![]() |
![]() |

లెజెండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25న అశేష అభిమానుల్ని శోకసంద్రంలో ముంచెత్తుతూ దిగంతాలకు తరలిపోయారు. ఆయన అంతిమ సంస్కారాలు తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక లాంఛనాలతో శనివారం జరిగాయి. అంతకుముందు ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని ఆయన నివాసం వద్ద సందర్శకుల కోసం ఉంచారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినవాళ్లు అతికొద్ది మంది మాత్రమే ఆయనను చివరిసారిగా సందర్శించుకోగలిగారు. ఆయన కొవిడ్-19 వైరస్ బారినపడటం, కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అభిమానులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరూ రావద్దని కుటుంబసభ్యుల తరపున బాలు కుమారుడు చరణ్ ముందుగానే అర్థించారు.
కాగా తెలుగువాడైన బాలు అంతిమ సంస్కారాలకు టాలీవుడ్ నుంచి స్టార్లెవరూ హాజరు కాలేదనీ, కనీసం సంగీత కులానికి సంబంధించిన వాళ్లు కూడా రాలేదని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొంతమంది భారీ ఎత్తున నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. బాలు మీద ప్రేమను కేవలం ట్వీట్ల రూపంలో ప్రదర్శించారే తప్ప, చెన్నైవెళ్లి ఆయనకు నివాళులర్పించలేదనీ, కాబట్టి టాలీవుడ్ స్టార్లంతా బోగస్ స్టార్లంటూ విమర్శిస్తున్నారు. టాలీవుడ్ నుంచి డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, ఆఖరుకి మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఎవరూ అక్కడ కనిపించలేదని ఆరోపిస్తున్నారు. ఇందుకు భిన్నంగా బాలు అంత్యక్రియలకు ముందు తమిళ స్టార్ హీరో విజయ్ కరోనా భయాన్ని జయించి వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాడనీ, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది సిగ్గుచేటనీ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
అయితే ఆ విమర్శల్లో ఏమాత్రం పసలేదనీ, బాలు ఏమాత్రం సహించని నెగటివ్ ధోరణి కలిగినవారే అలాంటి విమర్శలు చేస్తున్నారనీ టాలీవుడ్‌లోని బాలు అభిమానులు అంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో అందరూ చూస్తున్నారనీ, ఇలాంటి పరిస్థితుల్లో సినీ సెలబ్రిటీలు అక్కడకు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదనీ సెలబ్రిటీలు వస్తే వారిని చూడ్డానికి జనం ఎగబడతారనీ వారు చెబుతున్నారు. బాలు కుటుంబ సభ్యులతో ఈ విషయమై ముందుగానే అధికారులు హెచ్చరించారనీ, అందుకే బాలు తనయుడు చరణ్ ఎవరినీ రావద్దని కోరారని, అందుకు అనుగుణంగానే టాలీవుడ్ సెలబ్రిటీలు నడచుకున్నారనీ వారు స్పష్టం చేస్తున్నారు. సాధారణ పరిస్థితులు ఉన్నట్లయితే, టాలీవుడ్ నుంచి అనేకమంది బాలు అంతిమ సంస్కారాల్లో పాల్గొని ఉండేవారని ఒక డైరెక్టర్ తెలిపారు.
![]() |
![]() |