LATEST NEWS
తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రి కేసీఆర్ టార్గెట్ గా తాజాగా సంధించిన వమర్శనాస్త్రాలు రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  తన తండ్రి కేసీఆర్ ను, ప్రధాని మోడీనీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ ఒకే సమయంలో విమర్శలతో చెరిగేయడం   తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  డాడీ, మోడీ, చిన్న మోడీ అంటూ ఆమె ప్రయోగించిన పదాలు ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి.  డాడీ' అంటే తన తండ్రి కేసీఆర్ అని, 'చిన్న మోదీ' అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా  అయినా స్పష్టంగా చెప్పారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను   ఆమె తూర్పారబట్టారు. అలాగే తన తండ్రి కేసీఆర్ సీఎంగా ఉండగా రాష్ట్ర ప్రగతి కుంటుపడిందంటూ విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ నూ ఆమె వదల లేదు.   కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కొద్ది కాలం పాటు తన తండ్రి కేసీఆర్ ను మాత్రం మినహాయించి బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్, తన అన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లు లక్ష్యంగా ఆమె విరుచుకుపడ్డారు. అంతే కాకుండా బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులను సైతం వదలకుండా విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇక సొంత పార్టీ పెట్టడానికి ముందు ఆమె ఏకంగా బీఆర్ఎస్ కుంభ స్థలాన్నే గురిపెట్టారన్నట్లుగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఆయన మానసపుత్రిక అయిన కాళేశ్వరాన్ని దండగమారి ప్రాజెక్టు గా అభివర్ణించారు. కాళేశ్వరం అవినీతిపై విచారణకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన కవిత ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టును ఇసుమంతైనా ఉపయోగం లేని ప్రాజెక్టు అని దుయ్యబట్డడమే కాకుండా.. ప్రజాధనం దుర్విని యోగమయ్యిందంటూ విమర్శలు చేశారు. కాళేశ్వరంలో అవినీతికి హరీష్ రావును బాధ్యుడిని చేయాలంటూ డిమాండ్ చేయడం ద్వారా ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. దీంతో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీపై కవిత విమర్శలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కవిత విమర్శలు, ఆరోపణలపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్పందించకపోవడంతో మౌనం అర్ధాంగీకరం అన్న చందంగా కవిత ఆరోపణలల్లో వాస్తవం ఉందా అన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణులలోనే మొదలైంది. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి  బ్యాక్ టు వైసీపీ అన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.  అయితే తాజా పరిణామాలను బట్టి బాలినేనికి శ్రీనివాసరెడ్డికి వైసీపీ తలుపులు పర్మినెంట్ గా క్లోజ్ అయిపోయానని తేటతెల్లమైపోంది. గత ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం.. తాను స్వయంగా తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడంతో బాలినేని.. వైసీపీకి గుడ్ బై చెప్పేసి  జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని  శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు.  అయితే  గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది. జగన్ సైతం ఆయనను దూరం పెట్టారు. ఇటు బాలినేని కూడా తన అసంతృప్తినీ, అసమ్మతినీ బాహాటంగానే సాగారు. అయినా ఇటు బాలినేని కూడా మెడపట్టి బైటకు గెంటినా చూరుపట్టుకు వేళాడినట్లుగా ఎన్ని అవమానాలు ఎదురైనా వైసీపీని వీడకుండా అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ  2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. జనసేన గూటికి చేరడమైతే చేరారు కానీ.. అక్కడ ఆయనకు సరైర గుర్తింపు లభించలేదు. దీంతో బాలినేని తిరిగి వైసీపీ గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే అది ఉత్తి ప్రచారం మాత్రమేనని తాజా పరిణామంతో తేలిపోయింది.  అదెలా అంటే తాజగా జగన్  ఒంగోలు పార్టీ బాధ్యతలను చుండూరు రవి బాబుకు అప్పగిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో వైసీపీలో బాలినేని చాప్టర్ క్లోజేనని రాజకీయవర్గాలు అంటున్నాయి.  అలాగే బాలినేని కూడా తన రాజకీయ భవిష్యత్తుపై తన తాజా పోస్టు ద్వారా స్పష్టత ఇచ్చారు.  తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో  కలిసి జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను  ఇటీవల కలిసిన బాలినేని.. ఆ తరువాత సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించారు. జనసేనాని కేవలం పార్టీ అధినేత మాత్రమే కాదనీ, తన నమ్మకం, ఆశ్రయం అంటూ పేర్కొన్నారు. తద్వారా బాలనేని తాను  జనసేనను వీడుతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని పూర్వపక్షం చేశారు.   ఒంగోలు రాజకీయాల్లో ఈ మార్పులు   సంచలనంగా మారాయి. బాలినేని అనుచరులు కూడా ఆయన నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో రవి బాబు నాయకత్వంలో వైసీపీ ఏ విధంగా ముందుకు సాగుతుందీ, అలాగే  నియోజకవర్గంలో బాలినేని తన పట్టును ఏలా నిలుపుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. 
