TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
ఆ భీకరాకారుడికి ఆరడుగుల దూరంలో రాంబాబు, చిన్నారావ్ లు ఎగిరి వెల్లకితలా పడ్డారు.
వెంటనే రాంబాబు "ఒకటి … రెండు … మూడు … నాలుగు …'' అంటూ అంకెలు చదవడం మొదలెట్టాడు.
“ఏంట్రా … అమ్మా … అబ్బా .. అంకెలు లెక్కబెడ్తున్నావ్ … అమ్మా … అయ్యో…'' బాధతో మూలుగుతూ అడిగాడు చిన్నారావ్.
“అదా …. నా కళ్ళముందు తిరుగుతున్న నక్షత్రాల్ని లెక్కబెడ్తున్నా అమ్మా …'' బాధగా అన్నాడు రాంబాబు.
“నీకే నయం! కళ్ళముందు ఎంచక్కా నక్షత్రాలయినా కనిపిస్తున్నాయ్ … నాకైతే బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయ్'' అన్నాడు చిన్నారావ్.
“ఏరా? లేకపోతే ఈ 'రాకా'తోనే మజాకులు చేస్తార్రా?!'' నడుం మీద చేతులు పెట్టుకుని హుంకరించాడు రాకా.
“అబ్బే … మీ పర్సనాల్టీ గురించి తెలీక ఏదో తేలిగ్గా తీస్కున్నాం సార్'' అన్నాడు రాంబాబు ముక్కుతూ, మూల్గుతూ లేచి నిలబడి. “ఇప్పుడు మేమస్సలు మజాకులు చెయ్యంగా'' అన్నాడు చిన్నారావ్ గూడా లేచి నిలబడ్తూ.
రాకా వెళ్ళి సిమెంట్ దిమ్మమీద కూర్చున్నాడు. రాంబాబు, చిన్నారావ్ లు మెల్లిగా అతన్ని సమీపించారు. “మనం ముగ్గురూ ఒకే సెల్ లొ వుండాల్సిన వాళ్ళం … మనం స్నేహంగా వుండడం ఏంతో అవసరం …! హిహిహి …'' అన్నాడు రాంబాబు.
“అవసరమా? ఎవరికీ?'' అన్నాడు రాకా కళ్ళు ఎగరేస్తూ.
“అఫ్ కోర్స్! మాకే అనుకోండి. ముందుగా మనల్ని మనం పరిచయం చేస్కుందామా? నాపేరు రాంబాబు … ఇతను చిన్నారావ్ … మరి మీ పేరు?'' అడిగాడు రాంబాబు.
“రాకా!'' చెప్పాడతను.
“వెరీ స్వీట్ నేమ్! చాలా బాగుంది'' అన్నాడు చిన్నారావ్.
“ఏం … ? వేళాకోళమా …?'' అనుమానంగా చూస్తూ అడిగాడు రాకా.
“హవ్వ … హవ్వ! వేళాకోళమా …? అదీ మీతోనా? ఎత్తి కుదెయ్యరూ? నేను నిజంగానే చెప్తున్నాను సార్! నున్నటి మీ గుండు మీదొట్టు'' అన్నాడు చిన్నారావ్. అయినా మీరు చూస్తే తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. మీ పేరు చూస్తే తెలుగువాళ్ళ పేరులా లేదు. అసలు మీ మాతృభాష … అంటే మదర్ టంగ్ ఏంటి సార్?'' అడిగాడు రాంబాబు.
“తెలుగు! రాకా అనేది నా షార్ట్ నేమ్. నా పూర్తిపేరు రావినూతల కాంతారావ్ ని కుదించి రాకా అని పేరు పెట్టుకున్నా''
“చాలా చక్కగా వుంది. అసలు రాకా అన్న పేరు మీ ఫేస్ కి, మీ పర్సనాలిటీకి బాగా సూటయింది సార్'' అన్నాడు రాంబాబు.
