TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
అప్పుడు రాంబాబు, చిన్నారావ్ లు చూశారు రోడ్డుప్రక్కగా ఓ వ్యక్తీ బోర్లాపడి వుండడం. “ఎవరో బాగా చిత్తుగా తాగి రోడ్డుమీద పడిపోయాడు'' అన్నాడు రాంబాబు.
“చిత్తుగా తాగడం కాదు... వాడి బుర్రకాయ్ మీద నేనే కొట్టాతా … మూర్చపోయాడు'' అన్నాడు ఆటోడ్రయివర్.
“నువ్వు కొట్టావ? ఎందుకూ?''ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.
“ఎందుకంటే నాకీ ఆటో కావాలి కాబటి, వాడు ఈ ఆటో డ్రయివర్ కాబట్టి!'' పకపకా నవ్వాడు ఆటో నడుపుతున్న వ్యక్తీ.
రాంబాబు, చిన్నారావ్ లు ఉలిక్కిపడ్డారు. కొంపదీసి పిచ్చివాడి చేతిలో పడ్డామా? అని భయపడ్డారు. ఇంతలో ఆ వ్యక్తీ నవ్వుతూ వెనక్కి తిరిగి చూశాడు. వీథి లైటులొ ఆ వ్యక్తీ మొహం వాళ్లకి స్పష్టంగా కనిపించింది. అతని మొహం చూసిన ఆ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. “నువ్వా?'' ఇద్దరూ కోరస్ గా అరిచారు.
“అవును … నేనే!'' అన్నాడు రాకా, ఆటోని వేగంగా ఓ ఇరుగు సందులోకి తిప్పుతూ.
“నువ్వెలా వచ్చావ్?'' ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.
“నేను నిద్రపోతున్నానని అనుకున్నారు కదూ …? నేను కళ్ళు మూస్కునే మిమ్మల్ని గమనిస్తున్న … మీరు సెల్ లోంచి బయటికెళ్ళాక నేనూ బయటికి వచ్చాను. మీరు పోటుగాళ్ళలా కష్టపడి పొల్ వాల్ట్ జంప్ చేసి బయటపడి నడుం విరక్కొట్టుకున్నారు. నేను మీకంటే ముందే చక్కగా గేటు దగ్గరున్న వాడిని బెదిరించి తాళం తీయించి తర్వాత వాడి బుర్ర బద్దలు కొట్టి బయటికి వచ్చా'' అన్నాడు రాకా.
రాంబాబు, చిన్నారావ్ లకి చాలా గిల్టీగా అనిపించింది. “సారీ రాకా! అసలు మేం జైలునుండి తప్పించుకోనున్న ప్లాన్ నీకు చెప్దామనుకున్నాం. కానీ నువ్వు వద్దని డిస్కరేజ్ చేస్తావేమోననీ'' మెల్లగా అన్నాడు రాంబాబు.
రాకా పకపకా నవ్వాడు. “జైలునుండి తప్పించుకుందాం అంతే నేనెందుకు డిస్కరేజ్ చేస్తానూ?''
“అంటే అసలైన ఇంకో కారణం కూడా వుందిలే … మేం పోలీసులమై వుండి నువ్వు తప్పించుకోడానికి ఎలా సాయపడ్తాం?'' అన్నాడు చిన్నారావ్.
“అలా చెప్పండి … ఇంతకీ మీ ప్లాన్ ఏంటి …?'' అడిగాడు రాకా.
“దీపని మంగులు చెరనుండి విడిపించి పోలీస్ కమీషనర్ కి అప్పగించి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలి!'' ఆవేశంగా అన్నాడు రాంబాబు.
“మరి మంగులు అడ్రస్ మీకు తెలుసా?'' అడిగాడు రాకా.
రాంబాబు వెర్రిమొహం వేశాడు. రాకా పాక పకా నవ్వాడు.
“నాకు తెల్సు … మీకు మంగులుగాడి అడ్రస్ తెలియదు. మరి దీపనెలా రక్షిస్తారు?''
రాంబాబు, చిన్నారావ్ లు ఏం సమాధానం చెప్పలేదు. “అసలు మీకు సాయం చేయగల నన్ను వదిలిపెట్టి మీ ఇద్దరే జైలు నుండి పారిపోవాలనుకోవడం నాకు చాలా విచిత్రంగా వుంది'' అన్నాడు రాకా.
“మాకు నువ్వు సాయం చేయగలవా? ఎలా?'' ఆశ్చర్యంగా అడిగాడు చిన్నారావ్.
“నాకు మంగులు అడ్డా తెల్సు!''
“నిజంగానా ...?'' రాంబాబు, చిన్నారావ్ లు సంతోషంగా కోరస్ గా అరిచారు.
“అవును!'' “అయితే ఆటోని మంగులు డెన్ కి తీస్కెళ్ళు …'' ఆత్రంగా అన్నాడు రాంబాబు.
“ఏంటి? మనం ముగ్గురం ఈ జైలు డ్రెస్సులతోనే ఊరంతా తిరుగుదామా?'' అడిగాడు రాకా.
“మరెలా?''అడిగాడు చిన్నారావ్.
“ఇప్పుడు మా ఫ్రెండ్స్ యింటికి వెళ్ళి రెస్టు తీస్కుందాం. అక్కడ వాళ్ళ బాత్తలు వేస్కుని రేపు మంగులు దగ్గరికి వెళ్దాం''
“మీ ఫ్రెండ్స్ దగ్గరికా … మనం ఈ డ్రెస్సుల్తో వెళితే మనం జైలునుండి తప్పించుకుని వచ్చామని వాళ్లకి తెల్సిపోదా...? వాళ్ళేమనుకుంటారో?'' అమాయకంగా మొహంపెట్టి అన్నాడు రాంబాబు.
రాకా పక పకా నవ్వాడు. “మీకు పోలీసు ఉద్యోగాలు ఎవడిచ్చాడయ్యా బాబూ! నా ఫ్రెండ్స్ అంటే నాలాంటి వాళ్ళే అయ్యుంటారు. నేను జైలునుండి తప్పించుకు వచ్చానంటే వాళ్ళెంత గర్వంగా ఫీలవుతారు''
“అవును కదా …?'' అన్నాడు రాంబాబు ఎంతో రిలీఫ్ గా ఫీలవుతూ.
ఆటో ఆ చీకట్లో వేగంగా ముందుకు దూసుకు పోసాగింది.
|
|