LATEST NEWS
సామాన్యులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. రాజకీయం, సినిమా లేదా మరేదైనా అంశమైనా సరే, తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు.. సినిమాని ఆకాశానికెత్తుతారు, సినిమాని విమర్శిస్తారు.. ఇలా నచ్చిన అంశం మీద స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. అయితే, ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా వేదికగా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలన్నా భయపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నవారికి సీఐడీ నోటీసులు వస్తుండటమే ఆ భయానికి కారణం. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ వ్యక్తి చేసిన ఫేస్ బుక్ పోస్ట్ ని.. గుంటూరు కి చెందిన 66 ఏళ్ళ రంగనాయకమ్మ షేర్ చేశారు. దీంతో ఆమెకి సీఐడీ అధికారులు నోటీసులిచ్చి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తాజాగా రాజమహేంద్రవరంకి చెందిన అనూష ఉండవల్లికి కూడా నోటీసులను అందజేశారు. అధికార పార్టీకి, అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టినందుకే ఆమెకు నోటీసులు అందాయి. దీంతో నెటిజనులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు, ప్రతిపక్ష టీడీపీ.. జగన్ సర్కార్ ప్రజల స్వేచ్చని హరిస్తోందని, కక్ష సాధింపులకు దిగుతోందని విమర్శిస్తోంది. ఇక టీడీపీ నారా లోకేష్ అయితే.. మరి సోషల్ మీడియాలో మీ అంతుచూస్తాం, చంపుతాం అని బెదిరిస్తున్న వారి మీద చర్యలు తీసుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా మాట్లాడితే మీ అంతుచూస్తాం అంటూ కొందరు దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లోకేష్.. మరి వీరిపై చర్యలు తీసుకోరా? అని జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినందుకు నోటీసులు, విచారణ, అరెస్టులు అంటున్నారు. మరి అదే సోషల్ మీడియాలో ఎందరో అసభ్యకరంగా పోస్ట్ లు పెడుతున్నారు.. మరి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబసభ్యుల గురించి కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మహిళల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు కొన్ని కులాలను టార్గెట్ చేస్తూ, కుల విభేదాలు రెచ్చగొడుతున్నారు. మరికొందరు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని వదిలేసి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నవారిపై మాత్రమే చర్యలు తీసుకోవడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
పవిత్ర శ్రీశైల క్షేత్రంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొందరు అక్రమార్కులు భక్తుల సొమ్ములు కాజేశారు. శ్రీఘ్ర దర్శనాలు, అభిషేకం టికెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చాలా వరకు స్వాహా చేశారు. 150 రూపాయల శ్రీఘ్రదర్శనంలో కోటి 80 లక్షల రూపాయలను, 1500 రూపాయల అభిషేకం టికెట్లలో 50 లక్షలను, డొనేషన్స్ కౌంటర్లలో కోటి రూపాయలను, వసతి సదుపాయం కౌంటర్లో 50 లక్షలను కాజేశారు. టోల్ గేట్ పెట్రోల్ బంకుల నిర్వహణలో రూ.40 లక్షలు, 500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో 50 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. అవినీతికి పాల్పడ్డ అక్రమార్కులు ఏకంగా సాఫ్ట్‌వేర్‌నే మార్చేశారు. అవినీతి బండారం బయటపడుతుంటంతో ఈవోకి పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు ఉద్యోగులు. ఈ అంశంపై శ్రీశైలం ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ.. భారీ ఎత్తున అవినీతి జరిగింది వాస్తవమేనని అన్నారు. మొత్తం అవినీతి ఎంత జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి నివేదిక రాలేదన్న ఆయన.. రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. ఈ విషయం మీద ప్రభుత్వానికి కూడా నివేదిక తయారు చేస్తున్నామని ఈవో రామారావు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు.. లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో చంద్రబాబు ఈరోజు ఏపీకి వచ్చారు. రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి తాడేపల్లి‌లో తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబు.. గరికపాడు చెక్‌‌పోస్ట్ దాటారు. చెక్‌ పోస్ట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ వాహనాల వరకు అనుమతించిన పోలీసులు...అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీలు చేశారు.  నిజానికి చంద్రబాబు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లాలనుకున్నారు. వెళ్లేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ.. విమాన సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో చివరి నిమిషంలో విశాఖ పర్యటన వాయిదా పడింది. విశాఖ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి చేరుకున్నారు. 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాలకు అమరావతి నుంచే హాజరుకానున్నారు. ఈ నెల 27, 28న మహానాడును నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌లో మహానాడును నిర్వహించనున్నారు. జూమ్ యాప్ ద్వారా సుమారు 14 వేల మంది పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వివాదంలో చిక్కుకున్నారు. కూన వాహనాలు సీజ్ చేసినందుకు తనపై కక్షకట్టి బదిలీ అయ్యేలా చేశారని శ్రీకాకుళం జిల్లా, పొందూరు తహసీల్దార్ రామకృష్ణ ఆరోపిస్తున్నారు. అందుకు ఇదే సాక్ష్యమంటూ కూన రవికుమార్  ఫోన్‌లో దుర్భాషలాడిన ఆడియో క్లిప్ ను తహసీల్దార్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఆడియో జిల్లాలో హల్ చల్ చేస్తోంది.  ఈ నెల 18న గోరింట గ్రామంలో కూన సోదరుడుకి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లు మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తుండగా.. వీఆర్వో సమాచారం మేరకు తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవి కుమార్ తహసీల్దార్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది జరిగిన వారం రోజులకు తహసీల్దార్ రామకృష్ణ ఆకస్మిక బదిలీ అయ్యారు. క్వారంటైన్‌లో వసతుల విషయంలో తహసీల్దార్ చేతివాటం ప్రదర్శించారంటూ కూన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు తహసీల్దార్ రామకృష్ణపై బదిలీ వేటు వేశారు.  అయితే కూన సోదరుడుకి చెందిన వాహనాలు సీజ్ చేసినందుకు తనపై కక్షకట్టి బదిలీ అయ్యేలా చేశారని తహసీల్దార్ ఆరోపిస్తూ.. కూన రవికుమార్ ఫోన్‌లో దుర్భాషలాడిన ఆడియోను విడుదల చేశారు. ఇప్పటికే, కూనరవి మీద పొందూరు పీఎస్ లో తహశీల్దార్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 10,240 శాంపిల్స్ ను పరీక్షించగా 44మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.  అదే సమయంలో 41 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొంది. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,621కు చేరింది. గత 24 గంటలలో కృష్ణా జిల్లాలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య మొత్తం 56కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1848 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 767 మంది చికిత్స పొందుతున్నారు.
ALSO ON TELUGUONE N E W S
థియేటర్లు మూత పడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. నిజమే. మరి, టీవీ ఇండస్ట్రీ సంగతి ఏంటి? లాక్‌డౌన్ వలన బుల్లితెర కూడా బాగా నష్టపోయింది. టీవీ సీరియళ్లు, షోలు చేసే నటీనట సాంకేతిక వర్గం సైతం ఖాళీగా ఇంట్లో కూర్చుంటోంది. కొత్త షోలు చేయడం కుదరక పాత హిట్ సీరియళ్లు, షోలను రీటెలికాస్ట్ చేస్తున్నారు. దీనివల్ల యాడ్స్ తగ్గాయి. యాడ్ రెవిన్యూ తగ్గింది. కరోనా దెబ్బకు బుల్లితెర కూడా బాగా కుదేలైంది.  లాక్‌డౌన్ ఎఫెక్ట్ వలన టీవీ ఇండస్ట్రీకి ఎంత లాస్ వచ్చిందో తెలుసా? నెలకు ఇంచుమించు రూ. 500 కోట్లు. అవును... అక్షరాలా ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతినెలా టీవీ ఇండస్ట్రీ నష్టపోతోంది. తెలుగు ఛానల్స్ లో సుమారు 60 సీరియళ్లు, 20 షోలు నడుస్తున్నాయని అంచనా. మొత్తం మీద ఏడువేల మంది పని చేస్తున్నారట. వాళ్లందరికీ పని లేకుండా పోయింది. అలాగే, ఒకప్పుడు మెయిన్‌స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ యాడ్ రెవెన్యూ నెలకు 500 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు అటు ఇటుగా 100 కోట్లు కూడా రావడం లేదట. యాడ్ రెవెన్యూ 30 శాతం తగ్గిందని టాక్. మొత్తం మీద అన్ని ఛానల్స్ కలుపుకుంటే, లెక్కలు సరిగా తీస్తే నష్టాలు ఇంకా ఎక్కువ ఉంటాయని అంచనా.
