అందరూ దొంగలే - 74

Listen Audio File :

రాంబాబు, చిన్నారావ్ లు నిర్మానుష్యంగా వున్న ఆ వీధిలో కాళ్ళీడ్చుకుంటూ నీర్సంగా నడుస్తున్నారు. “ప్చ్..... దీప దొరికినట్టే దొరికి చేజారిపోయింది" బాధగా అన్నాడు రాంబాబు.

“అసలు రాకాలాంటి క్రిమినల్స్ ని నమ్మడం మన బుద్ధి తక్కువ" అన్నాడు చిన్నారావ్.

“నిజమే... పోనీ ఆ రాకాగాడిని ఎలాగైనా పట్టుకుందామంటే అ బాకాగాడు మనకి సహకరించడం లేదు.”

“వాడిని బొక్కలో తోసి నాలుగు తగిలిస్తే వాడే నిజం చెప్తాడు" ఆవేశంగా అన్నాడు చిన్నారావ్.

“బొక్కలో తోసి దంచడానికి ప్రస్తుతం మనమేం పోలీసులం కాదు. చట్టం దృష్టిలో మనం క్రిమినల్స్" విసుగ్గా అన్నాడు రాంబాబు.

“అసలు ఆ రాకాగాడికి దీప ఎందుకో?!” అన్నాడు చిన్నారావ్ ఆలోచనగా.

“ఎందుకేంటి... అమనం బుద్దిలేకుండా దీపకోసం మంగులు కమీషనర్ ని పది లక్షలు డిమాండ్ చేస్తున్నాడని చెప్పి లేనిపోని ఐడియా వాడికిచ్చాం... నా ఉద్దేశంలో ఇప్పుడు రాకా కమీషనర్ కి ఫోన్ చేసి పదిలక్షలు డిమాండ్ చేస్తాడు" అన్నాడు రాంబాబు.

“మన కథ మళ్ళీ మొదటికొచ్చింది.... పద... మనం మర్యాదగా జైలుకెళ్ళి జైలర్ ని క్షమించమని కోరి మన సెల్ లోకి వెళ్ళిపోదాం" వెనక్కి తిరుగుతూ అన్నాడు చిన్నారావ్.

రాంబాబు చిన్నారావ్ ని పట్టి ఆపాడు. “నో... మనం మళ్ళీజైలు కెళ్ళే ప్రశ్నేలేదు. రాకాని ఎలాగైనా ట్రేస్ చేసి, వాడి దగ్గర్నుండి దీపని సంపాదించి, కమీషనర్ కి అప్పగించి మన డ్యూటీల్లో మనం జాయిన్ కావాలి."

“తర్వాత మనం మన లవర్స్ ని పెళ్ళి చేస్కోవాలి" సంబరంగా అన్నాడు చిన్నారావ్. సరోజ, సునీతలకు మనం జైల్లోంచి పారిపోయినట్టు తెలీదుకదూ?” రాంబాబు అన్నాడు.

“ఎందుకు తెలీదూ.. పేపర్ లో హెడ్ లైన్స్ లో వేసుంటారు మన పరారీ గురించి" అన్నాడు చిన్నారావ్.

“అవును కదూ... పాపం... వాళ్ళేంకంగారు పడ్తున్నారో ఏమో..... పద.... వాళ్ళని చూసొద్దాం.”

“కానిస్టేబుల్స్" గట్టిగా అరిచాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

నలుగురు కానిస్టేబుల్స్ అప్పారావ్ ముందుకొచ్చి సెల్యూట్ కొట్టారు.

“మనం ఇప్పుడు వెంటనే బయలుదేరాలి" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ లేచి నిలబడ్తూ.

“ఎక్కడికి సార్.... లాడ్జిలు రెయిడ్ చెయ్యడానికా?” అడిగాడు మొదటి కానిస్టేబుల్.”

రాయల్ లాడ్జిని రెయిడ్ చేద్దాం సార్!” మెలికలు తిరుగుతూ అన్నాడు రెండో కానిస్టేబుల్.

“కాదు... ఎంపైర్ లాడ్జిని రెయిడ్ చేస్తే బాగుంటుంది" అన్నాడు మొదటి కానిస్టేబుల్.

“కాదు... రాయల్ లాడ్జే!”

“కాదు... ఎంపైర్ లాడ్జే!”

“మీ ఇద్దరూ నోర్లు ముయ్యండి. మనం లాడ్జిలను రెయిడ్ చెయ్యడానికి వెళ్ళడం లేదు.... రాంబాబు, చిన్నారావ్ లని వెతకడానికి వెళ్తున్నాం" మండిపడ్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“హోస్.. అంతేనా...” అంటూ నీరుకారిపోయారు. కానిస్టేబుల్స్.

"కానీ వాళ్ళిప్పుడు ఎక్కడ దొరుకుతారబ్బా!" ఆలోచిస్తూ బుర్రకాయ్ గోక్కున్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“ఏంటి సార్?! మీ బుర్రకాయ్ ఇలా అయ్యింది. రాంబాబు వాళ్ళ యింతికేళ్తే అక్కడ దొరుకుతారు కద్సార్?” అన్నాడు మొదటి కానిస్టేబుల్.

“షటప్... జైల్లోంచి పారిపోయిన వాళ్ళు మమ్మల్ని అరెస్టు చేస్కోండి అంటూ యింట్లో మనకోసం రెడీగా కూర్చుంటారా?” విసుక్కున్నాడు అప్పారావ్.

“మరి వాళ్ళని ఎక్కడని వెతుకుతాం సార్?” అడిగాడు రెండో కానిస్టేబుల్.

“వాళ్ళిద్దరికీ గర్ల్ ఫ్రెండ్స్ వున్నారు. వాళ్ళని కలవడానికి వాళ్ళు తప్పకుండా అక్కడికి వస్తారు.... పదండి" అన్నాడు గబగబా బయటికి అడుగులు వేస్తూ ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

అందరూ జీపు ఎక్కారు.

“డిప్పల్లో సర్సింగ్ హోం కు పోనియ్!” డ్రయివర్ తో చెప్పాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

జీపు ముందుకు కదిలింది.