అందరూ దొంగలే - 60

Listen Audio File :

దిప్పల్లో నర్సింగ్ హోమ్! సరోజ దేనిగురించో తీవ్రంగా వెతుకుతూ వుంది. “ఇందాకటి నుండి గమనిస్తున్నా ... దేనిగురించి అలా వెతుకుతున్నావ్?’’ సునీత అడిగింది.

“గ్లిజరిన్ బాటిల్! ఇందాక ఇక్కడే పెట్టా. అంతలోనే ఎక్కడ మాయం అయ్యింది?!’’ చెప్పింది సరోజ ఇంకా వెతుకుతూనే.

“అదా! ఈ టేబుల్ మీద అడ్డంగా ఉంటే నేనే తీశా ...’’ అంది సునీత.

“నువ్వు తీశావా? ఎక్కడ పెట్టావ్?’’ ఆత్రంగా అడిగింది సరోజ.

“టేబుల్ ఆఖరి సొరుగులో పడేశా. అయినా ఇప్పుడు గ్లిజరిన్ ఎందుకూ?’’ ఆశ్చర్యంగా అడిగింది సునీత.

“మనం కళ్ళల్లో గ్లిజరిన్ చుక్కలు వేస్కుని, నేను రాంబాబు కోసం, నువ్వు చిన్నారావ్ కోసం బాధపడద్దూ ...?’’ ఆమాత్రం తెలీదా అన్నట్టు చూస్తూ అడిగింది సరోజ.

సునీత నాలుక కర్చుకుంది. ఇద్దరూ కళ్ళల్లో గ్లిజరిన్ చుక్కలు వేస్కుని, కాస్సేపు కన్నీటి చుక్కలు కార్చి బాధపడ్డారు. “నువ్వెన్నయినా చెప్పు, కన్నీళ్ళు లేకుండా మామూలుగా బాధ పడ్తే అంత తృప్తిగా వుండదు. కళ్ళలోంచి కన్నీరు వస్తే ఆ దారే వేరు!’’ అంది సరోజ. సునీత నిజమేనన్నట్టు తలూపింది.

“పాపం ... వాళ్ళిద్దరూ జైల్లో ఏం తింటున్నారో ఏమో, ఈవేళ వాళ్ళిద్దరికీ మంచి భోజనం తీస్కేళ్దామా?’’ అడిగింది సరోజ.

“గుడ్ అయిడియా, తీస్కెళ్దాం ...’’ అంది సునీత. సరోజ, సునీత రాంబాబు, చిన్నారావ్ ల సెల్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఒకరినొకరు చూస్కుని కాస్సేపు బాధపడ్డారు. ఓ పావుగంట ఆ విశేషాలూ, ఈ విశేషాలూ మాట్లాడుకున్నాక, “మీకోసం మంచి భోజనం తెచ్చాం ...’’ అంటూ చేతిలోని క్యారియర్ ఎత్తి చూపించింది సరోజ.

“ఏం తెచ్చారు?’’ ఆశగా అడిగాడు చిన్నారావ్.

“అన్నం, ముక్కల సాంబారు, గుత్తొంకాయకూర, బంగాళా దుంపల వేపుడు, కొబ్బరి పచ్చడి, మీగడ పేరుగ’’ చెప్పింది సునీత.

“అబ ... నోరూరిపోతుంది ... ఆ క్యారియర్ త్వరగా ఇవ్వండి’’ అన్నాడు రాంబాబు ఆత్రంగా.

“ఎలా ... ఈ ఊచాల్లోంచి క్యారియర్ దూరదుగా ...?’’ అంది సరోజ.

“ఏయ్ బాబూ ... కాస్త తాళం తీయ్. వీళ్ళకి భోజనం ఇవ్వాలి’’ అంది సునీత అక్కడ వున్న సెంట్రీతో.

“అలా భోజనం ఇవ్వడానికి కుదర్దు’’ అన్నాడు సెంట్రీ.

“కుదర్దంటే ఎలా బాబూ ... అంత దూరంనుండి క్యారియర్ మోసుకోచ్చాం .... కాస్త తాళం తియ్’’ అంది సరోజ.

“చెప్పాను కదమ్మా ... కుదర్దని, జైలర్ గారి పర్మిషన్ కావాలి’’ అన్నాడు సెంట్రీ.

“మా వాళ్ళకి భోజనం పెట్టడానిక్కూడా బోల్డన్ని రూల్స్ మాట్లాడ్తావేంటయ్యా’’ అంటూ సెంట్రీతో వాదనకి దిగారు సరోజ, సునీత,

అదే సమయంలో అక్కడికి జైలర్ ఆత్మారాం వచ్చాడు. “ఏంటి గొడవ?’’ అని సెంట్రీని అడిగాడు.

సెంట్రీ చెప్పాడు.

“కుదర్దమ్మా ... మీరు తెచ్చిన భోజనం ఖైదీలకి పెట్టడానికి కుదర్దు. మీ భోజనం వల్ల వాళ్ళకేమైనా అయితే మీకు పర్మిషన్ ఇచ్చినందుకు. నా ఉద్యోగం పోతుంది’’ అన్నాడు ఆత్మారాం.

“మాకేమైనా అయితే నువ్వు పెట్టే భోజనంవల్ల అవ్వాలిగానీ ... మా వాళ్ళు పెట్టె భోజనం వల్ల ఏమౌతుంది?’’ కోపంగా అన్నాడు రాంబాబు.

“అసలు నువ్వు ఇక్కడి భోజనం తిని చూశావా ఎప్పుడైనా? నువ్వెందుకు తింటావ్? నువ్వు ఇంట్లో మీ ఆవిడ కమ్మగా వండిపెడ్తే పీకల్దాక తింటావ్’’ అన్నాడు చిన్నారావ్.

“ఏంటీ .... మీ ఇద్దరి నోళ్ళూ లేస్తున్నాయ్?’’ క్రూరంగా అన్నాడు జైలర్ ఆత్మారాం.

“అయినా పాపం ... వాళ్ళని కమ్మగా ఇంత తిండి కూడా తిననీయవ్, నువ్వేం మనిషివయ్యా’’ అంది సరోజ.

“అరరే ... ఇతను మనిషా?!’’ ఆశ్చర్యంగా జైలర్ ఆత్మారాంని పైనుండి క్రిందిదాకా, క్రిందినుండి పైదాకా చూస్తూ అంది సునీత.

దాంతో ఒళ్ళు మండిన ఆత్మారాం సరోజ జేతిలోని క్యారియర్ లాక్కుని దూరంగా విసిరేశాడు. అన్నం మొత్తం నేలపాలయ్యింది. అప్పుడు ఆ నలుగురు తిట్టిన తిట్లు విన్న జైలర్ ఆత్మారాం జీవితాంతం మర్చిపోడు.

*****