కాలగతిలో అనేక అనేక మార్పులకు తప్పకుండా కరోనా కారణం అవుతుందని చెప్పడానికి, ముఖ్యంగా సినిమాల్లో సన్నివేశాలు మారతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పట్లో హాట్ హాట్ బెడ్ రూమ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ తీసే సాహసం ఎవరూ చేయకపోవచ్చు. ఒకవేళ రచయితలు అటువంటి సన్నివేశాలు రాసినా, అవి తీయడానికి దర్శకులు సిద్ధమైనా... నటీనటులు నో చెప్పవచ్చు. ఒకప్పుడు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇకపై అటువంటి సన్నివేశాలకు దూరమని స్పష్టం చేశారు. "ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉండటమే మంచిదని అనుకుంటున్నాను. అయితే, సందీప్ కిషన్ సరసన నటిస్తున్న 'ఏ1 ఎక్స్ ప్రెస్'లో రొమాంటిక్ సీన్స్ ఇదివరకే షూటింగ్ చేశాం" అని లావణ్య త్రిపాఠి అన్నారు. దీన్నిబట్టి నీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కంటికి కనిపించని కరోనా ఏ పక్క నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియదు. తాకడం సంగతి పక్కన పెడితే... కరోనా సోకిన వాళ్లకు కొంత దూరంలో ఉన్న వచ్చే అవకాశం ఉందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారు బయటకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. అటువంటిది సహ నటీనటులకు ముద్దులు ఇవ్వడం కౌగిలించుకోవడం వంటివి చేయడానికి ఆలోచించడం తప్పేమీ కాదు. Lavanya Tripathi,Actress Lavanya Tripathi, lavanya tripathi a1 express,Lavanya Tripathi actress News
సుప్రీమ్ హీరో సాయి తేజ్ కొత్త సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్'లో 'నో పెళ్లి' సాంగ్ ఈరోజు ఉదయం విడుదలైంది. పెళ్లి వద్దనే యువకులు పాడుకోవడానికి ఈ పాట భలే ఉంటుంది. 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ‌... భర్తగా మారకు బ్యాచిలరు' పాట తర్వాత పెళ్లికి వ్యతిరేకంగా వచ్చిన పాటల్లో ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ అందించిన బాణీ ప్రేక్షకులు హమ్ చేసుకునేలానే ఉంది. ప్రస్తుతానికి థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. సినిమాలో విజువల్స్ వాడకుండా సాంగ్ కోసం ప్రత్యేకంగా షూట్ చేశారు. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే... మరో ఇద్దరు హీరోలు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం! మెగా హీరో సాయి తేజ్ కోసం మరో మెగా హీరో వరుణ్ తేజ్ పాటలో కనిపించాడు. వీళ్ళిద్దరూ బావ బావమరిది అనే సంగతి తెలిసిందే. బావ కోసం వరుణ్ తేజ్ అతిధి పాత్రలో మెరిశాడు. మరో విశేషం ఏంటంటే... ఇటీవలే తన ప్రేమ విషయం పబ్లిక్ గా ప్రకటించి, ఈ ఏడాదే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న రానా దగ్గుబాటి సైతం ఈ పాటలో 'నో పెళ్లి' అంటూ పాడుతూ కనిపించడం. ప్రస్తుతానికి ఈ పాట సినిమాపై క్రేజ్ పెంచింది. కరోనా వార్తలు తప్ప మరో విషయం పట్టించుకోని ప్రజల్లోకి సినిమా వెళ్లేలా చేసింది. ‌
  కమెడియన్ హర్షవర్ధన్ ఉన్నాడు కదా. ఆయన రైటర్ కూడానూ! నితిన్ 'ఇష్క్', 'గుండెజారి గల్లతయ్యిందే', అక్కినేని కుటుంబం నటించిన 'మనం' తదితర చిత్రాలకు రచయితగా పని చేశాడు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అని ఒక సినిమాకి డైరెక్షన్ చేశాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... అతడో వెబ్ సిరీస్‌లో రెండు ఎపిసోడ్స్‌ని డైరెక్ట్ చేశాడు. పదమూడేళ్ల క్రితం బుల్లితెర మీద నవ్వులు పంచి ప్రభంజనం సృష్టించిన 'అమృతం'కి సీక్వెల్ 'అమృతం ద్వితీయం'. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ గ్రూప్‌కి చెందిన డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్ జీ5లో వెబ్ సిరీస్ కింద వస్తుంది. ఉగాదికి స్టార్ట్ అయింది. ఇందులో రెండు ఎపిసోడ్స్‌ని హర్షవర్ధన్ డైరెక్ట్ చేశాడని ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ గుణ్ణం చెప్పారు. ఉగాదికి 'అమృతం ద్వితీయం' స్టార్ట్ చేసినప్పుడు ప్రతినెలా మూడు ఎపిసోడ్స్ లైవ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, లాక్‌డౌన్ ఎఫెక్ట్ వల్ల కుదరలేదు. జూన్ 25 నుండి క్రమం తప్పకుండా చేస్తామని జీ 5 క్రియేటివ్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయల చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తీసిన రెండు స్పెషల్ ఎపిసోడ్స్ ను మే 27న లైవ్ చేస్తున్నామని ఆయన అన్నారు.
ఐశ్వర్య రాజేష్ పేరు చెబితే తమిళ చిత్ర పరిశ్రమ నుండి తెలుగులోకి వచ్చిన కథానాయికగా అని కొందరు భావిస్తారు. అది తప్పు. తను తెలుగమ్మాయే. తెలుగులో ఒకప్పుడు కథానాయకుడిగా సినిమాలు చేసిన రాజేష్ కుమార్తె. ఆమెకు హాస్యనటి శ్రీలక్ష్మి స్వయానా మేనత్త. తమిళంలో పాతిక దాకా సినిమాలు చేసిన తర్వాత తెలుగుకి రావడంతో చెన్నై సుందరి అనుకుంటారంతా. ఒకప్పటి టాలీవుడ్ హీరో కూతురికీ లైంగిక వేధింపులు తప్పలేదంటే నమ్ముతారా? ఆమె మాటల్లో అక్షరాలా సత్యం ఇది. ఐశ్వర్య రాజేష్‌కి ఎనిమిదేళ్ల వయసులో తండ్రి... పదకొండు, పన్నెండేళ్ల వయసులో ఇద్దరు సోదరులు మరణించారు. కుటుంబ పోషణ కోసం కథానాయికగా మారాలని నిర్ణయించుకున్నారు.  అవకాశాల కోసం తిరిగే క్రమంలో విమర్శలు, ఛీత్కారాలు సహా లైంగిక వేధింపులూ ఎదుర్కొన్నానని తాజాగా ఐశ్యర్య రాజేష్ తెలిపారు. నార్త్ ఇండియన్ హీరోయిన్లులాగా డ్రస్సులు వేసుకోవడం లేదని, నల్లగా ఉన్నానని, తమిళం మాట్లాడానని తనకు అవకాశాలు ఇవ్వలేదని ఆమె చెప్పారు. కొందరు దర్శకులు కమెడియన్లను లవ్ చేసే  రోల్స్ ఇస్తే చేయలేదని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని విమర్శించినా తనపై విశ్వాసం ఏనాడూ కోల్పోలేదని, అందువల్లే ఈస్థాయికి వచ్చానని, మహిళలు అందరూ ఇలాగే ఉండాలని ఐశ్వర్య రాజేష్ సూచించారు.
  ‘‘ఏంటి బావా! నీకు పెళ్లంట. నాకు చెప్పలేదు’ – వరుణ్‌తేజ్‌ను ట్విట్టర్‌లో సాయిధరమ్‌ తేజ్‌ అడిగాడు. ‘‘నా పెళ్లికి చాలా టైమ్‌ ఉందిలే. కానీ, మన రానా దగ్గుబాటి, నితిన్‌ మాత్రం ఎప్పటికీ మీతోనే అంటూనే సింపుల్‌గా సింగిల్స్‌ గ్రూప్‌ నుండి ఎగ్జిట్‌ అయిపోయారు’’ – వరుణ్‌తేజ్‌ రిప్లై ఇచ్చాడు. మధ్యలో ‘వెన్నెల’ కిశోర్‌, మంచు మనోజ్‌ వచ్చారు. ‘సింగిల్స్‌ రాక్‌. సింగిల్స్‌ హ్యాపీ’ అన్నారు. తర్వాత నితిన్‌ సీన్‌లో వచ్చాడు. ‘‘బాధపడకండి బ్రదర్స్‌. మీ నంబర్‌ కూడా వస్తుంది. అవన్నీ కాదు గానీ, సాయితేజ్‌... అప్పుడెప్పుడో నా పుట్టినరోజుకి బహుమతి ఇస్తాననీ, లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయానని అన్నావ్‌! నా గిఫ్ట్‌ ఏది? ఎప్పుడు ఇస్తున్నావ్‌? అయామ్‌ వెయిటింగ్‌’’ – సాయితేజ్‌ని నితిన్‌ అడిగాడు. ఈ హడావిడి వెనుక అసలు కారణం వేరే ఉంది. అదేంటంటే... సాయితేజ్‌ హీరోగా నటిస్తున్న ‘సోలో బ్ర‌తుకే సో బెటర్‌’ సినిమా ఉంది కదా! అందులో ‘నో పెళ్లి’ అని ఒక పాట ఉంది. మే 25న విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులు దృష్టిని ఆ పాట మీద మరల్చడం కోసమే సోషల్‌ మీడియాలో ఈ హడావిడి అంతా! ‘‘నితిన్‌ డార్లింగ్‌... నేనెప్పుడో గిఫ్ట్‌ పంపేశా. నీ దగ్గరకు సోమవారం వస్తుంది. నువ్వు ఎప్పుడు ఈ పాటను విడుదల చేస్తావని అందరూ వెయిటింగ్‌. మా సింగిల్స్‌ నుండి మీ మింగిల్స్‌కి ఈ పాట అంకితం ఇస్తున్నాం’’ అని సాయితేజ్‌ అన్నారు. అదీ అసలు సంగతి.