తెలంగాణ వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర విత్తమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఆయన తన బడ్జెట్ లో ఆరోగ్య శాఖకు సముచిత బడ్జెట్ కేటాయించారు. తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు.  ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం   3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో  రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు కాగా, తలసరి ఆదాయం   రూ.4,18,931 కోట్లు, వృద్ధి రేటు వృద్ధి రేటు 10.2శాతంగా ప్రతిపాదించారు.  మల్లు తన బడ్జెట్ లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.  - ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పథకానికి రూ.4,000 కోట్లు - పంట బీమా పథకానికి రూ.1,886 కోట్లు - మూసి రివర్ ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు - ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు - ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకానికి  రూ.1,056 కోట్లు  - పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు - రోడ్లు భవనాల శాఖకు రూ.6,416 కోట్లు - యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి రూ.5,000 కోట్లు కేటాయించారు. అలాగే..  - ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు - పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు - బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు - హ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు - రీజనల్ రింగ్ రోడ్డుకు రూ1,525 కోట్లు - రాజీవ్ యువ వికాసానికి రూ.5,800 కోట్లు కేటాయించారు.  ఇక పోతే... - కల్యాణలక్ష్మి / షాది ముబారక్ రూ.3,683 కోట్లు - విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.2,170 కోట్లు - స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు  - రైతు భరోసాకు రూ.18,000 కోట్లు - చేయూతకు రూ.14,861 కోట్లు - మహాలక్ష్మికి రూ.4,305 కోట్లు - సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు కేటాయించారు.   అలాగే..  - శాంతి భద్రతలు - రూ.11,907 కోట్లు - గోదావరి పుష్కరాలు - రూ.500 కోట్లు - పర్యాటక శాఖ - రూ.1,224 కోట్లు కేటాయించారు. 
పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న (టి.సి.) రాజన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 108 ఏళ్లు.  కొంతకాలంగా వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో పలమనేరులో విషాదం నెలకొంది. పలువురు రాజకీయ ప్రముఖులు రాజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.    దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన రాజన్..   గాంధీజీ, నేతాజీ సిద్ధాంతాలతో ప్రభావితుడయ్యారు. విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.   రాజకీయాల్లో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ రాజన్ నిరాడంబర జీవితాన్నే గడిపారు. ఎటువంటి ఆస్తులూ కూడబెట్టలేదు.  ఆయనకు సంత ఇల్లు లేదు.   ప్రభుత్వ పింఛన్‌తోనే ఆ  జీవనాన్ని కొనసాగించారు.  2025లో తన 108వ జన్మదినాన్ని జరుపుకున్నారు.   ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు తమ సంతాపసందేశంలో పేర్కొన్నారు.  
తెలంగాణ ప్రభుత్వం శాసనసభ, శాసనమండలిలో  సమన్వయం కోసం ప్రభుత్వ విప్‌లను   నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కోసమూ ముగ్గురు సీనియర్ శాసనసభ్యులను   విప్‌లుగా నియమించింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు,  మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో   అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా  నియమించింది.   ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికె.రామకృష్ణారావు గురువారం ( మార్చి 19) ఉత్తర్వులు జారీ చేశారు.  
ALSO ON TELUGUONE N E W S
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేదికపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి(R Narayana Murthy) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఏపీలో నంది అవార్డుల పునరుద్ధరణ గురించి వారు చేసిన విజ్ఞప్తులపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనదైన శైలిలో స్పందించారు.  నట్టి కుమార్ తాజాగా 'తెలుగువన్ సినిమా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్. నారాయణమూర్తిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించడంలో తప్పు లేదని, కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్ర వేదికపై ఉండి మరో రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడటం హుందాతనం అనిపించుకోదని ఆయన పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఏపీ నుంచి 68 శాతం రెవెన్యూ వస్తుందని, కానీ ఇండస్ట్రీ పెద్దలు ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం ఏం చేశారని నట్టి కుమార్ ప్రశ్నించారు. విభజన తర్వాత ఇన్ని ఏళ్లలో ఏపీలో ఒక్క స్టూడియో అయినా కట్టారా? లేదా ఒక్క డబ్బింగ్ థియేటర్ అయినా నిర్మించారా? అని ఆయన నిలదీశారు. కేవలం షూటింగ్‌ల కోసం టూరిస్టుల్లా వెళ్లి వస్తున్నారు తప్ప, అక్కడ శాశ్వత ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఆయన ఇండస్ట్రీ ప్రతినిధిగా చాలా హుందాతనంగా మాట్లాడారని నట్టి కుమార్ అన్నారు. చిరంజీవి ఎక్కడా ఎవరినీ తక్కువ చేయలేదని, రెండు రాష్ట్రాల్లోనూ అవార్డులు ఇస్తే కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మాత్రమే చెప్పారని గుర్తు చేశారు.  అయితే, ఇండస్ట్రీలో కొందరు ద్రోహులు ఉన్నారని, వారు ఏపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పకుండా అడ్డుపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించడానికి పిలిచినప్పుడు ఎంతమంది హీరోలు, నిర్మాతలు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వైపు నుంచి సానుకూలత ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ పెద్దలే వెనకాడుతున్నారని నట్టి కుమార్ ఆరోపించారు.  ఏపీలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలంటే కేవలం అవార్డులు మాత్రమే సరిపోవని, మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టాలని నట్టి కుమార్ చేసిన సూచనలు చర్చనీయాంశంగా మారాయి. Also Read: బుజ్జితల్లితో విజయ్-రష్మిక క్యూట్ మూమెంట్!  
