TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
గజదొంగ మందులు డెన్ లో అటూ ఇటూ పచార్లు చేస్తుంటాడు. “సార్! ఇంక పచార్లు చేసింది చాలు సార్! మీరింక కూర్చోండి ... లేకపోతే మీకు కాళ్ళు నొప్పులు వస్తాయి సార్’’ అన్నాడు డేవిడ్.
“నోర్ముయ్ ... వాళ్ళని ఖతం చేసి రండిరా అంటే, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుని వచ్చారు. నువ్వు కూడా నాకు సలహా ఇచ్చేవాడివే’’ అన్నాడు మంగులు మండిపడుతూ.
“బాస్! ఆ డాక్టర్ మాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి పారేస్తే మీరు వాడిని చంపుతానని కొవ్వొత్తులు ఆర్పి శపథం చేశారా బాస్’’ అని అడిగాడు జాకబ్.
“ఏంట్రా నీ ఉద్దేశ్యం ...? నా సమస్యలకే నేను బోల్డన్నిసార్లు చెయ్యి కాల్చుకుని చస్తున్నా ... ఇప్పుడు మీ సమస్యలకి కూడా నేను చెయ్యి కాల్చుకోవాలా? నిన్ను చంపుతానని చెయ్యి కాల్చుకుని శపథం చేస్తే నాకు పట్టిన శని వదిలిపోతుంది ...’’ అన్నాడు గజదొంగ మంగులు పళ్ళు నూర్తూ.
ఇంతలో డెన్ ద్వారం దగ్గర అలికిడి విని ప్రక్కకి తిరిగి చూశాడు గజదొంగ మంగులు. అక్కడ కనిపించిన దృశ్యానికి మంగులు మొహం ఆనందంతో విప్పారింది. నాగరాజు దీప చెయ్యి పట్టుకుని మెల్లిగా నడిపించుకుంటూ ... చిరునవ్వుతో ... మొహంలో విజయగర్వంతో వస్తున్నాడు.
“శభాష్ నాగారాజూ ... శహభాష్ ... నువ్వు నాకు అసలైన శిష్యుడి వనిపించుకున్నావ్ ...’’ అంటూ ఆ డెన్ కంపించేలా వికటాట్టహాసం చేశాడు.
“వాడెందుకళా నవ్వుతున్నాడూ ...? వాదేమైనా పిచ్చోడా ...? అని అడిగింది దీప నాగారాజుని. దీప అలా అడగగానే మంగులు ఠక్కున నవ్వాపేసి వెర్రిమొహం వేశాడు. డెన్ లోని రౌడీలందరూ పాప వేసిన ప్రశ్నకి పగలబడి నవ్వారు!
“వీళ్ళందరూ ఎందుకలా నవ్వుతున్నారు ...? వీళ్ళు కూడా పిచ్చోళ్ళా ?’’ మళ్ళీ అడిగింది దీప నాగారాజుని. ఈసారి రౌడీలందరూ కూడా ఠక్కున నవ్వాపేసి వెర్రిమొహాలు వేశారు. “అయ్యిందమ్మా పెళ్ళి ...? ఇందాక నన్ను చూసి నవ్వారుగా?!’’ చంకలు గుద్దుకుంటూ సంబరంగా అన్నాడు గజదొంగ మంగులు.
“అయినా అంకుల్ ... నేననీ పిచ్చోళ్ళ దగ్గరికి ఎందుకు తీస్కొచ్చావు?’’ అడిగింది దీప నాగారాజుని. గజదొంగ మంగులుకి మండిపోయింది. “ఎందుకు తీస్కోచ్చాడో ఇప్పుడే నీకర్థం అవుతుంది ...’’ అంటూ జేబులోంచి బటన్ నైఫ్ తీసి బటన్ బొటనవేలితో నొక్కాడు. చాక్ చెక్ మని తెరుచుకుంది ...!
“హాయ్ ...! ఎంతమంచి కత్తో ...? బటన్ నొక్కితే బయటికొచ్చింది!’’ సంతోషంతో గంతులేసింది దీప.
“పిచ్చంకుల్ ... మీరేమో ఆ కత్తి పదునుగా వుందా ...?’ వెర్రి మొహం వేస్కుని నిల్చున్న మంగుల్ని అడిగింది దీప.
“ఆ ... చచ్చేంత పదునుగా వుంది’’ అన్నాడు క్రూరంగా చూస్తూ మంగులు.
“అలాగైతే ఆ కత్తి నాకు ఇచ్చేయ్ అంకుల్’’ అంది దీప సంబరంగా.
“ఎందుకూ ...” బిత్తరపోయి చూస్తూ అడిగాడు గజదొంగ మంగులు.
“మా ఇంట్లో బోల్డన్ని ములికి ఇరిగిపోయిన పెన్సిల్స్ వున్నాయ్. వాటిని చెక్కుకుంటా ...’’
“అబ్బా ...!’’ బాధగా జుత్తు పీక్కున్నాడు గజదొంగ మంగులు. “మీరు ఆ చిన్నపిల్లక్కూడా పవర్ ఫుల్ గా కనిపించడంలేదేమోనని నాకనుమానంగా వుంది బాస్’’ అన్నాడు డేవిడ్.
“నువ్వు నోర్ముయ్ ... నువ్వు చాలా పవర్ ఫుల్ గా కనిపించావ్ లే. అందుకనే ఫ్యామిలీప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నావ్ ...’’ డేవిడ్ వంక కొరకొరా చూస్తూ అన్నాడు మంగులు.
డేవిడ్ నోరు మూస్కున్నాడు. డెన్ లోని రౌడీలంతా ఘోల్లుమని నవ్వడం మొదలుపెట్టారు.
“నోరుముయ్యండి ... మీరంతా నోళ్ళు ముయ్యండి ...’’ గట్టిగా అరిచాడు మంగులు. అందరూ సైలెంట్ అయిపోయారు. గజదొంగ మంగులు దీపవంక క్రూరంగా చూశాడు.
“ఏంట్రా పిచ్చోడా ... అలా చూస్తున్నావ్?’’ అంది దీప ఏమాత్రం బెరుకులేకుండా. డెన్ లోని రౌడీలంతా నోళ్ళు రెండు చేతులతో అడిమిపెట్టారు వస్తున్న నవ్వుని బయటికి రానీకుండా.
“అవునే ... నిజంగా పిచ్చోడినే ... ఇంతదాకా నిన్ను బ్రతకనివ్వడమే నా పిచ్చితనం’’ అని దీప వైపు అడుగులు వేయసాగాడు మంగులు. డెన్ లోని అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు ...
“ఒరేయ్ కమీషనర్ ... నువ్వు మా అన్నయ్యని చంపుతావు కదూ ...? ఇప్పుడు చూడరా ... నీ ముద్దుల కూతురు గతి ఏమవుతుందో?’’
పకపకా నవ్వి గజదొంగ మంగులు చేతిలోని కత్తిని పైకెత్తి ఒక్కొక్క అడుగే దీపవైపు వెయ్యసాగాడు.
|
|