పంటల పండగ సంక్రాంతి పండగ

 


తెలుగునాట దీనిని పెద్ద పండగగా వ్యవహరిస్తారు. రైతులకు పంటలు ఇంటికి రావటంతో కొంచెం తీరిక దొరికి సంబరంగా చేసుకునే పంటలకు సంబంధించిన ముఖ్యమైన పండుగ ఇది. సూర్యుడు భూమధ్య రేఖకి ఉత్తరంగా ప్రయాణించటాన్ని ఉత్తరాయణమనీ, దక్షిణంగా ప్రయాణించటాన్ని దక్షిణాయమనీ అంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడుగనుక ఉత్తరాయణాన్ని మకర సంక్రాంతి, మకర సంక్రమణమనీ, అలాగే దక్షిణాయంలో సూర్యుడు కర్కాటకం రాశిలో ప్రవేశించటాన్ని కర్కాటక సంక్రమణమనీ అంటారు. సంక్రాంతి అన్నా, సంక్రమణం అన్నా జరగటం అని అర్ధం. అంతేకాదు ఉత్తరాయణం దేవతలకు పగలుగా, దక్షిణాయణం దేవతలకు రాత్రిగా భావిస్తారు. అందుకే ఉత్తరాయణకాలం పుణ్యకాలం అంటారు. ఈ రెండు సంక్రమణాలూ ఆంగ్లమాసం ప్రకారం జనవరి 14, జూలై 16న వస్తాయి. ఆంగ్లమానానికి ఆధారం ఉత్తర, దక్షిణ తేదీలేనంటారు మన పెద్దలు. మహా భారతంలో కురువృధ్ధుడైన భీష్మాచార్యుడు అంపశయ్యమీద పవళించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినప్పుడే (మకర సంక్రాంతి) తన ప్రాణాలను వదిలాడు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి పునర్ జన్మ వుండదని నమ్మకం.

 



మనం భోగి, పెద్ద పండుగ, కనుమ అని మూడు రోజులు జరుపుకునే ఈ పండగ సంబరాలు అసలు నెల రోజులు జరుపుకుంటారు. ఎలాగంటారా సంక్రాంతి అనగానే మీకు గుర్తుకొచ్చేవి ఏమిటి చెప్పండి? ఈ కాలం సిటీల్లోని పిల్లలకి కూడా మీడియా పుణ్యమాని పండగ రోజులు ఊదర కొట్టేసి మరీ చెబుతున్నారు కదా పండగ విశేషాలు. మరి సంక్రాంతి అనగానే ముందు గుర్తొచ్చేవి ఇంటికి వచ్చే కొత్త పంటలు, ఇంటి ముందు తీర్చిదిద్దిన అందమైన ముగ్గులు, వాటిలో రక రకాల పూలతో అలంకరింపబడ్డ గొబ్బెళ్ళు, హరిదాసు గానాలు, గంగిరెద్దు ఆటలు, పులి వేషాలు, గాలి పటాలు, భోగి మంటలు, భోగి పళ్ళు బొమ్మల కొలువులు, కోడి పందాలు ... అబ్బో .. ఇవ్వేనా ... ఇంకా చాలా వున్నాయి. మరి కొత్త అల్లుళ్ళని ఇంటికి పిలిచి మర్యాదలు చెయ్యటం .. అంటే కొత్తగా పెళ్ళయినవారి విరిసీ విరియని ప్రేమలు, నును సిగ్గులు చూడాలంటే ఇలాంటి పండగల్లోనే గొప్ప అవకాశం. కొత్త బియ్యంతో చేసే అరిసెలూ, పండగనాడు కొత్త బియ్యంతో వండి దేవుడికి నైవేద్యం పెట్టే పరవాణ్ణంవంటి పిండివంటలు, కొసరి కొసరి వడ్డింపులు సరేసరి. 

పెద్ద పండగ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. అలాగే కనుమనాడు వ్యవసాయ పనులలో తమకి తోడుగా వుండి పంటలు పండించటంలో భాగస్వాములైన పశువులకి పూజ చేస్తారు.


ఇదివరకు ఈ సంబరాలన్నీ ప్రత్యక్షంగా అనుభవించినా, నేటితరానికి ఈ సంబరాలు మీడియాలో ముచ్చట్లే, అయితే పల్లెటూళ్ళలో ఈ పండుగ ఛాయలు ఇంకా కనబడుతున్నాయి. అందుకే ఈ పండగకి సిటీలు బోసిపోతాయి, పల్లెటూళ్ళు ఫక్కున నవ్వుతాయి. పండగ ముచ్చట్లు వివరంగా చూద్దాం.