- పూజా హెగ్డే అందాల జాతర - ట్రెండీ లుక్‌లో నెటిజన్ల మనసు దోచుకుంటున్న క్రేజీ బ్యూటీ. - మళ్ళీ ఫామ్‌లోకి వస్తున్న పూజా..  - తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న వైనం. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సందడి మామూలుగా ఉండదు. తనదైన స్టైల్ మరియు గ్లామర్‌తో కెమెరా కళ్లను తనవైపు తిప్పుకోవడం పూజాకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో పూజా హెగ్డే హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. తన గ్లామరస్ అప్పియరెన్స్‌తో ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్ కోసం పూజా ఒక అద్భుతమైన లైట్ స్కై బ్లూ కలర్ డ్రెస్సును ఎంచుకుంది. ఈ ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆమె మెరిసిపోతూ కెమెరాలకు ఫోజులిచ్చింది. పూజా స్టైలింగ్, ఆమె చిరునవ్వు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ఒక లెవల్లో ఉంటుందని ఈ ఫోటోలు చూస్తే మరోసారి స్పష్టమవుతోంది. నెటిజన్లు సైతం "పూజా మళ్ళీ తన పాత గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే, పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రైమ్ ఈవెంట్‌లో ఆమె నటించబోతున్న కొత్త చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వెలువడ్డాయి. అహన్ శెట్టి సరసన ‘సంకి’ అనే బాలీవుడ్ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందని, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా పూజా ధీమా వ్యక్తం చేసింది. ఇకపోతే ఈమె ఈవెంట్‌కి  హాజరవుతున్న క్రమంలోనే అక్కడున్న అభిమానులు, కెమెరామెన్ ఈమెను ఫోటోలు తీసే ప్రయత్నం చేశారు.. అయితే ఆ సమయంలో ఒక అభిమాని మిమ్మల్ని కలవాలి ఉంది అన్నాడు. దానికామె రండి అని పిలిచింది. అంత‌టితో ఆగ‌కుండా మిమ్మ‌ల్ని పెళ్లి చేసుకోవాల‌ని ఉంది అన్నాడు. పెళ్లా అంటూ న‌వ్వుకుంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది పూజా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కొంతకాలం పాటు సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడిన పూజా, ఇప్పుడు మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది. తెలుగులో కూడా అగ్ర హీరోల సరసన నటించేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. కేవలం సినిమాలే కాకుండా, ఇలాంటి భారీ ఈవెంట్లలో తన గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. ప్రస్తుతం పూజా ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె తదుపరి సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో తన స్ట్రాంగ్ కమ్ బ్యాక్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వరుస ఫోటోషూట్లు, సినిమా అప్డేట్లతో పూజా హెగ్డే మళ్ళీ టాలీవుడ్ మరియు బాలీవుడ్ మీడియాలో సెన్సేషన్‌గా నిలుస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే కేవలం వెండితెరపైనే కనిపించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు తమ రూటు మార్చారు. కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా ఓటీటీ, టెలివిజన్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా తమ జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారు. పక్కా ప్లానింగ్‌తో మల్టీ-ప్లాట్‌ఫామ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమా నిర్మాణానికి ఏడాది నుండి రెండేళ్ల సమయం పడుతోంది. ఈ గ్యాప్‌లో ప్రేక్షకుల కంటికి కనిపించకపోతే క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని గ్రహించిన హీరోలు, స్మార్ట్ మూవ్ వేస్తున్నారు. ఇటీవల 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, 'ది ట్రైటర్స్' అనే పాపులర్ రియాలిటీ షోకి హోస్ట్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం సినిమాలే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు అక్కినేని నాగచైతన్య ఇప్పటికే 'దూత' వంటి వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు దానికి సెకండ్ సీజన్ కూడా సిద్ధమవుతోంది. అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం డిజిటల్ ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇలా కేవలం ఒకే మాధ్యమానికి అతుక్కుపోకుండా అన్ని వైపులా తమ బ్రాండ్ వాల్యూని పెంచుకోవడానికి ఇదొక చక్కని మార్గంగా మారింది. ఈ మల్టీ-ప్లాట్‌ఫామ్ విధానం వల్ల హీరోలకు ఆర్థికంగా లాభించడమే కాకుండా, వారి రీచ్ కూడా అద్భుతంగా పెరుగుతోంది. ఓటీటీ మరియు టీవీ షోల ద్వారా సామాన్య ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తోంది. ఒకప్పుడు వెండితెర నటులు బుల్లితెరపై కనిపిస్తే ఇమేజ్ తగ్గుతుందని భయపడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎక్కడ కంటెంట్ బాగుంటే అక్కడ ప్రేక్షకులు ఉన్నారని మన స్టార్స్ గుర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. "మా హీరో సినిమా కోసం రెండేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి షోలు లేదా సిరీస్‌ల ద్వారా తరచూ చూడవచ్చు" అని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. భవిష్యత్తులో మరికొందరు అగ్ర హీరోలు కూడా వెబ్ ఒరిజినల్స్ మరియు టాక్ షోలలో మెరవబోతున్నారు. మొత్తానికి టాలీవుడ్‌లో  వస్తున్న ఈ మార్పులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో హీరోలు కేవలం యాక్ట‌ర్స్‌గానే కాకుండా హోస్టులుగా, డిజిటల్ స్టార్స్‌గా మల్టీ టాలెంట్ చూపిస్తారని స్పష్టమవుతోంది. మరి ఈ కొత్త బాటలో ఇంకా ఎవరెవరు అడుగులు వేస్తారో వేచి చూడాలి!
