TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
మర్నాడు రాంబాబు, చిన్నారావ్ లు దీపాని స్కూలుకి తీస్కెళ్ళడానికి జీపులో నలుగురు గన్ మెన్ లతో వున్నారు. గుమ్మంలోనే వాళ్ళకి నాగరాజు ఎదురయ్యి “గుడ్ మార్నింగ్ బ్రదర్స్’’ అన్నాడు. ప్రతిగా రాంబాబు, చిన్నారావ్ లు అతనికి గుడ్ మార్నింగ్ చెప్పారు.
“ఏంటీ ...? దేప ఉయ్యాలాట ఆడ్దామని అడిగిందా?’’ రాంబాబు అడిగాడు నవ్వుతూ.
“ఆ అడిగింది, కానీ అది చాలా డేంజర్ ఆటే!’’ అన్నాడు నాగరాజు.
“అయితే ఆడావా? మరి నీ మెడ వంకరపోకుండా మామూలుగానే వుందే!’’ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు చిన్నారావ్.
“నేను ఆడ్తానా?! దీప తెచ్చిన తాడుని నా మ్యాజిక్ తో పాములా కన్పించేలా చేశా. దెబ్బకి భయపడిపోయి తాడుని దూరంగా పారేసింది ... ఇంకెప్పుడూ నన్ను ఉయ్యాలాట ఆడ్దామని అడగదు’’ అంటూ నవ్వాడు నాగరాజు. రాంబాబు, చిన్నారావ్ లు అతనితో శృతి కలిపారు.
దీపని తీస్కుని కమీషనర్ లింగారావ్, శ్రీలక్ష్మి బయటికి వచ్చారు. రాంబాబు, చిన్నారావ్ లు లింగారావ్ కి సెల్యూట్ చేశారు. దీపాని తీస్కుని రాంబాబు, చిన్నారావ్ లు జీప్ ఎక్కాడు. “మ్యాజిక్ అంకుల్ ... నువ్వు కూడా రా’’ అంటూ జీపులోంచి దీప అరిచింది.
“ఇంట్లో వుండి ఏం చేస్తావ్, నువ్వు కూడా వెళ్ళు ...’’ అన్నాడు కమీషనర్ లింగారావ్ నాగరాజుతో. నాగరాజు కూడా జీపు ఎక్కాడు. జీపు ముందుకి కదిలింది.
జీపు అరకిలోమీటరు వెళ్ళిన తర్వాత దారి ప్రక్కగా ఉన్న పొదలచాటున పొంచి వున్న గజదొంగ మంగులు ఆ వైపుగా వెళుతున్న జీపునీ, దాంట్లో వున్న దీపని, రాంబాబు, చిన్నారావ్, నాగరాజుల్ని చూసి కసిగా నవ్వాడు.
“కమీషనర్ ...! నీ టైం దగ్గరపడింది ...’’ అంటూ పళ్ళు నూరాడు.
******
స్కూల్ కెళ్ళే దార్లో నాగరాజు దీపకి జోకులు చెప్పి నవ్వించాడు. చిన్న చిన్న మేజిక్కులు చేసి దీప ఆశ్చర్యపడేలా చేశాడు. మధ్యాహ్నం లంచ్ టైం లో కూడా దీపని బాగా ఎంటర్ టైన్ చేశాడు నాగరాజు. ఆ విధంగా దీపకి చాలా బాగా నచ్చాడు నాగరాజు. రోజూ నాగరాజుని తన కూడా తీస్కెళ్తుంది దీప. నాగరాజు వచ్చాక రాంబాబు, చిన్నారావ్ ల ఇంపార్టెన్స్ కాస్త తగ్గింది ... దీప విషయంలో. దీప ఎక్కువగా నాగరాజుతో మాట్లాడుతోంది.
