TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
కమీషనర్ లింగారావ్ ఇల్లు ...! రాత్రి ఎనిమిది గంటలైంది. వరండాలో దీప నాగరాజుతో ఆడుకుంటూ వుంది. లోపలినుండి శ్రీలక్ష్మి బయటికి వచ్చింది.
“దీపా! ఆడింది చాలుగానీ ... లోపలికి రా అన్నం తిందువుగాని!’’ అంది.
“ఊ! నేను అప్పుడే తినను. డాడీ వచ్చాక తింటాను ...’’ అంది దీప.
“డాడీ అప్పుడే రారు. ఇప్పుడే ఫోన్ చేశారు. ఏదో మీటింగ్ వుందని!’’
“అయ్యగారు వచ్చేసరికి బాగా లేటవుతుందామ్మా ...?’’ అడిగాడు నాగరాజు.
“అవును! మీటింగ్ అయ్యేసరికి రాత్రి పదిగంటలవుతుందని చెప్పారు. దీపా! నువ్వు భోజనం చెయ్యి’’
“ఊ! నేను చెయ్యను. ఇంకాసేపు అంకుల్ తో ఆడుకుంటా ...’’ అంది దీప గారాలుపోతూ.
“మీరెళ్ళండమ్మా! నేను పది నిమిషాలు ఆడించి దీపమ్మగార్ని లోపలికి తీసుకొస్తాగా?’’ అన్నాడు నాగరాజు.
శ్రీలక్ష్మి అలానే నిలబడి వుంది.
టీవిలో “మా ఏడుపే – మీ ఏడుపు’’ డైలీ సీరియల్ వస్తుందమ్మా. మీరు అది చూస్తూ వుండండి. నేను దీపమ్మని తీసుకొస్తాగా ...’’ నచ్చజెప్తూ అన్నాడు నాగరాజు.
“అమ్మో ...మా ఏడుపే-మీ ఏడుపు సీరియలా!! నేను చూడాలి బాబోయ్!’’ అంటూ లోపలికి పరుగుతీసింది.
అరగంట గడిచింది సీరియల్ 2376వ భాగం అయ్యింది. అప్పుడు గ్రహిచింది శ్రీలక్ష్మి దీప ఇంకా లోపలికి రాలేదని!
“దీపా ...'' పిలిచింది శ్రీలక్ష్మి. వరండాలోంచి సమాధానం లేదు. “నాగారాజూ!’’ అని మరికాస్త గట్టిగా పిలిచింది. ఈసారీ సమాధానం లేదు. అసలు వరండాలో వాళ్ళు వున్న అలికిడే లేదు. శ్రీలక్ష్మి వరండాలోకి వచ్చింది. అక్కడ దీపగానీ, నాగారాజుగానీ లేరు.
“వీళ్ళు ఎక్కడికెళ్ళారబ్బా?’’ అనుకుంది శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి ఇద్దరి పేర్లూ పిలుస్తూ ఇంటిచుట్టూ తిరిగింది. ఇద్దరూ లేరు.
“దీప చాక్లెట్ కావాలని మారాంచేస్తే ప్రక్కనే వున్న సూపర్ మార్కెట్ కి నాగరాజు తీస్కెళ్ళాడేమో’’ అనుకుంది శ్రీలక్ష్మి. ఓ అయిదు నిమిషాలాగి ఇంకా వుండబట్టలేక పనివాడిని చూసి రమ్మని పంపించింది.
పావుగంట తర్వాత వాడొచ్చి “ఆళ్ళిద్దరూ ఎక్కడా లేరమ్మా’’ అని చెప్పాడు. శ్రీలక్ష్మి మనసు ఏదో కీడును శంకించింది.
*****
శ్రీలక్ష్మి, కమీషనర్ లింగారావ్ సెల్ కి ఫోన్ చేసి చెప్పింది దీప, నాగరాజు కనపడ్డంలేదని. కమీషనర్ లింగారావ్ మీటింగ్ మధ్యలో లేచేసి పావుగంటలో ఇంటికి వచ్చేశాడు.
“ఏంటి? అసలేమైంది?...’’ అంటూ అడిగాడ హాల్లో శోకాలు పెడుతున్న శ్రీలక్ష్మితో.
“ఏమవడం ఏమిటండి! మీ మొహం మందా ... దీప కనిపించడం లేదు!’’ భోరుమంటూ చెప్పింది శ్రీలక్ష్మి.
“అబ్బ! కాస్త ఆ ఏడుపాపు ... చుట్టుపక్కలాళ్ళు నేను పోయానానుకుంటారు ...’’ విసుగ్గా అన్నాడు కమీషనర్ లింగారావ్.
శ్రీలక్ష్మి ఏడుపు సౌండ్ తగ్గించింది. “ఆ నాగరాజు చాలా మంచివాడు. చాలా జాగ్రత్తగల మనిషి కూడా ... మన దీపాని ఇక్కడే ఎక్కడికో తీస్కెళ్ళి వుంటాడు ...’’ అన్నాడు లింగారావ్.
“కానీ ఇక్కడెక్కడా ఆళ్ళు లేరండీ ...’’ అన్నాడు పనివాడు.
“ఒకవేళ దీప రాంబాబు వాళ్ళ దగ్గరికి తీస్కెళ్ళమంటే నాగరాజు తీస్కెళ్ళాడేమో...?’’ కమీషనర్ లింగారావ్ తన సందేహాన్ని వ్యక్తపరిచాడు.
“ఇంత రాత్రి వేళ ఎందుకు తీసుకెళతాడు ...? అదీ మనతో చెప్పకుండా ...’’ అడిగింది శ్రీలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ.
“అదీ నిజమే ...!’’ ఆలోచనగా మొహం పెట్టాడు కమీషనర్ లింగారావ్.
శ్రీలక్ష్మి పరుగున గోడకి తగిలించి వున్న వెంకటేశ్వరస్వామి పటం దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నమస్కరించింది. “స్వామీ! మా దీప మాకు క్షేమంగా దక్కితే, మీకు ఆయన రెండు కాళ్ళూ సమర్పించుకుంటాను స్వామీ!’’ అని మూక్కుకుంది.
కమీషనర్ లింగారావ్ హవ్వ హవ్వ! అంటూ నోటిమీద కొట్టుకున్నాడు. “ఇదేం మొక్కే బాబూ! నా అన్గాలన్నీ ఇలా ఇన్ స్టాల్ మెంట్స్ లో సమర్పిస్తానని దేవుడికి మొక్కేసుకుంటే కొన్నాళ్ళకి నేను మిగాలనే తల్లీ!’’ అని లబ్బున మొత్తుకున్నాడు.
వెంటనే రెండు కాళ్ళూ లేకపోతే ఎలాగుంటుందో అని ఇమేజినేషన్ లోకి వెళ్ళాడు కమీషనర్ లింగారావ్. లింగారావ్ గుడి మెట్లమీద బొచ్చె పట్టుకుని అడుక్కుంటూ వుంటాడు.
“అమ్మా! అయ్యా ... ఇదివరకు పోలీస్ కమీషనర్ గా ఉద్యోగం చేశానమ్మా! ఇప్పుడు రెండు కాల్లో లేకపోవడంవల్ల నా ఉద్యోగం పోయిందమ్మా ... ఆకలేస్తుందమ్మా ... కాసింత ధర్మం చేయ్యండమ్మా! అయ్యా ... అమ్మా ....’’ ఇమేజినేషన్ లోంచి బయటికి వచ్చిన లింగారావ్ బాబోయ్ అంటూ జుత్తు పీక్కుని పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లని ఎలర్ట్ చేయమని చెప్పాడు.
|
|