అందరూ దొంగలే - 36

Listen Audio File :

రాంబాబూ, చిన్నారావ్ లు మంచం మీద పడుకుని కిసకిసా నవ్వసాగారు. కాస్సేపయ్యాక ఆయాసపడుతూ నవ్వడం ఆపారు. “ఈపాటికి ఆ డాక్టర్ గాడి పని అయిపోయి వుంటుంది” అన్నాడు చిన్నారావ్.

“ఆ మదన మనోహరి వాడిని చీల్చి చెండాడి వుంటుంది” అన్నాడు రాంబాబు.

“అసలు బ్రతికున్నాడో, చచ్చిపోయాడో పాపం!...”

“పూర్ ఫెలో...” జాలిగా అన్నాడు రాంబాబు.

ఇంతలో అక్కడికి సరోజ, సునీత వచ్చారు. వాళ్ళని చూడగానే రాంబాబు, చిన్నారావ్ ల మొహాలు వెలిగిపోయాయ్. ఇద్దరూ మంచంమీద నిటారుగా లేచి కూర్చున్నారు.

“చూడబోతే మీ ఇద్దరి ఆరోగ్యం బాగానే వున్నట్టుందే...!” అంది సరోజ. ఇద్దరూ వెంటనే నీరసంగా మంచంమీద వాలిపోయారు. వాళ్ళ ఒంట్లో బాగుందనే అభిప్రాయం నర్సింగ్ హోం వాళ్ళకొస్తే  డిశ్చార్జ్ చేసేస్తారేమోనని వాళ్ళిద్దరి భయం.

“మీరేం వేషాలేయ్యక్కర్లేదు.... ఇందాక మీకు మందులిద్దామని వస్తే ఇద్దరూ మంచంమీద లేరు. ఎక్కడికి షికారెళ్ళి వచ్చారు?” అంది సునీత సీరియస్ గా మొహం పెట్టి.

‘అబ్బే.. ఎక్కడికి లేదు! పక్క వార్డులో మా బాస్ ఇన్స్ పెక్టర్ వున్నాడు.... ఆయన్ని పలకరించడానికి వెళ్ళాం!” అన్నాడు రాంబాబు.

“అతను మీ బాసా?... బాబోయ్ అతను పెళ్ళాని ఎలా భరిస్తున్నాడండీ బాబూ?” అంది సరోజ గుండెల మీద చేయ్యేస్కుంటూ.

“ఏం అలా అంటున్నారు?!” ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రాంబాబు.

“మొత్తం నర్సింగ్ హోమ్ అంతా ఈ విషయం తెల్సింది.... మీకు తెలీలేదా?” అడిగింది సునీత.

“ఏంటది?” చిన్నారావ్ అడిగాడు.

“అతని పెళ్ళాం వచ్చి డాక్టర్ శ్రీనివాస్ ని ఉతికేసింది.”

రాంబాబు చిరునవ్వు నవ్వాడు. “ఎక్స్ పెక్ట్ చేశా... అయినా తన భర్త కిడ్నీని పీకిపారేసి కుక్క కిడ్నీ పెడితే ఏ భార్యకి కోపం రాదు మరి?” అన్నాడు.

“ఆవిడకి కోపం వచ్చింది నిజమేకానీ డాక్టర్ శ్రీనివాస్ ని తన్నడానికి ఆవిడకి వేరే కారణం వుంది!” చెప్పింది సరోజ.

“ఆమెకు?” ఇంకేం కారణం వుంటుందబ్బా!” ఆశ్చర్యపోతూ చూశాడు రాంబాబు.

“ఆవిడ డాక్టర్ శ్రీనివాస్ గదిలోకి వెళ్ళగానే ఎవడివయ్యా నువ్వూ చీరకట్టుకుని నా గదిలోకి చెప్పాపెట్టకుండా వచ్చేశావ్?” అని అడిగాడు...

అంతే.... ఆవిడ ఒక్కమాట మాట్లాడకుండా అతన్ని చితకబాదేసింది.. ఆయన మొహం దిబ్బరొట్టెలా వాచిపోయింది. కుడిచెయ్యి, ఎడమకాలు ప్రాక్చర్ అయిపొయింది.... వీపంతా కమిలిపోయింది... ప్రస్తుత్తం మీ బాస్ బెడ్ పక్క బెడ్ మీదే డాక్టర్ శ్రీనివాస్ ని పడేశారు!” అంది సరోజ జాలిగా.

అది విని రాంబాబు, చిన్నారావ్ లు పకపకా నవ్వారు.

“అన్నట్టు మీ ఇద్దర్నీ హాస్పిటల్ నుండి రేపు డిశ్చార్జ్ చేసెయ్య వచ్చు” అంది సునీత.

అంతే... రాంబాబు, చిన్నారావ్ ల మొహాల మీద నవ్వు మటుమాయం అయ్యింది. “అదేం?.... మేమేం పాపం చేశాం?!...” బాధగా అన్నాడు రాంబాబు.

‘అదేమిటి అలా అంటారు? జీవితాంతం హాస్పిటల్ లో వుంటారా?”

“మాకు ఒంట్లో బాలేదు కదా.... అప్పుడే డిశ్చార్జ్ చేస్తే ఎలా?.... అమ్మా..... అబ్బా....” బాధగా మూల్గుతూ అన్నాడు చిన్నారావ్.

“నో.... మీకు ఒంట్లో బాగానే ఉందని మా స్టాప్ అందరికీ తెల్సు. కాకపొతే చిన్న గాయంనుండి అంత రక్తం ఎలా కారిందో మాకు అర్థం కాలేదు!....” అంది సరోజ ఆలోచనగా.

రాంబాబు, చిన్నారావ్ లు మొహమొహాలు చూస్కున్నారు. ఇద్దరూ కళ్ళతోనే సైగలు చేస్కున్నారు.

“అసలు జరిగింది చెప్పనా?” సరోజ, సునీతల్ని చూస్తూ అడిగాడు రాంబాబు.

ఇద్దరూ చెప్పమన్నట్టు చూశారు. రాంబాబూ, చిన్నారావు లు ఇద్దరూ బ్లడ్ బాటిల్స్ తో నెత్తిమీద కొట్టుకోవడం చెప్పాడు.

“కానీ ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగింది సరోజ.

“మాకు ఈ నర్సింగ్ హోమ్ ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు....” అన్నాడు రాంబాబు.

“ఎందుకనీ...?”

రాంబాబు సిగ్గుపడుతూ చెప్పాడు – “ఐ లవ్ యూ సరోజా... అందుకు!”

“ఐ లవ్ యూ సునీత” అన్నాడు చిన్నారావ్.

“మేము కూడా సేమ్ టు సేమ్” అన్నారు ఆ ఇద్దరూ.

అంతే! రాంబాబు, చిన్నారావ్ లు సంతోషంగా “యా హూ...!” అని గట్టిగా అరిచారు. ఆ దెబ్బకి వార్డులోని ఓ హార్ట్ పేషెంట్ గుండె పట్టుకుని బాధగా మూలిగాడు.