అంతేకదా-చిన్న పిల్లలకి ఎవరు ఎక్కువ కాలక్షేపం ఇస్తారో వాళ్ళనే ఇష్టపడతారు. ఇంట్లో కూడా దీప నాగారాజుతోనే కాలక్షేపం చేస్తుంది. అన్నమ్కూడా నాగారాజే తినిపించాలి. ఆఖరికి స్నానం కూడా నాగారాజే చేయించాలి. ఏమాత్రం ఖాళీ వున్నా నాగారాజుని జోక్స్ చెప్పమనీ, మ్యాజిక్ చేయమని, ఆడదామనీ చంపుకుతింటుంది దీప/ ఇదిలా ఉంటే ...
రాంబాబూ, చిన్నారావ్ లు పోలీస్ స్టేషన్ లో ఇన్స్ పెక్టర్ అప్పారావుని కాల్చుకు తినసాగారు. అయిదు రూపాయలిచ్చి చికెన్ బిర్యానీ తెమ్మనడం, పది రూపాయలిచ్చి ఫుల్ బాటిల్ విస్కీ తెమ్మనడం ... ఇలాంటివి చెయ్యడమే కాకుండా అప్పారావు యింటి దగ్గర అతని భార్య మదన మనోహరితో అవీ ఇవీ పిండివంటలు వండించుకుని తినడం కూడా చెయ్యసాగారు. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ తమని ఎడ్పించుకు తిన్నదానికి రెట్టింపు ఎడ్పించుకు తినసాగారు ఆ ఇద్దరూ.
*****
ఆరోజు ... ట్రింగ్ ... ట్రింగ్ ... పోలీస్ స్టేషన్ లో ఫోన్ మోగింది. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఫోన్ లిఫ్ట్ చేసి “హలో! పోలీస్ స్టేషన్!’’ అన్నాడు.
“మేము పోలీస్ స్టేషన్ నెంబర్ తిప్పాం కాబట్టి అది పోలీస్ స్టేషనే అని మాకూ తెలుసు. ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు?’’ అంది అవతలి నుండి సరోజ.
“నన్నే ఎవరని అడుగుతున్నావా ...? నేను ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని’’ గర్జిస్తూ అన్నాడు అప్పారావ్.
“అంటే కుక్క కిడ్నీల అప్పారావేనా?’’ అడిగింది సరోజ.
ఆ మాట వినగానే అంతకుముందులా పులిలా గర్జించిన ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వెంటనే పిల్లిలా అయిపోయాడు. “ఆ విషయం మీకెలా తెల్సు మేడం? ఇంతకీ మీరెవరు మేడం?’’ మెల్లిగా గుసగుసలాడుతూ, బాధగా, భయంగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“నేనేవరైతే ఏంగానీ ... రాంబాబుని ఓసారిలా పిలువ్’’ అంది సరోజ.
“ఇదిగో రాంబాబు! ఓ సారిలా వస్తావా?’’ గట్టిగా పిలిచాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
వసారాలో కూర్చుని చిన్నారావ్ తో కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్న రాంబాబు చిరాగ్గా వెనక్కి తిరిగి అరిచాడు. “ఏంటి రమ్మని చెవి తెగిన మేకలా అలా అరుస్తున్నావ్? ఏం ... రెండు రూపాయిలిచ్చి రమ్ముబాటిల్ తెమ్మంటావా?’’
“నిన్ను రమ్మన్నది నా గురించి కాదయ్యా బాబూ ...! నీ కోసం ఎవరో అమ్మాయ్ ఫోన్ చేసింది’’ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
అంతే ... రాంబాబు ఒక్క గెంతు గెంతి లోపలికి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. అతని వెనకాలే చిన్నారావ్ కూడా లోపలికి వచ్చాడు.
“హలో ...!’’ అన్నాడు రాంబాబు.
“నన్ను సరోజ అంటారు, గుర్తున్నానా?’’ అడిగింది అవతలి నుండి సరోజ.
