Andaru Dongale Part 9

గజదొంగ మంగులు డెన్ లో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. కోపంతో బుసలు కొడుతూ, ఉన్నట్టుండి అతని రెండు కాళ్ళూ ఒకదానికొకటి తట్టుకుని బోర్లా పడిపోయాడు. వీరూ కంగారుగా పరుగున వచ్చి మంగులు జబ్బ పట్టుకుని పైకి లేవదీశాడు. మంగులు “హబ్బా!” అని బాధగా అంటూ మోకాలు చిప్పలు రుద్దుకున్నాడు. “మీరెంత కోపంలో వున్నా కాస్త నింపాదిగా పచార్లు చెయ్యొచ్చు కదా బాస్.... ఇప్పుడు చూడండి ఎలా బోర్లాపడి, మోకాలు చిప్పలు బద్దలు కొట్టుకున్నారో?!” అన్నాడు వీరూ మంగులు వంక జాలిగా చూస్తూ. నోర్ముయ్... అసలే చిప్పలు పగిలి నేచస్తుంటే నీ సోదేంటి నాకు. ముందు ఓ కొవ్వొత్తి అంటించి ఇలా పట్రా” మండిపడ్డాడు మంగులు. “ఇప్పుడే మోకాలు చిప్పలు బద్దలు కొట్టుకున్నారు. మళ్ళీ అంత అర్జెంటుగా చేతులు కాల్చుకోవాలా బాస్.... అయినా ఇప్పుడంత అర్జంటుగా ఏం శపథం చెయ్యదల్చుకున్నారు బాస్?” అడిగాడు వీరూ.

“నీ బోడి సలహాలు మాని కొవ్వొత్తి అంటించి తీసుకురా... ఇందాక దీప జీపులో వెళుతుంటే రోడ్డుమీద శపథం చెయ్యలేకపోయాను కదా... అందుకని ఇప్పుడు శపథం చేస్తా” అన్నాడు గజదొంగ మంగులు. వీరూ ఓ లావుపాటి కొవ్వొత్తి వెలిగించి మంగులు ముందుకు చాపాడు. మంగులు కొవ్వొత్తి మంటమీద చెయ్యి పెట్టి శపథం చేశాడు. “ఆ కమీషనర్ కి మనశ్శాంతి లేకుండా చేస్తాను. వాడి ముద్దుల కూతుర్ని కిడ్నాప్ చేసి చంపుతా!” కొవ్వొత్తి మీద చెయ్యి పెట్టి మంటని ఆర్పేశాడు. “ఆ.....” చెయ్యి కాలి బాధగా అరిచాడు మంగులు. “ఆహా.... ఓహో...” అంటూ ఆనందంగా అన్నారు డెన్ లోని రౌడీలు. “ఏంట్రా మీ గోల?” మండుతున్న చేతిని ఊదుకుంటూ అడిగాడు గజదొంగ మంగులు. “మీ చెయ్యి కాల్తుంటే మంచి చీకులు కాలిన వాసనొస్తుంది బాస్” అన్నాడో రౌడీ. “అందుకే మీరెప్పుడు శపథం చేస్తారా అని వీడు ఎదురుచూస్తుంటాడు బాస్” అన్నాడు మరో రౌడీ ఇంకొకడ్ని చూపిస్తూ. “నాకైతే నోరూరిపోతుంది బాస్” లొట్టలు వేస్తూ అన్నాడు ఇంకో రౌడీ.

“షటప్ ... షటప్ ... షటప్...” జుట్టు పీక్కుంటూ అరిచాడు మంగులు. “నేను బాధపడుతుంటే మీకంత వేళాకోళంగా వుందిరా వెధవల్లారా?!” “సార్! మీరేమీ అనుకోనంటే నేనో విషయం అడగనా బాస్?” సందేహిస్తూ అన్నాడు వీరూ. “చెప్పు....” కుడి చెయ్యి ఊదుకుంటూ ఎడమ చేత్తో కన్నీళ్ళు తుడ్చుకుంటూ అన్నాడు మంగులు. “మీరు అంత బాధపడుతూ కోవ్వొత్తులు ఆర్పుతూ చేతులు కాల్చుకుంటూ శపధాలు చెయ్యకపోతే మాములుగా శపథం చెయ్యొచ్చు కదా బాస్?” గజదొంగ గంగులు బాధగా నిట్టూర్చాడు. “ఈ ఆచారాన్ని మా ముత్తాత మొదలెట్టాడు వీరూ... అప్పటి నుండీ మా తాత, మా నాన్న, నేను, మొన్న చనిపోయిన నా అన్న గంగులు ఈ ఆచారాన్నే ఫాలో అవుతూ వచ్చాం.. దీన్ని నేను మానలేను వీరూ.... మానలేను!!... నాకీ బాధ కూడా తప్పదు!” అని మంగులు అక్కడ గోడకి తగిలించి వున్న అతని ముత్తాత ఫోటో దగ్గరికి వెళ్ళి దాని వైపు చూస్తూ నిల్చున్నాడు.

“ఇప్పుడు మన బాస్ ఆయన తాతగారి ఫోటోకి భక్తిగా దండం పెట్టుకుంటాడు చూడు...” అన్నాడు ఓ రౌడీ పక్క రౌడీతో. ఆ రౌడీ మాట పూర్తయీ కాకమునుపే మంగులు ముత్తాత ఫోటో వంక క్రూరంగా చూస్తూ “ధూ.... నీ బతుకు చెడా!...” అని ఫోన్ దగ్గరికి వెళ్ళి కమీషనర్ లింగారావ్ నంబర్ డయల్ చేశాడు. “హలో!....” అవతలి నుండి కమీషనర్ లింగారావ్ గొంతు. “నేనేరా కమీషనర్... నువ్వు నీ కూతురికి చాలా సెక్యూరిటీని పెట్టావని అనుకుంటున్నావేమో... కానీ అటువంటివేమీ నన్ను ఆపలేవుగా... నువ్వెంత టైట్ సెక్యూరిటీ పెట్టినా నీ కూతుర్ని చంపుతారా... కాస్కో...” అంటూ ఫోన్ డిస్కనెక్టు చేసి కాలిపోయి మాడిన తన కుడి అర చేతినే చూస్కుని భోరుమన్నాడు గజదొంగ మంగులు.