TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
డెన్ లోని అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు తర్వాతి నిముషంలో ఏమవుతుందోనని!
“బాస్ ... కాస్త ఆగండి బాస్!’’ అన్నాడు నాగరాజు. గజదొంగ మంగులు వెనక్కి తిరిగి నాగారాజువైపు చూశాడు. “ఏంటి ...? దీపకి సపోర్టా?!’’ అడిగాడు మంగులు.
“కాదు బాస్ ... దీన్ని చంపడంవల్ల నీకు లాభం ఏంటి బాస్?!’’
“పగ ... నా పగ చల్లార్తుంది’’ అన్నాడు మంగులు పళ్ళు కొరుకుతూ.
“దానివల్ల నీకు ఒక్క పైసా కూడా లాభంలేదు ... నా మాట విను బాస్ ... నువ్వు కమీషనర్ లింగారావ్ కి ఫోన్ చేసి దీప నా కబ్జాలో వుందనీ. దీపని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే పదిలక్షలు కావాలని డిమాండ్ చెయ్యి. వాడికి పాపంటే ప్రాణం ... కాబట్టి మీకు పదిలక్షలు ఇస్తాడు’’ అన్నాడు నాగరాజు.
“డబ్బులు సరే ... మరి నా పగ మాటో ...’’ అడిగాడు గజదొంగ మంగులు.
“పదిలక్షలు తీస్కోమన్నాను గానీ ... పాపని అప్పగించమని అన్లేదు కదా?! పాపని తీరుబడిగా సఫా చెయ్యచ్చు’’ అన్నాడు నాగరాజు.
“శభాష్ నాగరాజు ... ఇప్పుడు నిజంగా నా శిష్యుడవనిపించుకున్నావ్ ...” అన్నాడు మంగులు సంబరంగా.
“కానీ మాకు మాత్రం నాగారాజే మీకు గురువులు అనిపిస్తున్నాడు బాస్!’’ అన్నాడు డెన్ లోని రౌడీలలో ఒకడు. వాడి కామెంట్ కి డెన్ లోని వారందరూ ఘోల్లుమని నవ్వారు.
“అబ్బా ...!’’ అంటూ బాధగా జుత్తు పీక్కున్నాడు గజదొంగ మంగులు. ఆ దెబ్బకి అందరూ సైలెంట్ అయిపోయారు.
నాగరాజు దగ్గరికి దీప పరుగున వెళ్ళింది. “అంకుల్ ... ఈ పిచ్చోళ్ళ దగ్గరకెందుకు తీసుకొచ్చావ్ ...? పద మనింటికెళ్ళిపోదాం’’ అంది.
“వెళ్దాం పాపా ... ఇక్కడ చిన్న పనుంది! అదయ్యాక వెళ్దాం’’ అన్నాడు నాగరాజు.
గజదొంగ మంగులు కమీషనర్ లింగారావ్ నెంబర్ తిప్పాడు. ఫోన్ శ్రీలక్ష్మి ఎత్తింది. “హలో ... నేను మంగుల్ని మాట్లాడ్తున్నా ...! మీ పాప దీప నా దగ్గరే క్షేమంగా వుంది’’ అన్నాడు మంగులు.
అవతల శ్రీలక్ష్మి గొంతులో ఆనందం. “ఆ ...! మా పాప నీదగ్గర క్షేమంగా వుందా? మంగులూ, నువ్వెంత మంచివాడివి! స్వామీ వెంకటేశ్వరా ... నా దీప క్షేమంగా వున్నందుకు నీకు మంగులు కుడిచేయి, ఎడమకన్నూ సమర్పించుకుంటా స్వామీ’’
“ఏమ్మో ... ఏంటి పిచ్చి పిచ్చి మొక్కులన్నీ మొక్కుతున్నావ్? ఘూట్చేసి పారేస్తా ...! మంగులంటే ఎవరనుకున్నావ్ .... గజదొంగ మంగులు! ... నేను మీ పాపని కిడ్నాప్ చేసి తీస్కోచ్చా! నువ్వు నోరుమూస్కుని మీ ఆయనకి ఫోనివ్వు’’ అన్నాడు గజదొంగ మంగులు.
“ఆ గజదొంగ మంగులా ...?!’’ అంటూ శ్రీలక్ష్మి అవతలినుండి కెవ్వుమని అరిచింది.
తర్వాత పోలీస్ కమీషనర్ లింగారావ్ గొంతు వినిపించింది. “హలో ... ఎవరూ?’’
“ఎవరూ ఏంట్రా బేవకూఫ్! నేను గజదొంగ మంగులుని మాట్లాడ్తున్నా ... నీపాప ప్రస్తుతం నా చెరలో వుంది ... నీ పాపని నీకు క్షేమంగా అప్పగించాలంటే మాకు 10 లక్షలు ముట్టజెప్పాలి ... లేదా సఫా చేసేస్తా’’ అన్నాడు మంగులు.
