LATEST NEWS
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల భారం పడనుంది. జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.2,074 కోట్ల భారం పడనుంది. జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించింది. మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.3,802 కోట్ల రూపాయల భారం పడనుంది. మొదటి డీఏ బకాయిలను జీపీఎస్‌లో మూడు విడతల్లో జమ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్లు ఆయనకు ఒక వ్యక్తి పంపిన మెసేజ్ కలకలం రేపుతోంది. తాను ఒక ఎస్సై నంటూ అవతలి వ్యక్తి ఆయనకు మేసేజ్ పెట్టారు. ఈ హత్యకు ఇప్పటికే లావాదేవీలు కూడా జరిగాయని ఆ మెసేజ్ సారాంశం. అయ్యన్నను హత్యచేసి దానిని మావోయిస్టులు చేసినట్లు చిత్రీకరిస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఐతే ఈ మేసేజ్ పై అయ్యన్నపాత్రుడు వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వియ్యపు తాతారావు అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వియ్యపు తాతారావు బుచ్చయ్యపేట కేటీ ఆగ్రహారానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ తాతారావు గతంలో కూడా పలువురికి బెదిరింపు మేసేజ్‌లు పంపినట్లు పోలీసు విచారణలో తేలింది.
కరోనా కలకలంతో మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసందే. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. మరోపక్క.. స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది.    అయితే తాజాగా స్థానిక ఎన్నికల వ్యవహారంపై మంత్రి కొడాలి నాని మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. అది సరైన పద్దతి కాదు. నిమ్మగడ్డ మరి కొన్ని నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారు. తర్వాత రిటైర్ అయ్యి హైదరాబాద్‌లో ఉంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నేను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదు. అసలు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఈ విషయంలో ఏమీ చెయ్యలేరు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అలా కాకుండా ఎన్నికల సంఘం తనంత తాను ఎన్నికలు నిర్వహిస్తానంటే అది జరిగే పనికాదు. కరోనా మహమ్మారి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. ఇంతకూ ముందులాగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువ మందిని తరలించడం కూడా సాద్యం కాదు. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు. అసలు దసరా తర్వాత కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అసలు బీహర్ అసెంబ్లీ ఎన్నికలతో ఇక్కడి స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు" అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
సమాజంలో మానవత్వం నశించిపోతోంది. అమానుషాలు పెరిగిపోతున్నాయి. సొంత మనుషులే కిరాతకులవుతున్నారు. మెంటల్ బ్యాలెన్స్ తప్పి సైకోల్లో ప్రవర్తిస్తున్నారు. ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలాంటి దారుణ ఘటన జరిగింది. కన్నకూతురిపైనే తల్లి కిరాతకంగా ప్రవర్తించింది. కన్నకూతురిని పెన్సిలుతో 12 సార్లు పొడిచింది.  అనంతరం కొరికి గాయాలపాలు చేసింది తల్లి.    కరోనా నేపథ్యంలో విద్యాలయాలు ఆన్‌లైన్‌ కాస్లులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆరో తరగతి చదువుతున్న 12 ఏండ్ల  బాలిక ఇంట్లో వర్చువల్ పద్ధతిలో క్లాసులు వింటోంది. ఆ సమయంలో టీచర్ ఆ బాలికను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ బాలిక సమాధానం చెప్పకపోవడంతో ఆమె పక్కనే ఉన్న తల్లికి కోపం వచ్చి ఇలా కర్కశంగా ప్రవర్తించింది. టీచర్‌ ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదంటూ కన్న కూతురిని దారుణంగా గాయపర్చింది. తన చేతిలో ఉన్న పెన్సిల్ తో 12 సార్లు పొడిచింది. అంతటితో ఆగని ఆ మహా తల్లి .. నోటితో కొరికి కూతురిని గాయపరిచింది.                         అక్కను అమ్మ గాయపర్చడంతో అది చూసిన చిన్నకూతురు భయపడిపోయింది. తెలివిగా వ్యవహరించింది. 1098 ఛైల్డ్ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో  ఎన్జీవో ప్రతినిధులు వారి ఇంటికి చేరుకుని ఆ తల్లికి చివాట్లు పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు చికిత్స చేయించారు. కుమార్తెను పెన్సిలుతో పొడిచిన తల్లిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 300 ల రోజుల నుంచి అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తుంటే.. అది ఉద్యమమే కాదని, అసలు వాళ్ళంతా రైతులు కాదు పెయిడ్ అరిస్ట్ లని అన్న జగన్ సర్కార్.. ఇప్పుడదే అమరావతి ఉద్యమాన్ని చూసి భయపడుతోందా?. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టించడం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.    అమరావతి రైతులకు పోటీగా శనివారం నాడు మందడంలో ఓ శిబిరం వెలిసింది. అయితే, ఆ శిబిరంలో పాల్గొన్నవారికి శిక్షణ ఇస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి లీక్ అయింది. ఆ వీడియో చూస్తే అమరావతి రైతులుకి వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమం నడిపే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శిబిరానికి వచ్చిన మహిళలకు ఏం మాట్లాడాలో శిక్షణ ఇస్తున్నాడు. ఏ ఊరని ఎవరైనా అడిగితే రాజధాని ప్రాంతంలోని గ్రామమని చెప్పమన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారని.. అందువల్లే రిలే దీక్షలో పాల్గొంటున్నామని చెప్పమని మహిళలతో చెబుతున్నట్లు వీడియోలో ఉంది. అంతేకాదు, డబ్బులు కోసం కాదు.. ఇళ్ల స్థలాల కోసమే స్వచ్ఛందంగా వచ్చామని చెప్పాలని వారికి చెబుతున్నట్లు వీడియోలో రికార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   ఇప్పటి వరకూ రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులు అని వక్రంగా మాట్లాడిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు వీడియోతో అడ్డంగా బుక్కయిన ఈ వ్యవహారంపై ఏం సమాధానం చెప్తారోనన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమరావతి రైతులు అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పెరుగుతుందన్న భయం ప్రభుత్వంలో మొదలైందని, అందుకే పెయిడ్‌ ఉద్యమాన్ని చేయిస్తోందని మండిపడుతున్నారు.
ALSO ON TELUGUONE N E W S
కృష్ణ‌వంశీ 'ఖ‌డ్గం' హీరోయిన్ కిమ్ శ‌ర్మ‌, భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ కొన్నేళ్ల క్రితం చెట్టాపెట్టాలేసుకుని తిరిగిన విష‌యం చాలా మందికి తెలిసిందే. ఆ త‌ర్వాత ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. యువ‌రాజ్ బ్రిటీష్ న‌టి హాజెల్ కీచ్‌ను 2016లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు విష‌యం ఏమంటే మాజీ ప్రేయ‌సి సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్‌కు యువ‌రాజ్ కామెంట్ చేయ‌డం! అవును. కిమ్ శ‌ర్మ బీచ్ గురించి క‌ల‌లు కంటూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్‌గా పెట్టిన పోస్ట్ ఇందుకు నిద‌ర్శ‌నం. శ‌నివారం ఆమె త‌న హాలీడే డైరీస్‌కు సంబంధించిన ఓ పేజీ తెరిచి, త‌న స్ట‌న్నింగ్ ఫొటోనొక‌దాన్ని షేర్ చేసింది. దీనికి యువ‌రాజ్ చేసిన కామెంట్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆ ఫొటోను షేర్ చేసిన కిమ్ "బీచ్‌లో గ‌డిపే రోజు కంటే కంటే మంచి రోజు ఏముంటుంది?" అని క్యాప్ష‌న్ పెట్టింది. దానికి #notmuch #flashback అనే హ్యాష్‌ట్యాగ్‌ల‌ను జోడించింది. ప్ర‌స్తుతం ఆమె హృద‌యం ఎలాంటి ఆలోచ‌న‌లు చేస్తోందో ఈ పోస్ట్ తెలియ‌జేసింది. ఆ పిక్చ‌ర్‌లో కిమ్ రంగురంగుల బికినీ ధ‌రించి, చేతిలో స‌ర్ఫ్‌బోర్డ్ ప‌ట్టుకొని బీచ్‌లో నిల్చొని ఉంది. ఆ పోస్ట్‌కు రియాక్ట‌యిన యువ‌రాజ్‌, "Gaon basaa nahi basta lekar pahunch gai hain madam." అని హిలేరియ‌స్ కామెంట్ పెట్టాడు. కిమ్ శ‌ర్మ త‌ర‌చూ త‌న అందాల‌న ప్ర‌ద‌ర్శించే బికినీ పిక్చ‌ర్ల‌తో అభిమానుల‌కు వినోదాన్ని పంచుతూ వ‌స్తోంది. 'ఖ‌డ్గం'లో శ్రీ‌కాంత్ జోడీగా క‌నిపించిన కిమ్ 'మ‌గ‌ధీర' చిత్రంలో స్పెష‌ల్ అప్పీరెన్స్ ఇచ్చింది.
  జూలై నెల‌లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియ‌న్ ఫాలోయ‌ర్స్ మార్క్‌ను చేరుకున్న సంద‌ర్భంగా పూజా హెగ్డే చేసుకున్న సెల‌బ్రేష‌న్స్ ఇంకా మ‌న మ‌న‌సుల నుంచి చెరిగిపోలేదు. ప‌ట్టుమ‌ని మూడు నెల‌లు గ‌డిచాయో లేదో, ఆ న్యూస్ పాత‌బ‌డిపోయింది. ఇప్పుడు ఈ 'బుట్ట‌బొమ్మ' 12 మిలియ‌న్ ఫాలోయ‌ర్ల మార్క్‌ను చేరుకుంది. ఆమె సాధించిన అ ఫీట్‌తో ఫ్యాన్స్ ఆనందానికి అడ్డు లేదు. 11 మిలియ‌న్ల మంది ఫాలోయ‌ర్ల‌ను అందుకున్న‌ప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పూజ‌, "ఈ సంవ‌త్స‌రం నా కాళ్ల గురించి (మీకు తెలిసిన‌ట్ల‌యితే) నా పోస్ట్ కోసం వాటిని ఉప‌యోగించ‌డం మంచిద‌ని నేను డిసైడ్ చేసుకున్నాను. ఎప్ప‌ట్లాగే నేను పాజిటివిటీని, ల‌వ్‌ను వ్యాప్తి చేయ‌డాన్ని కొన‌సాగిస్తాను. నా స‌ర‌దా, సిల్లీ పోస్టుల‌తో మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంటాను. మీ ప్రేమ‌, ష‌ర‌తుల్లేని మీ స‌పోర్ట్ న‌న్ను డాన్స్ చేయిస్తుంది, బ‌లాన్నుంచి బ‌లానికి న‌డిపిస్తుంది, నా హృదయంలో ప్రేమ‌ను నింపుతుంది. Loads of love from Buttabomma herself” (sic). అని రాసుకొచ్చింది. ఇప్పుడు 12 మిలియ‌న్ల మంది ఫాలోయ‌ర్ల‌ను పొంద‌డంతో సెల‌బ్రేష‌న్స్‌ను ఎలా జ‌రుపుకుంటోద‌న‌ని ఫ్యాన్స్ ఆత్రుత‌తో ఎదురు చూస్తున్నారు. సినిమాల విష‌యానికి వ‌స్తే, త్వ‌ర‌లో అఖిల్ అక్కినేని స‌ర‌స‌న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' సినిమాలో పూజ‌ క‌నిపించ‌నున్న‌ది. 'రాధే శ్యామ్' సినిమా కోసం ప్ర‌స్తుతం ఇట‌లీలోని అంద‌మైన ప్ర‌దేశాల్లో ప్ర‌భాస్‌తో రొమాన్స్ చేస్తూ, ఆడి పాడుతోంది.
'సరైనోడు' సక్సెస్ తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేసే అవకాశం దర్శకుడు బోయపాటి శ్రీనుకి వచ్చింది. ఎందుకనో ఆ ప్రాజెక్ట్ తరువాత మెటీరియలైజ్ కాలేదు. చిరు తనయుడు రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' చేశాడు బోయపాటి. అది ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో మెగా ఫ్యామిలీతో బోయపాటికి ఏవో విబేధాలు వచ్చాయని గుసగుసలు వినిపించాయి. అయితే, అటువంటిది ఏమీ లేదని... చిరంజీవితో సినిమా చేయడానికి బోయపాటి సిద్ధం అవుతున్నారని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.  ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్లు 'సింహ', 'లెజెండ్' సినిమాల తరవాత హీరో, దర్శకుడి కాంబినేషన్లో ముచ్చటగా తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. దీని తరువాత చిరంజీవి హీరోగా బోయపాటి సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ హీరోని కలిసి స్టోరీ లైన్ వినిపించారని, లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారని టాక్. త్వరలో చిరంజీవిని కలిసి కథ వినిపిస్తారట. 
  న‌టి లువినా లోధ్ చేసిన వేధింపుల ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ డైరెక్ట‌ర్ మ‌హేశ్ భ‌ట్ న్యాయ బృందం శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆ న‌టిపై భ‌ట్ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్నార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అంత‌కు ముందు త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో లువినా లోధ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో భ‌ట్‌పై ఆమె కొన్ని తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హేశ్ భ‌ట్ లీగ‌ల్ టీమ్ విడుద‌ల చేసిన స్టేట్‌మెంట్‌ను ఆయ‌న‌కు చెందిన‌ విశేష్ ఫిలిమ్స్ అఫిషియ‌ల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆ స్టేట్‌మెంట్‌లో, "లువినా లోధ్ అనే ఆమె రిలీజ్ చేసిన వీడియో రిఫ‌రెన్స్‌తో.. మా క్ల‌యింట్ మ‌హేశ్ భ‌ట్ త‌ర‌పున ఆ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తున్నాం. ఆ ర‌క‌మైన ఆరోప‌ణ‌లు త‌ప్పుడు, ప‌రువున‌ష్టం క‌లిగించేవి మాత్ర‌మే కావు, చ‌ట్ట‌ప‌రంగా తీవ్ర‌మైన ప‌రిణామాల‌కు దారితీసేవి. మా క్ల‌యింట్ చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య తీసుకోనున్నారు. Sd/- Naik Naik & Co. Legal Counsel, Vishesh Films (sic).” అని పేర్కొన్నారు. అదివ‌ర‌కు ఒక నిమిషం 48 సెక‌న్ల నిడివి వీడియోలో మ‌హేశ్ భ‌ట్, ఆయ‌న ఫ్యామిలీ త‌న‌ను వేధింపుల‌కు గురిచేశార‌ని లువినా ఆరోపించారు. వీడియోలో మొద‌ట త‌న గురించి ప‌రిచ‌యం చేసుకున్న ఆమె, "త‌న ఫ్యామిలీ క్షేమం కోస‌మే" ఈ వీడియోను రూపొందించిన‌ట్లు తెలిపారు. మ‌హేశ్ భ‌ట్ మేన‌ల్లుడు సుమిత్ స‌భ‌ర్వాల్‌ను త‌ను పెళ్లి చేసుకున్న‌ట్లు కూడా ఆమె చెప్పారు.
  అన్ని వ‌దంతుల త‌ర్వాత‌, 2020 అక్టోబ‌ర్ 10న తోటి గాయ‌కుడు రోహ‌న్‌ప్రీత్ సింగ్‌తో త‌న అనుబంధం విష‌యాన్ని ప్ర‌క‌టించింది పాపుల‌ర్ సింగ‌ర్‌ నేహా క‌క్క‌ర్‌. త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రోహ‌న్‌ప్రీత్‌తో ఉన్న ఓ క్యూట్ పిక్చ‌ర్‌ను ఆమె పోస్ట్ చేసింది. దాంతో పాటు "నువ్వు నావాడివి రోహ‌న్‌ప్రీత్ సింగ్. #NehuPreet." అని రాసింది. రోహ‌న్‌ప్రీత్ కూడా అదే పిక్చ‌ర్‌ను షేర్ చేసి, "Meet My Zindagi! #NehuPreet". అని రాశాడు. అప్ప‌ట్నుంచీ నేహా, రోహ‌న్‌ప్రీత్ ఇద్ద‌రూ త‌మ అంద‌మైన ఫొటోల‌తో అభిమానుల‌కు క‌నువిందు చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు ఎట్ట‌కేల‌కు అక్టోబ‌ర్ 24న ఆ ఇద్ద‌రూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలోని గురుద్వారాలో జ‌రిగిన వారి ప‌విత్ర వైవాహిక వేడుక‌కు సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వివిధ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నేహా కక్క‌ర్‌, రోహ‌న్‌ప్రీత్ సింగ్ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన అనేక వీడియోలు మ‌నం చూడొచ్చు. ఆ ఇద్ద‌రి కెమిస్ట్రీ చూస్తే వారితో మ‌నం ప్రేమ‌లో ప‌డ‌కుండా ఉండ‌లేం. అయితే గురుద్వారాలో నేహ‌, రోహ‌న్‌ప్రీత్ వివాహ క్ర‌తువుకు సంబంధించిన‌ లేటెస్ట్ వీడియోలు ప్రేమ‌, వివాహంలోని స్వ‌చ్ఛ‌త‌ను తెలియ‌జేస్తాయి. ఆ వీడియోల‌లో త‌మ కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వైవాహిక ఆచారాల‌ను పాటిస్తూ నిల్చున్న ఆ జంట‌ను మ‌నం చూడొచ్చు. అంత‌కు ముందు త‌న మెహందీ వేడుక‌లో కాబోయే భ‌ర్త రోహ‌న్‌ప్రీత్‌తో క‌లిసున్న కొన్ని అంద‌మైన పిక్చ‌ర్ల‌ను నేహా క‌క్క‌ర్ షేర్ చేసింది. వాటిలో ఆకుప‌చ్చ రంగుల్లోని దుస్తుల‌తో ఆ ఇద్ద‌రూ ముచ్చ‌ట‌గా క‌నిపిస్తున్నారు. ఇంకో పిక్చ‌ర్‌లో మెహందీ వేసుకొని ఉన్న చేతుల‌ను చూపిస్తోంది నేహ‌. ఉంగ‌రం వేలికి 'రోహ‌న్' అనే పేరు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు.
  జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర పోషించిన 'మిస్ ఇండియా' మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. 'పెంగ్విన్' సినిమా త‌ర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల‌వుతున్న కీర్తి రెండో సినిమా ఇది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను నెట్‌ఫ్లిక్స్ శ‌నివారం విడుద‌ల చేసింది. ఫిమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా త‌యారైన ఈ సినిమాలో సంయుక్త అనే క్యారెక్ట‌ర్ పోషించింది కీర్తి. తాను బిజినెస్ చేయ‌డానికే పుట్టాన‌ని న‌మ్మే అమ్మాయి సంయుక్త‌. కానీ ఆమె డ్రీమ్‌కు త‌ల్లి అడ్డు చెబుతుంది. త‌ర్వాత ప‌ట్టుద‌ల‌తో చాయ్ బిజినెస్‌లోకి అడుగుపెడుతుంది సంయుక్త‌. ఒక కుటుంబం ఆమెకు స‌పోర్ట్‌గా నిలుస్తుంది. ఇండియ‌న్ చాయ్‌ను 'మిస్ ఇండియా' అనే బ్రాండ్ పేరుతో ఇంట‌ర్నేష‌న‌ల్ ప్లాట్‌ఫామ్‌పై అమ్మేందుకు అన్ని ర‌కాల ప్లాన్స్ సిద్ధం చేసుకుంటుంది. అన్ని చోట్లా ఉన్న‌ట్లే బిజినెస్ రంగంలోనూ రాబందులు ఉంటాయి. "బిజినెస్ అంటే ఆడ‌పిల్ల‌లు ఆడుకొనే ఆట‌కాదు.. బిజినెస్ ఈజ్ ఎ వార్" అంటూ ఓ బిజినెస్ టైకూన్ (జ‌గ‌ప‌తిబాబు) ఆమెకు ఆటంకాలు సృష్టిస్తాడు. సంయుక్త రోల్‌లో కీర్తి చాలా ప్రామిసింగ్‌, కాన్ఫిడెంట్‌గా క‌నిపిస్తోంది. ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని అన్‌స్టాప‌బుల్‌గా మార్చే అమ్మాయిగా కీర్తి న‌ట‌న‌ను చూసి తీరాల్సిందే అన్న‌ట్లుంది. ఆమెను బిజినెస్‌లో ప‌డెయ్యాల‌ని చూసే టైకూన్‌గా జ‌గ‌ప‌తిబాబు ఎప్ప‌టిలా త‌న‌దైన విల‌నీని ప్ర‌ద‌ర్శించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. కీర్తి త‌ల్లిగా న‌దియా న‌టించిన ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర‌, న‌రేశ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, క‌మ‌ల్ కామ‌రాజు ప్రామినెంట్ రోల్స్ చేశారు. న‌రేంద్ర‌నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మించారు. న‌వంబ‌ర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతున్న‌ట్లు ట్రైల‌ర్ ధ్రువీక‌రించింది.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నటుడిగా మారుతున్నారని టాలీవుడ్ టాక్. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. ఒకప్పుడు మౌనమునిగా పేరుండేది. స్టేజి మీద రెండు మూడు ముక్కలు మాట్లాడటానికి విముఖత చూపించే ఆయన, తరువాత ఒక టీవీ షో చేశారు. త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం.  రాఘవేంద్రరావు హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నదని సమాచారం. అయితే, రాఘవేంద్రుడిని ఎలా ఒప్పించారనేది ప్రస్తుతానికి ఎవరికీ అంతుచిక్కని రహస్యమే. ఆ సినిమాలో ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు రమ్యకృష్ణ, శ్రియ, త్రిష నటించనున్నారని టాక్. అయితే అగ్రిమెంట్ల మీద ఇంకా సంతకాలు చేయలేదట. రాఘవేంద్రరావు అంటే రమ్యకృష్ణ నో చెప్పే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే... ఆయన దర్శకత్వంలో బోలెడు హిట్ సినిమాలు చేశారు. మిగతా ఇద్దరూ ఆయన దర్శకత్వంలో సినిమాలు చేశారు. అయితే, ఆయన సరసన చేస్తారా? లేదా? అనేది చూడాలి.
అమెరికా వీసాలు సకాలంలో రాకపోవడం వలన 'సర్కారు వారి పాట' చిత్రీకరణ ఆలస్యంగా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలలో అమెరికాలో ప్రారంభించాలని అనుకున్నారు. వీసాల కోసం అప్లై చేశారు. కానీ, అవి రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు టోటల్ షూటింగ్ షెడ్యూల్ చేంజ్ చేశారట.  కొత్త ఏడాదిలో 'సర్కారు వారి పాట' షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. బహుశా... జనవరి 2వ తేదీ నుండి మొదలు కావచ్చు. సుమారు 45 రోజుల పాటు జనవరి 2 నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు అక్కడే చిత్రీకరణ చేస్తారట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటించనున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. 'గీత గోవిందం' విజయం తరువాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక పని చేస్తుంటారు. అయితే... కొన్నాళ్ల క్రితం 'మత్తు వదలరా' సినిమా వచ్చే వరకూ వాళ్లింటి నుండి హీరోగా ఎవరూ లేరు. ఆ లోటును కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా తీర్చాడు. ఇంటి బిడ్డకు నటన మీద ఆసక్తి ఉందని కీరవాణి ఫ్యామిలీ ఫక్తు హీరోయిజం ఉన్న సినిమాతో పరిచయం చేయలేదు. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయిచారు. 'మత్తు వదలరా' సినిమాకి మంచి పేరు వచ్చింది. అలాగని, వెంటనే శ్రీ సింహా మరో సినిమా చేయలేదు. మంచి కథ కోసం ఎదురు చూశాడు. అటువంటి కథ దొరికిందని సమాచారం.  లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... శ్రీ సింహ హీరోగా కీరవాణి కుటుంబానికి సన్నిహితుడైన నిర్మాత సాయి కొర్రపాటి ఓ సినిమా చేయనున్నారు. 'కలర్ ఫోటో' నిర్మాతలలో ఒకరైన బెన్నీ ముప్పానేనితో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. ఈసారీ కొత్త దర్శకుడు చెప్పిన కథకు కీరవాణి కుటుంబం ఓటు వేసింది. దసరాకి ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సినిమా ప్లాన్ చేస్తున్నారు.
ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్ కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సిటీలోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం గురువారం నాడు ఆయనను ఐసీయూలో ఉంచి నాన్-ఇన్వేజివ్ వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నట్టు హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తాజాగా శనివారం మధ్యాహ్నం మరో బెర్త్ బులిటెన్ విడుదల చేశాయి. రాజశేఖర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అందులో పేర్కొన్నారు. యాంగ్రీ స్టార్ చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు.  కరోనాతో సిటీ న్యూరో హాస్పిటల్ లో చేరిన రాజశేఖర్ భార్య జీవితను డిశ్చార్జ్ చేసినట్టు హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. ఆమెకు కొవిడ్-19 టెస్ట్ చేయగా, రిజల్ట్ నెగెటివ్ వచ్చినట్టు తెలిపాయి. డాక్టర్ కృష్ణ నేతృత్వంలోని వైద్య బృందం తమ తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని, ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉందని రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక పేర్కొన్నారు. 
‘అమరావతి అవమానం’ మోదీదా? బీజేపీదా?   బీజేపీ-టీడీపీ భాగస్వాములే   బాబు జాగే కొంప ముంచింది   కులం కోణంలో జగన్ నిర్ణయాలు   అనాధగా మారిన అమరావతి   కడకు దిక్కయిన కోర్టులు   విభజన నుంచి ఇప్పటివరకూ.. దేశంలో  రాజధాని నగరం లేని, ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో పురోగమిస్తుంటే, ఏపీ మాత్రం అనాధగా దిక్కులు చూస్తున్న విషాదం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ,  అక్కడి రైతులు చేస్తున్న ఉద్యమానికి మూడొందల రోజులు దాటిపోయాయి. నాటి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు-హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో.. అమరావతిలో భూమి పూజ చేసిన ప్రాంతం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది.  సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతిని కులం కోణంలో చూసి, ‘మూడు ముక్కలాట’కు తెరలేపడమే.. ఈ విషాదానికి అసలు కారణమన్నది బహిరంగ రహస్యం. ఒక్క జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు.. అటు బీజేపీ, ఇటు టీడీపీ.. అంతా కలసి, అమరావతిని అనాధను చేశారన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ.   విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. శివరామకృష్ణన్ కమిటీ, దాని పర్యటనలు, ప్రజాభిప్రాయసేకరణ, దొనకొండలో రాజధానిని పెట్టాలని కొందరు, నూజివీడు అయితే బాగుంటుందని మరికొందరి సూచనల తర్వాత.. నాటి సీఎం చంద్రబాబు నాయుడు ‘నారాయణ కమిటీ’ని తెరపైకి తీసుకువచ్చారు. కసరత్తులన్నీ పూర్తయ్యాక, అమరావతిని రాజధానిగా తేల్చారు. దానికోసం 32 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. వారిచ్చిన భూమునే పెట్టుబడిగా పెట్టి, మరికొంత కేంద్రసాయంతో రాజధాని నగరాన్ని నిర్మిస్తామని బాబు ప్రకటించారు. ఆ మేరకు రైతులకు కౌలుతోపాటు, కమర్షియల్ ప్లాట్లను కూడా ఇచ్చారు. కేంద్రం కూడా 7 వేల కోట్ల నిధులిచ్చిందని, ఆ డబ్బెక్కడికి పోయిందని సోము వీర్రాజు కొంతకాలం నుంచీ ప్రశ్నిస్తున్నారు. కానీ, అప్పటి సర్కారులో బీజేపీ కూడా భాగస్వామి అన్న వాస్తవాన్ని వీర్రాజు విస్మరించడం ఆశ్చర్యం.   జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, మూడు రాజధానులకు తెరలేపడంతో,  అమరావతి కథ అర్ధంతరంగా ఆగిపోయింది. అక్కడ కమ్మ వర్గానికి చెందిన వారి భూములే.. ఎక్కువగా ఉన్నాయన్న అనుమానంతోనే, జగన్మోహన్‌రెడ్డి చూపు.. అమరావతి నుంచి విశాఖకు మళ్లింది. నాడు అక్కడ శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, ఇప్పుడు మౌనమునిగా మారారు. అమరావతిపై మీడియాలో మాట్లాడవద్దని బీజేపీ నాయకత్వం, నేతలకు లక్ష్మణరేఖ గీసింది. అధికారంలో ఉన్నప్పుడు మీనమేషాలు, తాత్కాలిక కట్టడాలతో పేరుతో పబ్లిసీటీ చేసుకున్న చంద్రబాబు..  చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు అమరావతి జపం చేస్తున్నారు. ఆ రకంగా అంతా కలసి, అమరావతిని అనాధను చేశారు. అందుకే ఈ పాపం అందరిన్నది ఆంధ్రుల ఆరోపణ.   పాపం అమరావతి! నిలువెత్తు బుద్దవిగ్రహం సాక్షిగా, ఇప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులు.. మంత్రులతో అమ్మనాబూతులు తిట్టించుకుంటున్నారు. ధర్మాన కృష్ణదాస్‌అనే మంత్రి, రైతులను లం.. కొడుకులంటారు. మరికొందరు మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులంటారు. ఇంకొందరు మంత్రులు, టీ షర్టులేసుకుని ఉద్యమాలు చేస్తున్నారంటారు.  మరికొందరు అది ‘కమ్మ’రావతి అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తారు. స్పీకర్ లాంటి వ్యక్తి దానిని ఎడారి, శ్మశానంతో పోలుస్తారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, వాటిని భరిస్తూ, సహిస్తూ, జైళ్లకు వెళ్లినా.. తమ ఉద్యమాన్ని 300 రోజులు దాటించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల పాపం పుణ్యాన, అనాధగా మారిన అమరావతి.. న్యాయం కోసం న్యాయస్థానం వైపు రోడ్డుకు మోకాళ్లు ఆనించి, దీనంగా చూస్తోంది.   మోదీ ప్రధాని హోదాలో వచ్చి శంకుస్థాపన చేశారు. ఢిల్లీని మించిన రాజధానిగా మారాలన్నారు. ఢిల్లీ కూడా చిన్నబోయేలా కొత్త నగరం ఉండాలన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరాలను, సందర్శించమని సలహా కూడా ఇచ్చారు. మేం మీ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు.  కాబట్టి బీజేపీ అమరావతి నగరాన్ని,  వాయువేగంతో నిర్మిస్తుందని భావించారు. ఆ తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కూడా కేటాయించారు. దానితో ఇంకేముంది? అమరావతి నగర నిర్మాణం, పంచకల్యాణి గుర్రంలా పరుగులు పెడుతుందనుకున్నారు.  కానీ చంద్రబాబుతో దొస్తీ చెడటంతో, బీజేపీ తీరు కూడా మారింది. దానికితోడు నిర్మాణాల తాలూకు డీపీఆర్ కూడా కేంద్రానికి ఇవ్వలేదు. అప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ హయాంలో అమరావతికి అనుకూలంగానే తీర్మానించారు. ఆయన కూడా రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. మౌనదీక్ష నిర్వహించారు. ఇప్పుడు పరిస్థితి అందుకు రివర్సు. బీజేపీలో అమరావతి గురించి ఎవరు మాట్లాడితే, వారిపై వేటు వేస్తున్నారు.   ఈలోగా.. ఒక జీవీఎల్, ఇంకో సోము, ఇప్పుడు విష్ణువర్దన్‌రెడ్డి రూపంలో వెలువడిన అపశకునాల బట్టి, అమరావతికి కమలం పార్టీ కూడా శల్యసారథ్యం వహిస్తోందని స్పష్టమయింది. పైగా రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఏమీ లేదని, అఫిడవిట్ ఇచ్చింది. దీన్నిబట్టి.. మెడ మీద తల ఉన్న ఎవరైనా, అమరావతి అంశంలో జగన్ దారిలోనే.. బీజేపీ వెళుతోందన్న విషయం అర్ధమయి తీరాలి. అందుకే అమరావతి రైతులు ఢిల్లీలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినా, అక్కడే ఉన్న మోదీ నుంచి ఒక్కమాట కూడా రాలేదంటే.. ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏమిటన్నది సుస్పష్టం.   ఇక అమరావతి పాపంలో, చంద్రబాబుదే సింహభాగమన్నది.. ఈ పరిస్థితి-దుస్థితి అనుభవిస్తున్న వారి మాట. అధికారంలో ఉన్నప్పుడు గెజిట్‌లో అమరావతిని చేర్చకుండా.. డిజైన్లు, అత్యుత్తమ రాజధానుల సందర్శనల పేరిట చేసిన,  ప్రచారంతో కూడిన కాలయాపనే ఈ పరిస్థితికి మూలం అన్నది,  మెజారిటీ వర్గాల అభిప్రాయం. తాత్కాలిక నిర్మాణాలతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టే యోచన, పూర్తి స్థాయి నిర్మాణాలకు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు జగన్ దానిపై దృష్టి సారించే అవకాశం కూడా ఉండేది కాదన్నది వారి వాదన. నిజమే కదా మరి? తాత్కాలిక సచివాలయం పేరుతో బాబు, బడా కాంట్రాక్టరుకు సర్కారు భూమి ఇచ్చి మరీ, వందల కోట్లు సమర్పించుకున్నారు. సదరు కంపెనీ నిర్మించిన సచివాలయం ఖరీదు, హైదరాబాద్‌లో నిర్మించే భవనాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు.   నెల్లూరు నారాయణ సారథ్యంలో జరిగిన ఈ వ్యవహారంలో.. కాంట్రాక్టర్లు, వారిచ్చే కమిషన్లతో  టీడీపీ లాభపడితే, పూర్తిగా నష్టపోయింది మాత్రం రైతులేనంటున్నారు. విభజన జరిగిన వెంటనే చంద్రబాబు మేల్కొని, బెజవాడకు వచ్చి పూర్తి స్థాయి నిర్మాణాలు చేయని పాపమే.. ఇప్పుడు రైతులకు శాపమైంది. అదే  జగన్ మూడురాజధానుల ఆలోచనకు, ఊపిరిపోసిందనేది మెజారిటీ వర్గాల నిశ్చితాభిప్రాయం. అటు.. అమరావతిని ‘కమ్మ’రావతిగా ప్రచారం చేసిన వైసీపీ నేతలు, ఇప్పటివరకూ దానిని నిరూపించలేకపోయారు. అటు టీడీపీ కూడా, దానిని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేయకుండా.. నారాయణ, పుల్లారావు వంటి భూములు కొన్న  నేతలను కాపాడేందుకే ప్రాధాన్యమిచ్చింది. అమరావతి నిర్మాణ సమయంలో, నానా హడావిడి చేసిన ‘నారాయణ మాస్టారు’ ఇప్పుడు,  ఏ కలుగులో దాగున్నారో ఎవరికీ తెలియదు.   నగర నిర్మాణం అవుతుందో లేదో తెలియని అయోమయం.. మూడు పంటలు పండే భూములిచ్చి.. ఇప్పుడు నెత్తిన చేయి పట్టుకున్న రైతులే, అమరావతిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సర్కారుకు.. ఎదురొడ్డి పోరాడుతున్న వేలాది మంది రైతులు, వారి పక్షాన పోరాడుతున్న ఒక సుంకర పద్మశ్రీ, మరో వెగలపూడి గోపాలకృష్ణ ప్రసాద్, పువ్వాడ సుధాకర్, ఇంకో మార్టిన్, కంభంపాటి శిరీష, దుర్గాభవానీ, అక్కినేని వనజ వంటి జేఏసీ నేతలే, ఇప్పుడు అమరావతి కథలో హీరోలు. మరి వారంతా హీరోలయితే.. మోదీ-చంద్రబాబు-జగన్‌తోపాటు, అమరావతి గ్రామాలలో వీరవిహారం చేసి.. ఆడబిడ్డ తెచ్చుకున్న టిఫిన్ బాక్సులో ఉప్మా తిని, చివరాఖరకు కమలంతో చేతులు కలిపి.. ఇప్పుడు ఉద్యమాన్ని కాడికిందపడేసిన,  జనసేన వీరుడు పవన్ సంగతేమిటన్న సందేహం రావచ్చు.  ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కు! అది మీ ఇష్టం!! -మార్తి సుబ్రహ్మణ్యం