  చైనాలో కరోనా పుట్టింది. తర్వాత దేశమంతా పాకింది. ఇప్పుడు ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటున్నారు. ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. ఏ దేశంలో వైద్యులు ఆ దేశంలో చికిత్స చేస్తున్నారు. వ్యాక్సీన్‌ కనిపెట్టే పనుల్లో ఉన్నారు. పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు. పరిష్కారాలను అన్వేషించే క్రమంలో అందరూ చైనా అనుమతులు తీసుకోవాలా? ఏంటి? అవసరం లేదు కదా! ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ అనుకూల వర్గాలు, మీడియా, నాయకులను అడిగితే చైనా అనుమతులు తీసుకోవాలని చెబుతారేమో? ఇదేం వింత వాదన అంటారా? అదంతే. తెలంగాణలో షూటింగులు చేసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరకు టాలీవుడ్‌ పెద్దలు వెళ్లడాన్ని జీర్ణించుకోలేని అనుకూల వర్గాలు చెప్పే మాటలు వింటే... కరోనాకు ముందు కనిపెట్టడానికి చైనా అనుమతి తీసుకోవాలని అన్నట్టు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడినా టాలీవుడ్‌ ఇండస్ట్రీ హైదరాబాద్‌లోనే ఉంది. ఏపీకి తరలి వెళ్లలేదు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు టాలీవుడ్‌కి ఇంపార్టెంటే. అయితే, షూటింగులకు హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ స్టూడియోలు, సకల సౌకర్యాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా హీరోలు, ఆర్టిస్టులు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్‌ సెటిల్‌ అయ్యారు. ఉన్నట్టుండి ఏపీకి షిఫ్ట్‌ అవ్వాలంటే ఎలా అవుతారు? అవ్వలేరు. ఇండస్ట్రీలో మెజారిటీ పర్సెంటేజ్‌ హైదరాబాద్‌లో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం షూటింగులు చేసుకోవడానికి అనుమతులు ఇస్తే అందరికీ పని దొరుకుతుంది. అందుకని, కేసీఆర్‌ దగ్గరకు వెళుతున్నారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీ కేసీఆర్‌ దగ్గరకు వెళుతున్నట్టు జగన్‌ దగ్గరకు రావడం లేదని కుళ్ళుకుంటున్నాయి. టాలీవుడ్‌ ప్రవర్తనపై ఏపీ ప్రభుత్వం గుర్రుగా ఉందని వార్తలు రాయడం ప్రారంభించాయి. తెలంగాణలో షూటింగులు జరుగుతున్నప్పటికీ ఏపీ నుండి టాలీవుడ్‌కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి థియేటర్ల లెక్కల విషయంలో గట్టిగా ఉండాలని అనుకుంటున్నట్టు వివరించారు. షూటింగులు మొదలయితే, ఆ తర్వాత థియేటర్ల సంగతి. ముందు సినిమాలు రెడీ అయితే రిలీజ్‌ చేయడానికి థియేటర్లు కావాలి. తమిళనాడు, కర్ణాటకలో టీవీ షూటింగులకు అనుమతులు ఇచ్చారు. తెలంగాణలో ఇస్తే స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ వదిలేసి కాలి, వేలికి ముడివేసినట్టు ఏపీ ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వకుండా కరోనా క్రైసిస్‌ ఛారిటీ – సీసీసీ పెట్టి నిధులు మళ్లించారని వాపోతున్నారు. ఇండస్ట్రీ కార్మికులకు సీసీసీ వల్ల జరిగిన మేలు మాత్రం చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన గౌరవం జగన్‌కి ఇవ్వడం లేదని వైసీపీ అభిమానుల బాధ. ఒకవేళ తెలంగాణకు జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కేసీఆర్‌ని కలిసినట్టు ఆయన్ను టాలీవుడ్‌ పెద్దలు కలిసేవారు. ఈ లాజిక్‌ ఎలా మిస్‌ అవుతున్నారో??
  దర్శకుడు శేఖర్‌ కమ్ముల వ్యవహారం అంతా వేరుగా ఉంటుంది. సినిమా తీసే విధానం, గట్రా సంప్రయాద శైలికి భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకూ స్టార్‌ హీరోలతో శేఖర్‌ కమ్ముల సినిమాలు చేయలేదు. ఆయన చేసిన సినిమాల్లో నటించిన తరవాతే రానా దగ్గుబాటి, సాయి పల్లవి స్టార్లు అయ్యారు. నిఖిల్‌, వరుణ్‌ సందేశ్‌, తమన్నా తదితరులకు గుర్తింపు వచ్చింది. అలాగని, స్టార్‌ హీరోలతో సినిమాలు చేయకూడదని గిరి గీసుకుని కూర్చోలేదు. మధ్యలో ప్రయత్నించారు గానీ కుదరలేదు. నయనతార స్టార్‌డమ్‌లోకి వచ్చాక ఆమెతో ‘అనామిక’ చేశారు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’ చేస్తున్నారు. సాధారణంగా కొత్త హీరోలు, హీరోయిన్లుకు ట్రయినింగ్‌ ఇచ్చి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే శేఖర్‌ కమ్ముల, తరవాతి సినిమాను స్టార్‌ హీరోతో చేయనున్నట్టు ప్రకటన రావడం ఆశ్చర్యమే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘లవ్‌ స్టోరీ’ నిర్మాతలలో ఒకరైన నారాయణ దాస్‌ నారంగ్‌, ఈ సినిమాకి విడుదల ముందే శేఖర్‌ కమ్ములతో మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో స్టార్‌ హీరో నటిస్తారని ప్రకటించారు. ఏ స్టార్‌ హీరోతో చేస్తారో? నిజానికి, శేఖర్‌ కమ్ములతో చేయాలని చాలామంది స్టార్‌ హీరోలకు ఉంది.
రానా దగ్గుబాటి మల్టీ టాలెంటెడ్. సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అదే సమయంలో మంచి క్యారెక్టర్ వస్తే గెస్ట్ రోల్ లేదా ఇంపార్టెంట్ రోల్ చేసేస్తాడు. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడు. అమరచిత్ర కథలు అంటూ కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తాడు. టీవీ షోలకు హోస్ట్ గా చేస్తాడు. ఖాళీగా ఉండడం రానాకు నచ్చదు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. లాక్ డౌన్ సమయంలోనూ రానా ఖాళీగా లేడు. ఒక యానిమేషన్ టాక్ షో చేశాడు.  యాక్టర్ కాకముందు రానా యానిమేటర్ గా వర్క్ చేశాడు. ఒక యానిమేషన్ కంపెనీ స్టార్ట్ చేసి కొన్ని సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేయించాడు. యానిమేషన్ లో అనుభవం ఉండడంతో ఈ ఖాళీ సమయంలో 'వై ఆర్ యు' అని ఒక టాక్ షో చేశాడు. ఇప్పటివరకు వచ్చిన టాక్ షో లకు భిన్నమైనది ఇది. అనిమేషన్ కాన్సెప్ట్ లో ఇప్పటి వరకు ఎవరూ షో చేయలేదు అనుకుంట. ఈ టాక్ షో త్వరలో ఓటీటీలో విడుదల కానుందని తెలిపాడు. ఎలా ఉంటుందో చూడాలి మరి.
కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని 'బిగ్ బాస్' ఫేమ్, గ్లామరస్ యాక్టర్ తేజస్విని మదివాడ చెబుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'హార్ట్ ఎటాక్'లో హీరోయిన్ చెల్లెలుగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్ క్రీమ్' సినిమాల్లో కథానాయికగా నటించిన తేజస్విని మదివాడకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్లతో చాటింగ్ చేస్తే..‌. 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?' అని ఒకరు అడిగాడు. 'కరోనాకి వాక్సిన్ వచ్చిన తర్వాత' అని బదులిచ్చారు. అలాగే, తనకు బాయ్ ఫ్రెండ్ లేడు అని క్లారిటీ ఇచ్చింది. తన వయసు ఎంతో చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. ఇప్పటి వరకు తాను నటించిన వాటిలో 'మన ముగ్గురి లవ్ స్టోరీ' తనకు బాగా నచ్చినదని తేజస్విని మదివాడ తెలిపింది. హైదరాబాదులో తనకు ఇష్టమైనది తన ఇల్లే అని, ఫేవరెట్ ఫుడ్ విషయానికి వస్తే... పానీ పూరి, తాటి ముంజలు, చెరుకుగడలు పచ్చిమామిడికాయలు, కాకరకాయ తనకు ఇష్టమని ఆమె చెప్పింది. తేజస్వి మదివాడ నటించిన 'కమిట్మెంట్' సినిమా విడుదలకు సిద్ధమైంది. థియేటర్లు ఓపెన్ అయ్యాక ఆ సినిమా విడుదల అవుతుందని ఆమె చెప్పింది.
ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.
* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.
* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.
* క్వారంటైన్ ను ఎప్పటి నుంచో జీవన విధానంగా మలుచుకున్న యనమల కన్నా, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలే బెటరని నేతల్లో అభిప్రాయం  * చంద్రబాబు నాయుడు 24X 7 ప్రజా క్షేత్రంలో ఉన్నా, యనమల మాత్రం పత్రికా ప్రకటనలకే  పరిమితం కావటం పై ఆక్షేపణ  ఎసెట్స్, లయబిలిటీస్ అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆంధ్ర ప్రదేశ్ లో, ఆ మాట కొస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కి లయబిలిటీ గా మారిన చాలామంది నేతల్లో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు అనే భావన చాల మంది నాయకుల్లో బలంగా ఉంది.  పలుకే బంగారమాయెరా పద్ధతిలో ఆయన తనను తాను  ప్రెస్ నోట్స్ కు మాత్రమే పరిమితం చేసుకుని, సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవటం ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నించీ చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన చాలా సీనియర్ మోస్ట్ కావటం వల్లనూ, పార్టీ లో ఆయనకు చంద్రబాబు నాయుడు అత్యంత ప్రయారిటీ ఇవ్వటం కారణం గానూ, ఎన్ఠీఆర్ ను పదవీచ్యుతుని చేసిన సమయం లో ఆయన అద్భుతమైన 'శ్రమదానం' చేసినందువల్లనూ --ఇప్పటికీ తెలుగు దేశం నాయకులు ఆయన్ను అరమోడ్పు కన్నులతో, ఆరాధ్య పూరిత దృక్కులతో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అలా, తనదైన శైలిలో- పార్టీ లో 'సరిలేరు నాకెవ్వరు' టైటిల్ పెట్టుకుని మహరాజులా వెలిగిపోతున్న యనమల రామకృష్ణుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మీద ప్రెస్ రిలీజ్ లో చెడా మడా నిప్పులు చెరిగేశారు. అలా చెరిగిన నిప్పులలో-కొన్ని నిప్పురవ్వలను మీ కోసం ప్రత్యేకంగా అందచేస్తున్నాం.  రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో వైసిపి ప్రభుత్వ వైఫల్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల, ఉపశమన చర్యలు శరవేగంగా చేపట్టాలని, ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. "విపత్తుల్లో ప్రజలను కాపాడేవాడే పాలకుడు. ఆపదల్లో అండగా ఉండటం నాయకత్వ లక్షణం. అలాంటిది ప్రజలను కష్టాల్లో వదిలేయడం రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే.  రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతం. పాలకుల ఉదాసీనత వల్లే  రాష్ట్రంలో కరోనా విస్తృతం. వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన రూ 11,399కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు..? రూ 11,399కోట్ల బడ్జెట్ పెట్టి, కరోనా మాస్క్ లకు రూ 30కోట్లే ఇస్తారా," అంటూ ఆవేశంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను నిలదీశారు.  ఇదేనా మీరు చెప్పిన ‘‘నాడు-నేడు’’..? నాడు సీఎంగా చంద్రబాబు ఇలాగే చేశారా..? నేడు సీఎంగా మీరెలా చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారంటూ కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను కడిగి పారేశారు. విపత్తుల్లో చంద్రబాబు పనితీరుకు, మీ పనితీరుకు ప్రజలే బేరీజు వేస్తున్నారంటూ కూడా హెచ్చరించారు. " టిడిపి ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ పెట్టకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? డాక్లర్లు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఉండేవేనా..? మెడ్ టెక్ జోన్ పై చేసిన ఆరోపణలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గత ఏడాది రూ 2,27,975కోట్ల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు. తొలి 6నెలల్లో 35%కూడా ఖర్చు చేయలేదు. రెవిన్యూ వ్యయమే తప్ప కేపిటల్ వ్యయం శూన్యం. 65% నిధులు మీవద్దే ఉంటే ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎందుకు," అంటూ యనమల ఆ పత్రికాప్రకటనలోనే ఆగ్రహం తో ఊగిపోయారు.  కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరు..? డాక్టర్లు, సిబ్బందికి మాస్క్ లు, రక్షణ ఉపకరణాలు ఎందుకు కొనరు..?పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపేశారు. అమరావతి సహా అభివృద్ది పనులన్నీ నిలిపేశారు.  విపత్తు నిర్వహణకు, నరేగా కు, 14వ ఆర్ధిక సంఘ నిధులు, డివల్యూషన్ నిధులు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఏం చేశారు..? 11నెలల్లో అభివృద్ది శూన్యం, పేదల సంక్షేమం నిల్.. కరోనా ఉపశమన చర్యలు కూడా మొక్కుబడిగానే.. డిసెంబర్ లోనే విదేశాల్లో కరోనా ప్రభావం ప్రారంభం. జనవరి 3వ వారంలో మనదేశంపై కరోనా ప్రభావం. నాలుగో క్వార్టర్ పై కరోనా ప్రభావం చూపింది. మరి మొదటి 3క్వార్టర్లలో మీరు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏమిటి..? కరోనా రాకముందు ఏం చేయలేదు, కరోనా వచ్చాక చేసిందేమీ లేదని కూడా జగన్ మోహన్ రెడ్డి లెక్క తేల్చేశారు.  కరోనాపై కేంద్ర మార్గదర్శకాలు గాలికొదిలేశారు. లాక్ డౌన్ కు వైసిపి నేతలే తూట్లు పొడుస్తున్నారు. కరోనా వ్యాప్తి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సాహమా..? ఈ విపత్తులోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారా..?కరోనాలోనూ మీ అవినీతి,అక్రమాలు మానుకోరా, అంటూ నిప్పులు చెరిగారు. లోడింగ్ కార్మికులకు కరోనా సోకితే బాధ్యత ఎవరిది..? లాక్ డౌన్ పీరియడ్ లో వందల లారీల్లో ఇసుక తరలింపులా..? ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు..? మద్యం అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తారా, అని కూడా తన ప్రెస్ రిలీజ్ లో ఆయన ప్రశ్నించారు.  ఏడాది గడుస్తున్నా పరిపాలనపై సీఎంకు అవగాహన లేదు. సంబంధిత శాఖలపై ఏ ఒక్కమంత్రికి పట్టు దొరకలేదు. స్వప్రయోజనాలే తప్ప ప్రజారోగ్యంపై వైసిపి నేతలకు శ్రద్ద లేదు. టిడిపి హయాంలో ఏ అభివృద్ది పని ఆగలేదు. ఏ సంక్షేమ పథకం రద్దు చేయలేదు. పైగా అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించాం. అనేక అభివృద్ది ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. విపత్తుల్లో బాధిత ప్రజానీకాన్ని ఆదుకున్నాం. హుద్ హుద్ లో, తిత్లి తుపాన్ లో ఎలా ఆదుకున్నామో ప్రజలకు తెలుసునని కూడా యనమల గుర్తు చేశారు.  విపత్తులంటే సీఎం జగన్ కు భయం. ఎప్పుడు విపత్తులు వచ్చినా పత్తా ఉండరు. తిత్లి తుపాన్ లో, మొన్న గోదావరి, కృష్ణా వరదల్లో ఎక్కడ ఉన్నారో ప్రజలు మరిచిపోలేదు. పాలకుల నిర్లక్ష్యం  ప్రజలకు శాపం కారాదు. ఇప్పటికైనా కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేయాలి. ఫ్రంట్ లైన్ వారియర్లకు రక్షణ ఉపకరణాలు అందజేయాలి. వైద్య ఆరోగ్య శాఖకు నిధులు విడుదల చేయాలి. రైతుల వద్ద పంట ఉత్పత్తులు వెంటనే కొనుగోలు చేయాలి. ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఆయన ప్రెస్ రిలీజ్ సాంతం ఆయన జగన్ మోహన్ రెడ్డి ని కడిగేసి, నిప్పులు చెరిగి చంద్రబాబు నాయకత్వం పట్ల తన విధేయతను ను ఎప్పటిలాగానే-కాగితం రూపేణా తీర్చుకున్నారు. "జగన్ మోహన్ రెడ్డి ఈ ఎనిమిది నెలల నుంచే క్వారంటైన్ లో ఉన్నారు. మా యనమల వారు రాజ్యం చేసినంత కాలం ఎక్కువ సమయం క్వారంటైన్ లో గడిపిన సన్నివేశాలను, సందర్భాలను ఇప్పుడో సరి మేము గుర్తు చేసుకుంటున్నాం, ఎలాగూ కరోనా కారణంగా కాస్తంత వీలు చిక్కింది," అంటూ టీ డీ పీ నాయకులు నిట్టూరుస్తున్నారు.
