అందరూ దొంగలే - 14

Listen Audio File :

 

Episode – 14

జంగయ్య పకపకా నవ్వాడు. “మీరేమో నా కోసం కవితలు చిదివితే అవి సార్ కి దేబ్బకొట్టాయి” అన్నాడు నవ్వాపుకుంటూ.

“చదివింది చాలు... ఇలా రండి” కోపంగా అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

రాంబాబు, చిన్నారావ్ సెల్ బయటికొచ్చి, సెల్ తలుపేసి, తాళం పెట్టి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ దగ్గరికెళ్ళి ఎదురుగా నిలబడ్డారు. “ఎవడ్రా ఈ కవితలు రాసింది?!” దాదాపు అరుస్తున్నట్టుగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. చిన్నారావ్ నాకు తెలీదు అంతా ఇతనికి తెలుసన్నట్టుగా రాంబాబు వంక చూశాడు. “మా కాలనీలోనే వెలుగుశ్రీ అనే కవున్నాడు సార్! వాడే ఈ కవితలు రాశాడు సార్! చిన్నప్పటినుండీ వాడు ఇలాంటి కవితలే రాస్తున్నాడు సార్! మొన్నొకరోజు ఇంటికొచ్చిన ఓ హార్డ్ పేషంట్ కి వెలుగుశ్రీ గాడు కవితలు వినిపిస్తే ఆ హార్ట్ పేషంట్ గుండాగి చచ్చిపోయాడు సార్!” చెప్పాడు రాంబాబు.

“ఇప్పుడు నన్ను చంపడానికి తీస్కోచ్చారా ఆ కవితలు?!” చికాకుగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. “అంటే క్రిమినల్స్ ని హింస పెట్టడానికేమైనా పనికొస్తాయోమోననీ...”టోపీ తీసి బుర్ర గోక్కున్నాడు రాంబాబు. “అఘోరించలేకపోయావ్.... ఆ వెలుగుశ్రీ గాడిని కాస్త ఒళ్ళు దగ్గరెట్టుకుని కవితలు రాయమను...... ఇంకోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి కవితలు రాస్తే వెలుగుశ్రీ గాడి జీవితంలో వెలుగనేదే లేకుండా చేస్తా....... ఏదైనా తప్పుడు కేసు బనాయించి వాడిని బొక్కలో తోసి వాడికి, వాడు రాసిన కవితల్నే వినిపించి చంపుతానని వార్నింగ్ ఇవ్వు!” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. “అలాగే సార్!” అన్నాడు రాంబాబు. రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ వెనక్కి తిరిగారు.

“ఆగండి!” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ గంభీరంగా, ఇద్దరూ ముందుకి తిరిగారు. “అలా బయటికెళ్ళి నా కోసం మటన్ బిర్యానీ తెండి.” రాంబాబు చేతి వాచ్ వంక చూశాడు. రాత్రి 12-30 గంటలైంది. “సార్... ఇంత అర్ధరాత్రి వేళ మీరిప్పుడు మటన్ బిర్యానీ తింటారా?! అసలు ఈ టైం లో తినడమే ఆరోగ్యానికి మంచిదికాదు... అదీ మటన్ అంటే అసలు అరగదు సార్!” అన్నాడు రాంబాబు. “షటప్.... ఏ టైములో.... ఏది తింటే అరుగుతుందో ఏది తింటే అరగదో నువ్వేం చెప్పక్కర్లేదు... నోర్మూస్కుని నేను చెప్పింది తే...” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. యస్సార్!” ఇన్స్ పెక్టర్ జేబులోంచి పర్సు తీశాడు. “చూడూ... ఒక ప్లేట్ మటన్ బిర్యానీ, ఒక ప్లేట్ చికెన్ సిక్స్ టే పైవ్... ఒక ఫుల్ బాటిల్ మందు... తెల్సుగా మన బ్రాండేమిటో? ఇవన్నీ తీస్కురా.”

“అలాగే సార్!” ఇన్స్ పెక్టర్ పర్సులోంచి పది రూపాయలు నోటు తీసి రాంబాబు చేతిలో పెట్టాడు. రాంబాబు తన చేతిలోని పదిరూపాయలవంకా, ఇన్స్ పెక్టర్ అప్పారావ్ మొహం వంకా మార్చిమార్చి చూశాడు అయోమయంగా. “సార్! మీరు అయిదొందల నోటనుకుని పొరపాటున పది రూపాయల నోటిచ్చారు సార్!” అన్నాడు. “దానికే అన్నీ వస్తాయ్ లే... తీసుకురా...” కరుకుగా అన్నాడు ఇన్స్ పెక్టర్ అపారావ్. రాంబాబుకి విషయం అర్ధమైపోయింది. “సార్... ఈ టైంలో హోటల్స్ ఏమీ వుండవు కద్సార్...?! హిహిహి...” బలవంతంగా నవ్వుతూ అన్నాడు రాంబాబు. “మన స్టేషన్ నుండి రెండు ఫర్లాంగుల దూరం వెళితే అక్కడ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో “మై నాన్ వెజ్ ప్రెండ్’ అనే ఇరానీ హోటలుంది.

అది రాత్రి రెండుదాకా ఓపెన్ వుంటుంది. ఆ ప్రక్కనే వైన్ షాప్ కూడా వుంటుంది.... నా పేరు చెప్పు.... కాస్త డిస్కౌంట్ ఇస్తారు” అన్నాడు ఇన్స్ పెక్టర్. రాంబాబుకి ఈసారి మరో బ్రిలియంట్ ఐడియా వచ్చింది. “సార్.... నేను కాకుండా చిన్నారావ్ అయితే మంచి ఫుడ్ తెస్తాడు సార్!” అన్నాడు. చిన్నారావ్ కంగారుపడ్డాడు. “ఏమో సార్... నాకైతే అస్సలు నాలెడ్జి లేద్సార్..... అయినా బిర్యానీ అంటే ఏంటి సార్?” అంటూ అమాయకంగా అడిగాడు. “నాటకాలాడకుండా ఇద్దరూ వెళ్ళండి” అన్నాడు ఇన్స్ పెక్టర్. రాంబాబు, చిన్నారావ్ ఇద్దరూ స్టేషన్ బయటికొచ్చారు. “దరిద్రుడికి పది రూపాయలకి మటన్ బిర్యానీ, చికెన్ సిక్స్ టే ఫైవ్, మందు బాటిల్ ఇన్ని కావాలి.... వీడిలాంటి వాడు కనుకనే వీడి పెళ్ళాం లేచిపోయింది’ కసిగా తిట్టాడు రాంబాబు.

“వాడు నాశనమైపోతాడు అన్నాడు చిన్నారావ్. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ చెప్పిన ఐటమ్స్ కి ఎంత బిల్లవుతుందో దాన్ని వాళ్ళు చెరిసగం భరించాలి! అదీ వాళ్ళ బాధ. రాంబాబు, చిన్నారావ్ లు ఆ చీకట్లో భారంగా అడుగులు ముందుకు వేశారు.