Andaru Dongale Part 10

రాంబాబు, చిన్నారావ్ లు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ యింట్లో హాల్లో నేలమీద కూర్చునికులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు సాయంత్రం ఆరుగంటలైంది. అప్పటిదాకా ఇద్దరూ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఇంట్లో ఇల్లు ఊడవడం, అంట్లు తోమడం, మొదలైన చాకిరీలు నడ్డివిరిగేలా చేశారు. అప్పుడే కాస్త రిలాక్స్ అయ్యారు. ఆ టైలో ఇన్స్ పెక్టర్ అప్పారావ్ భార్య మదన మనోహరి వంకరటింకరగా హాల్లోకి నడుచుకుని వచ్చింది. ఆమె చేతిలోని ఓ గిన్నెని ఇద్దరి ముందు పెట్టింది. “ఏం మేడమ్?..... దీన్ని తళతళలాడేలా తోమెయ్యాలా?...” అడిగాడు రాంబాబు. “ధగధగలాడేలా తోమెయ్యాలా?” లోపల లోపల తిట్టుకుంటూ అడిగాడు చిన్నారావ్. “తోమడం కాదేమో... ఈ గిన్నెతో బయటికెళ్ళి కాస్త బంకమన్ను తెండి!” బొంగురుగొంతుతో అంది మదన మనోహరి!... ‘బంకమన్నా?!.... ఎందుకు మేడం?” ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.

“ఎందుకా?... మీ మొహానికి పుయ్యడానికి! నోర్ముస్కుని చెప్పింది చెయ్యండి!...” చికాకుగా అనేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది మదన మనోహరి. రాంబాబు, చిన్నారావ్ ఇద్దరూ ఆమెని బండ బూతులు తిట్టుకుంటూ యింట్లోంచి బయటపడ్డారు. కాస్త దూరం వెళ్ళాక వాళ్ళకో బురద గుంట కనిపించింది. “హమ్మయ్య... శ్రమపడి ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండానే బురద గుంట కనిపించింది!” తేలిగ్గా ఊపిరి పీలుస్తూ అన్నాడు రాంబాబు. “ఓ పండి తన ఫామిలీతో బాటు వుందే!!.....” అన్నాడు చిన్నారావ్. రాంబాబు క్రిందకి వంగి ఓ రాయి తీశాడు. “నువ్వు కూడా తియ్!” అన్నాడు. చిన్నారావ్ కూడా క్రిందకి వంగి రాయి తీశాడు. “రెడీ.... వన్... టూ... త్రీ....” ఇద్దరూ ఒకేసారి పందుల మీద రాళ్ళు విసిరారు. పందులు వీళ్ళని పెంటబాషలో తిడ్తూ బురదలోంచి లేచి దూరంగా పారిపోయాయి. రాంబాబు, చిన్నారావు లు బురద గుంటని సమీపించి నేల మీద కూర్చున్నారు. రాంబాబు గిన్నెని చేతులో పట్టుకుంటే చిన్నారావ్ దోసిలితో బురద తీసి గిన్నెలోకి వెయ్యసాగాడు.

“ఇంతకీ ఆవిదగారికి ఈ బురదెందుకో... బహుశా ఏ బ్యూటీ టిప్స్ బుక్ లోనో ఈ బురదని ఫేస్ ప్యాక్ లో ఉపయోగించొచ్చనిరాశారేమో!” అన్నాడు చిన్నారావ్. “కావొచ్చు!” కూల్ గా అన్నాడు రాంబాబు. “బాబోయ్... అలాగైతే పందులుపొర్లిన ఈ బురదని ఆవిడ మొహానికి రాస్కుంటే ఎలా?” కంగారుగా అన్నాడు చిన్నారావ్. “బురదని నీ మొహానికి రాస్కోమన్నంత కంగారు పడ్తావేం?.... అయినా ఆవిడ మొహానికి ఈ బురదే కరెక్టు!!” అన్నాడు రాంబాబు కసిగా పళ్ళునూర్తూ. ఇద్దరూ గిన్నేనిండా బురద తీస్కుని ఇన్స్ పెక్టర్ అప్పారావింటికి వెళ్ళారు. “ఏంటే?... బురద తేడానికింత లేటు?” రుసరుసా చేస్తూ అడిగింది మదన మనోహరి.

చిన్నారావ్ నసుగుతూ ఏదో చెప్పబోయాడు “అంటే మేడం.... మరేమో.... యింటి దగ్గర్లో బురద దొరకలేదు మేడం... కాస్త దూరం వెళ్ళాక ఓ మురికి గుంట కనిపించింది మేడం.... అందులో పందు.....” మిగతా వాక్యం పూర్తి కానివ్వకుండా చిన్నారావ్ పాదం మీద బలంగా ఓ తొక్కు తొక్కాడు రాంబాబు. “అబ్బా!...” అంటూ బాధగా మూలిగాడు చిన్నారావ్. “వెధవ!... చూశారా మేడం! కాస్త దూరం నడిచేసరికి ఎలా బాధపడిపోతున్నాడో?!....” అన్నాడు రాంబాబు. “చెప్తా... చెప్తా!...” క్రూరంగా చిన్నారావ్ వంక చూస్తూ లోపలికి వెళ్ళింది మదన మనోహరి. “ఏంటే నా మీద మేడంకి ఎక్కిస్తున్నావ్?” కోపంగా అన్నాడు చిన్నారావ్. “నీ మొహం... నేనలా టాపిక్ డైవర్ట్ చేయకపోతే నువ్వు ఈ బురదలో పందులు పొర్లిన సంగతి ఆమెకి చెప్పి ఉండేవాడివి!.... ఆవిడ మనిద్దరి అంతూ చుసుండేది!!” అన్నాడు రాంబాబు.