“అదేంటి సరూ? మనం ఎన్ని రోజుల నుంచి కలవనట్టు మాట్లాడ్తావ్? రెండు రోజుల క్రితమేగా కలిశాం’’ అన్నాడు రాంబాబు.
“అంటే నీకు కలవాలని లేదా?’’ అడిగింది సరోజ సీరియస్ గా.
“అయ్యో ...! అలాగంటావేంటి ...? నిన్నా, మొన్నా కమీషనర్ లింగారావ్ గారింట్లో లేటయ్యింది ... నిన్ను కలవాలని నాకెందుకు వుండదు?’’
“అయితే రేపు పార్కుకి రా ... నీతో అర్జంట్ విషయం మాట్లాడాలి. నీతో బాటు నీ ఫ్రెండ్ చిన్నారావ్ ని కూడా తీస్కురా!’’
“మనమధ్య వాడెందుకూ?’’ చిరాకుపడ్డాడు రాంబాబు.
“మనమధ్య కాదు ... అతని కోసం సునీత కూడా పార్కుకి వస్తుంది’’ అంది సరోజ.
*****
మర్నాడు .... పార్కులో .... రాంబాబూ, సరోజ, చిన్నారావ్, సునీత నలుగుతూ ఒక దగ్గరే కూర్చున్నారు. రాంబాబు, చిన్నారావ్ చేతుల్లో మిక్చర్ పొట్లాలు. ఇద్దరూ పరపరా నమలసాగారు.
“ఇంకా మీరు ఆ మిక్చర్ తినడం ఆపితే మేం మాట్లాడాలనుకున్నది చెప్తాం’’ అంది సరోజ విసుక్కుంటూ.
రాంబాబు నాలుక కర్చుకున్నాడు. “ఓ ... సారీ ... మీరిద్దరూ మౌనంగా కూర్చుని వుంటే టైం పాస్ కి మిక్చర్ కొనుక్కుని తింటున్నాం’’ అన్నాడు రాంబాబు.
“అవును ... రాంబాబు చెప్పింది కరెక్ట్ ...’’ అన్నాడు చిన్నారావ్ కాస్త మిక్చర్ నోట్లో వేస్కుంటూ.
సునీత చిన్నారావ్ చేతిలోని మిక్చర్ పొట్లం లాగి దూరంగా పారేసింది. సరోజ రాంబాబు వంక చూసింది.
“వద్దులే ... నేనే పారేస్తాను!’’ అని అంటూ పొట్లాన్ని ప్రక్కకి విసిరేశాడు.
“ఇప్పుడు చెప్పు!’’ అన్నాడు రాంబాబు.
“మనం ఇలా పార్కులకనీ, సినిమాలకనీ, హోటళ్ళకనీ తిరిగితే ఏమైనా బాగుంటుందా?’’ అడిగింది సరోజ.
“నాకైతే చాలా బాగుంది. ఏం నీకు బాగోలేదా...? అన్నాడు రాంబాబు.
“నాక్కూడా చాలా బాగుంది’’ అన్నాడు చిన్నారావ్. “ఏం? మీ ఇద్దరికీ మా కంపెనీ నచ్చడంలేదా ...?’’ అడిగాడు చిన్నారావ్.
“మా ఇద్దరికీ మీ ఇద్దరి కంపెనీ చాలా యిష్టం ... అందుకే అప్పుడప్పుడూ ఇలా పార్కులో, సినిమాల్లో కలుసుకోవడం కాకుండా, మీ కంపెనీని పర్మినెంట్ గా కోరుకుంటున్నాం’’ అంది సునీత.
“అంటే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం!’’ అంది సరోజ.
“యాహూ ...!’’ అంటూ సంతోషంగా గట్టిగా అరిచారు రాంబాబు, చిన్నారావ్ లు.
ఆ అరుపుకి సునీత, సరోజ పచ్చికమీద వెల్లికితలా పడిపోయారు. పిల్లల మనసుల్నీ దోచుకున్నాడు.
|
|