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. సాంకేతిక టెక్నాలజీ వినియోగిస్తూ కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులే టాప్.. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా గుర్తించే పరిజ్ఞానం మన పోలీసుల సొంతం.. ఇవి గత ఐదేండ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు.  గొప్పగా చేసుకుంటున్న ప్రచారాలు. గత ఆరేండ్లలో పోలీస్ శాఖకు భారీగా నిధులిచ్చామని, హైటెక్ సౌకర్యాలు కల్పించామని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెబుతుంటారు. కాని ఒక్క ఘటన తెలంగాణ పోలీసుల సత్తాకు సవాల్ గా నిలిచింది. మహబూబా బాద్ కిడ్నాప్ కేసు తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశ్నించేలా మారింది. తెలంగాణ కాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిహసించేలా చేస్తోంది.    మహబూబా బాద్ లో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసుల తీరుపై చాలా ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. హైటెక్ టెక్నాలజీ ఉన్న రోజుల్లోనూ కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం ఏంటనే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా కిడ్నాపర్లు డబ్బుల కోసం బాలుడి పేరెంట్స్ తో మాట్లాడుతూనే ఉన్నారు. బాలుడి పేరెంట్స్ చుట్టే  పోలీసులు తిరిగారు. కిడ్నాపర్ల ఫోన్లను పోలీసులు కూడా విన్నారు. అయినా వారెవరో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో , కిడ్నాపర్లు ఫోన్ మాట్లాడుతున్న లొకేషన్ ఏంటో వెంటనే కనిపెట్టలేకపోయారు. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లొకేషన్ ను మినిట్ టు మినిట్ ట్రేస్ చేసే టెక్నాలజీ ఉన్న ప్రస్తుత సమయంలో ... మహబూబా బాద్  పోలీసులకు కిడ్నాపర్లను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రజల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న గొప్ప టెక్నాలజీ ఎక్కడ పోయిందని వారు ప్రశ్నిస్తున్నారు.    ఆదివారం సాయంత్రం దీక్షిత్ రెడ్డి కనిపించకుండా పోయారు. అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. డబ్బుల కోసం కిడ్నాపర్ సోమవారం బాలుడి పేరెంట్స్ కు 11 సార్లు ఫోన్ చేశారని చెబుతున్నారు. మంగళవారం సైలెంట్ గా ఉన్న అగంతకులు బుధవారం మళ్లీ బాలుడి పేరెంట్స్ తో టచ్ లోకి వచ్చారు. డబ్బులు ఇవ్వాలని, ఇక్కడికి రావాలని, డబ్బును అక్కడ పెట్టి వెళ్లండని ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. అయినా ఐదు రోజులుగా బాలుడి కోసం వెతుకుతున్న పోలీసులు మాత్రం కిడ్నాపర్ల జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా కిడ్నాపర్లు ఫోన్ లో మాట్లాడుతున్నా గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీక్షిత్ రెడ్డి కేసులో మహబూబా బాద్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.   అయితే మహబూబా బాద్ ఎస్పీ కోటిరెడ్డి మాత్రం కేసులో తామెక్కడ నిర్లక్ష్యం వహించలేదని చెప్పారు. కిడ్నాపర్ చాలా తెలివిగా వ్యవహరించాడని, తనను ట్రేస్ చేయకుండా ఉండటానికి ఫోన్ వాడలేదని తెలిపారు. బాలుడి పేరెంట్స్ కు ఇంటర్ నెట్ కాల్స్ చేశారని ఎస్పీ వెల్లడించారు. యాప్ ద్వారా ఇంటర్ నెట్ కాల్స్ చేయడం వల్లే కిడ్నాపర్ ను గుర్తించడం వెంటనే సాధ్యం కాలేదన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ సాయంతో కిడ్నాపర్ వాడిన యాప్ ను గుర్తించి.. అతని మార్గంలోనే యాప్ సాయంతోనే గుర్తించామని చెప్పుకొచ్చారు. కిడ్నాపర్ యాప్ వాడటం వల్లే గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టిందని ఎస్పీ తెలిపారు. అయితే ఎస్పీ ప్రకటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ జనాలే హైటెక్ టెక్నాలజీని  ఉపయోగిస్తూ డిజిటల్ వండర్స్ చేస్తున్నారు. పోలీసుల దగ్గర మరింత అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. అయినా యాప్ ద్వారా మాట్లాడుతున్న కిడ్నాపర్ ను వెంటనే గుర్తించే టెక్నాలజీ లేకపోవడం ఏంటనే విమర్శలు జనాల నుంచి వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగంలో  పూర్ గా ఉన్న ఈ పోలీసులనే .. దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ చెబుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.    మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోనే దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ జరిగింది. బాలుడిని బైక్ పై తీసుకుని దర్జాగా వెళ్లాడు కిడ్నాపర్. కాని ఎక్కడా సీసీ టీవీలో అవి రికార్డు కాలేదు. అంటే మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో సీసీ కెెమెరాలు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయని దీన్ని బట్టి అర్ధమవుతోంది. అందుకే కిడ్నాపర్ విజువల్స్ ఎక్కడా చిక్కలేదని, పట్టణ శివారులోని ఒక ప్రాంతంలోనే అతడి విజువల్ రికార్డైందని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయం చెప్పాడు. అయితే జిల్లా కేంద్రంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు సరిగ్గా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కెమెరాలు ఎక్కడ అమర్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రాామాలు, పల్లెల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.    ఐదేండ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో మిస్సైన బాలుడిని ఇటీవలే అసోంలోని గోలపారాలో గుర్తించి త‌ల్లిదండ్రుల చెంత‌కు చేర్చారు. తెలంగాణ స్టేట్ పోలీసులు అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద‌ర్ప‌న్ ద్వారా ఇది సాకార‌మైందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ద‌ర్ప‌న్ ద్వారా తెలంగాణ పోలీసులు బాలుడిని గుర్తించి ఆచూకీని క‌నుగొన్నారని ఆయన తెలిపారు. ఇంతటి టెక్నాలజీ ఉన్న తెలంగాణ పోలీసులు.. ఫోన్ లో మాట్లాడుతున్న కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం చర్చనీయాశంగా మారింది. మొత్తంగా మహబూబా బాద్ ఘటన తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు మచ్చగా, సీఎం కేసీఆర్ గొప్పగా చేసుకుంటున్న ప్రచారానికి గండి కొట్టేదిగా మారిందనే చర్చే జనాల్లో ఎక్కువగా జరుగుతోంది.
అచ్చెన్నాయుడికే దక్కిన అధ్యక్ష పదవి   నారా-నందమూరి ఫ్యామిలీకి చెరో రెండు   బాబాయ్-అబ్బాయ్, తల్లీ కొడుకులకు చోటు   కళాకు ఒక న్యాయం, రమణకు మరో న్యాయం   కొత్త వారికి పదవులతో పార్టీ పరుగులు   టీడీపీ జాతీయ-రాష్ట్ర కమిటీల తీరిది   ఎట్టకేలకు చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ-రాష్ట్ర కమిటీలు ప్రకటించారు. ఇందులో నారా-నందమూరి కుటుంబాలకు చెరో రెండు పదవులు దక్కగా, బాబాయ్-అబ్ణాయ్, తల్లీ-కొడుకులకు రెండేసి పదవులు లభించాయి. అయితే ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును తొలగించిన నాయకత్వం, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా మాత్రం ఎల్.రమణను కొనసాగించటం ఆశ్చర్యం. పైగా ఇతర కమిటీల్లో ఉన్న వారికి మరో కమిటీలో కూడా స్థానం కల్పించటం పార్టీ శ్రేణులకు విస్మయం కలిగించింది.   చంద్రబాబు ప్రకటించిన పార్టీ జాతీయ-రాష్ట్రాల కమిటీలలో కొత్త వారికి స్థానం కల్పించడం, ముఖ్యంగా యువతకు, బడుగు వర్గాలకు చోటివ్వడం ద్వారా, పార్టీని పరుగులు పెట్టించే వ్యూహం కనిపిస్తోంది. అయితే ఈ కమిటీలో అగ్ర కులానికి సంబంధించి వైశ్య కులానికి ఒకరికి చోటివ్వగా, బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం కనిపించలేదు. తెలంగాణ నుంచి ఒక మహిళా నేతకు బ్రాహ్మణ కోటా నుంచి ఇచ్చారని చెబుతున్నప్పటికీ, ఆమె ఆ సామాజికవర్గానికి చెందిన వారు కాదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. గతంలో శిద్దా రాఘవరావుకు కోశాధికారి ఇవ్వగా, ఇప్పుడు అదే వైశ్య వర్గానికి చెందిన శ్రీరాం తాతయ్యకు ఆ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో వైశ్య జనాభా ఎక్కువగానే ఉన్నా, ఒక్కటే ఇచ్చారు. నిజానికి అధ్యక్ష పదవి దక్కించుకున్న అచ్చెన్నాయుడు పోలినాటి వెలమ కంటే, వైశ్య వర్గం నాలుగింతల సంఖ్య ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం. అయితే, రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న రెడ్డి వర్గానికి కేవలం మూడు పదవులే దక్కడం ప్రస్తావనార్హం. సోమిరెడ్డి, కోట్ల, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి మాత్రమే స్థానం లభించింది. కడప-కర్నూలు-నెల్లూరు-అనంతపురం-చిత్తూరులో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ వర్గం నుంచి ఈసారి పెద్దగా చోటు లభించలేదు. బహుశా రెడ్లు వైసీపీ వైపు ఉంటారన్న భావనతో, సంఖ్య తగ్గించి ఉండవచ్చంటున్నారు. జెసి కుటుంబానికి పదవి ఇస్తామని చెప్పినప్పటికీ, దివాకర్‌రెడ్డి వద్దని తిరస్కరించినట్లు చెబుతున్నారు. మొత్తంగా కమిటీలో, కమ్మ వర్గానికి 9 పదవులు లభించాయి. కేంద్ర కమిటీలోని 27 మందిలో ఓసీలకు 51, మిగిలిన వర్గాలకు 49 శాతం పదవులు దక్కాయి.   ఇక అంతా అనుకున్నట్లే, అచ్చెన్నాయుడుకు ఏపీ అధ్యక్ష పదవి దక్కింది. ఈఎస్‌ఐ అక్రమాల కేసులో ఆయన ఇటీవలే జైలుకు వెళ్లి వచ్చారు. బహుశా ఆ అర్హతతోనే ఆయనకు ఆ పదవి లభించి ఉండవచ్చు. అంటే పార్టీ కోసం జైలుకెళ్లిన వారికి, పార్టీ అండగా ఉంటుందన్న సంకేతాలిచ్చేందుకే, ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి ఉండవచ్చు. జైలుకు వెళ్లి వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకూ పొలిట్‌బ్యూరో దక్కినందున, ఆవిధంగానే భావించాల్సి ఉంది. ఇక చంద్రబాబు ఎలాగూ జాతీయ అధ్యక్షుడు. లోకేష్‌కు మళ్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. అయితే, బాబు వియ్యంకుడయిన నందమూరి బాలకృష్ణకు పొలిట్‌బ్యూరో, నందమూరి హరికృష్ణ కమార్తె సుహాసినీకి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు దక్కడం ద్వారా, నారా-నందమూరి కోటాలు భర్తీ చేసినట్టయింది.   అయితే, జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో నరా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డిలలో.. ఒక్క నారా లోకేష్‌కు మాత్రమే, సెంట్రల్ కమిటీ నుంచి పొలిట్‌బ్యూరో ఎక్స్‌అఫిషియో సభ్యుడి అయ్యే అవకాశం లభించింది. జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన రామయ్యకు పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించి, మళ్లీ అదే పోలిట్‌బ్యూరోలో లోకేష్‌కు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా అవకాశం లభించడం ప్రస్తావనార్హం. గల్లా అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి, ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌కు పొలిట్‌బ్యూరో పదవి లభించింది.   ఇక ఈసారి కొత్తగా రాజకీయ కార్యదర్శి పదవి సృష్టించి, దానిని టిడి జనార్దన్‌కు ఇవ్వగా, కార్యాలయ కార్యదర్శి పదవి అశోక్‌బాబుకు లభించింది. దానిని గతంలో ఏవి రమణ నిర్వహించేవారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి జాతీయ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత బుచ్చయ్యచౌదరికి పొలిట్‌బ్యూరో, ఇటీవలి కాలంలో దూకుడుగా వెళతూ సర్కారుకు చెమటలు పట్టిస్తున్న పట్టాభికి జాతీయ అధికార ప్రతినిధి పదవులు దక్కడం విశేషం. కొత్త కమిటీలో ప్రధానంగా పట్టాభికి కీలక స్థానం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే తెలంగాణ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న జోత్స్నకు మళ్లీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనితకు పొలిట్‌బ్యూరోలో, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వర్ల రామయ్యకు మళ్లీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అవకాశం లభించడం ప్రస్తావనార్హం. ఇది జాబితా కూర్పులో పొరపాటు జరిగిందా లేక, జాబితానే ఆవిధంగా రూపొందించారో తెలియదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.     ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఎల్.రమణను మళ్లీ  కొనసాగించడం చర్చనీయాంశమయింది. విఫల నాయకుడిగా పార్టీలో ఇబ్బంది పడుతున్న ఆయనను కొనసాగించడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రమణ స్థాయిలో చెప్పింది వినే నాయకుడు లేకపోవడమే బహుశా ఆయన కొనసాగింపునకు కారణం కావచ్చంటున్నారు. మరి ఏపీలో కళా వెంకట్రావును ఏ ప్రాతిపదిక తొలగించి, తెలంగాణలో ఏ ప్రాతిపదికన రమణను కొనసాగించారో అర్ధం కావడం లేదంటున్నారు. ఇంకా కనీసం వెంకట్రావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. టీడీపీకి 23 స్థానాలయినా వచ్చాయని, కానీ రమణ సారథ్యంలో పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేస్తున్నారు. పైగా రమణపై తెలంగాణ పార్టీ  నేతలంతా తిరుగుబాటు చేసినా, బాబు ఆయననే కొనసాగించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.   అయితే, తెలంగాణ నుంచి సీనియర్ నేత అరవిందకుమార్ గౌడ్‌కు పొలిట్‌బ్యూరో, జాతీయ అధికార ప్రతినిధిగా నర్శిరెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి- బక్కని నర్శింహులుకు జాతీయ ప్రధాన కార్యదర్శి, మెచ్చా నాగేశ్వరరావుకు జాతీయ ఉపాధ్యక్ష పదవులివ్వడం ద్వారా, తెలంగాణకు పెద్దపీట వేసినట్టయింది. ఎలాగూ రావుల పోలిట్‌బ్యూరోలోనే కొనసాగుతున్నారు. కానీ, రమణను అధ్యక్ష పదవి తొలగించకుండా, కొసాగించడం ద్వారా.. తెలంగాణలో పార్టీకి ఆయన తప్ప మరో దిక్కు, సమర్ధులు లేరన్న సంకేతం పంపినట్టయింది.   అయితే ఏపీలో అచ్చెన్నాయుడు, తెలంగాణలో రమణ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ.. వారికెవరికీ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి అధ్యక్షులుగా ఎవరున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు-లోకేష్ దిశానిర్దేశంలోనే పనిచేయాలి కాబట్టి.. ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఒకటేనని స్పష్టం చేస్తున్నారు. ఈసారి పితాని, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, నక్కా ఆనందబాబు వంటి వారికి స్ధానం కల్పించడం అభినందనీయమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, దూకుడుగా వెళ్లే ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్‌కు ఎక్కడా చోటు లభించకపోవడం చర్చనీయాంశమయింది. ఒకవేళ పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్ ఇచ్చినందున ఆయనకు పదవి ఇవ్వలేదనుకున్నా.. మరి టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడికి, అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  -మార్తి సుబ్రహ్మణ్యం
