Aanagar Colony 6

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

6 వ భాగం

నెంబర్ థర్టీన్ స్ట్రీట్, పోష్ లోకల్టీ అది.

చిత్రాంగి అనఫీషియల్ గెస్ట్ హౌస్ అది. ఎవరి పేరు మీద వుందో, కార్పొరేషన్ వాళ్ళకే తెలియాలి. పెద్దగేటు, ఓ గుర్కా,....లోపల దట్టంగా చెట్లు, వాటి మధ్య బిల్డింగ్. ప్రహరీగోడ వెనకవైపు వెళ్ళాడు. లోపల ఓ కుక్క వుందని అంతకు ముందే తెలుసుకున్నాడు. లోపల ఉన్నది ఆడకుక్కా, మగకుక్కా....అని అతని డౌటు.

ఎందుకైనామంచిదని "డాగ్ బిస్కెట్స్" కూడా పట్టుకొచ్చాడు.

పిట్టగోడ పెద్ద ఎత్తులో లేదు. అతి కష్టమీద ఆ గోడ ఎక్కి, అవతలవైపు దూకాడు. నడ్డీ విరిగిన సేన్షేషన్ కలిగింది. నడ్డీ విరిగిన పర్లేదు. కానీ, నరాల వీక్నెస్ రాదుకదా. అనుకున్నాడు. మనసులో సమరాన్ని తలచుకున్నాడు.

తనకే నరాల వీక్నెస్ రాకూడదని. మోకాళ్ళ మీద కూచొని చుట్టూ చూసాడు. హమ్మయ్య..కుక్కలేదు. అనుకున్నాడు. హాయిగా నిట్టూర్చిన అతని ఆలోచన రాంగ్ అని మరుక్షణంలోనే అర్ధమైంది.

ఆ కుక్క గుర్రుగా సాకేత్ ని చూస్తోంది. వెంటనే "భౌ" అన్నాడు సాకేత్ దాని రియాక్షన్ చూద్దామని. వెంటనే రియాక్టయిందా శునకం.

బావురు కప్పలా నోరు తెరిచి స్టీరియో ఫోనిక్ సౌండ్ ని డామినెట్ చేస్తూ తన శక్తి కొద్దీ "భౌ...భౌ...భౌ" అంటూ అరిచింది. ఏమాత్రం ఆసస్యమైన తన ఒంట్లోని ఫ్లెష్ పార్ట్ లన్నీ దాని నోటికింద మటన్ గా మారడం గ్యారంటీ అన్న నమ్మకం కలిగాక, తన చేతిలోని బిస్కెట్ ప్యాకెట్ దాని మీదకి విసిరాడు.

ఒక్కక్షణం తన అదుపుని ఆపి, ఆ బిస్కెట్ ప్యాకెట్ వాసన చూసి నాకు వెజ్ వద్దు. నాన్ వెజ్జే ముద్దు అన్న లెవల్లో మళ్ళీ అరుపందుకుంది. అతని తొడను గట్టిగా కోరకడానికన్నట్టుగా ముందుకు దూకింది. అప్పుడు తీసాడు.

తన కోటు జేబులో ఉన్న మటన్ ముక్క ఉన్న క్యారీబ్యాగ్ ను. దాన్ని ఊడబెరికి అందులోని మటన్ ముక్క కుక్క ముందు విసిరాడు. అది మటన్ ముక్కును నోట కరచుకొని, ఓ చెట్టుకింద సెటిలై నమలసాగింది. రిలాక్సయ్యాడు సాకేత్.

* * *

మిస్సయిలా ఎడిటర్ ఛాంబర్ లోకి దూసుకువెళ్ళాలన్న స్పీడ్ లో ఉన్న సాకేత్ కు నిన్నటి అనుభవం గుర్తొచ్చి ఎందుకైనా మంచిదని లైలా సీట్ లో ఉందా? అని ఓ లుక్కు లైలా సీటు వైపు వేశాడు.

లైలా ఎవరో రైటర్ తో మాట్లాడుతోంది. హమ్మయ్య,,,,లైలా ఇక్కడే ఉందని వేగంగా ఎడిటర్ క్యాబిన్ వైపు పరిగెత్తాడు.

"సార్...యురేకా" అని అరిచాడు. క్యాబిన్ లోకి అడుగు పెడుతునే.

"అదేంటయ్యా...ఆ అరుపేంటి? ఝుడుసుకు చచ్చాను" అన్నాడు ఎడిటర్ విశ్వంభరధరరావు.

"సారి సర్...ఎమోషన్ లో టెంప్టేషనై కొద్దిగా ఓవరయ్యాను" అన్నాడు.

"సరే...ముందు అసలు విషయానికి రా."

"అసలు విషయమేమిటంటే, అది రాత్రి పదిన్నర గంటల సమయం."

"అంటే రాత్రి నువ్వు చేసిన అడ్వంచర్ మొత్తం చెబుతావా? అదేం వద్దులే...అసలా సేన్షేషన్ న్యూస్ ఏమిటో...ఫొటోలు ఎలా వచ్చాయో.. చూపించు" సహనం నశించి అన్నాడు ఎడిటర్.