అందరూ దొంగలే - 16

Listen Audio File :

రాంబాబు ఇంకా మండిపడ్తూనే వున్నాడు. “అసలు ఈ పదిరుపాయలైనా ఎందుకిచ్చినట్టు? మీ డబ్బుల్తో నా కింత పిండం పడెయ్యండని చెప్పొచ్చుగా?” అన్నాడు.

“బహుశా మన పిండం కోసం ఆ పది రుపాయలిచ్చాడేమో.....” అన్నాడు చిన్నారావ్ నెత్తిమీద క్యాప్ సరిజేస్కుంటూ.

రాంబాబుకి తిక్కపుట్టి చిన్నారావ్ డొక్కలో మోచేత్తో ఓ పోటు పొడిచాడు. చిన్నారావ్ బాధగా మూలిగాడు.

వాళ్ళిద్దరూ “మై నాన్ వెజ్ ఫ్రండ్” హోటల్ సమీస్తుండగా ఓ సంఘటన జరిగింది. అడ్డచారల బనీను, మెడలో మఫ్లర్, గళ్ళ లుంగీతో, నడుంకి పటకా బెల్ట్ తో, గుబురు మీసాల్తో వున్న ఓ వ్యక్తి హడావిడిగా వాళ్ళకి ఎదురొస్తూ రాంబాబుని డ్యాష్ కొట్టి అతని జేబులోని పర్సు కొట్టేశాడు.

“ఏంటయ్యా ఆ హడావిడీ...? కళ్ళు కనిపించడం లేదా?” అంటూ ఆ వ్యక్తిని కసిరాడు రాంబాబు.

“సారీ కానిస్టేబుల్ గారూ.... అని అన్నాడు ఆ వ్యక్తి.

“కానిస్టేబుల్ కాదు... హెడ్ కానిస్టేబుల్!” హెడ్ దగ్గర వత్తి పలుకుతూ అన్నాడు రాంబాబు.

“సారీ కానిస్టేబుల్ గారూ... మా అమ్మ చావు బతుకుల్లో వుంటే మందులు కొనుక్కుని హడావిడిగా చూస్కోక మిమ్మల్ని డ్యాష్ కొట్టాను.... నన్ను క్షమించండి బాబూ....! అన్నాడు ఆ జేబు దొంగ.

“ఒక్కే... ఒక్కే.... ఈసారి ఆ డ్యాష్ కొట్టేదేదో కాస్త చూసుకొని కొట్టు” అన్నాడు.

ఆ జేబుదొంగ ఇద్దరికీ నమస్కరించి మెల్లగా నడుచుకుంటూ ప్రక్క సందులోకి తిరిగి తను రాంబాబు జేబులోంచి కొట్టేసిన పర్సుని వెలిగే కళ్ళతో ఓసారి చుస్కోని “వీడు హెడ్ కానిస్టేబుల్ కాదు... హెడ్ లేని కానిస్టేబుల్” అని మనసులో అనుకుని ఒక్కసారిగా పరుగు తీశాడు.

రాంబాబు, చిన్నారావ్ లు మరో నాలుగడుగులు వేసి “మైనాన్ వెజ్ ఫ్రండ్” హోటల్ దగ్గరికి వచ్చేశాడు. హోటల్ లోపలికి వెళ్తుండగా మరో సంఘటన....

పోలీసుల్ని తప్పించుకోవాలని పరుగులు పెడుతున్న గజదొంగ మంగులు సరిగ్గా అదే సమయానికి ఆ వైపుగా పరుగులు తీస్తూ రాంబాబుని డ్యాష్ కొట్టి, ఆగకుండా భుజంమీది మూటతో సహా ముందుకు పరుగులు తీశాడు.

“అరె.... వెధవలు...! వర్సబెట్టి ఇలా డ్యాష్ లు కొట్టేస్తున్నారేంటీ వీళ్ళ మొహం మండా...” అని తిట్టుకున్నాడు రాంబాబు.

చిన్నారావ్ కిసుక్కున నవ్వాడు. హోటల్ లోకి వెళ్ళి కౌంటర్ దగ్గర “ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ సిక్స్ టే ఫైవ్ పార్సెల్” అంటూ జేబులో చేయ్యిపెట్టాడు రాంబాబు.

రాంబాబు మొహం పాలిపోయింది.

అతని చేతికి పర్సు తగల్లేదు.

కంగారుగా మిగతా జేబులు కూడా వెతికాడు.

“ఏమైంది?” అడిగాడు చిన్నారావ్.

“నా పర్స కొట్టేశారు! ఇందాక చారల బనీను వాడు డ్యాష్ కొట్టి వెళ్ళాడు కదా... వాడే పర్స కొట్టేసి వుంటాడు.”

“కాదు... వాడు చూడ్డానికి చాలా మర్యాదస్తుడిలా వున్నాడు.... పాపం........ వాళ్ళమ్మకి కూడా ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు భుజంమీద గోనె సంచీతో డ్యాష్ కొట్టి పారిపోయాడే... వాడే నీ పర్స్ కొట్టేసింది” అన్నాడు చిన్నారావ్.

“అవును... అందుకే అంత కంగారుగా పరిగెత్తాడు.”

“వాడు ఇప్పుడే కదా డ్యాష్ కొట్టాడు. ఇంకా ఎక్కువ దూరం పరిగెత్తి వుండడు” అన్నాడు చిన్నారావ్.

“పద... వెధవని చితకబాదుదాం” అన్నాడు రాంబాబు.

ఇద్దరూ హోటల్లోంచి బయటకొచ్చి చీకట్లోకి పరుగు తీశారు.