అందరూ దొంగలే - 15

Listen Audio File :

రాంబాబు, చిన్నారావ్ లు అటు వెళ్ళీ వెళ్ళగానే పోలీస్ స్టేషన్ లో ఫోన్ మోగింది. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రిసీవర్ ఎత్తి “హలో...” అన్నాడు.

“హలో... లింగారావ్ హియర్!” అంది అవతలినుండి పోలీస్ కమీషనర్ లింగారావ్ గొంతు.

“ఆ... చెప్పు... చోరీనా, మర్డరా!” తాపీగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“కాదు... కిడ్నాప్ అవతల్నుండి సీరియస్ గా పోలీస్ కమీషనర్.

“సరేలే... ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం లాభం...? రేపు స్టేషన్ కొచ్చి రిపోర్ట్ ఇవ్వు” నిర్లక్ష్యంగా అన్నాడు.

“హలో! నేను మామూలు లింగారావ్ ని కాదు. పోలీస్ కమీషనర్ లింగారావ్ ని!” అరుస్తూ అంది అవతలి గొంతు. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కంగారుగా గబుక్కున లేచి నిలబడి సెల్యూట్ చేస్తూ “సారీ సార్... లింగారావ్ అంటే ఎవరో అనుకున్నాగానీ మీరని అనుకోలేదు సార్... కానీ అమ్మగార్ని కిడ్నాప్ చేసి, వాడేమి బావుకుందామని అనుకుంటున్నాడో నాకేం అర్ధం కావడం లేద్సార్....” అన్నాడు.

“కిడ్నాప్ చేసింది మా అమ్మని కాదు.... ఆవిడపోయి పది సంవత్సరాలయింది” చికాగ్గా పలికింది కమీషనర్ లింగారావ్ గొంతు.

ఇన్స్ పెక్టర్ ఫకాలుమని నవ్వేశాడు. “మీరు భలేగా మాట్లడతార్ సార్.... అమ్మగారంటే నా ఉద్దేశం ఆ అమ్మగారని కాద్సార్! మీ భార్యగారని సార్! హి హి హి “

“కిడ్నాపైంది మీ అమ్మగారు కాదు. ఛీ ఛీ... నా భార్యకాదు. మా పాపని గజదొంగ మంగులు కిడ్నాప్ చేశాడు. అసలే నేను టెన్షన్ లో వుంటే వెధవ జోకులేస్తావా?” మండిపడ్డాడు కమీషనర్ లింగారావ్.

“సారీ సార్! సిచ్యుయేషన్ లైట్ చేద్దామని నేనలా మాట్లాడా.......” మెల్లగా అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“లిజన్! మా పాపని గజదొంగ మంగులు కిడ్నాప్ చేస్కుని వెళ్ళిపోయాడు. వాడు పాత చిత్తుకాగితాలు ఏరుకునేవాడి గెటప్ లోఉన్నాడు. వాడి భుజంమీద ఓ గోనెసంచి వుంటుంది. దాంట్లో మా పాప వుంటుంది” చెప్తున్నాడు పోలీస్ కమీషనర్ లింగారావ్. లింగారావ్ మాటలకి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అడ్డు తగిలాడు.

“సరే గానీ పాపకి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో... లేదా శరీరం మీద ఏవైనా గుర్తులున్నాయో కాస్త చెప్తారా సార్?” వినయంగా అడిగాడు ఇన్స్ పెక్టర్.

ఈ ప్రశ్న వినగానే అవతల నుండి పోలీస్ కమీషనర్ లింగారావ్ కోపంతో రంకెవెయ్యడం మొదలెట్టాడు. “నువ్విలాంటి చావు తెలివితేటలు ప్రదర్శిస్తే నడిరోడ్డులో నీ బట్టలూడదీయించి, నీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చాలున్నాయో జనం చేత వెతికిస్తా... ఖబడ్దార్....”

“సారీ సార్” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“నేను అన్ని పోలీస్ స్టేషన్స్ నీ అలర్ట్ చేశా........ ఆ మంగులుగాడు మీ పోలీస్ స్టేషన్ వైపే వచ్చినట్టుగా అనుమానం వచ్చి నీకు ఫోన్ చేశా.... నువ్వు వెంటనే బయలుదేరి రోడ్లన్నీ సెర్చ్ చెయ్” అంటూ ఫోన్ పెట్టేశాడు కమీషనర్ లింగారావ్.

ఇన్స్ పెక్టర్ కంగారుగా గది బయటికొచ్చి వసారాలో కునుకుతున్న కానిస్టేబుల్ 420ని తట్టిలేపి “నువ్వు స్టేషన్ ని జాగ్రతగా చూస్కో....... కమీషనర్ గారు నాకు అర్జెంట్ గా పని అప్పజెప్పారు” అని వసారా మెట్లు దిగి అక్కడున్న మోటార్ బైక్ ఎక్కి ఒక్క కిక్ తో స్టార్ట్ చేశాడు.

మోటర్ బైక్ ముందుకు దూసుకెళ్ళింది. కానీ ఆ సమయంలో అక్కడికి నాలుగు సందుల వెనకాలే గజదొంగ మంగులు భుజంమీద గోనెసంచితో పోలీసుల్ని తప్పించుకుని పరుగులు తీస్తున్నాడన్న విషయం ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి తెలీదు పాపం!