అందరూ దొంగలే - 51

Listen Audio File :

కమీషనర్ లింగారావ్ ఆలోచనగా మొహం పెట్టాడు.

“ఏం చాడువుకున్నావ్ ..?’’ అడిగాడు నాగారాజుని రెండు క్షణాల తర్వాత.

“టెన్త్ ...’’ చెప్పాడు నాగరాజు.

“టెన్త్ కి ఏం ఉద్యోగం చూడగలం? కనీసం డిగ్రీ వుంటే బాగుండేది’’ అన్నాడు లింగారావ్.

అదే సమయంలో దీప అక్కడికి పరుగున వచ్చింది. “మామయ్యా ... నువ్వెళ్ళకు మామయ్యా! నువ్వు మా ఇంట్లోనే వుండు మామయ్యా!’’ అంటూ నాగరాజు చెయ్యి పట్టుకుంది. నాగరాజు మేజిక్ షోని చూసిన దీపకి నాగరాజు బాగా నచ్చాడు. కమీషనర్ లింగారావ్ నాగారాజుని పైనుండి క్రిందిదాకా గమనించి చూశాడు. మనిషి బుద్ధిమతుడిలాగానే వున్నాడు. కమీషనర్ లింగారావ్ ఒక నిర్ణయానికి వచ్చాడు.

అతను రాంబాబుతో ఇలా అన్నాడు. “నువ్వు, చిన్నారావ్, పాప సెక్యూరిటీ గురించి కేర్ తీస్కుంటారు. నాగరాజు మా ఇంట్లోనే వుండి పాపని ఎంటర్ టైన్ చేస్తూ పాప ఆలనా పాలనా చూస్కుంటాడు. భోజనం కానీ, టిఫిన్లు అన్నీ ఇక్కడే. మరి జీతం ఏమాత్రం కావాలి?’ అంటూ నాగరాజు వైపు చూశాడు.

“అయ్యో ... మిమ్మల్ని అడిగేంతటి వాడినా? మీకు ఏం తోస్తే అది యివ్వండి!!’’ అన్నాడు నాగరాజు.

“ఫర్వాలేదు, మొహమాటపడకుండా చెప్పు!’’ అన్నాడు కమీషనర్ లింగారావ్.

“అబ్బే ... మీరేం ఇచ్చినా ఫర్వాలేదండి. మూడుపూట్లా ఫుడ్ పెడ్తున్నారు ఇంతకంటే ఏం కావాలి?!’’ అన్నాడు నాగరాజు.

“సరే ... నువ్వు మంచిరోజు చూస్కుని రా! నువ్వు ఇక్కడ పనిచేస్తుండగానే వేరే ఇదినా ఉద్యోగం చూస్తాను. అప్పుడు అందులో జాయిన్ అవుడువుగాని! అడ్వాన్స్ గా ఇది వుంచు ...’’ అంటూ నాగరాజు చేతిలో వెయ్యి రూపాయలు వుంచాడు కమీషనర్.

నాగరాజు, లింగారావ్ కి నమస్కరిస్తూ “ఇంక పాపని గురించి మర్చిపొండి బాబూ! నేనున్నాను కదా! ఇక మంచిరోజులంటారా ... మనకి ఏ రోజు మేలు జరిగితే అదే మనకి మంచిరోజు. కాబట్టి ఇప్పుడే నేను డ్యూటీలో జాయిన్ అయిపోతా ...’’ అన్నాడు.

కమీషనర్ లింగారావ్ నాగరాజు భుజం తట్టి లోపలికి వెళ్ళాడు.

“దీప ఉయ్యాలాట ఆడదాం అని అడిగిందంటే సరేనని ఒప్పుకోకు, చాలా డేంజర్!’’ రాంబాబు నాగరాజు చెవిలో చెప్పాడు.

“ఇంతో అంతో తెలివితేటలున్నవాడిని .... దీపాని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెల్సు’’ అన్నాడు నాగరాజు.

రాంబాబు, చిన్నారావ్ లు ఇంటికి బయలుదేరుతుండగా నాగరాజు వాళ్ళు చేసిన మేలుకి కృతజ్ఞతలు చెప్పాడు.