  * మూడు శతాబ్దాలలో మూడు కరువుల ను ఎదుర్కున్న ఆంధ్ర ప్రదేశ్ * 1791-95, 1832-1833, 1929-39 మధ్య ఎదుర్కున్న కరువుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి * రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు శాసనాల్లో-ఇలాంటి కరువును ఎలా ఎదుర్కోవాలో స్పష్టం గా రాసి ఉంది * వెంకటాద్రి నాయుడు వంటి జనహిత పాలకుల విధానాలే ఇప్పుడు మనకి శ్రీరామ రక్ష మరో రెండు నెలలు కరోనా తన కోరలను, పంజాను ఇలాగే విసిరితే, ఆంద్ర ప్రాంతం లోనే కాదు, దేశం లోనే చాలా ప్రాంతం లో మూడు శతాబ్దాల నాటి డొక్కల కరువు పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి. డొక్కల కరువుగా కూడా పేరు గడించిన ఈ కరువులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభైలక్షల మంది బలయ్యారు. కరువు వల్ల ప్రాణ నష్టమే కాదు పశువులు, విత్తనాలూ నష్టమయ్యేవి. రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మరలా కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు. 1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.     కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు. పలువురు మహనీయులు డొక్కల కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు తమవంతు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారిలో కొందరి పేర్లు:   సర్ సి.పి.బ్రౌన్ గా ఆంద్ర ప్రజానీకానికి సుపరిచితుడైన ఆంగ్ల అధికారి, 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు చేసిన సేవలు, పలువురు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. అలాగే, ఏనుగుల వీరాస్వామయ్య అనే యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు కూడా పేదలకు ఆ సమయం లో అండగా నిలిచాడు వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.     కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై గా చెన్నై ప్రాంతం లో పేరున్న సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన తన దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, 1929-39 సంవత్సరాల మధ్య వచ్చిన మరో కరువు ను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. దీనివల్ల, గుంటూరు జిల్లా లోనూ , ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన కరువు వల్ల , దాదాపు 50 వేల అధికారిక మరణాలు నమోదైనట్టు ఆ సమయం లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్ గా పని చేసిన పత్రి లక్ష్మీ నరసింహారావు రాసుకున్న డైరీ లో లభ్యమైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆయన అప్పట్లో బ్రిటీష్ యంత్రాంగానికి రాసిన లేఖలు, తర్వాత అప్పటి బ్రిటీష్ అధికారులు తీసుకున్న నష్ట నివారణ చర్యల ప్రస్తావన కూడా ఆయన డైరీ లో ప్రముఖంగా ఉంది. అంటే, గడిచిన మూడు శతాబ్దాల కాలం లో ఆంధ్ర ప్రాంతం మూడు రకాల కరువును ఎదుర్కొని, చరిత్రలో నిలిచిపోయే విషాదాలను నమోదు చేసుకుంది. ఇప్పుడు , కరోనా సన్నద్ధత చర్యల విషయం లో వెనుకంజ వేస్తె, ఎకానమీ రివర్సల్ జరుగుతుందని, దానివల్ల సంభవించే విపరిణామాలు వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై, తిండి గింజలకు వెతుక్కునే పరిస్థితి వస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సుప్రీంకోర్టు లో రాష్ట్ర  ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం మరియు ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఆరు వారాల తర్వాత కూడా పరిస్తితిపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈసి కి అప్పగించిన సుప్రీంకోర్టు. దీంతో పాలక వై ఎస్ ఆర్ సీ పీ నిరాశకు గురైంది.  ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టులో విచారణ విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం, స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం వాదనలు విన్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెలిసిందే. ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ పిటిషన్ లో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి . రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికలకు నిర్వహణ కు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్దం. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం. ఈ వ్యవహారం పై చీఫ్ సెక్రటరీ కి, ఎన్నికల కమిషనర్ కు మధ్య లేఖల యుద్ధం కూడా నడిచింది. హైకోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా, అని కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాల నీ కూడా కోరింది. పంతాని కి పోయినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రంకోర్టు లో చుక్కెదురైంది.
  బంగారు తెలంగాణ భ్రమల్లో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికీ, వనరుల సక్రమ వినియోగానికీ, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేమీ ఈ బ‌డ్జెట్‌లో లేవు. అవధులు లేని హామీలతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టే కేసీఆర్‌ సర్కారు ఎత్తుగడలో భాగంగానే అంకెల గారడీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తీర్చిదిద్దారు. రాష్ట్రం ఏర్పడితే.. అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుం దనీ, సంపదను పెంచడమే కాదు, పంచడమూ జరుగుతుందనీ ఎంతగానో ఆశించిన ప్రజలకు ఈ బడ్జెట్లన్నీ నిరాశనే మిగిల్చాయి. ప్రణాళికలు, పథకాలు, ప్రకటనలు, నిధులు, వ్యూహాలు.. అన్నీ కాగితాలకూ, అంచనాలకూ, అంకెలకే పరిమితమ వుతున్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడంలేదు. ప్రజలపై పన్నుపోటు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమంతా పరివర్తనా సూత్రాన్ని అంగీకరించా లంటూ ఎడ్మండ్‌ బర్క్‌ను ఆర్థికమంత్రి ఉటంకించారు. నిజమే ఈ పరివర్తన ఏమిటి? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమా? వ్యవసా యాన్ని నీరుగార్చి రైతులను ఆత్మహత్యలకు గురిచేయడమా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కుల వృత్తులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు చెప్పిన మాటలు వినసొంపు గానే ఉన్నాయి. పల్లెల పరిపుష్టతకు ప్రాణాధారమైన వ్యవసాయం గాలిలో దీపంగా మారింది. రైతు జీవితం తెగిన గాలిపటమైంది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2750మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటే సర్కారు మాత్రం 340 ఆత్మహత్యలే జరిగినట్లు చెబుతూ కేవలం 40మందికే పరిహారం ఇచ్చింది. అసలు రైతుల బతుకులపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.5,942.97కోట్లు కేటాయించినా.. ఖర్చుచేసేది ఎంత అన్న ప్రశ్న తలెత్తుతున్నది. గత బడ్జెట్లలో నీటి ప్రాజెక్టులకు 25వేలకోట్లు కేటాయించి, 10వేలకోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ఎక్కువ నిష్ఫత్తిలో దుర్వినియోగం చేస్తున్న ఘనత ఈ సర్కార్‌ది. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్దిష్టంగా పూర్తిచేయలేదు. 2013-14లో 49,23,003 హెక్టార్లలో సాగు ఉండగా, 2015-16లో 41,74,532 హెక్టార్లలోనే సాగైనట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. సాగు ఎందుకు తగ్గింది? ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 2013-14లో వచ్చిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు 6,844 కాగా, 2015-16లో కేవలం 3,779 మాత్రమే వచ్చాయి. పెట్టుబడులు రాక కూడా మూడువేల కోట్ల నుంచి పదిహేను వందల కోట్లకు తగ్గింది. పారిశ్రామికాభివృద్ధిరేటు గ్రాఫ్‌ పడిపోయిన విషయం సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది టీఎస్‌ ఐపాస్‌ కింద 3,325 పరిశ్రమలకు అనుమతులిచ్చారు. కాబట్టి అవన్నీ వచ్చినట్లుగా భావించాలంటున్నారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ఊహించుకొంటూ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ అంచనాలు మాత్రమేనని ఆర్థిక సర్వే చెప్పింది. మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు అయ్యే ఖర్చును బడ్జెట్‌లో చూపించలేదు. రైతుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రయివేటు అప్పులు, పెట్టుబడి ఖర్చులు, విత్తన సమస్యలు, మద్దతు ధర వంటి సమస్యలే అన్నదాతల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఈ అంశాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టిపెట్టిన సంకేతాలేవీ ఈ బడ్జెట్‌లో కనిపించడంలేదు. రాష్ట్రంలో అత్యధిక మందికి అత్యవసర మైన ఈ అంశాలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక సంక్షోభం నేపథ్యంలో ఉపాధి సమస్య వేధిస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నాయి. మద్యం మహమ్మారి పేదల ప్రాణాలను ఆబగా హరిస్తోంది. వీటిని పరిష్కరించే యోచన లేకుండా కలగూరగంపగా తయారుచేసిన ఈ బడ్డెట్‌తో ముందుముందు అప్పులు, పన్నులు, విద్యుత్‌ భారాలు ప్రజల నడ్డి విరిచేస్తాయని చెప్పకతప్పదు.
