TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
కొద్దిరోజులు గడిచాయ్...
రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ సరోజ, సునీతల ప్రేమలో పూర్తిగా మునిగిపోయారు. ఆ రోజు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ పోలీస్ స్టేషన్ లో ఎంటర్ కాగానే రాంబాబు, చిన్నారావ్ లు కాళ్ళు నేలకేసి ధన్మని బాది సెల్యూట్ చేశారు.
“ఊ... నేను లేనన్ని రోజులూ స్టేషన్ లో మీ ఇష్టం వచ్చినట్టు తోక ఘాడించారా?” అనడిగాడు అప్పారావ్.
“అది మీకు తెలియాలి. మాకెలా తెలుస్తుంది సార్? హిహిహి....” నవ్వాడు చిన్నారావ్.
అప్పారావ్ అర్థంకానట్టుచూశాడు.
“అదే సార్! మరి మీరు కుక్క కిడ్నీని పెట్టుకున్నారుగా?” అన్నాడు రాంబాబు అతనికి అర్థమయ్యేలా చెప్తూ.
“హబ్బా....” బాధగా తలపట్టుకున్నాడు అప్పారావ్. “మీరా విషయం ఇంకా మర్చిపోలేదా?”
“మేం మర్చిపోవాలన్నా మర్చిపోలేం సార్. ఆ విషయాన్ని మీరు మాకు ప్రతిక్షణం గుర్తుచేస్తూనే ఉంటారు” అన్నాడు రాంబాబు.
“నేను...? నేనెందుకు గుర్తుచేస్తాను? అదేమైనా శుభకార్యమా నేను మాటిమాటికి గుర్తుచేస్కోడానికి, మీకు గుర్తుచేయడానికి?” చికాకు పడుతూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“అంటే మీరు గుర్తుచెయ్యాలని చెయ్యరు సార్. మీకు తెలీకుండానే అంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సార్” అన్నాడు చిన్నారావ్.
“ఇందాక మీరు స్టేషన్ లోకి ఎంటరయ్యేప్పుడు కుక్కలా నాలిక ఇంత బారుని బయటికి చాపి ఉంది వచ్చారు సార్” అన్నాడు రాంబాబు.
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ నెత్తిమీది క్యాప్ తీసి రెండు చేతుల్తో జుట్టు పీకేస్కుంటూ బాధగా అరిచాడు. “ఆ డాక్టర్ గాడి ఒళ్ళు పచ్చడి చేస్తే” అన్నాడు పళ్ళు నురుతూ.
“ఆ పని మేడంగారు మీకు ఆపరేషన్ అయిన రోజే చేసారు సార్” గుర్తు చేశాడు చిన్నారావ్.
“అవునవును... నేనైనా డిశ్చార్జ్ అయ్యాను గానీ వాడింకా బెడ్ మీదే వున్నాడు. కానీ వాడు కోలుకొని మామూలుగా తిరిగే రోజున నా సర్వీస్ రివాల్వర్ తో వాడిని షూట్ చేస్తా.”
“చాలా కాలంగా వాడనందుకు మీ సర్వీస్ రివాల్వర్ తుప్పు పట్టిందేమో కద్సార్?” అమాయకంగా అడిగాడు రాంబాబు.
“అలాగా? ఆ తుప్పుపట్టిన రివాల్వర్ తో ముందు నిన్ను పేల్చి ఆ తర్వాత ఆ డాక్టర్ గాడిని పెలుస్తా. ఉండండి.... ఇప్పుడేవచ్చి మీ పని చెప్తా” అంటూ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ సీట్లోంచి లేచి టాయిలెట్స్ లోకి వెళ్ళాడు
రెండు నిమిషాల తర్వాత టాయిలెట్స్ లోంచి భయంకరంగా ఏడుస్తూ బయటికి వచ్చాడు అప్పారావ్.
“ఏంటీ సార్... ఏమైంది సార్.....?” కంగారుగా అడిగాడు రాంబాబు.
“నాకు ఘోరమైన అన్యాయం జరిగిపోయిందిరా దేవుడో...” ఏడుస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
చిన్నారావ్ ఆలోచనగా మొహం పెట్టాడు.
“మీరు టాయిలెట్స్ లోకి వెళ్ళి.... ఘోరమైన అన్యాయం జరిగిపోయిందని ఏడ్చుకుంటూ బయటికొచ్చారంటే నాకో భయంకరమైన అనుమానం వచ్చింది సార్.... కిడ్నీతో పాటు కొంపదీసి వేరే పార్టులేవీ తీసెయ్యలేదుకదా?” అనడిగాడు చివరికి.
ఆ మాట వినగానే అప్పారావ్ ఏడుపాపి మండిపడ్డాడు. “ఏం?... అలా చేస్తే మీ ఇద్దరూ ఆనందంతో కేరింతలు కొడదామనా? నువ్వనుమానించేదేమీ కాదు!”
“మరి ఎందుకు సార్ అంతగా గోలెట్టేశారు?” అడిగాడు రాంబాబు.
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కుమిలిపోతూ ఏడ్చాడు.
“చెప్పండి.... మీ మనసులోని బాధేంటో చెప్తే సగం భారం తీరిపోతుంది.”
ఏడుపాపి, క్షణం పాటు ఆ ఇద్దరి వంకా సందేహంగా చూశాడు అప్పారావ్. “
మీరీ విషయం ఎవరికీ చెప్పరు కదా?”
చెప్పం అన్నట్టు ఇద్దరూ తలలు అడ్డంగా ఊగించారు.
“నేను పాస్ పోస్కుంటుంటే నా కుడికాలు తొంబై డిగ్రీల యాంగిల్ లో ఆటోమేటిక్ గా పైకి లేచింది!...” ఘొల్లుమన్నాడు అప్పారావ్.
అది విన్న రాంబాబు, చిన్నారావ్ లు నేలమీదపడి పొర్లిపొర్లి నవ్వారు.
|
|