![]() |
![]() |

అక్షయ్‌కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన 'లక్ష్మీ బాంబ్' మూవీ రిలీజ్ ఆగిపోయింది. అక్షయ్ బర్త్‌డే సెప్టెంబర్ 9న ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో అతని అభిమానులు అక్షయ్‌కుమార్‌ను తీవ్రంగా ద్వేషిస్తున్న నేపథ్యంలో ఈ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. సుశాంత్ చేయాల్సిన కనీసం ఐదు సినిమాలను లాబీయింగ్‌తో అక్షయ్ చేజిక్కించుకున్నాడంటూ సుశాంత్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
కాగా, 'లక్ష్మీ బాంబ్' విడుదల వాయిదా పడడానికి అక్షయ్ కుమార్ వర్గం వేరే వాదాన్ని వినిపిస్తోంది. ఎ-లిస్ట్ స్టార్ల సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయకుండా మొదట థియేటర్లలోనే రిలీజ్ చేయాలని బాలీవుడ్ ప్రొడ్యూసర్లు భావిస్తున్నారనీ, అందుకే 'లక్ష్మీ బాంబ్'ను ఒకేసారి అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో రిలీజ్ చేయాలని సంకల్పించారనీ చెబుతున్నారు.

"చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలను థియేటర్లు తెరుచుకొనే దాకా వెయిట్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చెయ్యడం బాగానే ఉంటుంది. ఎందుకంటే విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ వాటిపై ఆర్తిక ఒత్తిళ్లు పెరుగుతాయి. కానీ టాప్ స్టార్ల సినిమాలను అలా నేరుగా డిజిటిల్ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చెయ్యలేం. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, హృతిక్ రోషన్ లాంటి హీరోలు థియేటర్లకు ప్రాణం పోస్తారు. అక్షయ్ 'లక్ష్మీ బాంబ్'ను ఓటీటీలో నేరుగా రిలీజ్ చెయ్యకుండా ఆపడం మంచిదే. లేదంటే ఆయన తదుపరి సినిమా 'సూర్యవంశీ' పైనా దీని ప్రభావం పడుతుంది" అని ఆ వర్గం అంటోంది.
లారెన్స్ తనే నటించి, డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'కాంచన'కు రీమేక్‌గా 'లక్ష్మీ బాంబ్'ను హిందీలో డైరెక్ట్ చేశాడు.
![]() |
![]() |