ఇండియన్ క్రికెట్‌లోనే కాకుండా వరల్డ్ క్రికెట్‌లోనే నంబర్ వన్ క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటూ వస్తున్న విరాట్ కోహ్లీ తాజా న్యూజిలాండ్ పర్యటనలో బ్యాట్స్‌మన్‌గా దారుణంగా విఫలమవడం ఇండియన్ క్రికెట్ ప్రేమికుల్నే కాకుండా అతని అభిమానుల్నీ తీవ్రంగా నిరాశపరచింది. టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా మూడు ఫార్మట్లలోనూ బ్యాట్స్‌మన్‌గా అతను విఫలమవడం విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరచింది. మూడు ఫార్మట్లలో కలిపి 11 ఇనింగ్స్ ఆడిన విరాట్ చేసిన మొత్తం పరుగులు కేవలం 218.  న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టెస్ట్ ప్లేయర్‌గా నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న విరాట్, సిరీస్ ముగిసే సరికి రెండో ర్యాంకుకు దిగజారాడు. విరాట్ పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మళ్లీ నంబర్ వన్ ర్యాంకును అందుకున్నాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా 53.62 యావరేజ్ కలిగిన విరాట్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్ ఆడి సాధించిన యావరేజ్ ఎంతో తెలుసా? కేవలం 9.5.  ఈ నాలుగు ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ సాధించడం మాట అటుంచి ఏ ఇన్నింగ్స్‌లోనూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లో అత్యని హయ్యెస్ట్ స్కోర్ 19 రన్స్. ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను ఈ స్కోర్ చేశాడు. అతను ఈ టెస్ట్ సిరీస్‌లో చేసిన పరుగులు వరుసగా.. 2, 19, 3, 14. మొత్తం రన్స్ 38. అతనికంటే ఎక్కువగా 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి 44 పరుగులు చేయడం గమనార్హం. టెస్టుల్లో 2011లో అరంగేట్రం చేసిన విరాట్ ఇంత ఘోరంగా ఆడటం ఇది రెండోసారి మాత్రమే. ఇదివరకు 2016-17లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 9.2 యావరేజ్‌తో 46 పరుగులు చేశాడు. అతని కెరీర్ మొత్తమ్మీద అదే అతని పూరెస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌తో దాని దగ్గరకు వచ్చాడు. ఇక రెండో టెస్ట్ సందర్భంగా మైదానంలో కోహ్లీ ప్రవర్తన అతనికి చెడ్డపేరు తీసుకొచ్చింది. కెప్టెన్‌గానూ అతను టెస్ట్, వన్డే సిరీస్‌లో విఫలమయ్యాడు. మొదట వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన అతడు ఇప్పుడు 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్‌కు సమర్పించుకున్నాడు. గుడ్డిలో మెల్లగా మొదటగా జరిగిన టీ20 సిరీస్‌ను మాత్రం 5-0తో వైట్ వాష్ చేయగలిగాడు. అయితే అందులోనూ బ్యాట్స్‌మన్‌గా అతను వైఫల్యం చెందాడు. అంతర్జాతీయంగా 82 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ యావరేజ్ 50.80. కానీ ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతని సగటు 26.25 మాత్రమే. అతడి హయ్యెస్ట్ స్కోర్ 45. మిగతా మూడు మ్యాచ్‌లలో వరుసగా 11, 38, 11 స్కోర్లు చేశాడు. రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ పరుగుల వర్షం కురిపించడం వల్లే టీ20ల్లో భారత జట్టు విజేతగా నిలవగలిగింది. గాయం కారణంగా వన్డే, టెస్ట్ సిరీస్‌లలో రోహిత్ లేని లోటు సుస్పష్టంగా కనిపించింది. ఫాంలో ఉన్న కె.ఎల్. రాహుల్‌ను టెస్టుల్లోకి తీసుకోకుండా విరాట్ తీవ్ర తప్పిదం చేశాడని విశ్లేషకులంతా ముక్త కంఠంతో విమర్శిస్తున్నారు. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ యావరేజ్ 25 మాత్రమే. టూర్ మొత్తం మీద అతడు హాఫ్ సెంచరీ చేసింది ఈ వన్డే సిరీస్‌లోనే. అది మొదటి వన్డేలో 51 పరుగులు చేశాడు. మూడు రకాల ఫార్మట్లలో ఒక ఇన్నింగ్స్‌లో అతడి హయ్యెస్ట్ స్కోర్ ఇది. ఆ తర్వాత రెండు వన్డేల్లో అతడు చేసిన రన్స్ వరుసగా 15, 9. ఇప్పటివరకూ 248 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ టోటల్ యావరేజ్ 59.33 కావడం గమనార్హం. ఈ గణాంకాలే న్యూజిలాండ్ టూర్‌లో అతడు ఏ స్థాయిలో వైఫల్యం చెందాడో తెలియజేస్తున్నాయి. బౌలర్ నుంచి వచ్చే బంతిని అతని కన్ను నిశితంగా గమనిస్తుందనీ, దాని గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి, చాలా వేగంగా స్పందించి షాట్ కొడతాడనీ కోహ్లీని విశ్లేషకులతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అయితే అతని చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందని, అందుకే అలవోకగా ఫోర్లు కొడతాడని అంటుంటారు. ఫ్రంట్ ఫుట్ ఆడటంలో విరాట్‌ని మించిన వాడు లేడని కూడా వాళ్లు కితాబునిస్తుంటారు. అంటే అనేకమంది ఇతర బ్యాట్స్‌మెన్ కంటే అతడు ఎక్కువగా కవర్ డ్రైవ్స్ ఆడతాడు. చాలామంది స్క్వేర్ కట్ కొట్టే బంతుల్ని అతడు కవర్ డ్రైవ్ కొడతాడు. అంతేకాదు, చాలామంది దూరంగా పోతుందని వదిలేసే బంతుల్ని కూడా విరాట్ కవర్ డ్రైవ్స్ ఆడతాడు. అంత లాఘవంగా ఆ షాట్లను ఆడతాడని అతను పేరుపొందాడు. అలాంటివాడు రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు ఎల్బీడబ్ల్యూ అయిన తీరు నిర్ఘాంతపరచింది. అయితే తన బ్యాటింగ్‌లో ఎలాంటి లోపమూ లేదని అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ క్యాచ్ అవుట్ అయ్యాక, న్యూజిలాండ్ టూర్‌లో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి అడిగినప్పుడు "నా బ్యాటింగ్ బాగానే ఉంది" అని జవాబిచ్చాడు విరాట్. కొన్నేసి సార్లు స్కోర్లు బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబించవనీ, బంతిని సరిగా ఎగ్జిక్యూట్ చెయ్యకపోవడం వల్ల అవుటవ్వాల్సి వస్తుందనీ అతను చెప్పాడు. జట్టు గెలిస్తే.. 40 పరుగులు చేసినా గొప్పగానే ఉంటుందనీ, జట్టు ఓడితే.. సెంచరీ చేసినా వేస్టయిపోతుందనీ అతను వాదించాడు. కానీ న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ బాడీ లాంగ్వేజ్‌లోనే తేడా కనిపించిందనీ, బ్యాటింగ్ చేసేటప్పుడు మునుపటి ఈజ్ అతనిలో లోపించిందనీ క్రికెట్ అనలిస్టులు చెప్తున్న మాట. తదుపరి సిరీస్‌కైనా మనం మునుపటి గ్రేట్ బ్యాటింగ్ పర్ఫార్మర్‌ను విరాట్‌లో చూడగలమా? వెయిట్ చేద్దాం.
