందుకెళ్ళింది. తెల్లబోయి చూస్తున్న రాంబాబు, చిన్నారావ్ లకి బయటికి తొంగిచూసి టాటా చెప్పి కారు వేగం పెంచాడు రాకా.
క్షణాల్లో కారు కనుమరుగయింది. రాంబాబు, చిన్నారావ్ లకి అర్ధమైంది. రాకా తమని మోసం చేశాడని. “ఇప్పుడెలా? ఆ రాకా గాడు దీపని తన కూడా తీస్కెళ్ళాడే... దీప లేకుండా మనం కమీషనర్ లింగారావ్ ని కలవలేం! రాకాగాడిని ఎలా పట్టుకోవాలి?” ఆందోళనగా అడిగాడు చిన్నారావ్,
రాంబాబు రెండు క్షణాలు ఆలోచించాడు. అతని మనసులో సడెన్ గా ఓ ఆలోచన మెదిలింది. “మొన్న జైలునుండి తప్పించుకున్న రోజు రాత్రి రాకా ఫ్రెండ్స్ ఇంట్లో తలదాచుకున్నాం.. గుర్తుందా?” అడిగాడు రాంబాబు.
“అవును... మనం ఇప్పుడు అక్కడికెళితే రాకా దొరకడం గానీ, లేదా ఎక్కడ ఉంటాడన్న వివరాలుగానీ తెలుస్తాయ్" అన్నాడు చిన్నారావ్. ఆ దారిన వెళుతున్న లారీని ఆపి అందులో ఎక్కి కూర్చున్నారు రాంబాబు, చిన్నారావ్ లు . లారీ ముందుకు కదిలింది.
|
|