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే "విజయ్-రష్మిక పెళ్ళి భోజనానికి నన్ను పిలవలేదని, వారి ఫ్యాన్ అయిన నన్ను కూడా పిలవాలి కదా" అంటూ ఓ చిన్నారి బుజ్జి బుజ్జి మాటలతో వీడియో చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా, విజయ్ కి కూడా చేరువైంది. ఆ చిన్నారి వీడియో కింద విజయ్ ఓ క్యూట్ కామెంట్ చేశాడు. "బుజ్జితల్లి.. ఇంటికి పిలుస్తా లంచ్ కి.. నీ ఫేవరెట్ ఫుడ్, స్వీట్స్ నాకు చెప్పు, అన్నీ ఇంట్లో చేపించి మంచిగా తిందాము" అని విజయ్ రిప్లై ఇచ్చాడు. విజయ్ మాట ఇవ్వడమే కాదు, ఆ మాట మీద నిలబడ్డాడు కూడా. రీసెంట్ గా ఆ చిన్నారిని ఇంటికి పిలిచి.. తనకి ఇష్టమైన లడ్డులు, పులిహోర వంటి ఐటమ్స్ స్వయంగా వడ్డించారు. విజయ్, రష్మిక ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ముద్దాడటమే కాకుండా, ఎత్తుకొని సరదాగా కుబుర్లు చెప్పారు.  ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి బుజ్జి కోరికను తీర్చి, తనకు జీవితంలో మర్చిపోలేని మెమొరీ ఇచ్చారంటూ.. విజయ్, రష్మికపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Also Read: క్రేజీగా 'హ్యాపీ రాజ్' ట్రైలర్.. అబ్బాస్ కంబ్యాక్ అదిరిందిగా! https://x.com/Theteluguone/status/2034961769861718291
- ఈ వేసవిలో స్టార్ హీరోయిన్ల కెరీర్ క్లాష్..  - అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మృణాల్, నభా! - సమ్మర్ రేసులో సుందరీమణులు..  - 'డెకాయిట్'గా మృణాల్, 'స్వయంభు'గా నభా నటేష్ రచ్చ! తెలుగు సినీ పరిశ్రమలో వేసవి కాలం అంటే కేవలం స్టార్ హీరోల సినిమాల సందడి మాత్రమే కాదు, హీరోయిన్ల మధ్య జరిగే కెరీర్ పోటీ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. 2026 సమ్మర్ సీజన్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు తమ విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో ముందుగా వినిపిస్తున్న పేరు మృణాల్ ఠాకూర్. 'సీతా రామం', 'హాయ్ నాన్న' వంటి సినిమాలతో క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తన రూట్ మార్చింది. మృణాల్ నటిస్తున్న తాజా చిత్రం "డెకాయిట్". ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేసిన ఆమె, ఈ సినిమాలో రఫ్ అండ్ టఫ్ అవతార్‌లో కనిపించబోతుండటం విశేషం. ఏప్రిల్ 10న ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు, టాలీవుడ్ 'ఇస్మార్ట్' బ్యూటీ నభా నటేష్ చాలా కాలం తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రోడ్డు ప్రమాదం కారణంగా సినిమాలకు కొంత కాలం దూరమైన నభా, ఇప్పుడు భారీ పీరియాడిక్ ఫాంటసీ చిత్రం "స్వయంభు"తో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కోసం నభా గుర్రపు స్వారీ, యుద్ధ విద్యల్లో శిక్షణ కూడా తీసుకోవడం విశేషం. ఆమె కెరీర్‌కు ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది. మృణాల్ ఠాకూర్ తన వర్సటాలిటీని నిరూపించుకోవాలని చూస్తుంటే, నభా నటేష్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో గ్రాండ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉంది. గతంలో 'మ్యాస్ట్రో' వంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో నభాకు ఈ 'స్వయంభు' రిజల్ట్ చాలా ముఖ్యం. అటు మృణాల్ తన మాస్ యాంగిల్‌తో ఏ మేరకు మెప్పిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ఇద్దరు భామల సినిమాలపై విపరీతమైన చర్చ నడుస్తోంది. నభా మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే, మృణాల్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉండబోతున్నాయో అన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. ఈ సమ్మర్ బాక్సాఫీస్ పోరులో ఎవరికి ప్రేక్షకులు పట్టం కడతారో చూడాలి. ఈ భారీ చిత్రాల విడుదల తర్వాతే ఈ ఇద్దరు భామల తదుపరి ప్రాజెక్టులు మరియు కెరీర్ గ్రాఫ్ ఆధారపడి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్స్ మరియు ప్రమోషన్స్ ఈ పోటీని మరింత వేడెక్కించనున్నాయి. రాబోయే వేసవిలో బాక్సాఫీస్ క్వీన్ ఎవరో తేలిపోనుంది.
