TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
సెల్ తెలుపు క్రిందనుండి మూడు అన్నం గిన్నెల్ని లోపలి తోశాడు సెంట్రీ. చిన్నారావ్ ఆ గిన్నెల్ని తీస్కుని రాకా ముందు ఒకటి, రాంబాబు ముందు ఒకటి పెట్టి మూడోది తను తీస్కున్నాడు. ముగ్గురూ నేలమీద కూర్చున్నారు. ముందుగా చిన్నారావ్ గిన్నె ముక్కుదగ్గర పెట్టి వాసన చూసి మొహం చిట్లించాడు. తర్వాత రాంబాబు అదే పని చేశాడు.
“ఏంటి?'' అన్నాడు రాకా ఇద్దర్నీ చూస్తూ.
“ఈ రోజూ సాంబార్ అన్నమే!'' అన్నాడు చిన్నారావ్.
“సాంబార్ అన్నం సాంబార్ అన్నంలాగే వుంటే ఫర్వాలేదు. కానీ అది అలా వుండదు. ఇంకేదోలా వుంటుంది … ఇక కుంకుడు కాయ పులుసు వాసనేస్తుంది …'' అన్నాడు రాంబాబు.
“అయితే మీ ఇద్దరికీ ఈ భోజనం నచ్చదు … అవునా?'' అడిగాడు రాకా.
రాంబాబు, చిన్నారావ్ మొహమోహాలు చూస్కుని ఘోల్లుమని నవ్వారు. “అదేం ప్రశ్న …? ఈ తిండి ఎవరికైనా నచ్చుతుందా అని?'' అన్నాడు రాంబాబు.
“మీకు నచ్చదు కదా!'' అని వాళ్ళిద్దరి గిన్నెల్లోంచి సగం సగం సాంబారన్నం తీసి తన గిన్నెలో వేస్కున్నాడు రాకా.
“నాకు నచ్చడంతో సంబంధం లేదు …'' అంటూ తినడం స్టార్ట్ చేశాడు.
రాంబాబు, చిన్నారావ్ లు వెర్రి మొహాలు వేశారు. రెండు క్షణాలాగి వాళ్ళు కూడా తినడం మొదలుపెట్టారు. రాకా పెద్ద పెద్ద ముద్దలు నోట్లోకి తోస్తూ అయిదు నిమిషాల్లో తినడం పూర్తి చేశాడు. రాంబాబు, చిన్నారావ్ లు మాత్రం రాకా తీస్కోగా మిగిలిన ఆ కొద్దిపాటి అన్నాన్ని కష్టపడ్తూ పదినిమిషాల పాటు తిన్నారు.
రాకా సిమెంట్ దిమ్మమీద నడుం వాల్చి బ్రేవ్ మని తరించాడు. రాంబాబు, చిన్నారావ్ లు నేలమీద కూర్చుని గోడకి జారగిలబడి కాళ్ళు బార్లా చాపుకుని కూర్చున్నారు. ఓ రెండు నిమిషాలపాటు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.
ఉన్నట్టుండి "ఏంటో … ప్చ్'' అన్నాడు రాంబాబు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ.
“ఏంటాలోచిస్తున్నావ్?'' అడిగాడు చిన్నారావ్.
“మనం ఇలా జైల్లో వుండకుండా బయటే వుంటే ఈ పాటికి మటన్ బిర్యానీ, చికెన్ సిక్స్ టీ ఫైవ్ … అన్నీ తిని వుండేవాళ్ళం …'' అన్నాడు రాంబాబు నిట్టూరుస్తూ.
“అవును! పది రూపాయల్లో అన్ని తిని వుండేవాళ్ళం'' అన్నాడు చిన్నారావ్.
“పది రూపాయలకి అవన్నీ రావడం ఏంట్రా!'' మీకేమైనా మతిపోయిందా?'' అన్నాడు రాకా బొజ్జ నిమిరుకుంటూ.
“అవును … మేము ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి పదిరూపాయలిచ్చి ఏం తెమ్మంటే అదే తెచ్చేవాడు …. ఇందాక చెప్పినవే కాకుండా దానితోపాటు ఫుల్ బాటిల్ మందు తెమ్మన్నా పది రూపాయలే తెస్తాడు …'' అన్నాడు చిన్నారావ్.
“అదేంటి … ఇన్స్ పెక్టర్ మీరు కోరినవన్నీ ఎందుకు యిస్తాడు?'' అడిగాడు రాకా.
“మేమంటే వాడికి చచ్చేంత భయం కనుక'' అన్నాడు రాంబాబు. రాకా గబుక్కున లేచి కూర్చున్నాడు.
“అంటే మీరు అంత పవర్ ఫుల్ క్రిమినల్సా?'' అడిగాడు రాకా వాళ్ళిద్దరి వంకా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ.
“మేము క్రిమినల్స్ కాదయ్యా బాబూ … మేము కానిస్టేబుల్స్'' నెత్తికొట్టుకుంటూ అన్నాడు రాంబాబు.
రాకా ఆశ్చర్యంగా వాళ్ళవంక చూశాడు. “కానిస్టేబుల్స్ అయిన మీకు ఇన్స్ పెక్టర్ భయపడ్డం ఏమిటి? అయినా పోలీస్ డిపార్ట్ మెంట్ కి చెందినా మీరు జైలులో వుండడం ఏంటీ?'
' రాంబాబు, చిన్నారావ్ లు జరిగినదంతా రాకాకి చెప్పారు. “కాబట్టి ప్రస్తుతం ఆ గజదొంగ మంగులు పుణ్యాన జైలులో వున్నాం …'' అని స్టోరీని ముగించాడు రాంబాబు.
“ఒరేయ్ మంగుళూ …'' గట్టిగా అరిచి పళ్ళు నూరాడు రాకా.
“ఏంటి … మంగులు నీకు కూడా తెలుసా?'' ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.
“తెలుసా ఏంటి? మంగులు నాకు బద్ధ శత్రువు … నా గ్యాంగ్ కి వాడి గ్యాంగ్ కి అసలు పడదు. నా శత్రువు మీకు కూడా శత్రువు కాబట్టి ఈరోజు నుండీ మనం ఫ్రెండ్స్'' అన్నాడు రాకా రాంబాబు, చిన్నారావ్ లకి షేక్ హ్యాండ్ ఇస్తూ.
|
|