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
చిన్న చిన్న మార్పులు చేయాలని, దానివల్ల శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య తప్పుతుందని తెలుసా? ఒత్తిడి వుండే ఉద్యోగాలలో వున్నవారు, ఎక్కువగా ప్రయాణాలు చేసే ఉద్యోగాలలో ఉన్నవారు, రాత్రి షిఫ్టులలో పనిచేసేవారు, సమయానికి ఆహారం తీసుకునే వీలు లేనివారు... ఇలా ఎవరెవరి పరిస్థితులు, శారీరక అవసరాలను బట్టి వారు తీసుకునే ఆహారాన్ని నిర్ణయించాల్సి వస్తుందిట. కాబట్టి ఎవరికి వారు తమ శారీరక అనారోగ్యాలు, పరిస్థితులు, వారి బాధ్యతలు వంటివి నిపుణులతో చర్చించి, వారి సూచనల మేరకు ఓ డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకుని ఆహారం తీసుకుంటే ఇప్పుడు స్త్రీలు ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. చూశారా... ఏదో ఒకటి తిన్నామా లేదా అది చాలు అనుకుంటే ఎంత పొరపాటో. ఇంటిల్లిపాది ఆహారంపై శ్రద్ధ పెట్టే స్త్రీలు తాము తీసుకోవాల్సిన పోషకాహారం గురించి కనీస అవగాహన కలిగి వుండటం లేదన్నది ఎన్నో అధ్యయనాలలో బయటపడ్డ అంశం. ఆహారానికి, ఆరోగ్యానికి ఉన్న అనుబంధం తెలిసిందే కాబట్టి ఈ ఉమెన్స్ డే రోజున ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. 2. ఆరోగ్యంపై శ్రద్ధా తక్కువే ఆడవారిపై మరో  ముఖ్య ఆరోపణ. ‘‘వారు వారి ఆరోగ్యంపై శ్రద్ధ అస్సలు పెట్టరు’’ అని. మగవారితో పోలిస్తే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటంలో వీరు చాలా అశ్రద్ధ కనబరుస్తారట. అంతేకాదు.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలని పట్టించుకోకుండా అవి పెరిగి పెద్దవయ్యి, పెద్ద అనారోగ్యాలకు దారి తీసేంత వరకూ డాక్టర్ల దగ్గరకి వెళ్ళరని కూడా ఓ ఆరోపణ. ఇవన్నీ ఎవరో సరదాగా అన్న మాటలు కాదు. కొన్ని వేలమందిపై చేపట్టిన అధ్యయనంలో బయటపడ్డ అంశాలు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే కొందరు ఆడవారిని ఈ సమస్య ఆనవాళ్ళు ఎప్పుడు తెలిశాయని అడిగినప్పుడు విస్మయపరిచే అంశాలు తెలిశాయి. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులలో కూడా ఆ లక్షణాలను గుర్తించలేదని తెలిసింది. దానికి కారణం రోజువారి ఒత్తిడులు, ఉద్యోగం, కుటుంబాన్ని సమన్వయపరుచుకోవడంలో తమ గురించి తాము అస్సలు ఆలోచించుకోలేకపోవటం అంటున్నారు అధ్యయనకర్తలు. దీనికి పరిష్కారం ఏమిటి అంటే, బాధ్యతలను పంచటం. అటు కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కాని బాధ్యతలు పంచుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఆడవారిపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఏమైనా అనుమానం ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం అలవాటుగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండచ్చు. ఆరోగ్యంగా వుంటే ఆకాశాన్నయినా తాకచ్చు. ఏమంటారు? ఈ ఉమెన్స్ డేకి ఇది మీరు తీసుకోవలసిన రెండో రెజల్యూషన్. 3. వ్యాయామం అసలే లేదు శారీరక వ్యాయామానికి ఎంత సమయం కేటాయిస్తారు అని అడిగితే అరవై ఏడు శాతం మంది అస్సలు లేదు అన్నారట. అదిగోమరి ఆరోగ్యం పాడవదూ అలా చేస్తే అంటున్నారు నిపుణులు. సమయం లేదని సాకు చెప్పకండి. వ్యాయామానికి సమయం ఉండేలా మీ దినచర్యని రూపొందించుకోండి అని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే ఒక్కటే సూత్రం... ‘‘మితంగా తినడం, రోజూ వ్యాయామం చేయడం’’. అది ఎంత అవసరమో గుర్తించి, ఆచరించండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఇతరులనీ మోటివేట్ చేయండి. 4. రిలాక్సా? నో ఛాన్స్! మీరెలా రిలాక్స్ అవుతారు? మిమ్మల్నే అడిగేది. రోజూ మీరెలా రిలాక్స్ అవుతారు? దానికి ఎంత సమయం కేటాయిస్తారు? ఆలోచనలో పడ్డారా? మీలానే ఈ ప్రశ్న అడగగానే ఆలోచనలో పడ్డారుట ఎంతోమంది. వారి నుంచి వచ్చిన సమాధానాలు ఏంటో తెలుసా? రాత్రి నిద్రపోవడమే రిలాక్స్ అవటం అని, పిల్లలని చదివించటం అని, వాళ్ళతో కబుర్లని... ఇలా రకరకాలుగా  చెప్పారుట. అయితే దీని మొత్తంలో మీరు మీకు నచ్చినట్టుగా రిలాక్స్ అయ్యారా ఎప్పడైనఅ అంటే ‘నో’ అని ముక్తకంఠంతో చెప్పారుట. అలాగే టీనేజ్‌లో వుండగా హాయిగా రోజూ నచ్చిన పుస్తకం ఓ గంట అయినా చదివేదాన్ని అని ఒకరు, మ్యూజిక్ వినేదాన్ని అని ఒకరు, గార్డెనింగ్ చేసేదాన్ని అని ఇంకొకరు, ఒక్కర్తిని కూర్చుని ఆకాశాన్ని చూస్తుంటే భలే హాయిగా వుండేది అని మరొకరు చెప్పారుట. మరి అవి ఇప్పుడెందుకు చేయడం లేదు అంటే అందరిదీ ఒకటే సమాధానం.. ‘‘టైమ్ లేదు’’. మీ సమాధానం కూడా అదేనా? అయితే దానికి నిపుణులు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా? ‘‘రిలాక్స్ అవటం మీ సామర్థ్యాన్ని పెంచుతుందని గట్టిగా నమ్మండి. అప్పుడు రిలాక్స్ అవటానికి మీకు టైమ్ అదే దొరుకుతుంది. మీ ప్రయారిటీ లిస్టులో దానికసలు చోటే లేకపోతే ఎలా? దాన్ని ఫస్టు ప్లేసులోకి తీసుకురండి. బదులుగా అది మిమ్మల్ని అన్నిట్లో ఫస్టుగా వుంచుతుంది’’ అంటున్నారు. సో... రిలాక్స్ అవ్వటంలో తప్పులేదు... తప్పుకాదు అని గట్టిగా నమ్మండి. మీ హాబీల దుమ్ము దులిపి హాయిగా రిలాక్స్ అయిపోండి. 5. గాఢమైన నిద్రా కరువే ఇది చదివితే మీ మీద మీరే బోల్డంత జాలిపడిపోతారు. మొన్నామధ్య అమెరికాలో ‘‘సొసైటీ ఫర్ ఉమన్ హెల్త్ రీసెర్చ్’’ చేసిన పరిశోదనలో ఆడవాళ్ళు అసలు గాఢంగా నిద్రపోవడమే లేదని తేలింది. మగవారితో పోలిస్తే ఆడవారు నిద్రలోకి జారుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందని, పడుకున్నా మగవారిలా గాఢంగా నిద్రపోయే సమయం తక్కువని తేలింది. అలాగే ఆడవారు ఎదుర్కొనే ఎన్నో అనారోగ్య సమస్యలకి నిద్రలేమే కారణమని కూడా తేలింది. దీనికి ఒకరకంగా ఆడవారిలోని ప్రత్యేక హార్మోన్లు కారణం. నెలసరికి ముందు, వెనక స్త్రీలు ఎక్కువగా నిద్రలేమి సమస్యని ఎదుర్కొంటున్నారట. పెళ్ళయ్యాక, గర్భం, కాన్పు తర్వాత శరీరంలో ఏర్పడే పరిణామాలు, వీటికి తోడు ఇల్లు, ఉద్యోగ బాధ్యతలూ... ఇవన్నీ స్త్రీల గాఢమైన నిద్ర వేళల్ని హరిస్తున్నాయని  ఆ పరిశోధన తేల్చింది. మరి పరిష్కారం ఏంటీ అంటే, మొదట నిద్రలేమితో బాదపడుతున్నామని గుర్తించాలిట. నిద్రకు నిర్ణీత సమయాలని ఏర్పాటు చేసుకోవాలి. మనసు అలజడి లేకుండా వుండే గాఢమైన నిద్ర స్వంతమవుతుంది. కంటినిండా నిద్ర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముక్తాయింపు... ఉమెన్స్ డే ఉద్దేశం ఈ రోజున ఒక్కసారి ఇప్పటిదాకా సాగించిన ప్రస్థానాన్ని సమీక్షించుకుని, సాగించాల్సిన ప్రయాణానికి సర్వసన్నద్ధం