మ్యూజిక్ డైరెక్టర్‌గా, యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జి.వి. ప్రకాష్ కుమార్, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'హ్యాపీ రాజ్'(Happy Raj). తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. ముఖ్యంగా ఒకప్పటి లవర్ బాయ్ అబ్బాస్ ఈ సినిమాతో మళ్ళీ వెండితెరపై మెరవడం ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. (Happy Raj Trailer) ట్రైలర్ చూస్తుంటే ఇదొక యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ట్రైలర్ ప్రారంభం నుంచే చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. హీరో రాజ్ (జి.వి. ప్రకాష్) తన ప్రేమను గెలిపించుకోవడానికి పడే పాట్లు, ఆ క్రమంలో వచ్చే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తున్నాయి. ముఖ్యంగా హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ మధ్య జరిగే డ్రామా, కన్ఫ్యూజన్ కామెడీ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్‌లో సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. సీన్ల మూడ్‌ను బట్టి ఆయన ఇచ్చిన మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. విజువల్స్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉన్నాయి.  కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కథలో ఒక బలమైన ఎమోషనల్ పాయింట్ కూడా ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇది ఒక అబ్బాయి పెళ్లి చుట్టూ తిరిగే కథ. ప్రేమించిన అమ్మాయి తండ్రిని (అబ్బాస్) ఒప్పించడానికి హీరో చేసే ఫీట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే తండ్రి కొడుకుల ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తానికి 'హ్యాపీ రాజ్' ట్రైలర్ ఒక మంచి ఎంటర్‌టైనర్ అనే భరోసా ఇస్తోంది. జి.వి. ప్రకాష్ మార్కు నేచురల్ యాక్టింగ్, శ్రీగౌరి ప్రియ క్యూట్‌నెస్ ఆకట్టుకున్నాయి. ఇక అబ్బాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వింటేజ్ ఫీల్‌ను ఇస్తోంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తోంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. మార్చి 27న విడుదల కానున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి. Also Read: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న ‘ఫోర్త్ ఫ్లోర్’.. ఆ నాలుగో అంతస్తులో ఏం జరిగింది?
-పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్ 2  -శంకర్ ట్వీట్ వైరల్  -ట్వీట్ లో ఏముంది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ధురంధర్ 2(Dhurandhar 2)హవా స్పష్టమనే సంకేతాలు వచ్చేస్తున్నాయి. ప్రీమియర్స్ తో పాటు తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు టాక్  విషయంలో ఏమైనా మార్పు వస్తుందేమో అనే చర్చ కొంతమందిలో జరిగింది. కానీ రెండో రోజు కూడా బాగుందనే టాక్ వస్తుండటంతో పార్ట్ 1 లాగానే పార్ట్ 2 కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తుందనే నమ్మకంతో అందరు ఉన్నారు. చాలా మంది సినీ ప్రముఖులు కూడా ధురంధర్ 2 ని వీక్షించి  తన అభినందనలు చెప్తున్నారు. అలాంటి వాళ్ళల్లో శంకర్(Shankar)కూడా ఒకరు. ఆయనేం చెప్పాడో చూద్దాం. ఎక్స్ వేదికగా శంకర్ స్పందిస్తు నిజంగా జరిగిన సంఘటనలని కల్పిత పాత్రలతో తెరకెక్కించి ఒక అద్భుతమైన సినిమాని ధురంధర్ 2 ద్వారా దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar)అందించారు. సినిమా చూస్తున్నంత సేపు డ్యూరేషన్ ఎక్కువగా ఉందనే ఆలోచన కూడా రాలేదు. కొన్ని సీన్స్ ని ఎంతో కన్వీనెంట్ గా లెంగ్త్ తో సంబంధం లేకుండా తెరకెక్కించడం ఊహించని విధంగా ఉంది. శాశ్వత్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. రణవీర్(Ranveer SIngh)టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ చూడటం  ఎంతో ఆనందంగా ఉంది. మాధవన్ కూడా తన పెర్ఫార్మన్స్, ఎక్స్ ప్రెషన్స్ తో సాలిడ్ గా కనిపించారు. ముఖ్యంగా నటీనటుల ఎంపిక సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. ఇండియన్ సినిమా దగ్గర ధురంధర్ 2  ఒక చారిత్రక మూమెంట్ గా నిలుస్తుందని శంకర్ ఎక్స్ వేదికగా తెలిపాడు. Also read: Kanyakumari: థియేటర్స్‌లో చూడలేదు.. ఓటీటీలో తెగ చూసేస్తున్నారని ఎందుకు  ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద శంకర్ ద్వారా కూడా కొత్త రకం కథ, కథనం, టేకింగ్ తో కూడిన సినిమాలు వచ్చాయి. కాకపోతే కొంత కాలం నుంచి వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు. భారతీయుడు 2 , గేమ్ చేంజర్ చిత్రాలే ఉదాహరణ. తన అప్ కమింగ్ మూవీతో అయిన శంకర్ తన పూర్వ వైభవాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటి ఈ టైంలో ధురంధర్ పార్ట్ 1 ని పొగుడుతు శంకర్ నుంచి ట్వీట్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో  ధురంధర్ 2 ని శంకర్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనని కూడా కొంత మంది   నికార్సయిన సినిమా ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.     