హైద‌రాబాద్ వరద ముంపు బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం ప్రకటించారు. నగరంలో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. పేద‌ల‌కు సాయం అందించ‌డం కోసం మున్సిప‌ల్ శాఖ‌కు ప్ర‌భుత్వం రూ. 550 కోట్లు త‌క్ష‌ణం విడుద‌ల చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. ల‌క్ష చొప్పున, పాక్షికంగా దెబ్బ‌తిన్న ఇండ్ల‌కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు.    భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల హైద‌రాబాద్ న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జలు ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు గుర‌య్యార‌ని, వారిని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌ర‌ద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్ల‌ల్లో నివ‌సిస్తున్న వారు ఎంతో న‌ష్ట‌పోయార‌ని, ఇళ్ల‌లోకి నీళ్లు రావ‌డం వ‌ల్ల బియ్యం స‌హా ఇత‌ర ఆహార ప‌దార్థాలు త‌డిసిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దెబ్బ‌తిన్న ర‌హ‌దారులు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి, మ‌ళ్లీ మ‌మూలు జీవ‌న ప‌రిస్థితులు నెల‌కొనేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.    గ‌డిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసిందన్నారు కేసీఆర్. ప్రజలు అనేక కష్ట, నష్టాలకు గురయ్యారు.. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీలలో ఉండే వారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువ కష్టాల పాలయ్యారు.వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని చెప్పారు. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన భాద్యత ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.    నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలని సూచించారు. నష్టపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నా సరే, లక్షల మందికైనా సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.    హైదరాబాద్ లో మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందించాలని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
అంతన్నారు.. ఇంతన్నారు.. రాష్ట్ర సర్కార్ అంతు తేలుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యమన్నారు. కాని ఇప్పుడు మాత్రం తుస్సుమంటున్నారు. 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ఉనికే..  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. పార్టీ కొత్త బాస్ సోము వీర్రాజు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ఎక్కడున్నారో పార్టీ నేతలకే తెలియడం లేదట. సోము తీరుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ కేడర్ లో ఆందోళన నెలకొంది. పార్టీ భవిష్యత్ పై కమలం నేతల్లో కలకరం కనిపిస్తోంది.     ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చాలా సమస్యలున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జనాలు అల్లాడిపోతున్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. జగన్ సర్కార్ తమను పట్టించుకోవడం లేదని, కనీసా సాయం కూడా చేయడం లేదని వరద బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే  ప్రతిపక్ష పార్టీగా ప్రజలు సమస్యలపై పోరాడాల్సిన బీజేపీ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. బీజేపీ ముఖ్య నేతలెవరు మాట్లాడటం లేదు. వరద బాధితులకు బాసటగా సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం లేదు. కొన్ని రోజులుగా సోము వీర్రాజు ముఖమే కనిపించడం లేదు. బీజేపీ ముఖ్య నేతల తీరుపై జనాలు ఫైరవుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో లేకుండా పోవడమేంటనీ ప్రశ్నిస్తున్నారు.    సోము వీర్రాజు మొదటి నుంచి వైసీపీకి ఫేవర్ గానే ఉన్నారు. వరదల విషయంలో జగన్ సర్కార్ విఫలమైందని జనాలు ఆరోపిస్తున్నారు. దీంతో వరదలపై మాట్లాడితే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుందనే ఆయన సైలెంట్ గా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీర్రాజుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రమంతా సమస్యల్లో ఉంటే మాట్లాడకపోవడం ఏంటనీ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారట. కన్నా లక్ష్మినారాయణ పార్టీ చీఫ్ గా ఉండగా... ఆయన అన్ని అంశాలపై వెంటనే స్పందించేవారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేవారు. ప్రజలకు అండగా ప్రభుత్వంపై ఘాటు ప్రకటనలు చేసేవారు. కాని కొన్ని రోజులుగా బీజేపీలో అలాంటి సీన్ కనిపించడం లేదు. దీనిపైనే ఏపీ బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కన్నాతో పోలుస్తూ వీర్రాజు తీరుపై చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు.    తిరుమల విషయంలోనూ జగన్ సర్కార్ వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీ నిర్ణయాలపై భక్తులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాని హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీ మాత్రం టీటీడీ నిర్ణయాలపై మాట్లాడటం లేదు. టీటీడీ డిక్లరేషన్ విషయంలోనూ సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రమంతా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేసిన పార్టీ చీఫ్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. టీటీడీ వివాదాస్పద నిర్ణయాలపై బీజేపీ అధ్యక్షుడు మాట్లాడకపోవడంపై  హిందూ సంఘాలు విస్మయ వ్యక్తం చేస్తున్నాయి. సోము వీర్రాజు సహా కొత్త కార్యవర్గం తీరు బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.   ఇక బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డి బహిరంగంగానే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొన్ని రోజులుగా విష్ణువర్దన్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలతో ఆయన బీజేపీ లీడరా.. వైసీపీ నాయకుడో అర్ధం కావడం లేదని కొందరు కమలం నేతలు అసహనం చేస్తున్నారు. అయినా తీరు మార్చుకోని విష్ణువర్దన్ రెడ్డి.. ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించే సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ను సమర్ధించడం కమలనాధుల్లోనే కలకలం రేపుతోంది. అది కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ జగన్ రాసిన లేఖకు మద్దతుగా ఆయన మాట్లాడటం బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. ప్రధాని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిత్యం వాదించే, కోర్టుల్లో పిటిషన్లు వేసే న్యాయవాదిని.. వైసీపీ కోసం సమర్ధించడంపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.      సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిల వైఖరితో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉందా లేక అధికార పార్టీలో కలిసిపోయిందా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ విపక్ష పార్టీగా పని చేస్తోందో లేక వైసీపీకి బీ టీమ్ గా మారిందో తెలియడం లేదని కొందరు కమలం నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి నేతలతో పార్టీ బలోపేతం కావడం కలేనని.. రోజు రోజుకు బలహీన పడి ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుందని మరికొందరు తేల్చి చెబుతున్నారు. కేంద్రంలో అధికారం ఉండటంతో.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ఈజీ. కాని ఏపీ బీజేపీ ముఖ్యనేతలు మాత్రం అధికార పార్టీ మోజుతో పార్టీని నాశనం చేస్తున్నారనే ఆరోపణలు కార్యకర్తల నుంచి వస్తున్నాయి. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిల తీరుతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ హోం క్వారంటైన్ లో ఉందనే చర్చ ఏపీ జనాల్లోనూ జోరుగా సాగుతోంది. మరీ హోం క్వారంటైన్ నుంచి త్వరగా బయటికి వస్తారో లేక వైసీపీ సేవలో తరిస్తూ బీజేపీని బొంద పెడతారో చూడాలని కొందకు బీజేపీ నేతలు కామంట్ చేస్తున్నారు.
స్కూలు పిల్లలకు మతం-కులం లేదు   పాఠశాలలో కుల-మత నమోదుకు పాతర   139 కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు   వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మొండితనానికి, గుండెధైర్యానికి నిలువెత్తు చిరునామా. ఆయనొక సంచలనం. విజయమయినా, వివాదమయినా ఆయన దారే వేరు. ఏదయినా అనుకున్నారంటే చేసేయడమే. జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు.. జనరంజకమన్న ప్రశంసలు, మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తుంటే.. ప్రజావ్యతిరేకమని ఇంకొన్ని వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తుంటాయి. న్యాయవ్యవస్థతో పోరాటానికి తెరలేపిన జగన్.. ఆయనను అభిమానించే వారి దృష్టిలో మాత్రమే కాకుండా, న్యాయవ్యవస్థ లోపాలపై అసంతృప్తితో ఉన్న అనేకమంది దృష్టిలో.. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకుంటున్నారు. మరికొన్ని వర్గాలు మాత్రం సహజంగానే జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. ఇన్ని వైరుధ్యాలు ఉన్నందుకే, దేశం ఇప్పుడు  జగన్మోహన్‌రెడ్డిని ఆసక్తిగా చూస్తోంది. అది సానుకూల కోణమా? వ్యతిరేక కోణమా అన్నది వేరే విషయం!   ఇన్ని సంచలనాలకు కేంద్ర బిందువయిన జగన్మోహన్‌రెడ్డి.. తాజాగా తీసుకున్న రెండు విప్లవాత్మక నిర్ణయాలు, జనం దృష్టిలో ఆయనను హీరోను చేశాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు, రిజిస్టర్‌లో కులం-మతం ప్రస్తావన ఉండకూడదన్న నిర్ణయం... మెజారిటీ ప్రజలనే కాదు, విద్యావంతులు, సమాజహితం కోరుకునే వారిని సైతం మెప్పిస్తోంది. ఇప్పటివరకూ స్కూలు దశ నుంచే కుల-మత భావనలు మొదలయ్యేవి. విద్యార్ధి కులం-మతాన్ని విధిగా ప్రస్తావించాల్సి వచ్చేది. జగన్ సర్కారు తాజాగా ఈ నిబంధనకు పాతరేసింది. రిజిస్టరులో విద్యార్ధి కులం-మతాన్ని పేర్కొనకూడదని ఆదేశించింది.     ఈ నిర్ణయం వల్ల.. పాఠశాల స్థాయి నుంచే మొదలవుతున్న, కుల-మత భావనకు పాతర వేయవచ్చన్న అభిప్రాయం మేధావి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆంధ్రాలో ఇప్పటికే కులభావన తీవ్రస్థాయి నుంచి, ఉన్మాద దశకు చేరుకుంది. విజయవాడ న గరం పరిసర ప్రాంతాల్లో, ఏడాది పాటు ఉండి వచ్చిన ఎవరికయినా.. కుల వ్యవస్థపైనే అసహ్యం పుట్టడం ఖాయం. ఇప్పటికీ అక్కడ కులాల వారీగా ఫంక్షన్లు, స్నేహాలతోపాటు.. కుల ఘర్షణలూ జరుగుతున్న అరాచక సంప్రదాయం కనిపిస్తోంది. వాహనాలపై తమ కులాలను సగర్వంగా ప్రకటించుకునే సంస్కృతి దేశంలో ఒక్క బెజవాడలోనే కనిపిస్తుంటుంది. ఫలానా కులం వారికే ఇల్లు అద్దెకు ఇస్తామన్న దిక్కుమాలిన కులతత్వం దర్శనమిస్తుంటుంది.   నిజానికి ఇలాంటి కుల భావన ప్రారంభం కావడానికి.. పాఠ శాల స్థాయి నుంచి ప్రభుత్వమే, కుల ప్రస్తావన తీసురావడమే కారణం. అందుకే ఆ విధానాన్ని తొలగించాలని గతంలో వామపక్ష ప్రముఖులు, సంఘాలు డిమాండ్ చేసేవి. అయినా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు జగన్ ఆ మార్పు తీసుకురావడాన్ని సాహసోపేత నిర్ణయంగానే భావిస్తున్నారు.   ఇక 139 కులాలకు 56 కార్పొరేషన్లు  ఏర్పాటు చేయడం కూడా, సాహసోపేత నిర్ణయంగానే భావిస్తున్నారు. గత ఎన్నికల ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా, 28 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయితే, వాటిని ఎన్నికల నోటిఫికేషన్ నెల-రెండు నెలల ముందు ఏర్పాటు చేయడంతో, అవి కార్యాచరణకు నోచుకోలేకపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా,  చివరకు చాలామంది పదవీ బాధ్యతలు కూడా తీసుకోలేకపోయారు. మరికొందరు మాకొద్దని రాజీనామా చేశారు. ఇప్పుడు జగన్ ఏకంగా... 139 కులాలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేసి, బడుగుల పెదవులపై చిరునవ్వులు పూయించారు. చంద్రబాబులా ఎన్నికల ముందు కాకుండా.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల ముందు ఏర్పాటుచేయడంతో, అది జగన్ చిత్తశుద్ధిని చాటినట్టయింది.   సహజంగా అరడజను కార్పోరేషన్లు.. అవి కూడా విడతల వారీగా ఏర్పాటుచేసే సంప్రదాయం ఉంది. ఆ సందర్భంగా ఆయా కులాల వారీతో సన్మానాలు చేయించుకోవడం, మళ్లీ కొంత గడువు తర్వాత మరికొన్ని కార్పొరేషన్లు ఏర్పాటుచేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా.. 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడమంటే, అది అసాధారణ అంశమే కాదు. సాహసోపేతం కూడా! ఎందుకంటే వీటి పాలకవర్గాల్లో సగం మంది మహిళలకు కేటాయించడం అభినందనీయమే. ఇందులో ఉప కులాలకూ స్థానం కల్పిస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. ఇప్పటివరకూ దాదాపు అన్ని ప్రభుత్వాలూ యాదవ, శెట్టిబలిజ, తూర్పు కాపు వంటి ప్రధాన బీసీ కులాలకే అన్నింటా ప్రాధాన్యం ఇచ్చేవి. అసలు ఉప కులాల గురించి పట్టించుకున్న పాలకులెవరూ ఇప్పటిదాకా కనిపించలేదు. ఇప్పుడు ఆ లోటును కూడా జగన్మోహన్‌రెడ్డి సర్కారు భర్తీ చేసినట్టయింది. గత 16 నెలల కాలంలో.. 2,71,37,253 మంది బీసీలకు, 33,500 కోట్ల లబ్థి చేకూర్చినట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.   కాగా జగన్మోహన్‌రెడ్డి...  బడుగులకు సంబంధించి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం, టీడీపీ బీసీ ఓటు బ్యాంకుపై ‘పిడుగుపాటు’గానే కనిపిస్తోంది. బీసీల పార్టీగా పేరున్న టీడీపీ.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న కాలంలో,  తన బీసీ మూల సిద్ధాంతాన్ని విస్మరించింది. కాపుల ఓట్ల కోసం, పార్టీకి సంప్రదాయ మద్దతుదారైన బడుగులను పక్కకుపెట్టింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు-బీసీలకు శత్రుత్వం ఉందని తెలిసినా.. కాపులు ముద్రగడ వైపే ఉన్నారని తెలిసినా, పార్టీలోని కొందరు కాపు నేతల ఒత్తిళ్లకు లొంగి, కాపులను బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానితో ఆగ్రహించిన బీసీలు టీడీపీకి వ్యతిరేకంగా మారారు. పోనీ అలాగని రిజర్వేషన్ ప్రకటన సాధించిన కాపులేమైనా, టీడీపీకి ఓటు వేశారా అంటే అదీలేదు. కాపులు కూడా వైసీపీకే జైకొట్టడంతో టీడీపీ పరాజయం పాలవ్వాల్సి వచ్చింది.   దీనితో దిద్దుబాటుకు దిగిన బాబు.. ఈసారి బలమైన బీసీ వర్గానికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేపనిలో ఉన్నారు. పోయిన బీసీ ఓటు బ్యాంకును, తిరిగి సాధించే ప్రణాళిక రూపొందిస్తున్న దశలో... జగన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం, టీడీపీ బీసీ ఓటు బ్యాంకును, వైసీపీ కొల్లగొట్టేదిగానే కనిపిస్తోంది. ఎందుకంటే, 10 లక్షల జనాభా ఉన్న కులాలకు ఏ కేటగిరి, లక్ష నుంచి పది లక్షల వరకూ బి, లక్షలోపు జనాభా ఉన్న కులాలను సి కేటగిరిలో చేర్చారు. అంటే ప్రస్తుతం ప్రతీ బీసీకి ఒక కార్పోరేషన్ ఏర్పాటుచేసినట్టయింది.   ఇప్పటివరకూ ఇవన్నీ బీసీ కార్పొరేషన్ కిందనే ఉండేవి. జగన్ తాజా నిర్ణయంతో, అన్ని బీసీ కులాలకు సొంత కార్పొరేషన్ సమకూరినందున, సహజంగా ఆయా కులాలలో ఇది, జగన్‌పై సానుకూలత పెంచే అంశంగానే భావించక తప్పదు. అయితే... వీటికి బడ్జెట్, లబ్ధిదారులకు ఇచ్చే రుణాలు, పాలకమండలికి కార్యాలయాలు, వాహనాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా ఇంతే దూకుడు ప్రదర్శించకపోతే, కొత్త కార్పోరేషన్ల ఏర్పాటు కంటితుడుపుగానే మిగిలిపోక తప్పదు.  -మార్తి సుబ్రహ్మణ్యం
అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్టే మహిళలు వ్యవసాయరంగంలోనూ ముందంజలో ఉంటున్నారు. రైతు కూలీలుగానే కాదు రైతులుగా మారి లాభసాటి వ్యసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వ్యసాయరంగం పై ఆధారపడిన మనదేశంల్లో మహిళలు కొత్తపంథాలను అనుసరిస్తూ అధిక దిగుబడిని సాధించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేలా సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నేల చదును చేసి విత్తనాలు నాటి, పంటనుంచి ధాన్యాన్ని సేకరించి, ఇంటికి చేర్చి ఆహారంగా మార్చి ఇంటిల్లిపాదికి అందించడం వరకు మహిళల పాత్ర ఉంటుంది. మహిళా రైతుల సంఖ్య  భారతీయ వ్యవసాయ రంగంలో నానాటికీ పెరుగుతూనే ఉంది. జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వే నివేదికలు పరిశీలిస్తే 75శాతం మహిళా శ్రామికులు వ్యవసాయక్షేత్రంలోనే ఉంటున్నారు. రెండున్నర ఎకరాల పొలంలో  సగటున మహిళలు 3,845గంటలు పనిచేస్తున్నారు. నాట్లు వేయడంలో 557 గంటలు, కలుపు తీయడంలో 640గంటలు, పంటకు నీరు పెట్టడంలో 384 గంటల సమయాన్ని గడుపుతున్నారు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొందరు తిరిగి ప్రారంభిస్తుంటే.. సాఫ్ట్ వేర్ రంగాలను వదిలి సాగుదిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరి గురించి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..   సురేఖ... పుట్టిపెరిగింది నగరం వాతావరణంలో.. కానీ మొక్కలంటే మక్కువ. ఉన్నతవిద్య పూర్తి చేసిన తర్వాత రెండు దశాబ్దాలపాటు ఆమె  మీడియా, అడ్వటైజింగ్, కార్పోరేట్ ట్రైనింగ్ ఫీడ్ లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నతవిద్యకోసం వెళ్లేవారికి సంబంధిత యూనివర్సటీలా ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా కోచింగ్ ఇస్తూ మూడు కోర్సులు, ఆరు క్లాసులు గా బిజీబిజీగా ఉన్న లైఫ్ లో వ్యవసాయం పై మక్కువ మాత్రం తగ్గలేదు. కరోనా కారణంగా అన్నింటికీ బ్రేక్ పడగా.. ఇదే సరైన సమయం అనుకుంటూ గ్రామం వైపు పరుగుదీశారు. నగరానికి చేరువగా ఉన్న గ్రామంలో ఆరు ఎకరాల పొలం లీజుకు తీసుకున్నారు. వ్యసాయంపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంటూ మట్టివాసనను ఆస్వాదిస్తున్నారు. వ్యసాయం లాభసాటిగా ఉండాలంటే అందుబాటులోకి వచ్చిన ఆధునిక పద్ధతుల గురించి అవగాహన ఉండాలి. రైతులకు ప్రభుత్వం సమాచారాన్ని అందించాలి అంటూ అగ్రికల్చర్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నారు. నేల రకాన్ని పరీక్షించడంతో పాటు పంట పెరుగుదలలో తీసుకోవల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎసీ గదుల్లో కోచింగ్ ఇచ్చిన తాను ప్రకృతి మధ్య కు వచ్చిన వ్యసాయపాఠాలు నేర్చుకుని మరికొందరికీ ఆధునిక, లాభసాటి వ్యవసాయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పేముందు నేను తెలుసుకోవాలి కదా అంటూ తానే స్వయంగా పొలం పనుల్లో దగారు. భూసారాన్ని పరీక్షించడం నుంచి నాట్లు వేసే వరకు తానే ముందున్నారు.   కృష్ణవేణి... వ్యవసాయ కుటుంబంలో పుట్టిపెరిగారు. మట్టి పరిమళం బాగా తెలుసు. పల్లె నుంచి పట్టణానికి పోయినా ఆ మట్టి పరిమళాన్ని మరిచిపోలేదు.  పెండ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతలతో ఏ కాస్త సమయం దొరికిన సామాజిక సేవ చేస్తూ బిజీబిజీగా మారారు. పిల్లలు పెద్దవారై కాస్త తీరిక దొరకగానే ఆమె ఆలోచనలు తిరిగి వ్యవసాయం వైపు మళ్లాయి. ఊరిలో తమకు ఉన్న వ్యవసాయ భూములను కౌలుకు ఇవ్వకుండా తానే దగ్గర ఉండి సాగు చేయిస్తున్నారు. తాను చిన్నప్పుడు చూసిన సంప్రదాయ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తూ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయం అంటే ఇతరుల సాయంతో ఇతరులకు సాయంచే జీవనవిధానం అంటారు కృష్ణవేణి. పంట కోసిన తర్వాత తమ పశువులకు ఆహారం కోసం వెతికే గొర్రెకాపరులకు తమ పొలంలోకి అనుమతి ఇస్తారు. ఎండాకాలంలో దాదాపు రెండు నెలల పాటు గొర్రెలు,మేకలు, పశువులు  పొలంలో దొరికే చెట్టుచేమ తింటూ అక్కడ పేడ వేస్తాయి. ఈ పేడ పొలానికి మంచి ఎరువు అవుతుంది. పంటలేని కాలంలో పశువుల మేతకు అనుమతించడం వల్ల అవి వేసే పేడ ఎంతో మేలు చేస్తుందని ఇది తన చిన్నతనంలో చూసేదాన్ని అని ఆమ చెప్పారు. ఇప్పుడు పురుగు మందులతో వ్యసాయం చేస్తున్నారు. అప్పుడు పశుపక్ష్యాదులతో కలిసి వ్యవసాయం చేసేవారు అంటారు కృష్ణవేణి.   విశాల.. నగరాలను మార్కెటింగ్ చేసే కార్పొరేట్ వ్యక్తి విశాల. హైదరాాబాద్ ఐటీ క్యారిడార్ లో వీకెండ్స్  మార్నింగ్ టైమ్ లో స్టాఫ్ వేర్ పీపుల్  అంతా బయటకు వచ్చి మాస్  ప్రోగ్రామ్స్ చేసేలా రహ్ గిరి రూపకల్పన చేసిన వారిలో ఆమె ఒకరు. అంతర్జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్స్ చేసినా తమ మూలాలు పల్లెలోనే అన్న విషయం ఆమెకు బాగా తెలుసు. అందుకే పల్లెవైపు అడుగువేశారు. రాయలసీమలోని తమ గ్రామంలో ఉన్న పొలంలో చిరుధాన్యాలు పండించడంతో పాటు డాటర్స్ ఆఫ్ సాయిల్ పేరుతో ఎప్ బీ పేజీని క్రియేట్ చేశారు. వ్యసాయరంగంలో మహిళ పాత్రను అంతర్జాతీయ వేదికపై తెలియజేసేందుకు కృషి చేస్తున్నారు. మిల్లెట్స్ బ్యాంక్ ను ఏర్పాటుచేసి చిరుధాన్యాలకు మార్కెంటింగ్ కల్పించే ప్రయత్నం చేస్తుననారు. దీనితో పాటు సనాతన వ్యవసాయ పద్ధతులను ఆధునిక తరానికి అందించేందుకు మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు.   నిర్మల... విదేశాల్లో ఉద్యోగం. ఐదంకేల జీతం. కానీ, తాను పుట్టిపెరిగిన సమాజానికి ఎదో చేయాలన్న ఆరాటం. అంతే ఆమె అమెరికా నుంచి మారుమూల గ్రామానికి పయనం. మొదట సామాజిక అంశాలపై స్టడీ చేయాలనుకున్నారు. కానీ, వ్యవసాయం రంగంలో చిన్నసన్నకారు రైతులు, మహిళలు ఎదుర్కోంటున్న సమస్యలను చూసి తాను పనిచేయాల్సింది ఈ రంగంలోనే అనే నిర్ణయానికి వచ్చారు. వలసలకు మారుపేరు అయిన పాలమూరు జిల్లాకు అమెరికా నుంచి ఆమె వలస వచ్చారు. నారాయణపేట్, దామరగిద్ద ప్రాంతంలోని రైతులను కలుసుకుంటూ గత ఐదేండ్లుగా ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లుతూ పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం పేదవారికి పంచిన గుట్టలు, బండరాళ్లతో ఉన్న భూమిని రైతుల శ్రమదానంతో సాగులోకి తీసుకువచ్చారు. సాగునీటి సౌకర్యం అంతగా లేని ప్రాంతంలో వర్షాధార పంటలైన చిరుధాన్యాలను పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతు పండించిన పంట దళారీల ప్రమేయంలేకుండా నేరుగా వినియోగదారులకు చేరేలా కృషి చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మహిళా రైతులకు శిక్షణ ఇచ్చేప్రయత్నాలు చేస్తూ వ్యవసాయరంగాన్ని నమ్ముకున్నవారిని కష్టాల నుంచి గట్టెక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.   రేణుక మనం తీసుకునే ఆహారం కడుపు నింపడమే కాదు అనారోగ్యాల నుంచి రక్షణ ఇచ్చేలా ఉండాలి అంటున్నారు మహిళా రైతు రేణుక. కాలగర్భంలో కలిసిపోయిన వరివంగడాలను సేకరించి తిరిగి వాటిని సాగులోకి తీసుకువస్తున్నారు. సేంద్రీయవ్యవసాయం తాను చేయడమే కాకుండా తమ ఇరుగుపొరుగు వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు. రేణుక సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం క్యాన్సర్ కారణంగా ఆమె మామగారు చనిపోవడం. ఆహారం, జీవనశైలీ కారణంగానే దీర్ఘకాలిక సమస్యలైన క్యాన్సర్, మధుమేహం, కీళ్లనొప్పులు, గుండెజబ్బులు వస్తాయని డాక్టర్లు చెప్పడం ఆమెను ఆలోచింప చేసింది. మరి మన తాతముత్తాలు ఏం తినేవారు అన్నదిశగా సాగిన ఆలోచనలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన పురాతన వరి వంగడాలను సేకరించేలా చేశాయి. ఆమె భర్త తిరుపతి సహాకారంతో దాదాపు 51రకాల పాత వరి వంగడాలను సేకరించి వాటిని పండిస్తూ విత్తనాలను ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా పంపిణి చేస్తున్నారు.   వ్యవసాయరంగంలో కూలీలుగానే కాదు ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడే మహిళలు ఎందరో ఉన్నారు అని నిరూపిస్తున్నారు ఈ ఐదుగురు మహిళలు. ఆరోగ్యానిచ్చే ఆహారాన్ని పండిస్తూ సమాజాన్ని ఆరోగ్యదాయకంగా చేసే ప్రయత్నం చేస్తూ వ్యవసాయరంగంలో ఉన్న ప్రతి మహిళకు జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా హాట్సాఫ్...
గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు గ్రేటర్ షాక్ తగలబోతుందా? బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీ ఆగమాగం కానుందా? రెండోసారి జెండా ఎగరేయాలనున్న కారు పార్టీ స్పీడుకు జీహెచ్ఎంసీలో బ్రేక్ పడనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది ప్రీపోల్ సర్వేల్లో. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై తీన్మార్ మలన్నకు చెందిన క్యూ న్యూస్ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో గులాబీ పార్టీకి గుబులు రేపే ఫలితాలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో  రికార్డ్ స్థాయిలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ కు ఈసారి అందులో పదో వంతు సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలుఉన్నాయని సర్వే ఫలిచాలను బట్టి అర్ధమవుతోంది. ఇప్పటికిప్పుడు గ్రేటర్ లో ఎన్నికల్లో జరిగితే టీఆర్ఎస్ పార్టీకి మూడో స్థానం వస్తుందని ప్రీపోల్ సర్వే స్పష్టం చేస్తోంది. అది కూడా నాలుగో స్థానంలో ఉన్న టీడీపీ కంటే కొంచెం మెరుగ్గానే ఉంది గులాబీ పార్టీ పరిస్థితి   గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు డివిజన్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీగా పుంజుకున్నట్లు క్యూ న్సూస్ సర్వేలో తేలింది. గ్రేటర్ లో మెజార్టీ సీట్లు హస్తం కైవసం చేసుకోబోతుందని తెలుస్తోంది. బీజేపీ కూడా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని 40 డివిజన్లలో క్యూ న్యూస్ ప్రీపోల్ సర్వే పూర్తైంది. ఇందులో కాంగ్రెస్ 18 డివిజన్లలో ఆధిక్య సాధించి టాప్ లో నిలిచింది. బీజేపీ 13 డివిజన్లలో ముందంజలో ఉంది. ఇక అధికార టీఆర్ఎస్ మాత్రం కేవలం ఐదు డివిజన్లలోనే లీడ్ పొందింది. టీడీపీ నాలుగు డివిజన్లలో సత్తా చాటుతూ టీఆర్ఎస్ కు దరిదాపుల్లోనే నిలిచింది. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉండగా... అందులో పాతబస్తిలోనే 50 డివిజన్లున్నాయి. ఓల్డ్ సిటీలో ఎంఐఎందే పూర్తి ఆదిపత్యం కాబట్టి.. ఆ సీట్లపై మిగితా పార్టీలు ఆశలు పెట్టుకోవు. మిగితా 100 డివిజన్లలోనే పోటీ పడతాయి. ఈ వందలోనే 40 డివిజన్లలో సర్వే జరిపింది క్యూ న్యూస్ సంస్థ. సో... దాదాపుగా ఇవే ఫలితాలు మిగితా డివిజన్లలో ఉంటాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   ప్రీపోల్ సర్వేను పక్కాగా నిర్వహించింది క్యూ న్యూస్ సంస్థ. ఎన్నికల్లో మాదిరే బ్యాలెట్ పేపర్లతోనే సర్వే చేస్తోంది. సర్వే నిర్వహించిన డివిజన్ లోనే బాక్సులు పెట్టగా.. ఆసక్తి గల ఓటర్లు బ్యాలెట్ పేపరులో పార్టీ సింబల్ పై టిక్ చేస్తూ పెట్టేలో వేశారు. తర్వాత అందరి సమక్షంలోనే వాటిని లెక్కిస్తున్నారు. అచ్చం పోలింగ్ జరుగుతున్నట్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్ లోని  2 వందల మంది నుంచి ఓటు తీసుకుంటున్నారు. ఇందులో అన్ని వర్గాల వారు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్యూ న్యూస్ సర్వే నిర్వాహకులు. పారదదర్శకంగా సర్వే ఉండటంతో ఫలితాలపై ప్రజలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.    క్యూ న్యూస్ ఇప్పటివరకు నిర్వహించిన 40 డివిజన్లలో గ్రేటర్ లోని అన్ని ప్రాంతాలు దాదాపుగా కవరయ్యాయి. అయితే ప్రీ పోల్ సర్వేల్లో అధికార పార్టీకి నగరంలోని ఏ ప్రాంతంలోనూ సానుకూలత లభించడం లేదు. టీఆర్ఎస్ కు లీడ్ వచ్చిన ఐదు డివిజన్లలోనూ.. ఆ పార్టీకి ఇతర అభ్యర్థుల నుంచి   పోటీ  తీవ్రంగానే ఉంది. చాలా డివిజన్లలో అధికార పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ ముందున్న స్థానాల్లో ఆ పార్టీకి భారీగా ఓట్లు వచ్చాయి. బీజేపీ కూడా మంచిగానే ఓట్లు సాధించింది. సరూర్ నగర్ లో అధికార పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి దిగజారింది. సిటీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా.. ఆ ఏరియాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి జనాల నుంచి ఊహించని సపోర్ట్ లభిస్తోంది.    ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న మేడ్చల్ మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో గ్రేటర్ లోని 50 డివిజన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎంపీ పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ , ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఈ నాలుగు  నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. అధికార పార్టీ ప్రీపోల్ సర్వేల్లో బాగా వెనకబడి పోయింది. నాగోల్, కాప్రాలో  మాత్రమే కారుకు లీడ్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి షాకిచ్చేలా సర్వే ఫలితాలు వచ్చాయి. ఎల్బీనగర్ పరిధిలో 8 డివిజన్లు ఉండగా.. ఒక్క బీఎన్ రెడ్డి నగర్ లో మాత్రమే టీఆర్ఎస్ ముందుంది. మంత్రి సబితారెడ్డి నియోజకవర్గం మహేశ్వరం పరిధిలోని సరూర్ నగర్ డివిజన్ లో గులాబీ పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది.                           గ్రేటర్ శివారు ప్రాంత డివిజన్లలో కాంగ్రెస్ ముందుండగా.. న్యూసిటీలో మాత్రం బీజేపీ జోరు కనిపించింది ప్రీపోల్ సర్వేలో. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పూర్తి సత్తా చాటింది. ఈ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో  క్యూ న్యూస్ ఇప్పటివరకు నిర్వహించిన ప్రీపోల్ సర్వే లో బీజేపీనే మెజార్టీ సీట్లలో ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో ఘోరంగా చతికిలపడిన కాంగ్రెస్ కూడా అనూహ్యంగా  కొన్ని డివిజన్లలో లీడ్ సాధించింది.  హైదరాబాద్ లోక్ సభ పరిధిలోని గోషామహాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టు కనిపించింది. గోషామహాల్ పరిధిలోని అన్ని డివిజన్లలో బీజేపీ లీడ్ సాధించగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.    ఇక గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీ కనుమరుగయ్యందని ప్రచారం చేసే వారి దిమ్మ తిరిగేలా క్యూ న్యూస్ సర్వే ఫలితాలు కనిపిస్తున్నాయి. కూకట్ పల్లి , కుత్బుల్లాపూర్ పరిధిలోని గ్రేటర్ డివిజన్లలో టీడీపీ బలంగానే ఉన్నట్లు తేలింది. కొన్ని డివిజన్లలో ముందుండగా.. మరికొన్ని డివిజన్లలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జరిగిన సర్వేలో ఓవరాల్ గా అధికార టీఆర్ఎస్  కంటే టీడీపీకే ఎక్కువ ఓట్లు రావడం ఆసక్తి కలిగిస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలోనూ టీడీపీకి మంచిగానే ఓట్లు పడ్డాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే టీడీపీకి గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయని ప్రీ పోల్ సర్వేను విశ్లేషించిన పొలిటికల్ అలిస్టులు చెబుతున్నారు.
