అందరూ దొంగలే - 49

Listen Audio File :

ఆ వ్యక్తి గొంతు సవరించుకున్నాడు. “నా పేరు నాగరాజు.. మాది విజయవాడ. మా నాన్నకి క్యాన్సర్, మా అమ్మకి పక్షవాతం, మా చెల్లెలికి చిన్నప్పుడు పోలియో సోకి రెండు కాళ్లూ వంకర్లు తిరిగిపోయాయ్. మా అన్నయ్య పుట్టు గుడ్డి...” బాధగా అన్నాడు నాగరాజు.

అతని కుటుంబం గురించి విన్న రాంబాబు, చిన్నారావ్ లకి కళ్ళలో నీళ్ళు తిరిగాయ్. “సినిమాల్లో హీరోయిన్ కుండే కష్టాలన్నీ పాపం మీకున్నాయ్!” అన్నాడు రాంబాబు దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో.

“అసలు ఇన్ని కష్టాలతో ఎలా బ్రతుకుతున్నారు?” జాలిగా చూస్తూ అన్నాడు చిన్నారావ్.

“ఇప్పుడా కష్టాలేం లేవు లెండి...” అన్నాడు నాగరాజు.

“ఏం...? మీ ప్యామిలీ మొత్తాన్ని వదిలేసి ఇక్కడికొచ్చారనా?” అడిగాడు రాంబాబు.

“కాదు.. వాళ్ళే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు.”

“వాళ్ళే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే.. కొంపదీసి మీకు ఎయిడ్స్ గానీ కాదు కదా?” భయంగా చూస్తూ అడిగాడు రాంబాబు.

నాగరాజు విరక్తిగా నవ్వాడు. “అదయినా బాగుండేది.. కాని కాదు. మా కుటుంబ పరిస్థితి ఇంత దరిద్రంగా వుందని తిరుపతి వెళ్ళి దేవుణ్ని దర్శనం చేస్కుందామని ఓ టాక్సీ మాట్లాడుకుని తిరుపతి బయలుదేరాం.. టాక్సీ తిరుపతి కొండల్లోంచి లోయలోపడి అందరూ చనిపోయారు.... నేను ఎలా బతికి బయటపడ్డానో నాకే తెలీదు!”

రాంబాబు, చిన్నారావ్ లు “అయ్యయ్యో” అన్నారు.

“కుటుంబ సభ్యులందర్నీ పోగొట్టుకుని విజయవాడలో వుండలేక హైదరాబాదు వచ్చేశాను. ఉద్యోగం లేదు... మూడు రోజుల్నుండీ ఆ ప్రయత్నంలోనే తిరుగుతున్నాను... ఎక్కడా ఏ పనీ దొరకడంలేదు. రెండు రోజుల్నుండీ తిండిలేదు.. అందుకే ఆకలికి నీర్సం వచ్చి మీ ఇంటి గుమ్మంలో పడిపోయాను...” అన్నాడు నాగరాజు.

నాగరాజు బాధామయ గాధ విని రాంబాబు, చిన్నారావ్ లు కరిగిపోయారు. మర్నాడు పోలీస్ కమీషనర్ యింట్లో జరగబోయే పార్టీకి నాగరాజుని కూడా తీస్కెళ్ళి, ఆయనకి పరిచయం చేసి ఆయనకున్న ఇన్ ప్లుయన్స్ తో నాగరాజు కేదైనా ఉద్యోగం ఇప్పించమని బ్రతిమిలాడాలని రాంబాబు, చిన్నారావ్ లు నిర్ణయించుకున్నారు.

మర్నాడు సాయంత్రం... రాంబాబు, చిన్నారావ్, నాగరాజు ముగ్గురూ ఆటోలో కమీషనర్ లింగారావ్ ఇంటికి బయలుదేరారు. “అయినా పార్టీకి నేను వస్తే బాగుంటుందా?” అడిగాడు నాగరాజు.

“ఏం ఫర్వాలేదు. కమీషనర్ గార్కి మేమంటే చాలా యిష్టం. కావాలంటే మా గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా తీస్కురమ్మని చెప్పారు. పార్టీలో మంచి మూడ్ లో కూడా ఉంటారు కాబట్టి అక్కడే పరిచయం చేస్తే మంచిది!” అన్నాడు రాంబాబు.

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత నాగరాజు అడిగాడు. “అది వాళ్ళ పాప పుట్టినరోజు పార్టీ అన్నారు కదూ?”

“అవును. ఏం?” అడిగాడు చిన్నారావ్.

“పార్టీ? తర్వాత నేను చిన్న మ్యాజిక్ ప్రదర్శన యిస్తాను.”

“ఏంటి? నీకు మ్యాజిక్ వచ్చా?” ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.

“విజయవాడలో జంతర్ మంతర్ బాబూ అనే ఫేమస్ మెజీషియన్ వున్నాడు కదా! అతని దగ్గర కాస్త నేర్చుకున్నా. పెద్ద పెద్ద స్టేజీ షోలు ఇవ్వలేనుగానీ, ఇలా చిన్న చిన్న పార్టీల్లో మ్యాజిక్ షోలు ఇవ్వగలను” అన్నాడు నాగరాజు.

“అయితే ఇంకేం.. అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను కమీషనర్ గార్కి చెప్తా” అన్నాడు రాంబాబు.

ఆటో కమీషనర్ లింగారావ్ ఇంటిముందు ఆగింది. ముగ్గురూ ఆటోలోంచి కిందకి దిగి, డబ్బులిచ్చి ఆటోవాడిని పంపించేశారు. ఆ వీధంతా పార్టీకి వచ్చిన కార్లతో నిండిపోయింది. ఎంత కమీషనర్ తమని ఇష్టపడతారని తెల్సినా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే అలాంటి పార్టీకి మొదటిసారిగా రావడం వల్ల రాంబాబు, చిన్నారావ్ లకి కాస్త ఇబ్బందిగా, బెరుకుగా అనిపించింది