కావటం. స్త్రీల పట్ల మారాల్సిన సమాజం, ప్రభుత్వ దృక్పథాల గురించి గొంతెత్తినట్టే - అసలు మూలాలని కూడా బలపరుచుకునే దిశగా కూడా ఒక్కసారి దృష్టి సారించాలి. శారీరక ఆరోగ్యంపై మానసిక ఆరోగ్యం, ఈ రెండిటి మీద మీరు సాధించే విజయం ఆధారపడి వున్నాయి. కాబట్టి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు మరింత దృఢంగా మార్చుకునేందుకు పైన చెప్పిన ఐదు అంశాలు ఎంతో కీలకం. ఆ అయిదే కాదు.. ఇంకా చిన్నాపెద్దా అంశాలు ఎన్నో వున్నాయి ఆడవారు నిర్లక్ష్యం చేసేవి. అయితే అతి ముఖ్యమైనవి ఇవి కాబట్టి కనీసం వీటిపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని మీరు సానబెట్టుకుని దూసుకుపొండి. ఆఖరుగా ఒక్కమాట. ఎప్పటికప్పుడు విజేతలుగా నిలిచిన మహిళల జీవన పంథాని, వారు అనుసరించే విధానాలని గమనించండి. వాటిని అనుసరిస్తే పొందే లాభాలని గుర్తించండి. మార్పు మంచిదే అని నమ్మండి. ఓ స్త్రీ.. నీకు నీవే సాటి.. నీ విజయాలకి మా జోహార్లు. సాధించబోయేదానికి శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. -రమ
  ఒంట్లో బాగోలేనప్పుడు యాంటీబయాటిక్స్‌ అవసరాన్ని కాదనలేరు. పంటినొప్పి దగ్గర్నుంచీ కేన్సర్‌ వరకూ యాంటీబయాటిక్స్‌ లేకుండా మన చికిత్సా విధానాలే లేవు. ఒకరకంగా చెప్పాలంటే యాంటీబయాటిక్స్‌ మన వైద్యవిధానాన్నీ, దాంతోపాటు మన జీవితాన్నీ కూడా సమూలంగా మార్చేశాయి. యాంటీబయాటిక్స్‌ లేనిరోజుల్లో చిన్నపాటి చెవిపోటుకే మనుషులు చనిపోయే సందర్భాలు ఉండేవి. అయితే రోజులు మారుతున్న కొద్దీ యాంటీబయాటిక్స వాడకం పెరిగిపోతోంది. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్‌ను వాడేయడం, ఒకోసారి డాక్టరుని సంప్రదించకుండానే వాటిని పుచ్చుకోవడం సహజం అయిపోతోంది. ఇలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ను వాడటం వల్ల లేనిపోని పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. శరీరం తనను తాను బాగుచేసుకునే సహజసిద్ధమైన గుణం ఎలాగూ చెడుతుంది... యాంటీబయాటిక్స్‌ వాడకం వల్ల ఇతరత్రా ప్రమాదాలు కూడా ఉన్నాయంటూ రోజుకో నివేదిక బయటపడుతోంది. యాంటీబయాటిక్స్‌ను తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుందన్న విషయం తెలియందేమీ కాదు. అయితే ఇలా మంచి బ్యాక్టీరియా నష్టపోవడం వల్ల ఏకంగా మెదడుకే ఎసరు వస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇన్నాళ్లూ శరీరం అనేది ఒక యంత్రం అనీ... అందులో ఈ మూల ఉండే పేగులకీ, ఎక్కడో పైన ఉండే మెదడుకీ అంతగా సంబంధం లేదనీ చాలామంది వైద్యులు సైతం భావిస్తూ వచ్చారు. కానీ జీర్ణవ్యవస్థలో ఉండే కొన్ని పరిస్థితులు మన మెదడుని కూడా ప్రభావితం చేస్తాయని నిదానంగా తేల్తోంది. బహుశా ఈ విషయం రుజువైతే ఆహారానికీ, ఆలోచనకూ సంబంధం ఉందని వేల ఏళ్లుగా ఆయుర్వేద వైద్యులు చెబుతున్న మాట నిజమవుతుందేమో!   యాంటీబయాటిక్స్ వాడిన రోగుల్లో మెదడు పనితీరుని గమనించేందుకు పరిశోధకులు దాదాపు 400 మంది వివరాలను పరిశీలించారు. మనం తరచూ వాడే సిప్రాఫ్లొక్సాసిన్‌ సహా 54 రకాల యాంటీబయాటిక్స్ పనితీరుని వీరు గమనించారు. ఈ యాంటీబయాటిక్స్‌ను తీసుకున్న 47 శాతం మందిలో, మానసికమైన వికారాలు ఏర్పడ్డాయట. వీరిలో ఉద్రేకం, భ్రాంతి, అయోమయం, మూర్ఛ వంటి సమస్యలు కలిగాయంటున్నారు బోస్టన్‌కు చెందిన షమిక్‌ భట్టాచార్య అనే పరిశోధకుడు. ఇక యాంటీబయాటిక్స్‌ను తీసుకున్నాక మెదడు పనితీరు ఎలా ఉంటుందో గ్రహించేందుకు EEG తీసిన వైద్యులకీ ఇలాంటి ఫలితాలే కనిపించాయి. యాంటీబయాటిక్స్‌ వాడిన దాదాపు 70 మంది మెదడులో అసహజమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సదరు EEGలు నిర్ధారించాయి. చాలా సందర్భాలలో యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని ఆపవేసిన వెంటనే రోగులు తిరిగి మామూలు స్థితికి చేరుకున్నారు. కానీ మరికొందరిలో కిడ్నీలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తేలింది. ఈ పరిశోధనలన్నీ గమనించిన తరువాత అసలు యాంటీబయాటిక్స్‌ వాడకం గురించే భయం ఏర్పడం సహజం. కానీ యాంటీబయాటిక్స్‌ నిజంగా మన ప్రాణాల్ని కాపాడే ఆయుధాలని గుర్తుంచుకోవాలి. ఆయుధాలని ఎలాగైతే విచక్షణారహితంగా వాడితే ప్రమాదమో యాంటీబయాటిక్స్‌ కూడా అంతే! దీర్ఘకాలికంగా, వైద్యుని పర్యవేక్షణ లేకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా యాంటీబయాటిక్స్‌ను వాడితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు. - నిర్జర.  
అప్సరసలాంటి అమ్మాయి ఎదురయితే గుండె దడదడ లాడిన పర్వాలేదు గానీ, మాములుగా ఉన్నప్పుడు కూడా అలా  కొట్టుకుంటుంటే? ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అని గుర్తుపెట్టుకోండి.    గుండెని పదిలంగా చూసుకోవాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు అసలు డాక్టర్ని కలవాల్సిన పనే ఉండదంటున్నారు ప్రకృతి వైధ్య నిపుణులు. మనం తీసుకునే ఆహారపు విషయంలో కొంతమేర జాగ్రత్త తీసుకుంటే చాలట.  రోజువారి నడక, వ్యాయామం తో పాటు కింద చెప్పినవి కొన్ని పాటిస్తూ మన గుండెని ప్రేమగా చూసుకుందాం.    *  ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలులో విటమిన్‌ - బి కాంప్లెక్స్ , నియాసిన్‌ అధిక మోతాదులో వుంటాయి. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుండా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లలో కూడా ఎక్కువగా లభిస్తాయి.   * గింజ దాన్యాలలో సోయా చాలా ప్రత్యేకమైనది.త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు.శరీరానికి అవసరమైన అమినోయాసిడ్లు, లైసీన్లతోపాటు ఇసోఫ్లేవిన్స్ ని కలిగిఉంటుంది. ఇది గుండెకు బలాన్నిస్తుంది. * ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.   * ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. * బాదాం పప్పు  గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో ఉండే  ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్  ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది. *  గుమ్మడి కాయలలో బీటాకెరోటిన్‌ లు ఎక్కువగాఉంటాయి. ఇవి శరీరములో విటమిన్‌ ' ఎ ' గా మార్పుచెంది చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీరాడిలల్స్ ను ప్రారదోలడములో సహకరించి గుండెను కాపాడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున గుండెకు మేలు జరుగుతుంది . ఇలా కొద్దిపాటి జాగ్రత్తలతో మన గుండెని పదిలంగా చూసుకుందాం. - కళ్యాణి