Aanagar Colony 5

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

5 వ భాగం

యమ స్పీడుగా ఎడిటర్ చాంబర్ లకి దూసుకు వెళ్ళాడు సాకేత్. అతను అలా స్పీడుగా లోపలికి దూసుకెళ్ళేసరికి, ఎడిటర్ ఖంగుతిన్నాడు. అతని సెక్రటరి లైలా ఎడిటర్ ఒళ్ళోనే ఉంది మరి.

వెంటనే సాకేత్ సిగ్గుతో తలొంచుకొని "నేనేమీ చూడ్లేదు సార్" అన్నాడు.

"యూ...నాటీ" అని సాకేత్ బుగ్గమీద గిల్లీ సెక్రటరీ లైలా వెళ్ళిపోయింది. ఎడిటర్ గుర్రుగా చూసి..." వచ్చేముందు డోర్ శబ్దం చేసి రావచ్చుగా...అయినా అక్కడ పోయి ఏం చేస్తున్నాడు" అన్నాడు కీచుగొంతుతో.

"ఆఫీసు ఊడ్చే నూకాలమ్మకు వాత్సాయనుడి కామసూత్రాల గురించి ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నాడు" తాపీగా చెప్పాడు సాకేత్.

కోపాన్ని దిగమింగుకుంటూ "సర్లే ఇంతకీ విషయమేంటి? అని అడిగాడు.

"ఇవ్వాళ రాత్రి నేనో అడ్వంచర్ చేయబోతున్నాను" అన్నాడు ఉత్సాహంగా సాకేత్.

"ఏంటా అడ్వంచర్....నా కొంపల మీదకు తీసుకురావుగా" అన్నాడు భయం భయంగా ఎడిటర్. అంతకు ముందోసారి ఇలానే నేనో అడ్వంచర్ వేస్తానని చెప్పీ యూనిఫామ్ లో ఉండి మందుకొడుతున్న ఓ యస్సయ్ ని ఫోటో తీసి ఎడిటర్ ఊళ్ళో లేని టైమ్ లో ప్రింటింగ్ కు ఇచ్చేశాడు. తీరా తర్వాత తెలిసింది.

ఈ ఇన్ స్పెక్టర్ కు మందుపార్టీ ఇచ్చింది. ఎడిటరేనని. దాంతో ఆ ఇన్ స్పెక్టర్ ఎడిటర్ ని నానా బూతులు తిడితే, ఆ బూతులు మింగలేక కక్కలేక చచ్చూర్కున్నాడు ఎడిటర్. సాకేత్ ని చూస్తే భయంగానే ఉంటుంది. ఎడిటర్ కు, పులిని పక్కన పెట్టుకున్నంత భయం. అలా అని, సాకేత్ ని వదిలించుకుంటే మరో పత్రికలో సాకేత్ రాయడం మొదలెడితే తనకున్న టాలెంటెడ్ రైటర్ ఎక్కడ మిస్సవుతాడోనన్న భయం.

విశ్వంభరధరరావుకు ఉన్న దుర్గాణాల్లో ఇది ఒకటి. టాలెంటెడ్స్ ని బయటకు వెళ్ళనీయడు తన దగ్గరే ఉండాలి. గడ్డివాము దగ్గర కుక్కలా వాళ్ళని పూర్తిగా ఎదగనీయడు.

"పోనీ...ఆ అడ్వంచర్ ఏంటో చెబితే నేనూ సంతోషిస్తాను" అన్నాడు ఎడిటర్.

హమ్మో...చెబితే థ్రిల్లలుండదు. రేపీపాటికి మీకా అడ్వంచర్, థ్రిల్లింగ్ సేన్షేషన్ ముందుంచుతాను.

"అన్నట్టు ఓహండ్రెడ్ ఇప్పించండి కెమెరాలో రీలు వేయించాలి. ఓచర్ మీద హండ్రడ్ అని రాసి సాకేత్ కు ఇచ్చాడు. ఎడిటర్ ఆల్ ది. బెస్ట్ చెప్పి. అది ఆ ఎడిటర్ కొంప ముంచుతుందని అతనికే తెలియదు.

* * *

నాలుగు రూపాయల గప్ చుప్ లు తిని, ఓ స్ట్రాంగ్ టీ తాగి హమ్మయ్య ఈ పూటకి ఫుడ్డు అక్కర్లేదని అనుకుంటూ తన మెడలో వేలాడుతున్న కెమెరా వంక చూసుకున్నాడు తృప్తిగా. నెంబర్ థర్టీన్ స్ట్రీట్ లో చిత్రాంగి వుందని అతనికి కబురు వచ్చి చేరింది. చిత్రాంగి ముంబయ్ లో చిత్రగా, చెన్నయ్ లో చైత్రగా, హైదరాబాద్ లో చిత్రాంగిలా ఫేమస్, డిల్లీలో చిత్రా డియర్ గా చాలామందికి తెలుసు.

పాలిటీషియన్లు, బిజినెస్ మాగ్నె ట్స్ కు ఆమెతో కనెక్షన్ ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెట్. ఎవరికైనా ఏపని కావాలన్నా, ఆమెను ఆశ్రయిస్తారు.

ఆ రోజు ఉదయమే ఇక్కడికి వచ్చి నెంబర్ థర్టీన్ స్ట్రీట్ లో గెస్ట్ హౌస్ లో విడిది చేసింది. ఆ విషయం పసిగట్టిన సాకేత్ ఆ రోజు ఎవరు అక్కడికి వస్తారో తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

ఆ అడ్వంచర్ న్యూస్ స్కోప్ కు టైటిల్ కూడా ఆల్రెడి డిసైడ్ చేసుకున్నాడు. చిత్రాంగి వలలో ఉన్న చేప పేరేమిటి? అని హెడ్డింగ్ పెట్టాలని డిసైడ్ య్యాడు సాకేత్.