అందరూ దొంగలే - 39

Listen Audio File :

పోలీస్ కమీషనర్ లింగారావ్ ముక్కుపుటానికి అగర వత్తుల వాసన సోకింది. అంతే... లింగారావు గుండెపీచు పీచుమంది. అగరవత్తుల వాసనొస్తుందంటే శ్రీలక్ష్మి పూజ చేస్తుందన్న మాట. శ్రీలక్ష్మి పూజ చేస్తుందంటే ఏదైనా కోరి ముక్కుతీరుస్తానని దణ్ణం పెట్టుకుని తన ప్రాణం మీదికి తెస్తుందని కమీషనర్ లింగారావ్ భయం.

గణగణ.... మంటూ పూజ గదిలోంచి గంటమోగడం లింగారావ్ కి వినిపించింది. “బాబోయ్... ఇప్పుడు శ్రీలక్ష్మి ఏమైనా మొక్కేస్కుంటుంది” అని గుండెలు బాదుకుంటూ పూజగదిలోకి పరుగు తీశాడు లింగారావ్. శ్రీలక్ష్మి భక్తిగా కళ్ళుమూస్కుని దేవుళ్ళముందు చేతులు జోడించి ఉంది.

“స్వామీ... నా పాపకు ఎవరూ ఏ రకమైన కీడూ చెయ్యకుండా చూడు స్వామీ... అది కలకాలం క్షేమంగా ఉండాలి. అలా చేస్తే మా ఆయన కుడికాలుని...” మొక్కుకోబోతున్న శ్రీలక్ష్మి నోటిని పరుగున వెళ్ళి మూసేశాడు కమీషనర్ లింగారావ్.

‘ఏంటే.... నా కాలు కూడా దేవుడుకి సమర్పించేస్కుంటావా నీ భక్తి మండా....” పళ్ళు నూరాడు కమీషనర్ లింగారావ్.

శ్రీలక్ష్మి లింగారావ్ చేతిని నోటిమీంచి లాగేసింది. “ఏంటండీ.. దేవుడికి మొక్కుకుంటుంటే నోరు మూసేశారు! అలా చేస్తే చాలా పాపం తెల్సా?...” అని, లింగారావ్ చెంపలు చెళ్ళు చెళ్ళున వాయించింది.

“ఏంటే బాబూ... ఇలా కొట్టావ్?” బిత్తరబోతూ చెంపలు రుద్దుకుంటూ అడిగాడు లింగారావ్.

“రామ రామ.... మిమ్మల్ని కొట్టడం ఏంటండీ...” చెంపలు వేస్కుంది.

“మీరు నేను మొక్కుకోకుండా ఆపారు కదా... అందుకని న్యాయంగా మీరు చెంపలు వేస్కోవాలి! మీరు వేస్కోలేదని నేనే వేశా.”

“దాన్ని చెంపలు వేయడం అనరు!... చెంపలు వాయించడం అంటారు... అయినా దీప క్షేమం గురించి నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీస్కున్నా... కాబట్టి నువ్వేం భయపడక్కర్లేదు!” అన్నాడు కమీషనర్ లింగారావ్.

“ఏంటా నిర్ణయం?!....” అడిగింది శ్రీలక్ష్మి.

“మన దీపని గజదొంగ మంగులు నుండి కాపాడిన రాంబాబు, చిన్నారావులకే దీప సెక్యూరిటీ బాధ్యత మొత్తం అప్పగించాలని నిర్ణయంచుకున్నా!”

“ఆ!... ఎంతమంచి నిర్ణయం తీస్కున్నారండీ!...” శ్రీలక్ష్మి ఆనంద భాష్పాలు రాల్చింది.

వెంటనే దేవుడి పటాలవైపు తిరిగి “స్వామి...ఈయనకి ఇంత మంచి ఆలోచన కలిగినందుకు నీకు ఆయన ఎడమకంటి గుడ్డు.....” శ్రీలక్ష్మి ఇంకా ఏదో అనబోతుండగా ఆమె నోరు నొక్కేశాడు కమీషనర్ లింగారావ్.

**** ***** ***** ***

“హిహిహి........” అన్నాడు రాంబాబు.

“హహహ......” అన్నాడు చిన్నారావ్.

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వాళ్ళవంక అనుమానంగా చూశాడు. “ఏరా?.... ఎందుకురా నవ్వు తున్నారు?” అడిగాడు.

“నవ్వా?.... ఛ ఛ... మేం నవ్వడం లేదు సార్... ఏంటో... పిచ్చి పిచ్చి సౌండ్స్ అన్నీ మా నోట అలా ఆటోమేటిగ్గా వచ్చేస్తున్నాయ్ సార్. హిహిహి....” అన్నాడు రాంబాబు.

“ఒరే.. నాకు తెల్సురా.. మీరు నన్ను చూసే నవ్వుతున్నారు.... ఇన్నాళ్ళు మీ ఇద్దరికీ చేతినిండా పనిలేక బాగా ఎక్కిందిరా. మీరు వెంటనే మా యింటికి రండీ... అక్కడ మా ఆవిడ బండెడు బట్టలు నానేసింది. అవన్ని ఉతికితే అప్పుడు కాస్త దిగుతుంది....” అన్నాడు అప్పారావ్. ఇంతలో ఫోన్ మోగింది...

రిసీవర్ తీసి కోపంగా “భౌ....” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“హలో... ఇది పోలీస్ స్టేషన్ కాదా? పశువుల ఆస్పత్రా?” అవతలి నుండి కమీషనర్ లింగారావ్ గొంతు ప్రశ్నించింది.

“ఓ గుడ్... ఆఫ్టర్ నూన్ సార్... నేనే.. సార్ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని మాట్లాడ్తున్నా” అన్నాడు అప్పారావ్ సెల్యూట్ చేస్తూ.

“మరేంటి కుక్క మొరుగుడు వినిపించింది?”

“సారీ సార్.. ఏదో క్రాస్ టాక్ ఏమో సార్!”

“క్రాస్ టాక్ అయితే నువ్వు సారీ చెప్పడం ఎందుకోయ్... సరే రాంబాబునీ, చిన్నారావ్ ని తీస్కుని మా యింటికి వెంటనే రా... నీతో అర్జంట్ విషయం మాట్లాడాలి!” అంటూ కమీషనర్ లింగారావ్ ఫోన్ పెట్టేశాడు.

అప్పారావ్ విషయం రాంబాబు, చిన్నారావ్ లకి చెప్పాడు.

“మరి మీ యింటి దగ్గర బట్టల విషయం ఏం చేద్దాం సార్?...” నవ్వుతూ అడిగాడు రాంబాబు.

“అవి నేను ఉతిక్కి చస్తాన్లే!..” కసిగా అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.