Rating:             Avg Rating:       581 Ratings (Avg 2.89)

Aanagar Colony 4

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

4 వ భాగం

సాకేత్ కు తన కర్తవ్యం గుర్తొచ్చింది. వెంటనే ఏర్ బ్యాగ్ ఓపెన్ చేసి, అందులోనుంచి డైరి తీసి గబగబా ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ నోట్ చేసి ఏర్ బ్యాగ్ లో నుంచి కెమెరా తీసి 'అవ్వ నీ ఫోటో ఒకటి తీసుకోవాలా?" అని అడిగాడు సాకేత్.

"పదిరూపాయలవుతుంది" చెప్పింది అవ్వ.

"దేనికి"? అయోమయంగా అడిగాడు.

"నా ఫోటో తీసుకోవడానికి....అదీ 'ఆఫ్' అయితే పూర్తిగా నేను నిలబడి వున్న ఫోటో అయితే ఇరవై రూపాయలు" చెప్పింది అవ్వ.

వెంటనే జేబులో నుంచి ఇరవై రూపాయలు తీసి అవ్వ చేతిలో పెట్టబోయాడు.

"వద్దు..." అని కిందికి వంగి ఓ డబ్బా తీసింది.

"ఇందులో వెయ్" అంది.

ఆ డబ్బా మీద "నిస్సాహాయుల కోసం" అని వుంది.

"ఇదేమిటవ్వా?"

"నీకెందుకయ్యా....అందులో ఆ డబ్బు వేసి...నా ఫోటో తీసుకో" అంది అవ్వ.

సాకేత్ అవ్వ చెప్పినట్టే చెప్పాడు. "నాకో డౌట్ అవ్వా, నీ పేరేమిటి?"

"ముసిముసినవ్వులు నవ్వి చెప్పింది. అవ్వ "మాధురి కులకర్ణి" అని.

"ఆ". అంటూ వెనక్కి విరుచుకుపడబోయి తమాయించుకున్నాడు సాకేత్.

"నీ రూమ్ నెంబర్ పద్నాలుగువేల ఒకటి" చెప్పింది మాధురి కులకర్ణి.

"అదేంటి?"

"ఇక్కడ పద్నాలుగు వేల నుంచి రూమ్ నెంబర్లు మొదలవుతాయి" చెప్పింది అవ్వ.

తన రూమ్ వైపు నడిచాడు సాకేత్.

* * *

ఫ్రెష్ గా తయారై మంచమ్మీద వెల్లకిలా పడుకున్నాడు సాకేత్. ఈ ఆహానగర్ కాలనీ అతనికి విచిత్రంగా అనిపిస్తోంది. తను వచ్చింది ఈ విచిత్రాల వెనుక ఉన్న స్టోరీని, ఈ విచిత్రాల చిత్తాలను చేదించడానికే. ఈ ఎస్సయిన్ మెంట్ తనకు చాలా బావుంది. అసలు తన బాధ భరించలేక, తనకి పనిష్మెంట్ గా ఉంటుందని ఇక్కడికి పంపించాడు ఎడిటర్. కానీ, అంతా మనమంచికే అన్నట్టు, తనకి ఈ ఎస్సయిన్ మెంట్ తాలూకు ఎక్సయిట్ మెంట్ బాగానే ఉంది. థ్రిల్లంటే తనకెంతో థ్రిల్లు. తన జీవితమే ఓ థ్రిల్లర్ స్టోరీ. కనులు మూసుకొని ప్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాడు సాకేత్.

* * *

తమాషా పత్రికలో కాలమిస్ట్ కమ్ స్టోరీ రైటర్ సాకేత్ ఆ పత్రికలో రెగ్యులర్ గా సరదా కాలం రాయడమే కాక, స్పెషల్ స్టోరీస్ తీసుకురావడం, సినిమావాళ్ళ పర్సనల్ ఇంటర్య్వూలు చేయడం సాకేత్ డ్యూటీ. ఆ పత్రిక ఎడిటర్ విశ్వంభరధరరావు, అతనికి ఈ పత్రిక ఒక వ్యాపకమే. తన వ్యాపారాలు సజావుగా నడవడానికి ఈ పత్రికను అవసరమైతే ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని అతని ఆలోచన. ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండాలని ప్రయత్నిస్తుంటాడు.

తెలివైన వాళ్ళని ఎరవేసి, తన పత్రికకు పనికొచ్చేవాళ్ళని చేరదీస్తూ ఉంటాడు. అలాంటి అతని గాలానికి చిక్కిన ఎర సాకేత్. తెలివి, షార్ప్ నెస్, అత్యుత్సాహం, టాలెంట్ ఉన్న సాకేత్ తన పత్రికకు ఎస్సెట్ అవుతాడని అతన్ని ఎంకరేజ్ చేశాడు.

సాకేత్ రాసే రచనలు, కాలమ్స్, ఫీచర్స్ పాఠకుల ఆదరణ పొందడంతో నెలకు కొంత మొత్తం ముట్టజెప్పి ఒప్పందంతో మరే పత్రికలోనూ రాయకూడదనే నిబంధన పెట్టి, అతని తెలివి తేటలకు తన పత్రికకు పరిమితం చేసుకున్నాడు ఎడిటర్. అయినా సాకేత్ అవేమీ పట్టించుకోలేదు.

కారణం సాకేత్ కి ఆకలి బాధ తెలుసు. అర్ధతుక అర్ధమూ తెలుసు. తన వ్యాపారానికి పెట్టుబడి తన తెలివేనని తెలుసు. ఏపని మొదలెట్టినా చిచ్చర పిడుగుగా దూసుకువెళ్ళగలడు. మొరుపులా మెరిసి, పిడుగులా అనుకున్నది సాధించగలడు. ఒక్కోసారి సాకేత్ అత్యుత్సాహం విశ్వంభరధరరావుకు ప్రాణ సంకటం గా పరిణమిస్తుంది. అలాంటి సంఘటన.