తెలంగాణలో వరుస ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 3న జరగనున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ లోపే బల్దియా కొత్త పాలకమండలి ఏర్పాటయ్యేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వచ్చే మార్చి-ఏప్రిల్ లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు మంత్రి కేటీఆర్. అయితే ఆయన ఫోకసంతా గ్రేటర్ , మండలి ఎన్నికలపైనే పెడుతున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్ లో జరుగుతాయని భావిస్తున్న జీహెచ్ఎంసీ, మరో ఆరు నెలల తర్వాత జరగనున్న మండలి ఎన్నికలపై వరుస సమీక్షలు చేస్తున్న కేటీఆర్.. దుబ్బాక ఉప ఎన్నికను మాత్రం పట్టించుకోలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  నిజానికి మరికొన్ని రోజుల్లోనే జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎక్కువ దృష్టి సారించాలి. కాని కేటీఆర్ మాత్ర దుబ్బాక ఎన్నిక గురించి అసలు మాట్లాడటమే లేదు. దుబ్బాక నేతలతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కనీసం వారితో వీడియో కాన్ఫరెన్స్ లోనూ మాట్లాడలేదు కేటీఆర్.  సమయం సందర్భం వచ్చినప్పుడల్లా గ్రేటర్ ,మండలి ఎన్నికల్లో తామే గెలుస్తామని చెబుతున్న కేటీఆర్.. దుబ్బాకపై మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. కేటీఆర్ వైఖరిపై టీఆర్ఎస్ లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. దుబ్బాకలో పార్టీ పరిస్థితి బాగాలేదని  గ్రహించడం వల్లే కేటీఆర్ దానిపై ఫోకస్ చేయడం లేదని చెబుతున్నారు. పార్టీ సర్వేలోనూ అదే  తేలిందంటున్నారు. అందుకే దుబ్బాకలో పార్టీ ఓడిపోయినా  తన ఇమేజ్  డ్యామేజీ కాకుండా ఉండేలా కేటీఆర్ జాగ్రత పడుతున్నారనే ప్రచారం కూడా ఉంది.                  గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం మళ్లీ కైవసం చేసుకుంటామనే భావనలో కేటీఆర్ ఉన్నారట. అందుకు కారణం కూడా ఉందంటున్నారు. గ్రేటర్ లో ఇప్పటికే 30కి పైగా ఎక్స్ అఫిషియో సభ్యులు టీఆర్ఎస్ కు ఉన్నారు. ఓల్డ్ సిటీలో ఎలాగూ ఎంఐఎం దాదాపు 50 వరకు డివిజన్లు గెలుచుకుంటుంది. దీంతో గతం కంటే చాలా సీట్లు తగ్గినా.. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పతంగి పార్టీతో కలిసి గ్రేటర్ లో మళ్లీ పవర్ దక్కించుకునే అవకాశం అధికార పార్టీకి ఉంది. అందుకే గ్రేటర్ పై కేటీఆర్ ధీమాగా ఉన్నారని చెబుతున్నారు. మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చినా కేటీఆర్ కు పెద్ద  ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలోనూ మండలి ఎన్నికల్లో గులాబీ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. కాబట్టి ఈసారి అలాంటి ఫలితాలే వచ్చినా అది కేటీఆర్ కు అంత ఇబ్బందిగా ఉండదని చెబుతున్నారు. అందుకే తనకు మైనస్ కాకుండా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలపైనే ఫోకస్ చేస్తూ.. ఇబ్బందిగా  ఉందని భావిస్తున్న దుబ్బాకను కేటీఆర్ పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  దుబ్బాక ఉపఎన్నికతో మంత్రి హరీష్ రావుపై మెడపై కత్తి పెట్టారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం దుబ్బాక బాధ్యతలన్ని హరీష్ రావే చూస్తున్నారు. అక్కడ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  అక్కడ వ్యతిరేక ఫలితం వస్తే.. ఆ నెపమంతా హరీష్ రావుకు  అంటగట్టే కుట్ర జరుగుతుందనే వాదనలు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో మొదటి నుంచి హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఎన్నికల్లోనూ  సక్సెస్ చేసి చూపించారని చెబుతారు. అలాంటి ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ కలిగేలా టీఆర్ఎస్ లోని ఓ వర్గం ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలుస్తున్నా.. దుబ్బాకకు కేటీఆర్ ఎందుకు వెళ్లడం లేదని కొందరుచెబుతున్నారు. హరీష్ రావును ఇరికించే ప్రయత్న దుబ్బాక ఉప ఎన్నిక సాక్షిగా జరుగుతుందని బలంగా వాదిస్తున్నారు. అయితే తమ నేతపై కుట్రలు జరుగుతున్నాయని అనుమానిస్తూనే... దుబ్బాక  పరీక్షలో హరీష్ రావే గెలుస్తారని ఆయన అభిమానులు నమ్మకంగా చెబుతున్నారట.
కురుక్షేత్రం జరిగింది 5 ఊళ్ళ కోసం కాదు, దుష్ట శిక్షణ కోసం. అమరావతి పోరాటం 29 ఊళ్ళ కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రుల భవిత కోసం. ఇది అమరావతి రైతులు, మహిళల నినాదం. ఇదే నినాదం సోషల్ మీడియాలో హోరెత్తింది. మహాభారతం స్పూర్తితో 3 వందల రోజులుగా అలు పెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు ఆంధ్రా జనం జై కొట్టారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పోరాటయోధులకు  వందనాలు అంటూ కిర్తించారు.    అమరావతి రాజధాని రైతుల ఉద్యమజ్వాల మూడొందల రోజులుగా ప్రజ్వరిల్లుతూనే ఉంది. పది నెలలుగా అకుంఠిత దీక్షతో పోరాటం చేస్తున్నారు రైతులు, మహిళలు.  అధికారపక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. 3 వేల ఎకరాల భూములను రాజధాని కోసం ఇస్తే.. ఇప్పుడు మూడు రాజధానులంటూ తమను రోడ్డున పడేస్తున్నారన్న ఆక్రోశం వారిని నిత్యం పోరుకు పురికొల్పుతోంది. అందుకే అవమానాలు, నిర్బంధాలు ఎదురైనా వారు లెక్క చేయలేదు. పోలీసుల లాఠీ దెబ్బలకు వెనుకాడలేదు. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపినా జంకలేదు. కరోనా పడగ విప్పుతున్నా.. జాగ్రత్తలు తీసుకుంటూనే కదన రంగం వీడలేదు.    నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రహదారులపై బైఠాయింపు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ర్యాలీలు, ప్రార్థనలు, యాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు, వేడుకోళ్లు... ఇలా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఏకైక రాజధానిగా అమరావతి.. అనే లక్ష్యంతో ఉద్యమం హోరెత్తుతోంది. అమరావతి నుంచి ఢిల్లీ వరకు తమ ఉద్యమ నినాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు  రాజధాని రైతులు.      అమరావతి ఉద్యమం మొదలయ్యాకా ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. రాజధాని గ్రామాల్లోకి  వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని దించింది. దాదాపు గ్రామాలన్నింటినీ దిగ్బంధించింది. 144 సెక్షన్‌, పోలీసు చట్టంలోని 30 సెక్షన్లను ప్రయోగించి.. రైతులను భయాందోళనకు గురి చేసి ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది. 3 వేల మందికి పైగా అన్నదాతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపింది. రాజధాని మొదలైన నాటి నుండి 80మంది రైతులు మనస్థాపానికి గురి అయి చనిపోయారు. అయినా ఉద్యమం ఆపలేదు అమరావతి రైతులు. కొందరి గుండెలు అలసి ఆగిపోయినా... భూదేవి అంతటి ఓర్పుతో శాంతియుతంగా పోరాడుతున్నారు ఈ భూమి పుత్రులు.    రాజధాని పరిరక్షణ ఉద్యమంలో  అతివలే ఆదిశక్తులయ్యారు.  మందడంలో నిరసన ర్యాలీ చేసినా, దుర్గమ్మకు మొక్కులు చెల్లించినా , అసెంబ్లీ ముట్టడైనా, జాతీయ రహదారి దిగ్బంధమైనా.. మహిళలే ముందుండి నడిచారు. పోలీసులు బూటు కాళ్లతో తన్నినా, లాఠీలతో కొట్టినా మౌనంగా భరించారు. శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతికి చెందిన మహిళా ప్రతినిధులు, వారి తరపున పోరాడుతున్న మహిళా నేతలు  ఢిల్లీ వెళ్లి... కేంద్ర మంత్రులను కలిసి తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు.      అమరావతి రైతులు, మహిళల అలుపెరగని పోరాటానికి ఆంధ్ర జనం జైకొట్టింది. ఉద్యమానికి 300 రోజులు పూర్తైన సందర్భంగా వారికి సంఘీభావం తెలిపింది.  అమరావతి మహోద్యమం గురించి , రైతులు , మహిళామతల్లులు పడుతున్న కష్టాల గురించి దేశ ప్రజలకు , జాతీయ నాయకులకు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు జనాలు. మన రాజధానిని మనం కాపాడుకుందామంటూ శపథం చేశారు.  అమరావతి హ్యాష్ టాగ్  ట్విట్టర్ లో  ట్రెండింగ్ లో నిలిచింది. రాజధానికి మద్దతుగా ట్విట్టర్ లో భారీగా పోస్టులు పెట్టారు. ఇతర అమరావతి అభిమానుల ట్వీట్లను రీట్వీట్ చేశారు.      జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించలేక మౌనంగా రోధిస్తున్న వారికి, అమరావతి మహిళల పోరాటం ఈ రాష్ట్రానికే స్పూర్తి అని కీర్తించారు. ఒక నియంతకు భయపడి వెనుకడుగు వేస్తున్నాం కానీ, తెగించి నిలబడతే, జగన్ అనే వాడు చాలా చిన్న వాడు అని చాటి చెప్పారు.. అమరావతి మహిళలు అంటూ ఆకాశానికెత్తారు. ఆ పోరాట స్పూర్తితోనే, ఇంత పెద్ద అధికార యంత్రాంగం చేతిలో ఉన్నా, 16 నెలలుగా అమరావతిని ఇంచ్ కూడా కదపలేక పోయాడని కొందరు పోస్టులు పెట్టారు.    నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి, నాకు రాజధాని లేదు అని చెప్పాల్సిన స్థాయికి దిగజారిపోయామని ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం కోసం, మన హక్కుల కోసం, అమరావతి మహిళలు, రైతుల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని పోరాడదాం రండి అంటూ పిలుపిచ్చారు. రైతన్నల కోసం  5 కోట్ల ఆంధ్రుల  బిడ్డల భవిష్యత్ కోసం.. ఆంధ్ర బిడ్డల చిరునామా కోసం.. మన బిడ్డలు వలస బతుకులు కాకుండా కాపాడు కోవటం కోసం కలిసి రావాలని కోరారు. ఆంధ్రుడా ఆలోచించు. రాజధాని అమరావతి ఒక్కటే అని గుర్తించు అని నినదించారు.  గమ్యంలేని గమనం, ముగింపులేని ప్రయాణం ఇంకా ఎన్నాళ్లు ఎన్నేళ్లు ?.. రండి కదలిరండి. మన రాజధాని అమరావతిని కాపాడుకొందాం, అమరావతి రైతులకు తోడుగా రా కదలిరా అంటూ కొందరు పోస్టు చేశారు.    రాజధాని కోసం భూమి త్యాగం చేసిన రైతులకు గత  ప్రభుత్వం కొత్త బట్టలు పెట్టి గౌరవం ఇచ్చింది ...ఇప్పుడు ప్రభుత్వం లాఠీ తో గౌరవం ఇచ్చిందని నెటిజన్లు ఆరోపించారు. 34,322 ఎకరాలను ప్రభుత్వం అడగగానే ఇచ్చేసిన తమ త్యాగానికి ఏనాడైనా అమరావతి రూపుదాల్చుతుందన్న నమ్మకం... ఆ నమ్మకంతోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఉద్యమకారులారా... విజయోస్తు అంటూ కీర్తించారు నెటిజన్లు, ఆంధ్ర ప్రజలు.    రాజధాని ఉద్యమం 3 వందల రోజులు కావడంతో అమరావతి రైతులు కదం తొక్కారు. కరోనా భయం వెంటాడుతున్నా, వర్షం కురుస్తున్నా పోరు బాటలో ముందుకు సాగారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆకుపచ్చ కండువాలు ధరించి జాతీయ జెండాలు, అమరావతి జేఏసీ జెండాలతో నినదించారు. తుళ్లూరు నుంచి మందడం వరకు 9 కిలోమీటర్ల మేర వేల మంది రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు పోరు ఆపబోమని స్పష్టం చేశారు. పరిరక్షణ సమితి ర్యాలీలో పాల్గొనేందుకు రాజధాని ప్రాంతంలోని ప్రతి పల్లె కదిలింది. గుంటూరు, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు, పెదకూరపాడు, పొన్నూరు, తెనాలి, వేమూరు, నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో  భారీగా నిరసనలు కొనసాగాయి. అమరావతికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు  జరిగాయి.
