అందరూ దొంగలే - 61

Listen Audio File :

ఆ మర్నాడు … సెంట్రీ వచ్చి సెల్ తాళం తీసి తలుపులు తెరిచి "బయటికి రండి'' అన్నాడు.

“ఏంటీ మమ్మల్ని విడుదల చేసేస్తున్నారా?'' సంతోషంగా అన్నాడు రాంబాబు.

“నిన్న జరిగినదానికి జైలర్ గారు మిమ్మల్ని ఎంతో మెచ్చుకుని మీకు ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించారు'' అన్నాడు సెంట్రీ

“ఖైదీలకి ప్రమోషన్ కూడా ఇస్తారా?'' ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించాడు చిన్నారావ్.

“మీలాంటి మంచి ఖైదీలకి ఎందుకివ్వరూ?''

“ప్రమోషనంటే ఎలా? మాకేం అర్థం కావడంలేదు'' అన్నాడు రాంబాబు అయోమయంగా.

“రండి మీకే తెలుస్తుంది'' అన్నాడు సెంట్రీ.

రాంబాబు, చిన్నారావ్ ఇద్దరూ సెల్ లోంచి బయటికి వచ్చారు. సెల్ బయట వున్న మరో ఇద్దరు సెంట్రీలు రాంబాబు, చిన్నారావ్ ల జబ్బలు గట్టిగా పట్టుకుని ముందుకు లాక్కెళ్ళారు.

“ఏంటి … ప్రమోషన్ అంటే మమ్మల్ని ఇలా ఈడ్చుకెళ్ళడమా?'' అన్నాడు రాంబాబు చికాకుగా.

అతని ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పలేదు. ఓ అయిదారు సేల్స్ దాటి ముందుకెళ్ళాక ఒక సెల్ దగ్గర ఆగి దాని తాళం తీశాడు సెంట్రీ. అతను తలుపు తీసీ తియ్యగానే మిగతా ఇద్దరు సెంట్రీలూ రాంబాబు, చిన్నారావ్ ల్ని లోపలికి తోశారు. వెంటనే ఆ సెల్ తలుపు దగ్గరికి లాగి తాళం వేశాడు సెంట్రీ.

“ఇదేంటి … ప్రమోషన్ అని చెప్పి దీంట్లోకి తోశారు?'' అన్నాడు రాంబాబు.

“నిన్న జైలర్ గారితో గొడవ పెట్టుకున్నారుగా … ఆయనకి తిక్కరేగి మిమ్మల్ని ఈ సెల్ లొ వేయమని చెప్పారు'' అన్నాడు సెంట్రీ.

“ఈ సెల్ కీ, పాత సెల్ కీ డిఫరెన్స్ ఏంటో?'' అన్నాడు రాంబాబు.

“మన పాత సెల్ ఏసి అయినట్టూ … ఇది ఆర్డనరీ సెల్ అయినట్టూ'' వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు చిన్నారావ్.

“అన్ని డిఫరెన్స్ లూ మీకు తెలుస్తాయ్ గానీ ఓసారి ఆ మూలకి చూడండి...'' అనేసి ముందుకు అడుగులు వేశాడు సెంట్రీ. మిగతావాళ్ళు అతన్ని ఫాలో అయ్యారు.

ఇప్పుడు రాంబాబు, చిన్నారావ్ లకి అనుమానం వచ్చింది. గది మూలకి చూడమని వెళ్ళారేంటీ … ఎముందక్కడ? ఆ సెంట్రీ గాడు ఏదో కొంపలు మునిగే పనే చేశాడని వాళ్లకి అనిపించింది. ఇద్దరూ భయంభయంగా వెనక్కి తిరిగి గది మూలగా చూశారు. అక్కడ వున్న సిమెంట్ దిమ్మమీద పూర్తిగా దుప్పటి కప్పుకుని పడుకుని వున్నాడు ఒక ఖైదీ. కేవలం తల మాత్రం బయటికి వుంది. నున్నటి గుండుతో పీచు వలచిచేసిన కొబ్బరికాయంత వుంది అతని తలకాయ్. అతను వీళ్ళనే చూస్తున్నాడు.

అతన్ని చూడగానే రాంబాబుకి నవ్వొచ్చి కిసుక్కున నవ్వాడు. “మొహం చూస్తుంటే ఎవడో వెర్రిపీనుగులా వున్నాడు'' అన్నాడు చిన్నారావ్ నవ్వుతూ.

ఆ మాట వింటూనే మీద వున్న దుప్పటిని దూరంగా విసిరేస్తూ "రేయ్'' అని గట్టిగా అరుస్తూ లేచి నిలబడ్డాడు అతను. దుప్పటి తీసేసి లేచి నిలబడ్డాక తెల్సింది రాంబాబు, చిన్నారావ్ లకి అతని పర్ననాల్టీ ఏంటో! నున్నటి గుండుతో, ఆరున్నర అడుగుల పొడవుతో, కండలు తిరిగిన శరీరంతో భీకరంగా వున్నాడు అతను. వీళ్ళనే క్రూరంగా చూస్తూ ఒక్కో అడుగూ వీళ్ళవైపు వేస్తూ దగ్గరికి రాసాగాడు అతను.

రాంబాబు, చిన్నారావ్ ల పైప్రాణాలు పైనే పోయాయ్. “ఎందుకలా దరిద్రపు కామెంట్ చేశావ్? వాడి పర్సనాల్టీ చూడు. మనల్నిప్పుడు కైమా చేసేలా వున్నాడు'' అన్నాడు రాంబాబు చిన్నారావ్ చెవి దగ్గర గుసగుసగా.

చిన్నారావ్ ఏదో అనేంతలోగానే ఆ భారీకాయుడు ఇద్దర్నీ సమీపించి ఇద్దరి కాలర్లు రెండు చేతులతో పట్టి ఇద్దర్నీ మూడు అడుగుల ఎత్తుకి లేపాడు.

“అబ్బ … సార్ చూడ్రా .. ఎంత కళగా వున్నాడో!! భలే హాండ్ సమ్ పర్సన్ కదా … హిహిహి …'' నవ్వుతూ అన్నాడు రాంబాబు లోలోపల భయపడ్తూనే.

“అవును … ఆ దుప్పటి తీసిపారేస్తేనే తెల్సింది ఈయన ఫిగరేంటో ఆయన అందం ఏంటో!'' అన్నాడు చిన్నారావ్ కూడా బలవంతంగా నవ్వుతూ.

మరుక్షణం ధనేల్ మని శబ్దం.