![]() |
![]() |

సూపర్‌స్టార్ మహేశ్ బ్లాక్‌బస్టర్ మూవీ 'దూకుడు'లో "పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు" అంటూ నర్తించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చిందులు వేసిన పార్వతీ మెల్టన్ కెరీర్ టాప్ గేర్‌లో వెళ్తుందని ఊహిస్తే.. అందుకు విరుద్ధమైన అనుభవాలు ఎదురై, పెళ్లి చేసుకుని అర్ధంతరంగా సినిమాలను వదిలేసి వెళ్లిపోయింది. చారడేసి కళ్లు, మిలమిల మెరిసే ఒళ్లుతో కాస్త తెలుగుతనం, మరికాస్త విదేశీయం.. ఆమె పేరులాగే డ్యూయెట్‌లా కనిపిస్తుంది పార్వతి.
తొలిచిత్రం 'వెన్నెల' స్టిల్స్‌తోనే ఆమె కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. తనకు వస్తున్న అవకాశాల గురించి సమాచారం లేకపోవడంతో విదేశాల్లోనే ఉండిపోయిన ఈ ముద్దుగుమ్మ టాలెంట్‌ను మోహన్‌బాబు పసిగట్టారు. వెంటనే తమ సొంత సంస్థలో తీసిన 'గేమ్' మూవీలో తనయుడు విష్ణు సరసన అవకాశం ఇచ్చారు. ఇందులో ఒకే ఒక్క పాట పార్వతీ మెల్టన్‌ను టాప్ గేర్‌లోకి తీసుకెళ్లింది. "ఉయ్యాలే ఉయ్యాల.. ఊగే నడుమే ఉయ్యాల" అనే సాంగ్‌లో ఆమె హొయలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఈ పాట తర్వాత పార్వతికి అవకాశాలు తలుపు తట్టాయి.

'అల్లరే అల్లరి'లో వేణు జోడీగా, 'మధుమాసం'లో సుమంత్ సరసన, పవన్ కల్యాణ్ 'జల్సా'లో సెకండ్ హీరోయిన్‌గా నటించి తనదైన ముద్ర వేసింది. 'జల్సా' చేసేటప్పుడే పార్వతికి తన తదుపరి సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ ఇస్తానని త్రివిక్రమ్ ఆమెకు ప్రామిస్ చేశాడనీ, కానీ 'ఖలేజా'లో ఆ అవకాశాన్ని అనుష్క తన్నుకుపోయిందనీ అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఏదేమైనా మహేశ్ తదుపరి సినిమా 'దూకుడు'లో "పూపై పూవై అంటాడు ఆటో అప్పారావు" పాటలో నర్తించేందుకు ఒప్పుకున్న ఆమె ఆ పాటతో దుమ్ము రేపింది.
ఆ తర్వాత కూడా ఆమె రెండు సినిమాల్లోనే హీరోయిన్‌గా నటించింది. ఒకటి బాలకృష్ణతో 'శ్రీమన్నారాయణ'లో, మరొకటి సాయిరామ్ శంకర్‌తో 'యమహో యమః' సినిమాలో. అవకాశాల విషయంలో అప్పటికే అసంతృప్తిగా ఉన్న ఆమె, ఆ తర్వాత సంవత్సరం 2013లో బిజినెస్‌మ్యాన్ షమ్సు లలానితో మూడు ముళ్లు వేయించుకొని, పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసి, హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ గడిపేస్తోంది.

![]() |
![]() |