Andaru Dongale Part 11

ఇంతలో మదనమనోహరి లోపలి నుండి వచ్చి తన చేతిలోని చీరల్ని వీళ్ళిద్దరి ముందూ నేలమీద కుప్పగా పడేసింది. “ఏంటే మేడమ్... ఈ చీరల్ని స్టీల్ సామాన్ల వాడికి వెయ్యాలా?” అడిగాడు రాంబాబు. “కాదు... మీరు తెచ్చిన బురద వాటన్నింటికీ బాగా పులమండి” చెప్పింది మంద మనోహరి. “ఏంటి మేడమ్?....” ఆవిడ చెప్పింది తను సరిగా విన్నానా అని సందేహం వచ్చి మళ్ళీ అడిగాడు రాంబాబు. “ఏం?... చెవుడా?... చీరల నిండా బురద పూయమని చెప్తున్నా... బయటికి తీస్కెళ్ళి పూయండి!” అనేసి వంకర టింకరగా నడుచుకుంటూ వెళ్ళింది మదనమనోహరి.

ఇద్దరూ చీరల్నీ, బురదనీ ఇంటి బయటికి తీస్కెళ్ళి చీరలకి బాగా బురద పట్టించారు. “అమ్మగారికి ఈ మధ్య కాస్త పిచ్చికూడా పట్టినట్టుంది.... లేకపోతే నిక్షేపంగా ఉండే చీరలకి బురద పట్టించడం ఏంటి?....” అన్నాడు కానిస్టేబుల్ చిన్నారావ్. “పోనిద్దూ... ఆవిడ పిచ్చి ఆవిడకానందం... మనకెందుకూ?” చిన్నారావ్ తో అని ఇంట్లోకి చూస్తూ “మేడమ్... మొత్తం బురదంతా చీరలకి పట్టించాం” అంటూ అరిచాడు రాంబాబు. మదనమనోహరి బయటికొచ్చి “ఆ చీరలన్నింటినీ శుభ్రంగా ఉతకండి... కాస్తంత మురికి కూడా ఉండకూడదు!.... లేకపోతే హాయిగా తీరుబడిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారా?” అనేసి మళ్ళీ లోపలికెళ్ళిపోయింది. ఇద్దరూ మదనమనోహరిని బండ బూతులు తిట్టుకుంటూ చీరలన్నీ శుభ్రంగా ఉతికారు. అప్పటికి రాత్రి తొమ్మిది గంటలైంది.

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఇంటికొచ్చాడు. రాంబాబు, చిన్నారావ్ లు అతనికి సెల్యూట్ చేశారు. “సార్... మేమిక యింటికెళ్ళామా?” అడిగాడు రాంబాబు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని. “ఇంటికా?.... ఇంటికెళ్ళి ఏం చేస్తారు? మీకు పెళ్ళామా సంసారమా?... స్టేషన్ కెళ్ళి నైట్ డ్యూటీ చెయ్యండి!” క్రూరంగా చూస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. స్టేషన్ కెళుతూ దార్లో రాంబాబు ఇలా మండిపడ్డాడు. “హు....! ఇంతోటి అందగత్తె పెళ్ళాంతో వీడేదో పెద్ద పొడిచేసేట్టూ....

” **** **** **** **** ****

అర్ధరాత్రి పన్నెండు గంటలు. పోలీస్ కమీషనర్ లింగారావ్ ఇల్లు.... బెడ్ రూంలో మంచంమీద లింగారావ్, శ్రీలక్ష్మి, వాళ్ళమధ్య దీప.... ముగ్గురూ గాఢంగా నిద్రపోతున్నారు. ఆ ఇంటికి కాస్త దూరంలో చీకట్లో ఓ ఆకారం కదులుతోంది. అది మెల్ల మెల్లగా కమీషనర్ లింగారావ్ ఇంటిని సమీపిస్తోంది. అది గజదొంగ మంగులు ఆకారం... మంగులు భుజం మీద పాత గోనెసంచి..... పాత చిత్తుకాగితాలు ఏరుకునేవాడి గెటప్ లో వున్నాడు గజదొంగ మంగులు. అప్పుడే సెకండ్ షో వదిలినట్టున్నారు. సినిమా జనాలు అప్పుడొకడూ ఇప్పుడొకడూ వస్తున్నారు – సైకిల్ మీద, స్కూటర్ మీద, కారులోను. అలా ఎవరయినా ఎదురయినప్పుడు గజదొంగ మంగులు ఫుట్ పాత్ మీద చిత్తుకాగితాలు ఏరుతూ భుజం మీద గోనెసంచిలో వేస్తూ గొప్పగా నటిస్తున్నాడు. సెకండ్ షో జనం రావడం కూడా ఆగిపోయింది. హమ్మయ్యా...! అనుకుంటూ తేలిగ్గా నిట్టూర్చాడు మంగులు.

కానీ అంతలోనే ఓ ఊరకుక్క మంగులుని చూసి “భౌ... భౌ...” మంటూ మొరిగింది. మంగులుకి ఒళ్ళు మండింది. “ఏయ్ ... ఛీ!” అంటూ చెయ్యెత్తాడు మంగులు. అప్పుడు కుక్కకి అంతకంటే ఒళ్ళు మండింది. అది పళ్ళన్నీ బైట పెట్టి “ఈ....” అంటూ మంగులుని కరవడానికి ముందుకు దూసుకొచ్చింది. అంతటి గజదొంగకి కూడా కుక్క కరవడాని కోస్తుందంటే ఠారెత్తింది. గజదొంగ మంగులు దానికందకుండా పరుగుతీశాడు. అది మంగులుని వెంబడించింది. అక్కడే వున్న ఓ చెత్తకుండీ మంగులు దృష్టిని ఆకర్షించింది. మంగులు చెత్తకుండి వెనక్కి పరుగుతీశాడు. కుక్క మంగుల్ని అనుకరించింది. మంగులూ, కుక్కా ఇద్దరూ చెత్తకుండీ చుట్టూ పరుగులు తీశారు. చివరికి ఇద్దరూ ఆయాసంతో ఆగిపోయారు. చెత్తకుండీ అవతల మంగులు, ఇవతల ఊరకుక్కా. కుక్క ఓసారి మంగులు వంక సీరియస్ గా చూసి ఆ తర్వాత తన భాషలో “భౌ....వ్.... వ్వౌ..వ్వౌ...వూ...” అని బూతులు తిట్టి అక్కడి నుండి పరుగున వెళ్ళి చీకట్లో మాయమైంది. “దరిద్రపు ముండా... దీని గురించి కూడా కొవ్వొత్తులు ఆర్పి, శపథం చేయాల్సిన పరిస్థితి తెస్తుందేమో అనుకుని భయపడి చచ్చా...” అని దాన్ని తిట్టుకుంటూ కమీషనర్ లింగారావ్ ఇంటివైపు అడుగులు వేశాడు.