మరి ముస్లిం తోఫా హిందువులకూ ఇస్తారా?   తెలంగాణ తెరపైకి కొత్త చర్చ   ప్రభుత్వాలనేవి సెక్యులర్‌గానే ఉంటాయి. ఉండాలి కూడా. పాలకులకు అన్ని కులాలు- అన్ని మతాలూ సమానమే. ఎవరి పట్ల పక్షపాతం ఉండకూడదు. అందరికీ సమాన హక్కులు కల్పించాలి. రాజ్యాంగం కూడా చెబుతోంది ఇదే. సరే.. కొందరు పాలకులు కొన్ని మతాల మెహర్బానీల కోసం, వారికోసమే ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్న సంప్రదాయం దశాబ్దాల నుంచే మొదలయింది. గత ఐదేళ్ల కాలం నుంచీ అది కులాల వరకూ విస్తరించి, కులానికో కార్పొరేషన్ ఏర్పాటుచేసే సంప్రదాయానికి తెరలేపారు. అందుకు ఎవరూ అతీతులు కాదు. కానీ ఒక మతం చేసుకునే పండుగలప్పుడు, అన్ని మతాలకూ బహుమతులిస్తున్న పాలకులు.. మరి మిగిలిన మతాల పండగులప్పుడు ఇచ్చే బహుమతులు కూడా, అన్ని మతాలకూ ఇవ్వాలి కదా? మరి పాలకులు ఆ సమ న్యాయం పాటిస్తున్నారా? తెలంగాణలో మహిళలకు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ.. ఇప్పుడు ఈ ప్రశ్ననే తెరపైకి తెచ్చింది.   తెలంగాణలో బతుకమ్మ పండుగకు విశిష్టతతోపాటు, చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కొన్ని వందల ఏళ్ల నుంచి తెలంగాణ పల్లెలో, బతుకమ్మ ఆడే సంప్రదాయం ఉంది. అయితే అది పట్టణ ప్రాంతాలలో కొందరు మాత్రమే ఆచరించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, మర్చిపోయిన ఈ సంప్రదాయాన్ని కేసీఆర్ కుమార్తె కవిత మళ్లీ గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో తమకు రాష్ట్రం కావాలంటూ వివిధ సంస్థలు ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించారు. అయితే కవిత మాత్రం బతుకమ్మను ఇంటింటికీ చేర్చారు. ఒకరకంగా బతుకమ్మకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌లా మారారు. నిజానికి ఆమె కృషి వల్లనే, బతుకమ్మ పండుగకు ఇంత ప్రాధాన్యం వచ్చిందనేది నిజం. అసలు బతుకమ్మ గురించి తెలియని ఆంధ్రా మహిళలు సైతం.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంతోపాటు, బయట బతుకమ్మ ఆడారంటే, కవిత ఎంతమంది మహిళలపై ప్రభావితం చూపారో స్పష్టమవుతోంది. ఉద్యమ సమయంలో మహిళలు, బతుకమ్మ ఆడుతూ స్వరాష్ట్ర కాంక్షను వ్యక్తీకరించారు. బతుకమ్మ ఫక్తు హిందువుల పండుగ. నిజాం నవాబుల జమానాలో, రజాకార్లు మహిళలను బట్టలు ఊడదీసి, వారితో నగ్నంగా బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందినట్లు చరిత్ర చెబుతోంది.   సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత, బతుకమ్మ పండుగకు కేసీఆర్ సర్కారు ఏటేటా కొంత నిధిని ఏర్పాటుచేసింది. తర్వాత మహిళలకు చీరలు ఉచితంగా పంపిణీ చేసే సంప్రదాయం ప్రవేశపెట్టింది. అయితే, ఆ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళలు వాటిని రోడ్డుపైనే పడేసి పోయిన ఘటనలు మీడియాలో చూసినవే. చీరల కొనుగోలులో కుంభకోణం జరిగిందని, మహారాష్ట్ర నుంచి వాటిని తక్కువ రేటుకు తెచ్చి, ఇక్కడి కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని అప్పట్లో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న చీరలలో కూడా నాణ్యత లేదని, గత ఏడాది మిగిలిపోయిన చీరలను పంపిణీ చేస్తున్నారన్న మహిళల విమర్శలు మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇదంతా రాజకీయ కోణం. రంజాన్ తోఫాకు సైతం ప్రభుత్వం నిధులిస్తున్న విషయం తెలిసిందే.   కానీ, బతుకమ్మ చీరలను, ముస్లిం మహిళలకూ పంపిణీ చేయడంపై.. తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫక్తు హిందువుల పండుగయిన బతుకమ్మ పండుగ చీరలు, ముస్లింలకు ఎలా ఇస్తారన్నది ఒక ప్రశ్న. రజాకార్లు హిందూ మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆడించి.. బతుకమ్మను అవమానిస్తే, అదే బతుకమ్మ చీరలను ముస్లింలకు ఎలా పంపిణీ చేస్తారన్న ప్రశ్నలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. దీనిపై వినిపిస్తున్న ప్రశ్నలు, జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారింది. బతుకమ్మ పండుగ రోజు ప్రభుత్వం ఇచ్చిన చీరలు కట్టుకున్న హిందూ మహిళలు, వాటికి కట్టుకుని బతుకమ్మ ఆడతారు. మరి ఆ చీరలు కట్టుకునే ముస్లిం మహిళలు, హిందూ మహిళల మాదిరిగా బతుకమ్మ ఆడతారా? అన్నది ఇప్పుడు హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మరి ఏ ఉద్దేశ్యంతో ముస్లిం మహిళలకు, బతుకమ్మ చీరలను బహుమానంగా ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   అదేవిధంగా ప్రభుత్వం, ప్రతి ఏటా రంజాన్ తోఫా ఇస్తోంది. దీనికి కూడా బతుకమ్మ చీరల మాదిరిగానే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ విచిత్రంగా.. రంజాన్ తోఫా కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితం. ఆ బహుమతులు హిందువులకు ఇవ్వరని హిందూ సంస్థలు గుర్తు చేస్తున్నాయి. మరి హిందువులు నిర్వహించుకునే ప్రతి బతుకమ్మ పండుగకు ముస్లిం మహిళలకు సైతం చీరలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, మరి రంజాన్ తోఫా సమయంలో హిందువులకు ఎందుకు బహుమతులు ఇవ్వరని ప్రశ్నిస్తున్నాయి.   ‘ప్రభుత్వ సెక్యులర్ విధానం హాస్యాస్పదం, అసంబద్ధంగా ఉంది. బతుకమ్మ చీరలు తీసుకుంటున్న ముస్లిం మహిళలు, వాటిని కట్టుకుని హిందూ మహిళల మాదిరిగా బతుకమ్మ ఆడగలరా? అలా ఆడాలని ఈ ప్రభుత్వం చెప్పగలదా? మరి రంజాన్ తోఫా ముస్లింలకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఇదేనా కేసీఆర్ చెప్పే సెక్యులర్ నీతి? అయినా రజాకార్ల చేతిలో.. అవమానాల పాలయిన హిందూ మహిళలను ఏ మతమయితే దారుణంగా వేధించిందో, అదే మతానికి చెందిన మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వడమంటే, హిందూ మహిళలను అవమానించినట్టే’నని భాగ్యనగర్ విశ్వహిందూ పరిషత్, ప్రచార సహ ప్రముఖ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. -మార్తి సుబ్రహ్మణ్యం
కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనని తేలింది. జగన్ ప్రభుత్వంమే దీన్ని అంగీకరించింది. ఈ మేరకు ఏకంగా హైకోర్టులోనే అఫడవిట్ దాఖలు చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ.. తాండవ యోగేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని ఏపీ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. కరోనా కాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని హైకోర్టుకు తెలిపింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం‌ అభిప్రాయం తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది.    స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ సర్కార్ తాజా వైఖరితో మార్చిలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని రుజవైంది. అయితే కరోనా ప్రభావం ఉన్నా స్థానిక ఎన్నికలు జరపాలని పట్టుబట్టిన జగన్ సర్కార్.. ఇప్పుడు మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వ స్పందన రాజకీయ, న్యాయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.    కరోనా విజృంభిస్తున్న మొదటి రోజుల్లో.. దేశం మొత్తం లాక్ డౌన్ విధించేసినా స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టింది వైసీపీ సర్కార్. ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఫైరయ్యారు సీఎం జగన్. మంత్రులు, వైసీపీ నేతలైతే ఆయన్ను దారణంగా టార్గెట్ చేశారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించారు. ఎస్‌ఈసీని కూడా తొలగించి రచ్చ రచ్చ చేసింది ప్రభుత్వం. అయితే హైకోర్టు జోక్యంతో నిమ్మగడ్డ తన పదవిలో కొనసాగుతున్నారు. స్థానికల ఎన్నికల వ్యవహారం ఏపీలో అప్పట్లో పెద్ద  సంచలనమే అయింది. టీడీపీ, వైసీపీ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.    ప్రస్తుతం దేశం కరోనా భయం నుంచి బయటపడుతోంది. ఏపీలో కూడా లాక్ డౌన్ ఎత్తేశారు. బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ అంశాలను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కాదని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం నిర్వహించకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చి వరకూ.. ఎస్‌ఈసీ పదవీ కాలం ఉంది. అందుకే ఇప్పుడు సాధ్యం కాదని హైకోర్టుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయమే ఫైనల్. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో.. అన్నదానిపైనే…స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఆయన ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనా.. ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది.    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే దేశంలో కరోనా కేసులు నమోదు కావడంతో అంతటా భయాందోళన నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మార్చి 15న ప్రకటన చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే.. చాలా మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు. నిమ్మగడ్డ తీసుకున్న ఆ నిర్ణయాన్ని అప్పుడు ప్రభుత్వం తప్పుపట్టింది. ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు కొత్త చట్టమే తెచ్చింది. కొత్త ఎన్నికల కమిషనర్ ను కూడా హడావుడిగా నియమించింది. అయితే ప్రభుత్వ చర్యలపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై నానా రభస చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఆయన చెప్పిన మాటనే హైకోర్టుకు చెప్పడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
అనగనగా ఓ అందమైన రాజ్యం. ఆ రాజ్యానికి ఓసారి పెద్ద ఆపద వచ్చింది. శత్రుదేశం వారు తమ రాజుని బంధించి తీసుకుపోయారు. ఆ శత్రుదేశపు కోటలోకి అడుగుపెట్టి, రాజుగారిని విడిపించుకుంటే కానీ... తమ రాజ్యానికి భవిష్యత్తు ఉండదు. కానీ ఎలా ఆ శత్రుదేశం సాధారణమైనది కాదు. ఆ దేశానికి ఉన్న కోటగోడలు ఆకాశాన్ని తాకేంత పెద్దవి. ఆ కోటగోడలను దూకి ఎలాగైనా లోపలకి ప్రవేశించేందుకు ఓ వందమంది యోధులు బయల్దేరారు. అంత పెద్ద కోట గోడని ఎవ్వరూ ఎక్కి రాలేరులే అన్న ధీమాతో శత్రుసైనికులు కోట లోపలే ఏదో పండుగ సంబరాలలో మునిగిపోయి ఉన్నారు. కోటగోడను చేరుకున్న తర్వాత తల పైకెత్తి చూసిన యోధులకు కళ్లు తిరిగిపోయాయి. ‘అబ్బే ఈ గోడని ఎక్కడం మన వల్ల కాదెహే!’ అంటూ ఓ యోధుడు ముందుగానే కూలబడిపోయాడు. మరికొందరు ఓ నాలుగడుగులు పైకెక్కి.... ‘అబ్బే ఈ గోడ నున్నగా జారిపోతోంది. దీన్ని ఎక్కడం అసాధ్యం,’ అంటూ చెట్ల కిందకి చేరుకున్నారు. అలా ఒకొక్కరే కోటగోడను ఎక్కే ప్రయత్నాన్ని విరమించుకోసాగారు. పైగా ఎక్కుతున్నవారితో కూడా ‘ఆ కోటని ఎక్కడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఇంత ఎత్తైన కోట గోడల వల్లే, ఈ రాజ్యం ఇంత గొప్పదయ్యింది,’ అని అరుస్తూ నిరుత్సాహపరచసాగారు.   ఒకవేళ ఆ మాటలు వినిపించుకోకుండా ఎవరన్నా మరికాస్త పైకి ఎక్కే ప్రయత్నం చేస్తే- ‘చెబుతోంది నీకే! బతికుంటే మరో రాజుని ఎన్నుకోవచ్చు. అనవసరంగా ఈ గోడని ఎక్కి నీ ప్రాణాలు కోల్పోవద్దు,’ అంటూ అరిచి గీపెట్టారు. కానీ అదేం విచిత్రమో కానీ, ఒక వ్యక్తి మాత్రం తనకి వినిపించే మాటలను ఏమాత్రం ఖాతరు చేయకుండా క్రమంగా పైకి ఎక్కసాగాడు. అలా ఎక్కే ప్రయత్నంలో, నాలుగడుగులు పైకి ఎక్కితే పది అడుగులు కిందకి జారిపోతున్నాడు. కాళ్లూ చేతులూ దోక్కుపోయి రక్తం ఓడుతున్నాడు. అయినా పట్టువిడవకుండా గోడ ఎక్కుతూనే ఉన్నాడు. అతను మూర్ఖుడనీ, చావుకి సిద్ధపడుతున్నాడనీ కింద ఉన్నవాళ్లు అరుస్తూనే ఉన్నారు. ఎట్టకేళకు ఓ అయిదు గంటలు గడిచిన తర్వాత... ఆ వ్యక్తి కోట గోడను చేరుకున్నాడు. శత్రువుల కంట పడకుండా కోట తలుపులు తీసి తన తోటివారిని లోపలకి తీసుకువెళ్లాడు.   వందమంది యోధులూ కలిసి శత్రుసైనికులను తుదముట్టించారు. తమ రాజుగారిని విడిపించుకుని విజయంతో తమ రాజ్యానికి చేరుకున్నారు. ‘ఎవరు ఎంతగా నిరుత్సాహపరిచినా కూడా ఇతగాడు వెనక్కి తగ్గలేదు ప్రభూ! కోట గోడని ఎక్కేదాకి తన ప్రయత్నాన్ని విరమించలేదు,’ అంటూ ఆ ఒక్క వీరుడినీ రాజుగారికి పరిచయం చేశాడు సేనాధిపతి. తన ముందు నిలబడిన ఆ వీరుని చూసిన రాజుగారు తెగ ఆశ్చర్యపోయారు. కారణం... అతను చెవిటివాడు. ‘ఒకోసారి మనల్ని నిరుత్సాహపరిచే మాటలు చెవిన పడకపోవడమే మంచిది మహారాజా! కోటగోడను ఎవ్వరూ ఎక్కలేరంటూ తోటివారంతా అరిచిన అరుపులు ఇతనికి వినపడకపోవడం వల్లే, తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. ఒకోసారి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇలా చెవిటివాడిలాగా ఇతరుల మాటలను వినిపించుకోకపోవడమే మంచిదేమో!’ అన్నాడు సేనాధిపతి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
అది ఓ పెద్ద పడవ. ఆ పడవలో వందమందికి పైగా ప్రయాణికులు పయనిస్తున్నారు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైపోయింది. చూస్తూ చూస్తుండగానే చిరుజల్లు మొదలైంది. ఆ చిరుజల్లు కాస్తా క్షణాల్లో పెనుతుపానుగా మారిపోయింది. పడవలోని ప్రయాణికులంతా బిక్కుబిక్కుమంటూ ఆ పరిస్థితిని గమనిస్తున్నారు. తాము ఎలాగైనా సురక్షితంగా బయటపడితే బాగుండురా భగవంతుడా! అని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. కానీ ఒక ప్రయాణికుడు మాత్రం ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయాడు. అరుపులు, ఏడుపులు, శాపనార్థాలతో గోల పెట్టడం మొదలుపెట్టాడు. అతను అలా అటూ ఇటూ కదలడం వల్ల పడవకి మరింత ప్రమాదం అని ఎందరు చెప్పినా ఊరుకోలేదు. తన పెడబొబ్బలకి పసిపిల్లలు భయపడతారని వారించినా వెనక్కి తగ్గలేదు.   పడవ యజమానికి ఏం చేయాలో తోచలేదు. ఆ ఒక్క ప్రయాణికుడు స్థిమితంగా లేకపోవడం వల్ల ప్రయాణికులంతా భయంలో, ప్రమాదంలో పడుతున్నారని అతనికి తెలుసు. కానీ ఏం చేయడం? నయానా భయానా ఎంతగా వారించేందుకు ప్రయత్నించినా ఆ కంగారు ప్రయాణికుడు మాత్రం తన గొంతుని తగ్గించడంలేదు.   ఇదంతా గమనిస్తున్న ఓ స్వామిజీ నిదానంగా పడవ యజమాని దగ్గరకు వెళ్లాడు. ‘మీరు కనుక అనుమతిస్తే, నేను ఆ ప్రయాణికుడిని శాంతింపచేయగలను,’ అని సూచించాడు. యజమాని సరే అనగానే పడవ నడిపేవారి వద్దకు వెళ్లి, వారి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే పడవ నడిపేవారంతా కలసి.... గగ్గోల పెడుతున్న ప్రయాణికుడిని ఒక్కసారిగా నీటిలో పడేశారు. దాంతో ఆ ప్రయాణికుడు చేతులు కాళ్లు కొట్టుకుంటూ, నడిసముద్రంలో ప్రాణాల కోసం అర్తనాదాలు చేయడం మొదలుపెట్టాడు. జరుగుతున్న తంతుని తోటి ప్రయాణికులంతా దిగ్భ్రాంతితో గమనించసాగారు. ఇలా ఓ రెండు నిమిషాలు గడిచిన తరువాత, ఆ ప్రయాణికుడిని పడవలోకి చేర్చమని అడిగారు స్వామీజీ.   ప్రయాణికుడిని తిరిగి పడవలోకి చేర్చగానే అతను ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అప్పటివరకూ కేకలు వేసినవాడల్లా నిస్తేజంగా ఉండిపోయాడు. అతడిని చూస్తూ స్వామిజీ చిరునవ్వుతో ‘మనం ఉన్న పరిస్థితి ఎంత సురక్షితంగా ఉందో అన్న విషయం, అంతకంటే దారుణమైన ప్రమాదంలోకి చేరుకుంటే కానీ తెలియదు. కాస్తంత మబ్బులు కమ్ముకోగానే నువ్వు భయపడిపోయావు. కానీ ఇంత నడిసముద్రంలో నీకంటూ నీడగా ఓ పడవ ఉందనీ, నిన్ను కాపాడేందుకు వందల మంది మనుషులు ఉన్నారనీ మర్చిపోయావు. ఒక్క గంట గడిస్తే చాలు తీరాన్ని చేరుకుంటానని కూడా నీకు తట్టలేదు. నీటిలో పడగానే, ఈ నావే నీకు ఆధారం అన్న విషయం నీకు గుర్తుకువచ్చింది. ఇంతకుముందు ఆ విచక్షణ లేకపోవడం వల్ల నీతోపాటు తోటి ప్రయాణికులను కూడా భయపెట్టేశావు. పడవ మునిగిపోయే పరిస్థితులు కల్పించావు. నీ పట్ల నమ్మకం, నువ్వున్న పరిస్థితుల మీద కృతజ్ఞత లేకపోతే... నువ్వు ఏ తీరాన్నీ చేరుకోలేవు,’ అంటూ చెప్పుకొచ్చారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
