అందరూ దొంగలే - 67

Listen Audio File :

ఇద్దరూ మళ్ళీ చీకట్లో పరుగుదీశారు. కాస్త దూరం పరుగు తీశాక వాళ్లకి ఎదురుగ పెద్ద గోడ. ఇరవై అడుగుల ఎత్తున్న జైలు ప్రహారీగోడ. దానిమీద కరెంట్ వైర్లు!

“మెయిన్ ఎక్కడుందో?'' అన్నాడు చిన్నారావ్.

“నాకు తెల్సు పద!'' రాంబాబు ఎదమపక్కకి పరుగుతీశాడు.

చిన్నారావ్ కూడా అతన్ని ఫాలో అయ్యాడు. అక్కడ జంక్షన్ బాక్స్ దగ్గరికి వెళ్తుండగా సెంట్రీ ఎదురయ్యాడు.

“అయిపొయింది …. మనపని అయిపొయింది'' అన్నాడు రాంబాబు. సెంట్రీ ఇద్దరినీ సమీపించి గన్ వాళ్లకి గురిపెట్టాడు. “ఏరా పారిపోదామని ప్రయత్నిస్తున్నారా?''

“పారిపోవడమా? అది తెలిస్తే మేం ఇన్నాళ్ళు ఇక్కడెందుకు వుంటాం'' అమాయకంగా అన్నాడు రాంబాబు.

“మరి సెల్ లోంచి ఇక్కడికి ఎలా వచ్చార్రా?''

రాంబాబు చిటికెనవేలు చూపించాడు. “మాకు ఇది వచ్చింది … టాయిలెట్స్ దగ్గర బల్బు మాడిపోయింది. చాలా చీకటిగా వుంది. అందుకని ఇక్కడికెళ్ళి జైలు గోడమీద పోస్కోమని సెల్ తలుపులు తీసి మమ్మల్ని క్కడికి పంపించాడు సెంట్రీ.''

“ఏంటీ? వాడు కాపలాగా రాకుండా మిమ్మల్ని ఒంటరిగా పంపించాడా?'' అడిగాడు సెంట్రీ.

“ఎందుకు రాలేదూ …? అదిగో అక్కడ నిల్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు'' చేప్పాడు రాంబాబు ఆ సెంట్రీ వెనకవైపు చూపిస్తూ.

సెంట్రీ వెనక్కి తిరిగి చూశాడు. క్షణం ఆలస్యం చెయ్యకుండా రాంబాబు, చిన్నారావ్ లు ఆ సెంట్రీ మీద పది, అతని చేతిలోని గన్ లాక్కుని దాంతో బుర్రమీద గట్టిగా ఓ దెబ్బ వేశారు. ఆ సెంట్రీ చిన్నగా మూలిగి నేలమీదికి ఒరిగాడు.

రాంబాబు గబగబా వెళ్ళి ఆ పక్కనే వున్న మెయిన్ ఆఫ్ చేశాడు. జైలంతా చిమ్మచీకటి క్రమ్మింది.

“ఇక్కడెక్కడో రెండు పెద్ద పోల్స్ వుండాలి … ఎక్కడా?'' అన్నాడు రాంబాబు.

“ఆ ప్రక్కనున్నాయ్'' చెప్పాపడు చిన్నారావ్.

ఇద్దరూ చీకట్లో అటు పరుగుతీసి ఆ రెండు పోల్స్ తీసుకుని వచ్చారు. పోలీస్ ట్రైనింగ్ లొ చేసిన పొల్ వాల్ట్ జంప్ వాళ్ళిద్దరికీ ఇప్పుడు పనికొచ్చింది. ఇద్దరూ ఆ పోల్స్ పట్టుకుని గోడకి దూరంగా వెళ్ళి మళ్ళీ వేగంగా ముందుకు పరుగెత్తుతూ జైలు గోడమీదినుంది పొల్ వాల్ట్ జంప్ చేశారు. జైలుగోడ అవతల రాంబాబు, చిన్నారావ్ లు దబ్బుమని నేలమీద పడ్డారు.

