TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
పోలీస్ కమీషనర్ లింగారావ్ ఇల్లు.... లింగారావ్.... శ్రీలక్ష్మి, సోఫాలో కూర్చుని టీవీలో ఏదో సీరియల్ చూస్తున్నారు.
ఇద్దరి కళ్ళలోంచి ధారాపాతంగా కన్నీళ్ళు కారుతున్నాయ్. లింగారావ్ బాధగా తల పట్టుకున్నాడు. "ఇంకా ఏడవడం నావల్ల కాదు... దయచేసి ఆ కామెడీ సీరియల్ కట్టేయ్” అన్నాడు.
శ్రీలక్ష్మి రిమోట్ బటన్ ప్రెస్ చేసి టీవీ ఆఫ్ చేసింది. “పోనీ టీవీలో ఎప్పుడూ మంచి సీరియల్స్ రావాలని ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకోనా?” భర్తని అడిగింది శ్రీలక్ష్మి.
“ఏం?... ఆ సాకుతో నా చెయ్యో, కాలో స్వామికి సమర్పించుకుందామనా??” పళ్ళునూర్తూ అడిగాడు లింగారావ్.
ఇంతలో డోర్ బెల మోగింది. “రాంబాబు, చిన్నారావ్ లే వచ్చుంటారు....!” అన్నాడు కమీషనర్ లింగారావ్.
“ఏవండీ... పోనీ నేను మొక్కుకుంటానంటే మీకు అభ్యంతరంగా వుంది కాబట్టి పాప క్షేమం గురించి రాంబాబు చెయ్యి, చిన్నారావ్ కాలు మొక్కేస్కోనా?” అడిగింది శ్రీలక్ష్మి.
ఆ మాట వినగానే లింగారావ్ కి మెంటలెక్కిపోయింది.
అతను నెత్తిమీద ఠపా ఠపా.... మొట్టేస్కోసాగాడు. శ్రీలక్ష్మి కంగారుగా అతని రెండు చేతులు పట్టి ఆపింది. “పోన్లెండి... మీకిష్టం లేకపోతే వద్దులెండి.. అనవసరంగా బుర్రకాయ్ మీద అంత గట్టిగా మొట్టేస్కుని దాన్ని బద్దలు చేస్కోకండి. రేపుమీ బుర్రకాయ్ ని సమర్పించుకుంటా అని నేను మొక్కాలంటే అది పనికొచ్చే కండీషన్ లో ఉండాలికదా?!”
ఆ మాటలకి కమీషనర్ లింగారావ్ కుమిలిపోయాడు. “ఓ భూమాత.... నువ్వూ నా కాళ్ళ కింద చీలిపోయి నన్నునీలో ఎందుకు కలిపేస్కోవు?” అన్నాడు బాధగా.
శ్రీలక్ష్మి సోఫాలోంచి గబుక్కున లేచి దూరంగా గెంతి అక్కడ నిలబడి “మీరు... నేను మీ పక్క నుండగా అలాంటి కోరికలు కోరితే ఎలా?” అంది చికాకుగా చూస్తూ...
కమీషనర్ లింగారావ్ మళ్ళీ ఇరిటేట్ అవుతు బుర్రకాయ మీద మొట్టేస్కోబోయాడు. కానీ మరోసారి డోర్ బెల్ మోగింది. వెంటనే మొహంలో ఫీలింగ్స్ అన్నీ మామూలుగా చేసేస్కుని లేచెళ్ళి వీధి తలుపులు తీశాడు. అతను ఊహించిన విధంగానే రాంబాబు, చిన్నారావ్ లు వచ్చారు. వారితోపాటు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కూడా వున్నాడు. కమీషనర్ లింగారావ్ ని చూడగానే ముగ్గురూ సెల్యూట్ చేసారు.
“రండి... రండి...” అంటూ ముగ్గుర్నీ లోపలిని ఆహ్వానించాడు లింగారావ్. అందరూ హాల్లోకి వచ్చారు. శ్రీలక్ష్మికి రాంబాబు, చిన్నారావ్ లనిపరిచయం చేశాడు కమీషనర్ లింగారావ్. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఎలాగూ ఎప్పడూ కమీషనర్ లింగారావ్ ఇంటికి డ్యూటీ మీద వస్తుంటాడు కాబట్టి అతను శ్రీలక్ష్మికి తెలుసు.
“కూర్చోండి....” అన్నాడు లింగారావ్ తను శ్రీలక్ష్మి పక్కన కూర్చుంటూ.
“పర్వాలేదు సార్...” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“నేను కూర్చోమన్నది నిన్ను కాదు..... వాళ్ళని!” అప్పారావ్ తో ఆజ్ఞాపిస్తున్న విధంగా.
ఇద్దరూ కూర్చున్నారు.
“మా పాప ప్రాణాలు కాపాడారు. .మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేం బాబూ....” అంది శ్రీలక్ష్మి.
“అయ్యో.... అంత మాటలెందుకు మేడం.... అది మా డ్యూటీ” అన్నాడు రాంబాబు సిగ్గుపడ్తూ.
“మీరు మాట్లాడ్తుండండి.... నేను కాఫీ చేసుకువస్తా” అంది శ్రీలక్ష్మి లోపలికి వెళ్తూ.
“నువ్వేంటి చాలా రోజులు లీవ్ లో వున్నావు....?” ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని అడిగాడు లింగారావ్.
“అంటే ముందు మామూలు జ్వరం వచ్చి, అది మలేరియాగా మారి చివరికి టైఫాయిడ్ లోకి దించింది సార్!” అన్నాడు అప్పారావ్.
“ఓహ్...!” అన్నాడు లింగారావ్.
కమీషనర్ కి నిజం చెప్పారో.. చంపుతా అన్న విధంగా ఓ లుక్కేశాడు రాంబాబు, చిన్నారావ్ ల వంక అప్పారావ్.
“నువ్వూ వంట గదిలోకెళ్ళి అమ్మగార్కి సాయం చెయ్” అన్నాడు లింగారావ్ అప్పారావ్ తో. అప్పారావ్ లోపలికెళ్ళాడు.
|
|