  ఇంట్లోకి అడుగుపెట్టినవారు ఒక్క నిమిషం మీ డ్రాయింగ్‌ రూంని చూస్తూ ఉండిపోవాలనీ, వారి కళ్లో మీ అభిరుచి పట్ల అభినందన కనిపించాలనీ ఎవరికి మాత్రం అనిపించదు. అతిథుల సంగతి పక్కన పెడితే మనది అనుకునే ఇల్లు అందంగా కనిపించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు. కాకపోతే ఇందుకు చాలానే అవాంతరాలు కనిపిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టం లేకపోవడం, ఇరుకైన గదులు, అద్దె ఇల్లులాంటి సమస్యలతో అనుకున్నా ఇంటిని అలంకరించుకోలేకపోతుంటారు. అందుకోసమే ఈ చిన్న చిట్కాలు...     మామూలు వస్తువులతోనే అలంకరణకు ఎక్కువ అవకాశం లేనప్పుడు నిత్యం వాడుకునే వస్తువులనే మరింత కళాత్మకంగా కనిపించేవి ఎన్నుకొంటే సరి. బట్టలు తగించే కొక్కేలు, కర్టెన్ రాడ్స్, పెన్‌స్టాండులు, గడియారాలు, నైట్‌ ల్యాంప్స్ వంటివి కొంచెం విభిన్నమైనవి ఎంచుకొని చూడండి.     వాల్‌ స్టికర్స్‌ ఆన్‌లైన్‌ షాపింగ్ పుణ్యమా అని ఇప్పుడు వాల్‌స్టికర్స్‌ అందరికీ అందుబాటులోనే దొరుకుతున్నాయి. వీటి ధరలు కూడా మరీ అంత ఎక్కువగా ఉండవు. కాకపోతే ఎలాంటి బొమ్మని ఎంచుకోవాలి? అది ఎంత పరిమాణంలో ఉండాలి? అన్న విషయాలను ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవాలి. గోడ రంగుని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం ఆర్డర్‌ చేసిన వాల్ స్టికర్‌ ఒకే షీట్‌ మీద వస్తోందా లేకపోతే వేర్వేరు స్టికర్స్‌ని అసెంబుల్‌ చేసుకోవాలా అన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి.     చిన్న చిన్న బొమ్మలతో ఇంట్లో చిన్న బొమ్మలు చాలానే పేరుకుంటాయి. చాక్లెట్లతో పాటుగా వచ్చినవో, చైనా బజార్లలో కొనుక్కున్నవో, కీచెయిన్లు ఊడిపోయినవో మిగిలిపోయిన బొమ్మలను అక్కడక్కడా అతికించవచ్చు. ఫ్రిజ్‌ తలుపులకీ, కిటికీ చెక్కలకీ, స్విచ్‌ బోర్డులకీ డబల్ స్టికర్‌తో అంటించి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించవచ్చు.     పోస్టర్స్‌ గృహాలంకరణకు సంబంధించి అతి చవకగా లభించేవి వాల్‌ పోస్టర్లే. కాకపోతే చవగ్గా దొరుకుతోంది కదా అని ఇల్లంతా నింపితే మాత్రం వీటితో అసలుకే మోసం వస్తుంది. మరీ భారీ పరిమాణంలో ఉండే పోస్టర్లు ఒకోసారి ఇల్లు ఇరుకుగా ఉన్న భావన కలిగిస్తాయి. కాబట్టి కంటికి నదురుగా, మరీ ఆడంబరంగా తోచని పోస్టర్లని ఎన్నుకోవాలి. వీటిని సెలోఫిన్‌ టేప్‌తో అతికిస్తే త్వరగా ఊడిపోవడమే కాకుండా, గోడ మీద కూడా మరకని మిగులుస్తాయి. ఇలాంటి సందర్భాలలో మెడికల్‌ షాపుల్లో దొరికే తెల్లటి సర్జికల్‌ టేపుని ఉపయోగిస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇటు గోడకీ, అటు పోస్టరుకీ నష్టం కలగకుండా తీసివేయవచ్చు.     ఉపాయం ఉంటే ఇల్లు మనది కాకపోవచ్చు, మేకులు కొట్టడం ఇష్టం లేకపోవచ్చు, గోడకి ఏదన్నా అంటించడానికీ మనస్కరించకపోవచ్చు... అయినా కూడా కాస్త శ్రద్ధ పెడితే గదిని అలంకరించేందుకు చాలా ఉపాయాలు తడతాయి. ఫ్రిజ్‌ మీద ఒక బొమ్మల కొలువు తీరుతుంది, బెడ్‌ల్యాంప్‌ నుంచి ఒక అందమైన బొమ్మ వేళ్లాడుతుంది, టీవీ కింద ఉన్న కేబుల్ బాక్స్‌ మీద ఒక టెడ్డీ బేర్‌ కూర్చుంటుంది... కాస్తంత ఉపాయం ఉంటే గది మొత్తం అందంగా మారిపోతుంది. కావాలంటే ఒక్కసారి మీ డ్రాయింగ్ రూమ్‌ని పరిశీలించి చూడండి. - నిర్జర.
చిన్నా పెద్దా ధనిక పేదా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కనికరం లేకుండా కబళిస్తోన్న వ్యాధి క్యాన్సర్. దీన్ని అరికట్టడం చేతకాక ప్రపంచం దేశాలన్నీ పరిశోధనల్లో మునిగి తేలుతున్నాయి. ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో అర్థం కాని మహమ్మారి క్యాన్సర్. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల జోకిలి పోకుండా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు అన్నది మాత్రం సత్యం.    బిస్కట్లు, కేకులు వంటి వాటి దగ్గర్నుంచి బొబ్బట్లు వంటి సంప్రదాయ వంటకాలన్నిటికీ ప్రధాన దినుసు మైదాపిండి. ఇది పాంక్రియాస్ మీద తీవ్ర ఒత్తిడి కలిగించి ఇన్సులిన్ లెవెల్స్ ని అస్తవ్యస్తం చేస్తుంది. అదే విధంగా చక్కెర కూడా ఎక్కువ తీసుకోకూడదు. స్థూలకాయం, మధుమేహాలకు కారణమయ్యే చక్కెర పాంక్రియాస్, కాలేయాలతో పాటు జీర్ణవ్యవస్థను కూడా పాడు చేస్తుంది. అందుకే పండ్లు, తేనె వంటి వాటి ద్వారా అందే సహజ చక్కెర తప్ప నేరుగా చక్కెరను తీసుకోవడం మంచిది కాదు.    పాలు తాగితే ఎముకలు గట్టి పడతాయని అందరూ అంటారు. అయితే వయసు పెరిగేకొద్దీ పాలలో ఉండే ల్యాక్టోజ్ ను అరాయించుకునే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వయసు పెరిగేకొద్దీ పాలు మోతాదు దాటి తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ప్యాట్రిక్ హాఫార్డ్.    వీటితో పాటు సరిగ్గా ఉడికించకుండా క్షణాల్లో తయారుచేసే జంక్ ఫుడ్... చక్కెరతో పాటు కెమికల్స్ ఎక్కువగా ఉండే సోడాలు...  మైదా, పాలు, చక్కెర కలిపి తయారు చేసే డోనట్స్ కూడా  ఎంతో కీడు చేస్తాయి. ఒకేసారి పది చెంచాల చక్కెరని కడుపులోకి పంపించే ఏ ఆహార పదార్థమైనా ప్రమాదకరమేనంటారు న్యూయార్క్ టైమ్స్ సృష్టికర్త, ప్రముఖ వైద్యులు అయిన డాక్టర్ జోసెఫ్ మెర్కోలా.   ఇక సోడియం, నైట్రేట్ ఎక్కువగా ఉండే మాంస పదార్థాలని ముట్టవద్దనేది అమెరికన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ సూచన. ఉప్పు ఎక్కువ వేసి, నూనెలో వేయించే బంగాళాదుంప చిప్స్ జోలికి పోవద్దంటున్నారు మసాచుసెట్స్ లోని క్లార్క్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ డేల్ హ్యాటిస్. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తరచుగా తీసుకుంటే ఉదర క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని 2005లొ క్యాన్సర్ సైన్స్ మ్యాగజైన్ చేసిన పరిశోధనలో సైతం వెల్లడైంది. అదే విధంగా క్యాన్స్ లో నిల్వ చేసి అమ్మే ఆహార పదార్థాలు,  మార్గరీన్ చీజ్ వంటివి కూడా ఎక్కువ తీసుకోకూడదనేది నిపుణుల సూచన.   కాబట్టి వీలైనంత వరకూ వీటి జోలికి పోకుండా జాగ్రత్తపడండి. క్యాన్సర్ ని మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకోండి.  - sameeranj
చాలామంది ఉన్నట్లుండి కడుపులో మంట పుడుతోందంటూ కుర్చీలో అలాగే వాలిపోతుంటారు. దీనికి అసిడిటీయే కారణం. అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే... 1. సరిగా నిద్ర లేకపోవడం. 2. ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం. 3. ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం. 4. ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం. 5. ఉండాల్సిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. రుచిగా ఉందని ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా జరుగదు. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమౌతుంది. 6. సమయానికి భోజనం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు. అసిడిటీ మరియు గుండెల్లో మంటను అదుపు చేసేందుకు కొన్ని చిట్కాలు : 1. అసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. 2. ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించాలి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడిన ఆహారం, చాక్లెట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. 3. యాపిల్ పండు రసం, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది 4. పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. 5. తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. 6. ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. భోజనం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమించకండి. 7. మద్యపానం, ధూమపానం అలవాటుంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించండి. 8. తులసి ఆకులను ఉదయంపూట తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
కూల్ డ్రింక్స్ లో కోకాకోలా పేరు తెలియనివారు బహుశ ఉండరేమో. ఎందుకంటే ప్రపంచంలోని ఏ మూలనైనా ఇది దొరుకుంది. రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ తో ఇది వరల్డ్ మొత్తం ఆక్రమించేసింది. మొట్టమొదటి కోకాకోలాను అట్లాంటాలో 1886 లో డాక్టర్ జాన్ పెంబర్టన్ ప్రారంభించారు.  ఐదువందలకు పైగా బ్రాండ్లతో అన్ని దేశాల్లో లభిస్తోంది. ఈ కంపెనీలో దాదాపు ఏడులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచజనాభాలో అత్యధికమంది తాగే కూల్ డ్రింక్ఇదేనేమో..!  సరదాగా అప్పడప్పుడు కాకుండా రోజూ కోకాకోలానే తాగితే ఏం జరుగుతుంది...! కోకాకోలా రుచికోసం, నిల్వ కోసం దాని ఎన్నో పదార్థాలను కలుపుతారు. ఇది తాగిన తర్వాత రీప్రెష్ అనిపించడానికి కారణం వాటిలో ఉండే పదార్థాలే. మరి రోజూ కోకాకోలానే జీవితాంతం తాగితే ఏం అవుతుంది. .? కోకాకోలా  శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?  దంతాలను ఏమి చేస్తుంది..?  నీళ్ళకి బదులుగా కోకాకోలాను తాగితే శరీరానికి కావల్సిన పోషకాలను అది ఎలా భర్తీచేస్తుంది.? ఇలా అనేక అనుమానాలు వస్తాయి కదా....! వాటిని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. మోనాకోలో ఒక మహిళ 16 ఏండ్లుగా నీళ్లకు బదులుగా నేరుగా కోకాకోలానే తాగింది. మరీ ఆమె ఆరోగ్యం ఏం అయ్యింది, వాటి నుంచి సర్వైవ్ అయిందా.? ఒక వేళ మనం కూడా ఇలానే చేస్తే ఏమవుతుంది..? ... డాక్టర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పేది ఒక్కటే. శరీరజీవక్రియలు సక్రమంగాజరగాలంటే  ప్రతి మనిషి రోజూ తప్పకుండా 3 నుండి నాలుగు లీటర్ల వాటర్ నుతీసుకోవాలని. కానీ దానికి బదులుగా కొకాకోలా ను మాత్రమే తీసుకుంటే... ప్రతి రోజు తీసుకునే ఒక సింగిల్ కోక్ లో 39 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక వేళ 8 కోక్ లను ప్రతి  రోజు తాగితే అది 312 గ్రాముల చక్కెర తో సమానం. అది 6 చాక్కెట్ బార్లను ఒకే సారి తిన్నదానితో సమానం. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి  రోజులో 40 గ్రాముల కంటే తక్కువ షుగర్ ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా ఎనిమిది కోక్ లు తాగితే దాదాపు 312 గ్రాముల చక్కెర తీసుకున్నట్టే.  కేవలం కోక్ ను తీసుకోవడం వల్లనే వారానికి 8000 అదనపు కాలరీల తీసుకున్నట్లు అవుతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో షుగర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అధిక కాలరీలు తీసుకోవడం అధిక బరువు సమస్యకు దారితీస్తుంది. అలాగే దంత క్షయానికి హానిచేయడమే కాకుండా, కోక్ ను తీసుకున్న ప్రతి సారి దంతాలు, నాలుక చిగుళ్ళులపై పేరుకొనిపోయి గంటలు కొద్ది ఉంటుంది. సరిగ్గా బ్రష్ చేయకపోయే పంటి మీద ఉన్న ఎనిమల్ పోవడమే కాకుండా శాశ్వతంగా పళ్లను తీసివేయాల్సి వస్తుంది. రోజంతా ఇలానే తీసుకుంటూ ఉంటే వాష్ రూమ్ కి పదేపదే పరిగెత్తాల్సి ఉంటుంది. కోక్ లోని కెఫిన్ అనే పదార్థం అధిక మూత్ర విసర్జనకు కారణం అవుతుంది. కాబట్టి పదే పదే వాష్ రూమ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కెఫిన్ గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు కానీ అందులోని ముఖ్య ఇంగ్రీడీన్ అయిన ఫ్రక్టోస్ కార్న్ సిరప్ గురించి మాత్రం ఆందోళన చెందాలసిందే.  ఎందుకంటే ఫ్యాట్లీ లీవర్ సమస్యకు దారితీస్తుంది. దాని లక్షణాలు అలసటగా ఉండటం, పై కడుపులో నొప్పి. అయినా అలాగే కోక్ తాగడం కొనసాగిస్తే ఇంకా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తరచుగా మూర్చ పోవడం, పొటాషియం నిల్వలు తగ్గిపోవడం కూడా జరుగుతుంది. అధిక మోతాదులో షుగర్, కెఫిన్ తీసుకుంటారు కాబట్టి హృదయ స్పందనలో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ అనారోగ్య సమస్యలు అక్కడితో ఆగవు.  టైప్ -2 డయాబెటిస్ కు గురికావడం జరుగుతుంది. శరీరానికి కావల్సిన విటమిన్ లు లోపిస్తాయి. ఫలితంగా కిడ్నీ డ్యామేజి కి దారితీస్తుంది.   అయినా అలాగే కోక్ మాత్రమే తాగుతూ ఉంటే 600 పౌండ్ల వరకు బరువును పెరుగుతారు. అంతేకాదు హార్ట్ అటాక్ తో చనిపోవడం కూడా జరుగుతుంది. 16 ఏండ్లుగా కేవలంకోకాకోలా ను మాత్రమే తాగుతున్న మహిళా కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లం వంటి  చాలా సమస్యలు చవి చూసింది. చివరికి కోకాకోలా తాగడం ఆపేసింది. దాంతో చాలా తక్కువ సమయంలోనే ప్రాణాపాయం నుంచి బయట పడింది. వారానికో, నెలకో, ఏడాదికో ఒకసారి తీసుకుంటే ఫర్వాలేదు. కానీ, రోజూ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరం. అప్పుడు రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ కాస్త రెస్ట్ ఇన్ పీస్ గా మారుతుంది. సో.. కోకా కోలా గురించి ఇంత తెలిసాక కూడా మీరు తరచుగా కోకాకోలా తాగుతారా.. అలా కావాలని అనుకుంటారా.. కాదు గా..!