TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
ముగ్గురూ లోపలికి అడుగుపెట్టారు. హాలంతా పూలతో, బెలూన్లతో అలంకరించబడి వుంది. హాలు మధ్యలో తెనులు వేశారు. దానిమీద బర్త్ డే కేక్ రెడీగా వుంది. ఆ పార్టీకి వచ్చినవాళ్ళలో సగంమంది పోలీసు అధికారులే కావడంతో రాంబాబు, చిన్నారావ్ లు మాటి మాటికీ సెల్యూట్ లు కొట్టాల్సి వస్తోంది.
రాంబాబు, చిన్నారావ్ లను చూడగానే ఎక్కడో దూరంగా ఫ్రెండ్స్ మధ్యన వున్న దీప “అంకుల్స్ ...’’ అంటూ దగ్గరికి పరిగెట్టుకు వచ్చింది.
రాంబాబు “హాప్పీ బర్త్ డే టూ యూ ...’’ అంటూ దీప బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు.
“ఛీ ... అప్పుడే చెప్పకూడదు. కేక్ కట్ చేశాక చెప్పాలి! సరే గానీ మనం ఇపుడు ఉయ్యాలాట ఆడ్డామా అంకుల్?’’ అడిగింది దీప ఉత్సాహంగా.
రాంబాబు గతుక్కుమన్నాడు. “ఇప్పుడొద్దు పాపా! మరేమో ... ఇప్పుడు నా పీకకి తాడుకట్టి నువ్వు ఊగావనుకో, అప్పుడు తాడు బిగుసుకుని నేను చచ్చాననుకో ... నీ బర్త్ డే పార్టీ క్యాన్సిల్ అయిపోతుంది కదా మరి?’’ వెర్రినవ్వు నవ్వుతూ అన్నాడు రాంబాబు.
"కాదు, ఉయ్యాలాట ఆడాల్సిందేనని దీప మారాం చేస్తుండగా అక్కడికి కమీషనర్ లింగారావ్, అతని భార్య శ్రీలక్ష్మి వచ్చారు. రాంబాబు, చిన్నారావ్ లు అతనికి సెల్యూట్ చేశారు. “ఏంటోయ్ మీరిక్కడే నిలబడిపోయారు? రండి రండి’’ అంటూ కమీషనర్ లింగారావ్ రాంబాబు, చిన్నావావ్ లను హాలు మధ్యకి తీస్కెళ్ళాడు. వాళ్ళ వెనకాలే నాగరాజు కూడా వెళ్ళాడు.
రాంబాబు కమీషనర్ లింగారావ్ కి నాగారాజుని తన క్లోజ్ ఫ్రెండ్ గా పరిచయం చేశాడు. బర్త్ డే కేక్ కట్ చేసిన తర్వాత తను మ్యాజిక్ షో ఇస్తానని నాగరాజు కమీషనర్ లింగారావ్ కి చెప్పాడు. కమీషనర్ సంతోషంగా సరేనన్నాడు. పార్టీకి ఇన్స్ పెక్టర్ అప్పారావు కూడా వచ్చాడు. అతను చేసే కుక్క చేష్టలన్నీ పార్టీకి వచ్చిన వాళ్ళని చచ్చేట్టుగా నవ్వించాయ్. ఇక తట్టుకోలేక ఇన్స్ పెక్టర్ అప్పారావుకు ఇంటి వెనక్కి వెళ్ళి జామచెట్టుక్రింద కూర్చుని భోరున ఏడ్చాడు.
దీప ఏడు గంటలకి కేక్ కట్ చేసింది. పార్టీకి వచ్చిన అందరి పిల్లలూ “హ్యాపీ బర్త్ డే టూ యూ...’’ అంటూ కోరస్ గా పాడారు. తర్వాత నాగరాజు పిల్లలలకోసం మ్యాజిక్ షో స్టార్ట్ చేశాడు. ఖాళీ ప్లాస్టిక్ సంచిలోంచి చాక్లెట్లు తీసి అందరు పిల్లలకి పంచాడు. గుడ్డపీలికల్ని రంగు రంగు రిబ్బన్లుగా మార్చి దీపకి ఇచ్చాడు. గాల్లోంచి ఐస్ క్రీమ్స్ దీఒపకి తినిపించాడు. ఇంకా చిన్న చిన్న మ్యాజిక్కులు చాలా చేసి అందరు పిల్లల మనసుల్నీ దోచుకున్నాడు.ముఖ్యంగా దీప మనసుని.
కమీషనర్ లింగారావ్ నాగారాజుని అభినందించాడు. తర్వాత రాంబాబు, చిన్నారావ్ లతో ఇలా అన్నాడు. “ఈవేళ నా మనసెంతో ఆనందంగా వుంది. ఈ సందర్భంలో మీకో గుడ్ న్యూస్. దేపని గజదొంగ మంగులు నుండి కాపాడినందుకు మీ ఇద్దరికీ డబుల్ ఇంక్రిమెంట్స్ శాంక్షన్ చేస్తున్నాను.’’
రాంబాబు, చిన్నారావ్ లు అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. డిన్నర్ అయిన తర్వాత ఒక్కొక్కరే కమీషనర్ లింగారావ్ దగ్గర శలవు తీస్కుని వెళ్ళసాగారు. చివరికి రాంబాబు, చిన్నారావ్, నాగరాజు మిగిలారు.
అప్పుడు కమీషనర్ లింగారావ్ ఖాళీగా ఉన్నాడని రాంబాబు, నాగరాజు దీనగాథ గురించి ఆయనకి క్లుప్తంగా చెప్పి “మీరే నా ఫ్రెండ్ కి దారి చూపించాలి సార్!’’ అన్నాడు. నాగారాజుని కమీషనర్ లింగారావ్ రికమెండ్ చెయ్యడంవల్ల తన జీవితంలో ఓ పెద్ద మలుపు తిరగాబోతూందని ఆ క్షణంలో రాంబాబుకి తెలీదు.
|
|