TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
రాంబాబు, చిన్నారావ్ యింట్లో అప్పటిదాకా వాళ్ళు పెళ్ళి ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేస్కోవాలి అన్న విషయాల్ని రెండు గంటలనుండి చర్చించుకుంటు న్నారు. అది ఎంతకీ తేలని చర్చ ....
“అసలు సరోజా, సునీత కూడా వుంటేనే ఈ డిష్కషన్ ఒక కొలిక్కి వస్తుందని నా నమ్మకం’’ అన్నాడు రాంబాబు.
“నువ్వు చెప్పింది కూడా కరెక్ట్!’’ అన్నాడు చిన్నారావ్.
“అసలు మన పెళ్ళి ఎప్పుడవుతుందో?’’ అన్నాడు రాంబాబు తన్మయత్వంతో కళ్ళు మూస్కుని.
“ఇప్పుడు అవుతుంది – అప్పుడే లోపలికి వచ్చిన కమీషనర్ లింగారావ్ అన్నాడు గంభీరంగా.
“అదేంటి ...? నీ గొంతు కమీషనర్ లింగారావ్ గాడి గొంతులా వుంది’’ కళ్ళు మూస్కునే ప్రశ్నించాడు రాంబాబు. చిన్నారావ్
రాంబాబు డొక్కలో ఓ పోటు పొడిచాడు.
“అబ్బ! ఏంట్రా అలా పోడిచావు ...?”అంటూ కళ్ళు తెరిచిన రాంబాబుకి ఎదురుగా కమీషనర్ లింగారావ్ కనిపించాడు.
రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ లేచి నిలబడి లింగారావ్ కి సెల్యూట్ చేశారు. “సార్ ... ఏంటి సార్ ఇలా వచ్చారు?’’ అడిగాడు రాంబాబు కంగారుగా.
“పెళ్ళి గురించి కలవరిస్తున్నారుగా? మీ పెళ్ళి చేసి పోదామనీ ... కానిస్టేబుల్స్’’ అంటూ అరిచాడు. బయటినుండి బిలబిలా అరడజను మంది కానిస్టేబుల్స్ లోపలికి వచ్చారు.
“వీళ్ళని అరెస్ట్ చెయ్యండి’’ వాళ్ళలో ఒక కానిస్టేబుల్ ఇద్దరి చేతులకీ బేడీలు వేశాడు. రాంబాబు, చిన్నారావ్ కి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు.
“సార్! మమ్మల్నెందుకు అరెస్టు చేస్తున్నారు సార్?’’ అయోమయంగా అడిగాడు రాంబాబు.
“మా దీపని కిడ్నాప్ చేసినందుకు’’ చెప్పాడు కమీషనర్ లింగారావ్.
“ఆ ...! దీప కిడ్నాప్ కి గురైందా?’’ కోరస్ గా అంటూ ఆశ్చర్యంగా నోళ్ళు తెరిచారు రాంబాబు, చిన్నారావ్ లు.
“జైల్లో తీరుబడిగా ఆశ్చర్యపోదురుగాని! ఊ ... వీళ్ళని తీసుకురండి’’ అంటూ బయటికి వెళ్ళి జీపక్కి కూర్చున్నాడు కమీషనర్ లింగారావ్. పోలీసులు రామాబు, చిన్నారావ్ లను వెనుకనుండి తోస్కుంటూ తీసుకొచ్చి జీపు ఎక్కించారు. జీపు ముందుకు కదిలింది.
*****
డిప్పలో నర్సింగ్ హోమ్ లో ...
సరోజ జనరల్ వార్డులో ఓ రోగికి ఇంజక్షన్ చేస్తుండగా సునీత అక్కడికి పరుగున వచ్చింది.
“సరోజా ... సరోజా .... న్యూస్ పేపర్లో మన రాంబాబు, చిన్నారావ్ లకి సంబంధించి ఫ్రంట్ పేజీలో న్యూస్ పడింది’’ కంగారుగా చెప్పింది సునీత. ఆమె కంగారు గమనించిన సరోజ కులాసాగా నవ్వుతూ, రోగికి ఇంజక్షన్ చేస్తూ –
“ఓ ... అలాగా! ఏంటీ? మళ్ళీ దీప మీద ఎటాక్ జరిగితే ఇద్దరూ రక్షించారా?’’
“కాదు, దీపని వీళ్ళిద్దరూ కిడ్నాప్ చేశారు.
“వ్వాట్!’’ ఇంజక్షన్ చెయ్యడం ఆపి ఆశ్చర్యంగా చూసింది సరోజ సునీత వైపు.
“ఏం? జోక్ చేస్తున్నావా?’’ అని అడిగింది.
“అయ్యో! నేను నిజమే చెప్తున్నాను ... దీపని కిడ్నాప్ చేశారన్న నేరం మీద రాంబాబు, చిన్నారావ్ ఇద్దర్నీ అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకి తరలించారు. కావాలంటే రెస్ట్ రూమ్ లో న్యూస్ పేపరుంది పోయి చదువు’’
“ఆ ...’’ అని బాధగా అరిచాడు పేషెంట్.
“ఏంటయ్యా బాబూ ... అసలు అలా బాధగా అరవాల్సింది నేను, నువ్వెందుకు అరిచావ్?’’ అంటూ విసుక్కుంది సరోజ.
“మీరు ఆ దిక్కుమాలిన న్యూస్ వింటూ నా జబ్బలోకి సూదిని యమ గట్టిగా గుచ్చేశారండి” అన్నాడు పేషెంట్.
“మనం డాక్టర్ కి చెప్పేసి వెంటనే చంచల్ గూడ జైలుకెళ్ళాలి’’ అంది సునీత.
“పద’’ అంటూ కంగారుగా ముందుకు పరుగెత్తింది సరోజ. సునీత ఆమెని అనుసరించింది.
“బాబోయ్ ... నా జబ్బలో సూదిని వదిలేశావ్ తల్లోయ్!’’ వెనుకనుండి ఆ పేషెంట్ పెడ్తున్న గోల వాళ్ళ చెవిన పడలేదు.
|
|