అందరూ దొంగలే - 37

Listen Audio File :

సమయం – సాయంత్రం....

స్థలం.... పార్కు.

ఓ మూల పచ్చికలో రాంబాబు, సరోజలు కూర్చుని వుంటారు. రాంబాబు తల వంచుకుని గడ్డిపరకలు పీకుతూ వుంటాడు.

“మనం వారం పాటు పార్కుకి వస్తే ఇక్కడ అసలు పచ్చిక అనేదే వుండదు రాంబాబూ” అంది సరోజ.

“ఎందుకనీ?” అమాయకంగా అడిగాడు రాంబాబు.

“ఎందుకేమిటీ? మనం వచ్చిన దగ్గర్నుండి సరా.... సరా మంటూ నువ్వు గడ్డి పీకేస్తున్నావ్ కదా ఒక్క ముక్క మాట్లాడకుండా.”

రాంబాబు సిగ్గుపడ్డాడు.

“ఏమైనా మాట్లాడు రాంబాబూ” అంది సరోజ.

“ఆ. మాకు నిజానికి మీ నర్సింగ్ హోమ్ ని వదలడం ఇష్టం లేదు. కానీ మీరు ప్రేమిస్తున్నట్టు తెలిశాక ఇంక ఆ నర్సింగ్ హోమ్ లో మాకేం ఇంటరెస్ట్ వుంటుంది. అందుకే డిశ్చార్జ్ అయి బయటికి వచ్చేశాం” అన్నాడు రాంబాబు.

“ఇప్పటికి ఈ డైలాగ్ వందసార్లు చెప్పావ్. వేరే ఏమైనా మాట్లాడు రాంబాబు” అంది సరోజ. ఇలాంటి సందర్భాల్లో ఎలా మాట్లాడాలో రాంబాబుకి బొత్తిగా తెలీదు. మాట్లాడాడానికి ఏదో ఒక టాపిక్ దొరకాలి కదా అని చుట్టూ చూశాడు. పార్కులో దోరంగా బుట్టలో పల్లీలు అమ్ముకునే కుర్రాడు కనిపించాడు.

“అటూ చూడు” అన్నాడు రాంబాబు సరోజతో.

సరోజ తల పక్కకి తిప్పి చూసింది. “అబ్బ....! ఎంత అందంగా వున్నాయో” అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ.

“పల్లీల్లో కూడా అందాన్ని చూసే నిన్ను నేను మెచ్చుకోకుండా వుండలేకపోతున్నా సరూ!”

“నేను అందంగా వున్నాయన్నవి పల్లీలు కావు. అక్కడున్న విరబూసిన గులాబీలను” కాస్త సీరియస్ గా అంది సరోజ.

రాంబాబు నాలుక కర్చుకున్నాడు. “ఓహ్.. నేను నిన్ను చూడమంది పల్లీలు అమ్మే కుర్రాడిని....! చూశావా... వాడి వయసు పన్నెండేళ్ళు వుంటాయేమో! కానీ అప్పుడే వాడి భుజాల మీద ఎంత భాద్యత పడిందో! ఈ వయసు నుండే వాడు సంపాదనలో పడ్డాడు.... అన్నట్టు ఉడకబెట్టిన పల్లీలంటే ఇష్టమా. వేయించిన పల్లీలంటే యిష్టమా?” హుషారుగా అడిగాడు రాంబాబు.

సరోజ రాంబాబు వంక సీరియస్ గా చూసింది.

రాంబాబు ఇబ్బందిగా నవ్వాడు. “ఓహ్... ఐయామ్ సారీ... నీ ముందు కూర్చుని నేను సరిగా మాట్లాడలేకపోతున్నా... పోనీ నువ్వూ మాట్లాడకూడదూ?” అన్నాడు.

“ఆ పక్కకి చూడు” అంది సరోజ.

రాంబాబు పక్కి తిరిగి చూశాడు.

“చాలా బాగుంది కదూ సీనరీ?” అడిగింది.

“అవును... చుడువా అమ్మేవాడు... వాడి చుట్టూ అమాయకంగా కేరింతలుకొట్టే పిల్లలూ, ఓహ్! బ్యూటిపుల్ సీనరీ” అన్నాడు రంబు సంబరంగా.

“నేనంటున్నది చుడువా సీనరీ కాదు... ఆకాశంలోని ఆ ఇంద్ర ధనుస్సు... వెండితునకల్లా ఆ తెల్లని మబ్బులూ, ఆ సీనరీ గురించి.”

రాంబాబు నాలుక కర్చుకుని ఇబ్బందిగా నవ్వాడు.

ఆ పార్కులోనే మరోమూల... చిన్నారావ్, సునీతలు కూర్చుని వున్నారు. సునీత హఠాత్తుగా లేచినిలబడింది. సునీత మొహంలో ఉక్రోషం గమనించి చిన్నారావ్ కంగారుగా తను కూడా లేచి నిలబడి. “ఏంటీ అప్పుడే లేచి నిలబడ్డావ్?” అడిగాడు అయోమయంగా.

“ఏం లేదు... నీ మాటల సొంపుల్ని తట్టుకోలేక అంది సునీత...

“మీ ఫ్రెండు రాంబాబు కూడా నీ టైపులోనే మాట్లాడతాడా?”

చిన్నారావ్ ఇబ్బందిగా నవ్వాడు.

“పాపం! అక్కడ మా సరోజ ఏం అవస్థలు పడుతుందో! ఇంక ఇక్కడ కూర్చోడం ఎందుకూ.. పద పోదాం.”

“అంటే ప్రేమించిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో మాకు ప్రాక్టిస్ లేదుకదా” నసిగాడు చిన్నారావ్.

“ఇద్దరూ ఓ పని చెయ్యండి. మాతో మాట్లాడడం ప్రాక్టిస్ చేసి వేరే వాళ్ళని ప్రేమించండి” అంటూ గబగబా పార్కు గేటువైపు అడుగులు వేయసాగింది సునీత.

“సునీ,,, సునీ... నా మాట విను” అంటూ ఆమె వెనకాలపడ్డాడు చిన్నారావ్.