“పాపం! సార్ కూడా మనలానే అమాయకంగా క్రిమినల్ కేసులో ఇరుక్కుని వుంటాడు. సార్ ఫేస్ చూడు రాంబాబూ! ఎంత అమాయకంగా వుందో?'' అన్నాడు చిన్నారావ్.
“అసలు మిమ్మల్ని జైల్లో ఎందుకు వేశారు సార్? పాపం ఆకలికి తట్టుకోలేక షాపులో బ్రెడ్డు దొంగిలిస్తే వేశారా?'' అడిగాడు రాంబాబు.
“కాదు … నామీద హత్య, కిడ్నాప్, రేప్, లూటీ, డెకాయిటీ, చీటింగ్. ఇన్ని రకాల కేసులున్నాయ్. నేను ఇప్పటిదాకా పది హత్యలూ, రెండు రేప్ లూ చేశాను'' గర్వంగా చెప్పడు రాకా.
అది విన్న రాంబాబు, చిన్నారావ్ లు వెల్లకింతలా పడిపోయారు
*****
అర్థరాత్రి … సరిగ్గా పన్నెండు గంటలైంది. 'డాం …!' పెద్ద శబ్దంతో గజదొంగ మంగులు డెన్ ప్రతిధ్వనించింది. ఆ శబ్దానికి మంగులు ఉలిక్కిపడి మంచంమీద నుండి లేచాడు. మెల్లగా తలగడ క్రింది నుండి రివాల్వర్ తీశాడు. ఏంటా శబ్దం? కొంపదీసి పోలీసులు డెన్ ని చుట్టుముట్టారా? మరి డేవిడ్, జాకబ్, ఈ సన్నాసులంతా ఎక్కడ చచ్చారు? ఇది కమీషనర్ లింగారావ్ గాడి పనేనా? ఆలోచిస్తే వాడి కూతురికి ప్రాణాపాయ్రం అని తెలీదా? వాడు కాకపొతే మరెవరు? ట్రిగ్గర్ మీద వేలుపెట్టి రెడీగా వుంచి శబ్దం చేయకుండా అడుగులు ముందుకు వేశాడు.
గది తలుపు శబ్దం కాకుండా మెల్లిగా తియ్యాలని ప్రయత్నించాడు. కానీ అది శబ్దం చేయనే చేసింది. కిర్ ర్ ర్ ర్ ర్ … “ఓ … రేపు కొవ్వొత్తుల ఆర్పి ఆ కార్పెంటర్ గాదని ఖతం చేస్తానని ప్రతిజ్ఞ చేయాలి'' నెత్తి కొట్టుకుంటూ అనుకున్నాడు గజదొంగ మంగులు. కాసేపు నిశ్శబ్దంగ అలానే నిల్చునాడు. నాలుగు క్షణాల తర్వాత ….
“ఠంగ్ ….'' మని శబ్దం. మంగులు పూర్తిగా ఎలర్ట్ అయిపోయాడు. ఆ శబ్దం వంటగదిలోంచి వచ్చింది. మంగులు మెల్లగా వంట గది వైపు అడుగులు వేశాడు, అడుగులో అడుగు వేసుకుంటూ వంటగదిని సమీపించాడు. లోపల లైట్ వెలుగుతోంది. అంటే ఎవరో వున్నారు! ఎవరై వుంటారు? తానిలా ఆలోచిస్తూ ఏమరుపాటుగా వుంటే వంటగదిలో ఉన్నవాళ్ళు హఠాత్తుగా బయటికి వచ్చి తనని షూట్ చేస్తారు. కాబట్టి తనికి ఆలస్యం చెయ్యకూడదు! గజదొంగ మందులు వంటగది గుమ్మంలోకి ఒక్క గెంతు గెంతి రివాల్వర్ ని రెండు చేతులతో పట్టుకుని ముందుకుచాపి "హాండ్సప్ …!'' అన్నాడు గట్టిగా.
|
|