“పాపం అమాయకుడు ... ఆ నాగారాజుని ఏం చేశారు ...?’’ కంగారుగా అడిగాడు కమీషనర్ లింగారావ్.
“నాగరాజు అమాయకుడేంట్రా బేవకూఫ్, మీ దీపాని వాడే నాకు అప్పగించాడు ... నాగరాజు నా మనిషి .. ఇదిగో ... కావాలంటే మాట్లాడు’’ అంటూ నాగారాజుని దగ్గరికి పిలిచి, అతని చేతికి రిసీవర్ ఇచ్చాడు గజదొంగ మంగులు.
“హలో ...!’’ అన్నాడు నాగరాజు.
“హలో ... నాగారాజూ ... వాడు చెప్పింది నిజమేనా?’’ సీరియస్ గా అడిగాడు పోలీస్ కమీషనర్ లింగారావ్.
“నిజమే ... మంగులు నా బాస్. నా బాస్ కోసం నేను రాంబాబు, చిన్నారావ్ లను పట్టుకుని మీ ఇంట్లోకి ప్రవేశించా! ఇదిగో ... దీపతో మాట్లాడు’’ అంటూ రిసీవర్ దీపకి ఇచ్చాడు నాగరాజు.
“హలో డాడీ ...’’ అంది దీప.
“అమ్మా దీపా ... ఎలాగున్నావమ్మా?’’ కంగారుగా అడిగాడు కమీషనర్ లింగారావ్. దీప సమాధానం చెప్పేలోగా నాగరాజు దీప చేతిలోంచి రిసీవర్ లాగేసుకున్నాడు.
“దీప గొంతు విన్నావు కదా ... కాబట్టి నీ దీపాని నీ దగ్గరకు క్షేమంగా చేర్చడానికి మాకు 10 లక్షలు ఇవ్వాలి’’ అన్నాడు నాగరాజు.
“ఒరేయ్ నీచుడా ... మంచివాడిలా నమ్మించి, మా ఇంట్లోచేరి ఇంత నీచానికి ఒడిగడ్తావ్?’’ అన్నాడు కమీషనర్ లింగారావ్ అరుస్తూ.
“సరే ... నీ బుర్రకేం ఎక్కుతున్నట్టు లేదు ... దీపాని సఫా చేసేస్తాంలే ... ఫోన్ పెట్టేస్తాను’’ అన్నాడు నాగరాజు.
“నాగరాజు ... ఆగు ... ఫోన్ పెట్టేయ్యకు’’ అవతలినుండి అరిచాడు కమీషనర్ లింగారావ్.
“ఏంటి?” అన్నాడు నాగరాజు.
“నేను డబ్బులు ఇస్తా! దీపాని ఏం చెయ్యకండి’’ అన్నాడు కమీషనర్ లింగారావ్.
“వెరీగుడ్! అలా దార్లోకి రా’’ అన్నాడు నాగరాజు.
“కానీ పదిలక్షలంటే కష్టం ... ఓ అయిదు లక్షలు ఇస్తాను’’
“నొ ... పదిలక్షలకి ఒక్క పైసా తగ్గినా పాప ప్రాణాలతో బతకదు’’
“అంత ఇచ్చుకోలేను’’ ప్రాధేయపడుతూ అన్నాడు కమీషనర్.
“ఇప్పుడు నువ్వు వెంటనే ఇవ్వక్కర్లేదు ... కాస్త టైం తీస్కునే ఇవ్వు’’
“పోనీ అయిదు కాకపొతే, ఆరు లక్షలు ఇస్తాను ...’’ అన్నాడు కమీషనర్.
“కుదర్దు’’ అన్నాడు నాగరాజు.
“పోనీ ఎనిమిది?’’
“అబ్బా! ఒక్క పైసా కూడా తగ్గడానికి వీల్లేదని నీకెన్నిసార్లు చెప్పాలయ్యా? అయినా పదిలక్షలు మాకే వస్తాయనుకున్నావా? దీంట్లో రెండు లక్షలు వేరే వాళ్ళకి వాటా ఇవ్వాలి’’ విసుక్కున్నాడు నాగరాజు.
“వేరే వాళ్ళకి వాటానా? ఎవరి వాళ్ళు?’’ అడిగాడు కమీషనర్ లింగారావ్ ఆశ్చర్యంగా.
“రాంబాబు, చిన్నారావ్’ ఠకీమని అప్పటికి మనసుకి తోచిన పేర్లు చెప్పాడు నాగరాజు.
కమీషనర్ లింగారావ్ చేతిలోంచి రిసీవర్ జారిపోయింది.
|
|