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళ, తమిళ మేకర్స్ తీసే మిస్టరీ థ్రిల్లర్స్ అంటే మన ప్రేక్షకులకు చాలా ఆసక్తి. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై ప్రశంసలు అందుకున్న తమిళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘ఫోర్త్ ఫ్లోర్’ (Fourth Floor).. మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. ‘ఫోర్త్ ఫ్లోర్’ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఈరోజు(మార్చి 20) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సస్పెన్స్ రైడ్‌ను ఎంజాయ్ ఎంజాయ్ చేయవచ్చు. ఎల్.ఆర్. సుందరపాండి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బిగ్ బాస్ తమిళ విన్నర్ ఆరి అర్జునన్ ప్రధాన పాత్ర పోషించారు. తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ వల్ల చెన్నై వెళ్లిన హీరో, అక్కడ ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫోర్త్ ఫ్లోర్ లో దిగుతాడు. అప్పటి నుంచి అతనికి ఎదురైన విచిత్రమైన అనుభవాలు, ఆ ఫోర్త్ ఫ్లోర్ వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ ఏమిటన్నదే ఈ సినిమా కథాంశం. సినిమాలో ఆరి అర్జునన్ నటనతో పాటు దీప్సిక, పవిత్ర తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కథలో ఉండే సైకలాజికల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను చివరి వరకు సీటు అంచున కూర్చోబెడతాయి. ధరణ్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ హారర్ మూడ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో ‘ఫోర్త్ ఫ్లోర్’ ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.  Also Read: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం'
  -ఓటిటి లో రికార్డ్స్  -షేర్ చేస్తున్న ప్రేక్షకులు  -ఇంతకీ ఏంటి ఆ మూవీ   రంగం మూవీలోని 'ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే.. పిచ్చి పరుగులు తీసే వెల్లివిరిసెను వయసే' అనే సాంగ్ ని ఇప్పుడు ఓటిటి మూవీ లవర్స్ ఒక సినిమా విషయంలో విపరీతంగా పాడుకుంటున్నారు. ఈ విషయంలో పదాలు మార్చాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేకుండా పోతుంది. ఇందుకు అవకాశం కల్పించిన చిత్రం 'కన్యాకుమారి'. పైగా ఎంతో పుణ్యాన్ని కూడా మూటగట్టుకుంటుంది. ఏంటి! అసలు మీరేం చెప్తున్నారో మీకు అర్ధమవుతుందా అనే డౌట్ మీకు రావచ్చు. మరి మీ డౌట్ కి పూర్తి క్లారిఫై ఇస్తున్నాం. కన్యాకుమారి(Kanyakumari)గత ఏడాది ఆగస్ట్ 17న థియేటర్లలో అడుగుపెట్టింది. కానీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతోనో లేక అదే టైంలో కూలీ, వార్ 2 థియేటర్స్ లోకి అడుగుపెట్టడం వలనో     బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. అసలు కన్యాకుమారి రిలీజ్ అయ్యిందనే విషయం కూడా ఎవరికీ తెలియలేదు. కానీ సెప్టెంబర్ 17న ఓటీటీలో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన దగ్గర్నుంచి  రోజు రోజుకి అత్యధిక వ్యూస్ ని రాబడుతు  ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. యూత్ టార్గెట్ గా పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ,జీవితం, బ్రేకప్ వంటి అంశాలతో క్లీన్ కదాంశాలతో మూవీ సాగుతుంది.  చిత్రంలో ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేదు. శ్రీచరణ్, గీత్ సైనీ జంటగా చేయగా, బలగం ఫేమ్ మురళి గౌడ్ ముఖ్యమైన క్యారక్టర్ ని పోషించాడు.   Also read: Dhurandhar 2: ధురంధర్ 2 కి మోదీ నోట్ల రద్దుకి సంబంధం ఉందా!  ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది. . రవి నిడమర్తి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అయ్యాయి. సృజన్ అట్టాడ(Srujan attada) దర్శకత్వం కూడా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. కన్యాకుమారి లవర్స్ ప్రస్తుతం ఈ మూవీ క్లిప్స్ ని  సోషల్ మీడియాలో షేర్ చేస్తు సందడి చేస్తున్నారు. మరి మీరు కూడా మిస్ అవ్వకండి. చూసాక మీరే పైన చెప్పుకున్న కన్యాకుమారి లవర్స్ లో ఒకరిగా మారతారు.    
