అమ్దరోపో దొంగలే -64

Listen Audio File :

కొద్దిలో అతని బుర్ర పేలిపోయి వుండేదే … బుల్లెట్ అతని చెవిప్రక్కగా రాసుకుపోయింది.

“ఏదీ దీపా … ఆ రివాల్వర్ అక్కడ పడేయ్యమ్మా. లేకపోతె చాలా డేంజర్'' అన్నాడు భయంగా దీపాని చూస్తూ.

“నాకేం డేంజర్ కాదులే! నీకే దేనజర్'' అంది దీప కళ్ళు తిప్పుతూ.

“సరేలే … నాకే డేంజర్లే … దాన్ని పక్కన పారేయ్ .. ప్లీజ్ … '' అన్నాడు మంగులు బ్రితిమిలాడుతూ.

“మరి ఐస క్రీమ్ తెప్పిస్తావా?'' అడిగింది దీప.

“ఓ … ఇప్పుడే తెప్పిస్తా! ఒరేయ్ ఎవడ్రా అక్కడ చచ్చింది'' అని గట్టిగా అరిచాడు.

అదే సమయంలో డేవిడ్ అక్కడికి కళ్ళు నులుముకుంటూ వచ్చాడు. “ఏంటి సార్! ఇక్కడేదో 'టప్' మని శబ్దం వచ్చింది?''

“దున్నపోతు వెధవా …!'' డేవిడ్ నడ్డిమీద ఓ తనను తన్నాడు మంగులు.

డేవిడ్ కాస్త ముదుకు తూలీ, క్రింద పడిపోకుండా తమాయించుకుని నిలబడ్డాడు. వాడి చూపులు దీప మీద పడ్డాయి. “అరె … అదేంటమ్మా రివాల్వర్ పట్టుకున్నావు … ఇచ్చేయ్ లేకపొతే పెల్తుంది …'' అంటూ దీప దగ్గరికి వెళ్ళబోయాడు డేవిడ్.

“ఆగు … లేకపోతే నిన్ను కూడా పేల్చేస్తా ….'' అంది దీప.

“తప్పమ్మా … అలా అనకూడదు! ఏదీ ఇలా తే'' ఒక అడుగు ముందుకు వేశాడు డేవిడ్.

“ఒరేయ్ సన్నాసి వెధవా? అది నిజంగానే పెలుస్తుంది. నువ్విలా రా నీతో పనుంది …'' అరిచాడు గజదొంగ మంగులు.

డేవిడ్ మంగులు దగ్గరకెళ్ళాడు

“నువ్వు అర్జంట్ ఐస క్రీమ్ తీసుకురా …''

“అర్థరాత్రి మీకిదేం కోరిక బాస?'' ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు డేవిడ్.

“ఇది నా కోరిక కాదురా. చిన్నారి దీప … మురిపాల పాపది ఈ కోరిక!'' పళ్ళు నూర్తూ అన్నాడు మంగులు.

“కానీ ఇప్పుడు షాపులుండవు కదా బాస్'' బుర్ర గోక్కుంటూ అన్నాడు డేవిడ్.

“ఆ విషయం నాక్కూడా తెలుసు! …. షాపులు వుండకపోతే ఏ షాపువాడి ఇంటికో వెళ్ళి వాడిని గన్ పాయింట్ తో షాపుని ఓపెన్ చేయించి తీసుకురా …''

“సరే బాస్ …'' వెనక్కి తిరిగాడు.

“ఒరేయ్ ఆగు!'' అంది దీప. డేవిడ్ ఆగి దీపవంక చూశాడు.

“నాకు బటర్ స్కాచ్ కోన్ ఐస్క్రీం, నాలుగు పెద్ద పెద్ద చాక్లేట్లూ, రెండు క్రీమ్ బిస్కట్ పాకేట్లూ, రెండు చిప్స్ పాకెట్లూ తీసుకురా …'' చెప్పింది దీప.

“చాలా …?'' అడిగాడు దీపని ఆశ్చర్యంగా చూస్తూ.

“ఇప్పుడైతే ఇవే గుర్తున్నాయి, నువ్వు వచ్చాక మళ్ళీ ఏదైనా గుర్తొస్తే అప్పుడు చెప్తాలే …''అంది దీప.

“బాబోయ్!'' అన్నాడు డేవిడ్ జుత్తు పీక్కుంటూ.

“నువ్వు త్వరగా వెళ్ళు … తర్వాత తీరిగ్గా జుట్టు పీక్కుందువు గాని!'' కసిరాడు గజదొంగ మంగులు.

డేవిడ్ అక్కడినుండి వెళ్ళిన నిమిషానికి మోటార్ సైకిల్ స్టార్టుచేసి ముందుకు వెళ్ళిన శబ్దం వచ్చింది.

“ఇక రివాల్వర్ ఇచ్చేసి నీ గదిలోకి వెళ్ళమ్మా …'' అన్నాడు గజదొంగ మంగులు. ఒక అడుగు ముందుకువేసి చెయ్యి చాపుతూ.

దీప గాలిలోకి రివాల్వర్ పేల్చింది. మంగులు అక్కడే ఆగిపోయాడు భయంగా. “నో … నేను చెప్పినవన్నీ ఇస్తేనే నీకు రివాల్వర్ ఇస్తా'' అంది దీప,

“నేనసలు పెళ్ళే చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే ఇలాంటి పిల్లల్ని అస్సలు కనకూడదు!'' అని మనసులో అనుకున్నాడు మంగులు.