![]() |
![]() |
.webp)
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మనకు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ద్వారా పాపులర్ అయ్యారు. కానీ వాస్తవానికి వారిలో ఎంతో అద్భుతమైన నటులు దాగి ఉన్నారు. ఈ విషయాన్ని చిరు రుద్రవీణ, ఆరాధన, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలతో నిరూపించారు. ఆయన కెరీర్ మొదట్లోనే వచ్చిన పున్నమినాగు, మంచు పల్లకి ఆయనలోని నటుడిని బాగా ఆవిష్కరించిన చిత్రాలుగా చెప్పుకోవాలి. అలాంటి చిరంజీవి ఇప్పుడు కేవలం మాస్ మసాలా సినిమాలు చేస్తున్నాడు అంటే ఆ పాపం ఎవరిది అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మరోవైపు నందమూరి బాలకృష్ణ సంగతి కూడా అంతే. ఆయనలో ఎలాంటి నటుడు ఉన్నాడో విశ్వనాథ్‌తో ఆయన చేసిన జననీ జన్మభూమి, ఆదిత్య 369, పాండురంగడు, భైరవద్వీపం, బాబాయి- అబ్బాయి, నారీ నారీ నడుమ మురారి, శ్రీరామరాజ్యం, శ్రీకృష్ణార్జున విజయం, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు. కానీ వారు నటించిన చాలా చిత్రాలను ప్రేక్షకులు సరిగా ఆదరించకపోవడం వలన వాటికి మంచి పేరు వచ్చినప్పటికీ కమర్షియల్ గా నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి.
ఒకసారి చిరంజీవి మాట్లాడుతూ అందరూ నేను నటించిన రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటివి భలే ఉన్నాయి అంటూ ఉంటారు. కానీ అలా అనేవారే గాని చివరికి నా వీరాభిమానులు కూడా ఆ చిత్రాలను ఒక్కసారి కంటే ఎక్కువ చూడలేదు. మిగతావారు అది కూడా చూశారో లేదో తెలీదు. కోట్లు పెట్టి సినిమాలు తీస్తే నిర్మాతలకు నష్టాలు వచ్చే విధంగా నేను ఎందుకు అలాంటి చిత్రాలు చేయాలి? అనేది అసలు ఆ ప్రశ్న. ఇదే ప్రశ్న అడుగుతున్న మీరు ఆ సినిమాలను ఎన్నిసార్లు చూసుంటారు... అనేది మనస్సాక్షిగా ఆలోచించుకోండి. తీయండి... చేయండి అంటారు... చేస్తే చూడరు... ఎంతసేపటికి నా నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అలాంటి చిత్రాలు వస్తేనే ఆదరిస్తున్నారు తప్ప కాస్త బాగా డెప్త్‌లోకి వెళ్లి మంచి చిత్రాలను, పది కాలాలపాటు గుర్తుండే చిత్రాలను చేయాలంటే వీలు కావడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.
నిజంగానే ఇది నిజం.. ఈ సంగతి ఇప్పుడు ఎందుకంటే రేపు సంక్రాంతికి రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' గాని, నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' గాని రెండు పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు కనుక మంచి విజయాన్ని సాధిస్తే వారు మరలా అదే తరహా చిత్రాలను రిపీట్ చేసే అవకాశం ఉంటుంది. దానితో ఈ వయసులోనైనా కొత్త తరహా చిత్రాలను చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదని రెండు సినిమాలు హిట్ అయినా సరే చిరు బాలయ్యలు విభిన్న చిత్రాలలో నటించాలని చాలామంది విభిన్న చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఎప్పుడు ఆరు ఫైట్లు, ఆరు పాటలు, ఒక పది పదిహేను పంచ్ డైలాగులు, ఓ ఐటం సాంగ్ అంటే ఎలా? వీరిలోని అసలైన ప్రతిభను వారు ఇంత కాలానికి అయినా బయటకు తీసుకొని వచ్చే చిత్రాలు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు. దర్శకులు కాస్త ఉత్సాహంగా ఈ దిశగా ప్రయోగాత్మక, కొత్తదనం నిండిన చిత్రాలతో ముందడుగు వేయడానికి ప్రేక్షకులు వారికి సరైన ప్రోత్సాహాన్ని అందించకుండా ఉంటే అలాంటి చిత్రాలు చేసే వీలుండదు కదా.. అనేది కొందరి అభిప్రాయం.
![]() |
![]() |