TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
అప్పుడు సమయం రాత్రి ఒంటిగంటైంది.
రాంబాబు చటుక్కున లేచి కూర్చున్నాడు. ప్రక్కనే నిద్రపోతున్న చిన్నారావ్ భుజం మీద తట్టాడు. చిన్నారావ్ కూడా కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు.
"చెప్పిందంతా గుర్తుంది కదా?'' చిన్నార్రావ్ చెవిలో గుసగుసగా అన్నాడు రాంబాబు. చిన్నారావ్ తలూపాడు. ఇద్దరూ రాకావైపు చూశారు. రాకా గాఢంగా నిద్రపోతున్నాడు. దూరంగా సెంట్రీ బూట్ల చప్పుడు … ఆ వైపుగా వస్తున్నట్టు.
“ఇటే వస్తున్నాడు …'' అన్నాడు రాంబాబు చిన్నారావ్ చెవిలో గుసగుసగా.
“హిహిహి …'' నవ్వాడు చిన్నారావ్.
“ఎందుకిప్పుడు అకారణంగా నవ్వుతున్నావ్?'' చిరాకుపడుతూ తగ్గుస్వరంతో ప్రశ్నించాడు రాంబాబు.
“నువ్వు చెవిలో గుసగుసగా మాట్లాడుతుంటే నాకు కితకితలు పెడుతుంది …హిహిహి …''
“చాలు ఆపు. వాడొస్తున్నాడు'' అన్నాడు రాంబాబు.
బూట్ల శబ్దం వాళ్ళని సమీపించసాగింది. “నువ్వు రెడీగా వుండు'' అన్నాడు రాంబాబు.
చిన్నారావ్ తలూపి ప్రక్కకి తప్పుకున్నాడు.
సెంట్రీ వీళ్ళ సెల్ దాటి వెళ్తూండగా రాంబాబు "చూడు భాయ్!'' అంటూ అతన్ని పిలిచాడు. సెంట్రీ ఆగి ఏమిటన్నట్లు రాంబాబు వంక చూశాడు.
“అగ్గిపెట్టె వుందా? సిగరెట కాల్చుకోవాలి?'' అడిగాడు రాంబాబు.
అతను దగ్గరికి వచ్చి జేబులోంచి అగ్గిపెట్టి తీసి రాంబాబుకి కటకటాల మధ్యనుండి అందించాడు. “ఏంటి మెలుకువగా వున్నావు?'' అడిగాడు.
“నిద్ర పట్టడం లేదు … ఏం తోచడం లేదు … కాసేపు కాలక్షేపంగా సిగరెట్టయినా కాలుడ్డామనీ'' అన్నాడు రాంబాబు.
రాంబాబు చొక్కా జేబులో, పైజామా జేబులో వెతికి తెల్లముఖం వేసి సెంట్రీ వైపు చూశాడు.
“ఏంటీ?'' అడిగాడు సెంట్రీ.
“సిగరెట్లు వున్నాయనుకున్నాను లేవు'' అన్నాడు రాంబాబు అగ్గిపెట్టెను ఇస్తూ. సెంట్రీ అగ్గిపెట్టెను అందుకుంటుండగా హఠాత్తుగా రాంబాబు ఊచాల్లోంచి అతని పీకని గట్టిగా పట్టుకున్నాడు. చిన్నారావ్ ఆలస్యం చెయ్యకుండా గబుక్కున ముందుకు వచ్చి గట్టిగా సెంట్రీ నెత్తిన బలమంతా ఉపయోగించి ఓ గుద్దు గుద్దాడు. సెంట్రీ కిక్కురుమనకుండా నేలమీద కూలిపోయాడు.
ఇద్దరూ మొహమొహాలు చూస్కున్నారు. తర్వాత ఇద్దరూ క్రిందికి వంగి చూశారు. వాళ్ళ కళ్ళకి సెంట్రీ నడుము బెల్తుకి వేళ్ళాడుతున్న తాళాల గుత్తి కనిపించింది. రాంబాబు నేలమీద కూర్చుని ఊచాల్లోంచి చెయ్యిపెట్టి అతికష్టం మీద తాళాల గుత్తిని అందుకున్నాడు. తర్వాత వాటికున్న తాళం చెవుల్ని ఒక్కొక్కదాన్నే ట్రయ్ చేస్తూ చివరికి పావుగంట తర్వాత తాళం తీశాడు.
“త్వరగా పద … ఇప్పటికే ఆలస్యం అయ్యింది'' అన్నాడు చిన్నారావ్.
సెల్ తలుపు తీస్కుని చీకట్లోకి పరిగెత్తారు రాంబాబు, చిన్నారావ్ లు. కారిడార్లో దూరంగా మరో సెంట్రీ కనిపించాడు వీళ్ళకి. అంతే … అక్కడే వున్నా ఓ స్తంభం చాటుకి నక్కారు. ఆ సెంట్రీకి ఏదో అనుమానం వచ్చింది. ఎందుకంటే అతనికి పరుగులు తీస్తున్న అడుగుల శబ్దం అస్పష్టంగా వినిపించింది.
“కౌన్ హై … '' అంటూ రాంబాబు, చిన్నారావ్ లు దాక్కున్న వైపు వచ్చాడు.
రాంబాబు, చిన్నారావ్ ఊపిరి బిగపట్టారు. సెంట్రీ వాళ్ళు నిల్చున్న స్తంభానికి దగ్గరగా వచ్చి అటూ ఇటూ దిక్కులు చూశాడు. సెంట్రీ చుట్టూ తిరుగుతూ చూస్తుండగా అతని వీపు రాంబాబు, చిన్నారావ్ ల్ వైపు వచ్చింది.
ఇంక ఆలస్యం చెయ్యదల్చుకోలేదు రాంబాబు, చిన్నారావ్ లు, ఇద్దరూ ఒక్కసారిగా ఆ సెంట్రీ మీదపడి ఒకరు మెడమీద గుద్దితే, ఇంకొకరు నెత్తిమీద గుద్దారు.
ఆ సెంట్రీ కూడా నేలమీద కుప్పకూలిపోయాడు.
|
|