అందరూ దొంగలే - 63

Listen Audio File :

కానీ లోపలి దృశ్యం చూసి మంగులు బిత్తరపోయాడు. అక్కడ దీప నేలమీద కూర్చుని వుంది. దీప చుట్టూ గిన్నెలు వున్నాయి. ఓ మూలగా పెద్దబిందె నేలమీద పడివుంది. బహుశా అది పైనుండి క్రింద పడడంవల్లే పెద్దగా శబ్దం అయి తను లేచి వుంటాడు.

“ఓ … పిచ్చంకుల్ … నువ్వా …?'' అంది దేప మంగులుని చూసి.

“ఇక్కడేం చేస్తున్నావ్?'' అడిగాడు మంగులు.

“తినడానికి ఏమయినా వున్నాయేమోనని చూస్తున్నా … ఛీ … నీ ఇంట్లో ఏం లేవు!'' అంది దీప. తర్వాత క్రిందనుండి లేచి గబగబా గజదొంగ మంగులు దగ్గరికొచ్చింది. అతని చేతిలోని రివాల్వర్ వంక చూసి … "ఏదీ … ఇలాతే'' అంది. గజదొంగ మందులు దీప చేతికి రివాల్వర్ ఇచ్చాడు.

“ఎలా వుంది? అది దీపావళి తుపాకీ!'' అన్నాడు మంగులు.

“ఏం కాదులే! నాకు తెల్సు … నిజం తుపాకీ … ఇదిగో … దీన్ని ఇలా గురిపెట్టి …'' దీప మంగులుకి గురిపెడుతోంది.

“దీన్ని నొక్కితే డాం అని పేలి చచ్చిపోతారు. మా నాన్న దగ్గర కూడా ఇలాంటివి వున్నాయ్'' అంతలోనే దీప చేతిలోని రివాల్వర్ తనకే గురిపెట్టి వుడడంతో కంగారుపడి "నువ్వు పోరాబాట్న ట్రిగ్గర్ నొక్కేస్తావేమో … చచ్చూరుకుంటా! దాన్ని అటుతిప్పు'' అన్నాడు.

దీప రివాల్వర్ వున్న చేతిని క్రిందికి దింపేసింది. “అంకుల్ నాకు ఆకలేస్తుంది'' అంది దీప.

“అర్థరాత్రి ఆకలంటే ఎలా! నన్ను చంపుకు తిను …!'' అన్నాడు విసుక్కుంటూ.

“ఊ … ఊ … నాకు ఐస క్రీమ్ కావాలి'' అంది దీప నెలకి రెండు కాళ్ళూ తాటించి మారాం చేస్తూ.

“ఇప్పుడు ఐస క్రీమ్ ఎక్కడినుండి వస్తుంది? నోర్మూసుకుని పడుకో … లేకపొతే చంపుతా'' అన్నాడు గజదొంగ మంగులు.

“నన్ను చంపుతావా …?'' అంది దీప మంగులు వంక సీరియస్ గా చూస్తూ.

“ఏంటే … ఏంటా చూపు?'' అన్నాడు మంగులు దీపవంక కోపంగా చూస్తూ.

రివాల్వర్ వున్న దీప కుడిచేయి గాల్లో లేచింది. దానికి సపోర్టింగ్ గా ఎడమచేయి. రెండు చేతులతో రివాల్వర్ ఎత్తి గజదొంగ మంగులుకి గురి పెట్టింది …

“బాబోయ్ వద్దు!'' అంటూ అరిచాడు మంగులు.

కానీ అప్పటికే ఆలస్యం అయింది. దీప ట్రిగ్గర నొక్కింది. “డాం ….'' పెద్ద శబ్దంతో రివాల్వర్ పేలింది.

“బాబోయ్!'' భయంతో అరిచాడు గజదొంగ మంగులు.