TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
వీళ్ళ గది మెట్ల మీద ఓ వ్యక్తి బోర్లాపడి ఉన్నాడు. అతని శరీరంలో ఏ రకమైన కదలికా లేదు... కళ్ళు మూస్కుని వున్నాయ్. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. “శవమా..?” భయం భయంగా చూస్తూ అడిగాడు చిన్నారావ్.
“హత్య...?” అన్నాడు రాంబాబు చిన్నారావ్ వంక చూస్తూ.
“ఒకవేళ హత్య అయితే ఆ మనిషిని చంపి మనింటి గుమ్మం ముందు ఎందుకు పడేస్తారు?” సందేహంగా అడిగాడు చిన్నారావ్.
“ఆత్మహత్యేమో!” అన్నాడు రాంబాబు.
“పోనీ ఆత్మహత్య అయితే మనింటి గుమ్మం దగ్గర ఎందుకు చేస్కోవాలి!” అన్నాడు చిన్నారావ్.
“మనింటి గుమ్మం దగ్గర కాకపోవచ్చు... వాళ్ళింట్లోనే ఏ పురుగుల మందో తాగి వుండొచ్చు.... ఇక్కడికి వచ్చి చచ్చిపోయి వుండవచ్చు...!”
“నిజమే.... మనింటి గుమ్మంముందే ఎందుకు చావాలి? వాళ్ళింట్లోనే పురుగుల మందు తాగినవాడు బుద్దిగా వాళ్ళింట్లోనే చావొచ్చుకదా...! మన గుమ్మంలో చచ్చి మనకెందుకు ట్రబులివ్వాలని?”
చిన్నారావ్ కి వచ్చే సందేహలకి రాంబాబుకి చచ్చేంత చికాకేసింది. “అన్నీ సందేహాలు నన్నడిగితే నేనెక్కడ చెప్పను....!నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు... అసలే టెన్షన్ తో చస్తుంటే నీ వెధవ ప్రశ్నలొకటి!”
“ఉండు.. దగ్గరికెళ్ళి చూద్దాం...” అన్నాడు చిన్నారావ్.
“పద...” అన్నాడు రాంబాబు.
ఇద్దరూ చేయీ, చేయీ పట్టుకుని భయంగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలారు. రాంబాబు చిన్నారావ్ చేయిపట్టి నొక్కుతూ ఆపాడు. చిన్నారావ్ ఏంటన్నట్లు రాంబాబు మొహంలోకి చూశాడు.
“అతను బ్రతికే వున్నాడు... పొట్ట చూడు పైకి కిందకి మెల్లిగా కదుల్తూ వుంది” అన్నాడు రాంబాబు. చిన్నారావ్ ఆ వ్యక్తి పొట్టవంక చూశాడు. నిజమే...! అది పైకి కిందకీ కదులుతుంది. ఇద్దరూ గబగబా అడుగులువేస్తూ ఆ వ్యక్తిని సమీపించారు. రాంబాబు ముందుకు వంగి ఆ వ్యక్తి భుజం మీద చెయ్యేసి ఏయ్ మిస్టర్ అంటూ వూపాడు. ఆ వ్యక్తి కదలలేదు, మెదలలేదు.
“మూర్చపోయినట్టున్నాడు...! నీళ్ళు తీసుకురా...” అన్నాడు రాంబాబు.
చిన్నారావ్ తాళం తీసిలోపలికెళ్ళి గ్లాసుతో నీళ్ళు తెచ్చి ఆ వ్యక్తి ముఖం మీద చిలకరించాడు. ఆ వ్యక్తి మెల్లిగా కళ్ళు తెరిచాడు.
“దాహం దాహం...” అతని పెదాల మధ్య నుండి అస్పష్టంగా వినిపించింది.
చిన్నారావ్ మళ్ళీ లోపలికి పరుగుతీసి మరో గ్లాసుడు మంచినీళ్ళు తెచ్చాడు. రాంబాబు అతని తల ఎత్తి పట్టి వుంచితే, చిన్నారావ్ మెల్లగా నీళ్ళు తాగించాడు. ఇద్దరూ అతన్ని చెరో రెక్కా పట్టుకుని లేవదీసి మెల్లగా లోపలికి నడిపించుకుని తీస్కెళ్ళి గది మూల వున్న పరుపుమీద కూర్చోబెట్టారు. అతనికి కూడా ఇంచుమించు వీళ్ళిద్దరి వయసే వుంటుంది... అంటే పాతిక వుండొచ్చు. కానీ మనిషి బండగా వున్నాడు... నల్లగా...పొట్టిగా.
“ఎవరు మీరు?” అడిగాడు రాంబాబు.
ఆ వ్యక్తి ఇద్దరి మొహాల వంకా మార్చి మార్చి చూసి “ఆకలి!” అన్నాడు.
రాంబాబు చిన్నారావ్ వంక చూశాడు. చిన్నారావ్ గూట్లోంచి బ్రెడ్ పాకెట్ తీసి ఓ నాలుగు స్లయిసులకి జామ్ పూసి ప్లేట్లో పెట్టి ఆ వ్యక్తి ముందు వుంచాడు.
ఆ వ్యక్తి వాటిని ఆవురావురుమంటూ రెండు నిమిషాల్లో తినేశాడు. “ఇంకా కావాలి!” ఆన్నాడు.
మరో నాలుగు స్లయిసులకి జామ్ పూసి ఇచ్చాడు చిన్నారావ్. ఇప్పుడు కాస్త ఆకలి తీరడంవల్లేమో ఆ వ్యక్తి మెల్లగా తింటూ గదిని పరికించి చూశాడు. అది ఒకటే చాలా పెద్ద గది. గది మధ్యలో రాడ్ కి కర్టెన్ కి అవతల నేలమీద ఓ మూల స్టవ్, వంట సామాగ్రి, బాత్రూమ్ బహుశా వెనక వైపు వుండి వుండొచ్చు. ఆ వ్యక్తి బ్రెడ్ తింటుండగానే రాంబాబు స్టవ్ అంటించి కాఫీ పెట్టాడు. కాఫీ కప్పుల్లో పోసేసరికి ఆ వ్యక్తి బ్రెడ్ తిన్నాడు. మంచినీళ్ళు తాగి కాఫీ కప్పు అందుకుని తృప్తిగా తాగాడు.
ఆ వ్యక్తి మొహంలో అలసట, నీరసం సగం తగ్గింది.
“ఇప్పుడు చెప్పండి...” అన్నాడు రాంబాబు పరుపుమీద అతని పక్కన కూర్చుంటూ
చిన్నారావ్ రాంబాబు పక్కన కూర్చున్నాడు.
|
|