వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..
కుడుములు , ఉండ్రాళ్ళు..
వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.
బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్..
అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది.
జిల్లేడు కాయలు , మోదకాలు..
విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది.
పాయసం , పరమాన్నం..
పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది.
పులిహోర..
ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి.
చలిమిడి , వడపప్పు..
వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి , పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది.
పండ్ల నివేదన , పత్రీ ప్రభావం..
స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. !
*రూపశ్రీ.