![]() |
![]() |

రామ్‌చరణ్ హీరోగా కృష్ణవంశీ రూపొందించిన చిత్రం 'గోవిందుడు అందరి వాడేలే' 2014 అక్టోబర్‌లో రిలీజయ్యింది. అందులో చరణ్ తాతయ్యగా ప్రకాశ్‌రాజ్ నటించారు. అయితే ఆ క్యారెక్టర్ కోసం మొదట పేరుపొందిన తమిళ సీనియర్ యాక్టర్ రాజ్ కిరణ్‌ను తీసుకున్నారు. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా మనకు ఆయన సుపరిచితుడే. దాదాపు 60 శాతం సన్నివేశాలు చిత్రీకరించిన అనంతరం హఠాత్తుగా ఆయనను తొలగించి, ఆ క్యారెక్టర్‌ను ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నారు. ఇది అప్పట్లో వివాదాన్ని సృష్టించింది. ఈ మార్పు వెనుక చిరంజీవి ఉన్నారంటూ ప్రచారంలోకి వచ్చింది.
కాగా ఆ సినిమా విడుదలైన మూడేళ్ల తర్వాత.. అంటే 2017లో రాజ్‌కిరణ్ నోరు విప్పారు. తనకు మాట మాత్రంగా చెప్పకుండా తనను ఆ సినిమా నుంచి తొలగించారని బాధపడ్డారు. "ఒక నటుడి స్థానంలో మరొకర్ని తీసుకొనేటప్పుడు అందుకు సరైన కారణం చెప్పాలి. కానీ అలా జరగలేదు. డైరెక్టర్ కృష్ణవంశీ కానీ, హీరో రామ్‌చరణ్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎవరూ ఏ విషయమూ చెప్పకుండా నా స్థానంలో వేరే నటుడ్ని తీసుకున్నారు. ఇది కళని, కళాకారుల్ని అగౌరవపరచడమే." అని వాపోయారు.
ఈ సినిమా కథను తన ఇంటికొచ్చి మరీ కృష్ణవంశీ చెప్పారని రాజ్‌కిరణ్ వెల్లడించారు. "అందులో మంచి సందేశం ఉండటంతో ఓకే చెప్పాను. ఫస్ట్ హాఫ్ అంతా తాత పాత్రకే ప్రాధాన్యం ఉంటుంది. సెకండాఫ్‌లోనే హీరోయిజం ఉంటుంది. నాకు వినిపించిన వార్త ఏంటంటే.. ఫస్ట్ హాఫ్ షూటింగ్ రషెస్ చూసిన తర్వాత చిరంజీవి 'ఈ సినిమాలో హీరో రాజ్‌కిరణా? రామ్‌చరణా?' అని అడిగారట. హీరో పాత్రకు వెయిటేజ్ తక్కువగా ఉందని, తాత పాత్రని నెగటివ్‌గా మార్చమని అడిగారట. అప్పటికే 60 శాతం సినిమా అయిపోయింది. హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్లాన్ చేసినప్పుడు భారీ వర్షాల కారణంగా షూటింగ్ వాయిదా వేశారు. మళ్లీ స్టార్ట్ చేసినప్పుడు పిలుస్తానన్నారు. కానీ ఆ తర్వాత నన్నెవరూ పిలవలేదు. ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు. కానీ ఓ ఆర్టిస్ట్ పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు" అని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా ఇదే తరహా ఘటన మరో స్టార్ హీరో సినిమా విషయంలోనూ జరిగింది. ఈసారి ఇలాంటి అవమానానికి గురయ్యింది జగపతిబాబు అయితే, అది మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అప్పుడు కూడా కొన్ని సన్నివేశాలు తీశాక జగపతిబాబును తొలగించారు. ఇప్పుడు కూడా ఆయన స్థానంలోకి వచ్చింది ప్రకాశ్‌రాజ్ కావడం గమనార్హం. 'సరిలేరు నీకెవ్వరు' నుంచి తనను ఆకస్మికంగా తొలగించడంపై జగపతిబాబు తన ఆవేదన వ్యక్తం చేయడం మనకు తెలిసిందే కదా!
![]() |
![]() |