 



ధనుర్మాసం మొదలయినప్పటినుంచీ ఇంటి ముంగిట పేడ కళ్ళాపులు జల్లి, పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చి ముచ్చట పడతారు మగువలు. ఈ రంగవల్లులు తీర్చటంలో కూడా పోటీలు .. ఎవరు పెద్ద ముగ్గు వేశారు, ఎవరు అందంగా వేశారు, ఎవరు కొత్త ముగ్గు వేశారు వగైరా. వారి ఇంటి ముందు ముగ్గు వెయ్యటం పూర్తి కాగానే ఆ వీధిలో, వీలుంటే పక్క వీధుల్లో కూడా ఎవరే ముగ్గు వేశారో చూసి రావాలి. ఆ సంబరమే వేరు. పండగనాడు వాటిల్లో రంగులు నింపటం నేటి సరదా అయితే వాటిలో పసుపు కుంకుమలు, పూలు జల్లటం ఇదివరకటి సంబరం.


రంగవల్లులతో ఆగిపోదండీ ఆడ పిల్లల ముచ్చట్లు. తెల్లవారుఝామునే లేచి, ఆవు పేడని సేకరించి, గొబ్బెమ్మలు చేసి, వాటిని అలంకరించి, పూజ చేస్తారు. ఇంటి ముందు రంగవల్లులలో వాటిని అమర్చి, మధ్యాహ్నం వాటిని తీసి గోడకి పిడకలు కొట్టటం, వాటిని తీని ఎండబెట్టి, దండలు గుచ్చటం .. అబ్బో ఎన్ని పనులో..

ధనుర్మాసం మొదలయినప్పటినుంచీ నెలంతా ఈ గొబ్బెమ్మలు పెడతారు. మధ్యలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో అనుకుని సందె గొబ్బెమ్మ పెడతారు. ఆ రోజు సాయంకాలం ఇంటి ముందు శుభ్రం చేసి సందె ముగ్గు వేస్తారు. సందె ముగ్గు అంటే సాయంకాలం ఇల్లూ, వాకిలీ ఊడ్చి, వాకిట్లో పలచగా ఒక చెంబు నీళ్ళు చల్లి, గుమ్మానికి అటో రెండు కర్రలు, ఇటో రెండు కర్రలు ఏటవాలుగా ముగ్గుతో వేసి మధ్యలో రాంబాణం, నక్షత్రంలాంటి చిన్న ముగ్గు వేస్తారు. (ఇది వరకు ఇలా ప్రతి ఇంటి ముందూ ఏడాది పొడుగూ రోజు వేసేవారు). ఆవు పేడతో మూడు పెద్ద గొబ్బెమ్మలు చేసి ఒక పీటపై పసుపు, కుంకుమ, బియ్యంపిండితో ముగ్గులు వేసి గొబ్బెమ్మలనుకూడా పసుపు, కుంకుమ, బియ్యంపిండి, పూలతో అలంకరించి ఆ పీటమీద పెట్టి వాకిట్లో పెడతారు. ఇందులో ఒక గొబ్బెమ్మ మిగతా వాటికన్నా కొంచెం పెద్దగా వుంటుంది .. ఇది తల్లి గొబ్బెమ్మ, మిగతావి పిల్ల గొబ్బెమ్మలు. ఆ ఇంటి ఆడ పిల్లలు తమ తోటి ఆడ పిల్లలను పేరంటం పిలిచి వస్తారు. అందరూ సాయంకాలం ఆగొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈ పాటలలో ఎక్కువ కృష్ణుడి గురించే వుంటాయి.

ఆ గొబ్బెమ్మలకి పూజ చేసి నైవేద్యం పెట్టి, వచ్చిన బాలలందరితో కలిసి తామూ నైవేద్యాన్ని ఆరగిస్తారు. సాధారణంగా దీనికి పచ్చి శనగపప్పు వుడకబెట్టి, తాలింపు వేసి పెడతారు. సంక్రాంతి నెల అంతా ఈ సంబరాలతో ఇళ్ళు ఎంత కళకళలాడుతుంటాయో! ఆధునికులకు ఇవి పేడ ముద్దలుగానూ, వాటికి నైవేద్యం పెట్టటం ట్రాష్ గానూ అనిపించవచ్చు. కానీ దీనిలోని అంతరార్ధం వేరు. .. ఇవి పేడ ముద్దలు కావు. గోపికలు. గోపికలకు ప్రతి రూపంగా పెట్టబడ్డవి. వీటి మధ్యలో సాధారణంగా ఒక పెద్ద గొబ్బెమ్మని వుంచుతారు. ఆవిడ భక్తిలో ఉత్తమ స్ధానంలో వున్నదన్నమాట.. ఈ సందర్భానికి తగినట్లుగా గోదాదేవి అనుకోవచ్చు. ఇలా ఆలోచిస్తే గొబ్బెమ్మలంటే గోపికలు, వారిమధ్య కృష్ణ సేవలో తరించి ఆయనని చేరిన గోదాదేవి .. అందుకే శ్రావ్యమైన కృష్ణ గీతాలని పాడటం, ఆ చరిత్రలు గుర్తు చేసుకోవటం.

-పి.యస్.యమ్. లక్ష్మి


More Sankranti