“అబ్బ … నడ్డి విరిగింది'' అన్నాడు నేలేమీద నుండి రాంబాబు లేచి బట్టలకంటిన దుమ్ము దులుపుకుంటూ.

“అవును … అయినా ఈ జైలుగోడలు ఇంత ఎత్తు ఎందుకు కడతాతో … కాస్త హైట్ తగ్గించి పెట్టొచ్చుగా?'' అన్నాడు చిన్నారావ్ కూడా నేలమీదనుండి లేస్తూ

“అసలు గోడే లేకపోతే బాగుండేదికదా?'' అన్నాడు రాంబాబు.

“మనం ఇక్కడ తీరుబడిగా కబుర్లు వేస్కుని కూర్చుంటే వాళ్ళొచ్చి పట్టుకుని మళ్ళీ సెల్ లొ వేస్తారు …. పద … పరుగుతీద్దాం'' అన్నాడు చిన్నారావ్.

“పద'' అన్నాడు రాంబాబు. ముందుకు పరుగుతియ్యాలని అనుకున్న ఇద్దరికీ కొన్ని గజాల దూరంలో మెయిన్ రోడ్డు మీద ఆటో ఆగి వుండడం కనిపించింది.

“ఆటో …!'' ఆనందంగా రాంబాబు వంక చూసి అన్నాడు చిన్నారావ్.

“రోడ్డు పక్కన ఆపి ఆటోలో నిద్రపోతున్నాడేమో డ్రయివర్'' అన్నాడు రాంబాబు.

“కాదు … డ్రయివర్ మేల్కొనే వున్నాడు. అదిగో … డ్రయివింగ్ సీటులో కూర్చుని సిగరెట కాల్చుకున్తున్నాడు'' అన్నాడు చిన్నారావ్.

వీథిలైటు వెల్తురులో అటుతిరిగి కూర్చుని వున్నా డ్రయివర్ మసకగా కనిపించాడు రాంబాబుకి. “అవునుగానీ … ఈ టైమప్పుడు వీదిక్కడ ఆటో ఆపుకుని ఎందుకు కూర్చున్నాడబ్బా?!'' ఆశ్చర్యపోయాడు రాంబాబు.

“వాడెందుకు అక్కడ కూర్చున్నాడో మనకి అనవసరం … మన అదృష్టం కొద్దీ వాడక్కడ వున్నాడు ... పద'' అన్నాడు చిన్నారావ్.

ఇద్దరూ పరుగున వెళ్ళి ఆటో ఎక్కారు.

“ఏయ్ బాబూ! త్వరగా పద'' అన్నాడు రాంబాబు వెనుక నుండి ఆటో డ్రయివర్ భుజమ్మీద కొడ్తూ.

“ఎక్కడికెళ్ళాలి?'' అడిగాడు ఆటోవాడు గంభీరంగా.

రాంబాబు, చిన్నారావ్ మొహమొహాలు చూస్కున్నారు. అవును … ఎక్కడికెళ్ళాలి.ఇప్పుడు రూమ్ కి వెళితే పోలీసులు అక్కడికి రావడం ఖాయం … మరి? ఆ మంగులుగాడి అడ్రస్ కూడా తెలీదు. ఏం చెయ్యాలి?

“చెప్పండి సార్ … ఎక్కడికి వెళ్ళాలి?'' అడిగాడు ఆటోవాడు.

“ముందు ఇక్కడినుండి త్వరగా పద … నువ్వెక్కడికి వెళ్ళాలో తర్వాత చెప్తాం'' అన్నాడు రాంబాబు.

ఇంతలో జైల్లో హారన్ మోగడం వినిపించింది. క్షణం ఆలస్యం చేసినా వాళ్ళు జైలు సెంట్రీలకి దొరికిపోవడం ఖాయం.

“పదవయ్యా బాబూ!'' కంగారుగా అరిచాడు రాంబాబు. ఆటో రివ్వున కదిలింది.