శ్రీవిష్ణు అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. ఓ వైపు విభిన్న సినిమాలు చేస్తూనే, మరోవైపు ప్రేక్షకులు తన నుంచి ఆశించే ఎంటర్‌టైనర్స్ తో అలరిస్తుంటాడు. ఇటీవల 'విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) సినిమాతో థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. బాగానే నవ్వులు పూయించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ మూడు వారాలకే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. 'విష్ణు విన్యాసం' డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. ఈరోజు(మార్చి 20) నుంచి 'విష్ణు విన్యాసం' స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది. థియేటర్లలో బాగానే నవ్వించినప్పటికీ 'సామజవరగమన', 'సింగిల్' సినిమాల స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది 'విష్ణు విన్యాసం'. రిజల్ట్ తో సంబంధం లేకుండా శ్రీవిష్ణు మార్కు కామెడీకి ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటారు. అందుకే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే ఎదురుచూశారు. ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇవ్వడంతో అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకునే అవకాశముంది. డెబ్యూ డైరెక్టర్ యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన 'ఆయ్' ఫేమ్ నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఒంగోలు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో శ్రీవిష్ణు ఒక జూనియర్ లెక్చరర్‌గా కనిపించాడు. ముఖ్యంగా న్యూమరాలజీని పిచ్చిగా నమ్మే హీరో, చిత్ర విచిత్రంగా ప్రవర్తించే హీరోయిన్ మధ్య జరిగే కామెడీ డ్రామా ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది.  కాగా, 'విష్ణు విన్యాసం' విడుదలైన వారానికే మార్చి 6న 'మృత్యుంజయ్'(Mrithyunjay) సినిమాతో థియేటర్లలో అడుగుపెట్టాడు శ్రీవిష్ణు. ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది. Also Read: బిగ్ షాక్.. పెద్ది మళ్ళీ వాయిదా.. అసలేం జరుగుతోంది?
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
నిజమే ఉగాది పండుగ మనదే. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది తోనే ప్రారంభమవుతుంది.  మన కొత్త సంవత్సరం అంతా ఎంతో కళను నింపుకుని ఉంటుంది. సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా కృత్రిమత్వంలో పడిపోతున్న మనిషిని బయటకు తీసుకొచ్చి కాసింత ప్రకృతి మధ్య నిలబెడుతుంది. ఇంతకూ మన ఉగాది మనకు మాత్రమే తెలుసా!! మనకు తెలిసిన ఉగాది ఏంటి?? మనం రేపటి తరానికి ఉగాది గురించి చెబుతున్నది ఏంటి??  ఉగాది వెనుక కథ!! సోమకుడు అనేవాడు వేదాలను హరించాడు(దొంగిలించాడు). అలా వేదాలను దొంగిలించిన సోమకుడిని  మత్స్యవతారంలో ఉన్న  విష్ణువు వధించి(సంహరించి, చంపి) వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంను పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  అయితే చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా మారిన కారణంతో ఆ యోధుడిని స్మరించుకుంటూ ఉగాది జరుపుకుంటారని చారిత్రక వృత్తాంతం. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఉగాది అనేది ఓ కొత్తదనానికి సూచిక.  ఆశను మొలిపించే తరుణం!! మనిషి తరతరాలుగా ఓ నమ్మకంతో ఉన్నాడు. అదే కొత్తదనంలో జీవితం కొత్తగా మారుతుందని. అది చాలా మంచి ఆశావహదృక్పథం కలిగి ఉంటుంది. ఆకురాల్చు కాలంలో చెట్ల ఆకులు అన్నీ పోయాక, మోడువారి ఏమీలేనితనంతో ఉన్నప్పుడు, వసంతం వస్తుంది, మెల్లిగా చివురులు తొడుగుతాయి చెట్లు. అవన్నీ పచ్చని ఆశల చివురులు, ఉగాదిలో దాగున్నది అదే అంటారు అందరూ. షడ్రుచులు-జీవితసారం!! ఉగాది రోజు అందరి ఇళ్లలో ఉండే ప్రత్యేక విందు ఉగాది పచ్చడి. నిజానికి జీవితమంతా ఆ పచ్చడిలోనే ఉందని చెబుతారు పెద్దలు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, ప్రేమలు, పొట్లాటలు ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులలో కలిసిపోయి ఉంటాయని చెబుతారు. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడికి నత ప్రత్యేకత వచ్చి పడింది. అలాగే మరొక విషయం కూడా. ఉగాది సమయంలోనే కొత్త బెల్లం దొరుకుతుంది, మామిడికాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఈ సమయానికి కాస్త చిన్న చిన్నగా ఉన్న వగరుతో ఉన్న కాయలు వస్తాయి. ఇంకా ఎంతో గొప్ప ఔషధ మూలాలు కలిగిన వేపచెట్లకు పువ్వులు పూస్తాయి, కొత్త చింతపండు ఎర్రెర్రగా నిగానిగలాడుతూ అందరి ముందుకూ వస్తుంది.  వీటన్నింటి కలయిక అయిన వేపపచ్చడి ఆరు రుచులతో కనువిందు చేస్తుంది. సంప్రదాయపు గీతిక!! ఉగాది రోజు మగవాళ్ళు అందరూ పంచెకట్టులోనూ, ఆడవాళ్లు పట్టుచీరల్లోనూ, పిల్లలు కొత్త బట్టల్లోనూ మెరిసిపోతూ ఉంటారు. ఆ వస్త్రధారణలో అసలైన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నగరాలలో కృత్రిమత్వంలో మునిగిపోయిన యువత ఎంతో అందంగా, పద్దతిగా, బుద్దిగా ఇలా తయారైతే ఇంటిల్లిపాదికీ ఎంత సంతోషమో!! ఇంకా పంచాంగ శ్రవణం మరొక వేడుక, పిండి వంటల సంబరం మరొక ఎత్తు. ఇలా అన్ని విధాలుగా ఉగాది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. మనిషి జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఉగాది చెబుతుంది. అభివృద్ధి వేగంలో మనిషి మర్చిపోతున్న అసలైన నడవడికను మన ఉగాది మనకు తిరిగి అందిస్తుంది. అందుకే ఇది మన తెలుగుసంవత్సరం అని గొప్పగా జరుపుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.   
  ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతిరోజూ మాత్రలు మింగడం, ఇన్సులిన్ తీసుకోవడం మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. మీ ఇంట్లోనే, మీ వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తే ఎంత బాగుంటుంది కదా? ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు సూచించిన ఒక అద్భుతమైన "డబుల్ ధమాకా" చిట్కా గురించి ఈ Video Link క్లిక్ చేసిన మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఈ మార్పు ఎందుకు చేసుకోవాలి? (Why Should We?) సాధారణంగా మనం తినే రోటీలు కేవలం ఆకలిని తీరుస్తాయి. కానీ వాటికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జత చేయడం వల్ల అవి ఔషధాలుగా మారుతాయి: • సహజసిద్ధమైన పరిష్కారం: ఎటువంటి రసాయనిక మందులు లేకుండానే ఉదయం పూట సాఫీగా విరేచనం అయ్యేలా చేస్తుంది. • పోషకాల గని: చియా సీడ్స్ వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం మరియు ఫైబర్ అందుతాయి. • దీర్ఘకాలిక ప్రయోజనాలు: కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో బరువు పెరగకుండా, హార్మోన్ల అసమతుల్యత కలగకుండా కాపాడుతుంది. • మెదడు ఆరోగ్యం: వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (అల్జీమర్స్), పార్కిన్సన్స్ వంటి సమస్యలు రాకుండా ఈ పదార్థాలు రక్షణనిస్తాయి. • మందుల వాడకం తగ్గుతుంది: సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఈ రోటీలు తీసుకోవడం వల్ల మీరు వాడే షుగర్ మాత్రల డోస్, ఇన్సులిన్ అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎలా తయారు చేసుకోవాలి? (How-to Guide) మీరు రోజూ తినే రెండు పుల్కాలు లేదా రోటీల పిండిలో ఈ క్రింది విధంగా కలపండి: 1. మలబద్ధకం సమస్య ఉన్నవారి కోసం: • చియా సీడ్స్: 2 నుండి 3 టీస్పూన్ల చియా సీడ్స్‌ను 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. • సబ్జా గింజలు: 1 నుండి 1.5 టీస్పూన్ల సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలి. • ఈ నానబెట్టిన గింజలను నీటితో సహా పిండిలో కలిపేసి రొట్టెలు చేసుకోవాలి. 2. షుగర్ (డయాబెటిస్) నియంత్రణ కోసం: • పచ్చి పనసకాయ పొడి: 2 నుండి 3 టీస్పూన్ల పచ్చి పనసకాయల పొడిని పిండిలో కలపాలి (ఇది ఆన్‌లైన్ లేదా మెడికల్ షాపుల్లో దొరుకుతుంది). • మెంతి పొడి: ఒక టీస్పూన్ వేయించిన మెంతుల పొడిని కలపాలి. • ఈ మిశ్రమంతో రోటీలు చేసుకుంటే మెంతి పొడి వల్ల వచ్చే చేదు కూడా వేడి చేయడం వల్ల తగ్గుతుంది, రుచిగా ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not to Do) • నానబెట్టకుండా వాడకండి: చియా సీడ్స్ లేదా సబ్జా గింజలను నేరుగా పిండిలో కలపకూడదు, కచ్చితంగా నానబెట్టాలి. • పనస పండు వద్దు: షుగర్ ఉన్నవారు పనస పండు తినకూడదు (గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ), కేవలం 'పచ్చి పనసకాయ పొడి' మాత్రమే వాడాలి. • మందులు ఆపకండి: ఈ చిట్కాలు పాటిస్తూనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, షుగర్ లెవల్స్ తగ్గుతున్న కొద్దీ డాక్టర్ సలహాతోనే డోస్ తగ్గించుకోవాలి. • అతిగా వద్దు: ఆరోగ్యానికి మంచిది కదా అని మితిమీరిన పరిమాణంలో పదార్థాలను వాడకండి, పైన చెప్పిన కొలతలు పాటించండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఈ రోటీలను పిల్లలకు ఇవ్వవచ్చా? జ: తప్పకుండా ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు పదార్థాల పరిమాణం (డోస్) కాస్త తగ్గిస్తే సరిపోతుంది. ఇది వారి జీర్ణక్రియకు చాలా మంచిది. ప్ర: గింజలను విడిగా నీటిలో కలుపుకొని తాగితే సరిపోదా? రోటీలోనే ఎందుకు కలపాలి?  జ: రోటీలో కలిపి వేడి చేయడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే, ఔషధంలా విడిగా తీసుకోకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసికంగా కూడా బాగుంటుంది మరియు రుచిగా ఉంటుంది. ప్ర: ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇవి తీసుకోవచ్చా?  జ: అవును, ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్, బరువు పెరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాల కోసం, ప్రత్యక్ష నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్  క్లిక్ చేయండి  👉 [www.youtube.com/@Naveenacolumn] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)