Home  »  News  »  చిరుతో పూరి డ్రీమ్ ప్రాజెక్టుకు సమయం వచ్చేసిందా?

Updated : Jan 7, 2023

నిన్న మొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి తనతో ఆల్రెడీ పనిచేసిన అనుభవం ఉన్న దర్శకులతోనే పనిచేసేవారు. కానీ కొంత కాలంగా ఆయన పంథా మారింది. 'శంకర్ దాదా ఎంబీబీయస్' తర్వాత ఆయన శ్రీను వైట్ల, కె. విజయభాస్కర్‌, మురుగదాస్, ప్రభుదేవా, సురేందర్ రెడ్డి, కొరటాల శివ, మోహన్ రాజా వంటి వారి దర్శకత్వంలో నటించారు.  కానీ వీరెవరూ చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకోలేకపోయారు. దాంతో చిరు డైల‌మాలో పడ్డారు. తన ఇమేజ్‌కి, క్రేజ్‌కి అనుగుణంగా చిత్రాలు తీయగలిగిన పాత‌దర్శకులనే రిపీట్ చేయాలా లేదా కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలా? అనే విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

తాజాగా 'వాల్తేరు వీరయ్య'తో దర్శకుడు బాబీకి అవకాశం ఇచ్చారు చిరు. దీని తరువాత 'బోళా శంకర్' సినిమా చేస్తున్నారు. దానికి కూడా వరుస డిజాస్ట‌ర్స్ తీసిన మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై చిరంజీవి భ‌విష్య‌త్తు నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. కొత్త దర్శకులను నమ్ముకొని వారికి అవకాశాలు ఇవ్వడమా, లేదా అనేది ఈ రెండు చిత్రాల ఫలితాలు నిర్ణయించనున్నాయి. కొత్త దర్శకులు అయితే తనను విభిన్నంగా చూపిస్తారని చిరు నమ్మకం. ఈ రెండు చిత్రాలు దానిని నిరూపిస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' గనక మంచి విజయాన్ని సాధిస్తే అది రాబోయే రోజుల్లో చిరుకి మరింత బూస్టింగ్ ఇస్తుంది. తద్వారా ఇంతవరకు చిరుతో పనిచేసే అవకాశం రాని మరి కొంతమంది దర్శకులకు చిరుతో పని చేసే అవకాశం లభిస్తుంది. ఈ లిస్టులో ఇప్పటికే పూరి జగన్నాథ్, మారుతి, ప్రశాంత్ నీల్, కృష్ణవంశీ వంటి పలువురు దర్శకులు ఉన్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు పూరి జగన్నాథ్. ఆల్రెడీ చిరంజీవి నటించిన 150వ చిత్రానికి పూరి ఎంపిక అవుతాడని బాగా ప్రచారం జరిగింది. ఆయన తయారుచేసిన 'ఆటో జానీ' స్టోరీ చిరుకు నచ్చిందని, దాంతో చిరు 150వ చిత్రం పూరీతోనే ఉంటుందని నాడు వార్తలు వచ్చాయి. కానీ ఆటో జానీ పూర్తిగా చిరుని మెప్పించలేకపోవడంతో ఆయన తమిళ 'కత్తి' రీమేక్‌ని వీవీ వినాయక్‌తో 'ఖైదీ నెంబర్ 150'గా తీశారు. 

మరోసారి ఇప్పుడు చిరుతో ఎలాగైనా సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నాడు పూరి. వాస్తవానికి ఇది పూరి డ్రీమ్ ప్రాజెక్ఠ్‌. పూరి తదుపరి చిత్రం చిరుతో ఉంటుందా లేదా అనేది 'వాల్తేరు వీర‌య్య' చిత్రంపైన ఆధారపడి ఉంది. దాంతో ఆయన వీరయ్య ఫలితం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవలే చిరంజీవి 'ఆటో జానీ' కంటే మంచి కథను తీసుకొని వస్తే తనకు పూరీతో చేయడానికి ఇబ్బంది ఏమీ లేదని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దాంతో పూరి ఎన్నడూ లేని విధంగా ఒక మంచి కథను తీసుకొని చిరు దగ్గరకు వెళ్లాలని భావిస్తున్నారు. సాధారణంగా పూరి తన కథలకు ఎక్కువ సమయం కేటాయించడు. ఒక పది పదిహేను రోజులు బ్యాంకాక్, సింగపూర్‌కు వెళ్లి స్టోరీని రెడీ చేసుకుని తీసుకుని వస్తాడు. కానీ ఈసారి మాత్రం ఆయన తన యంగ్ టీమ్ తో కలిసి చిరు చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కోసం ఎంతో కష్టపడి రూపొందిస్తున్నాడని సమాచారం. 

'లైగర్' చిత్రం భారీ డిజాస్టర్ అవడంతో పూరిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా పూరి అలాంటి వాటిని  లెక్కలోకి తీసుకోడు. వాటిని పెద్దగా పట్టించుకోడు. దేనిని ఖాత‌రు చేయడు. తన ప్రయత్నాలను ఆపడు. అందుకే ఆయన మరో అవకాశాన్ని ద‌క్కించుకోవడం ఖాయం అంటున్నారు. మొత్తానికి పూరి వినిపించే కథ‌, కంటెంట్ చిరు చిత్రాన్ని డిసైడ్ చేసేందుకు ఉపయోగపడతాయి. దాంతో 'బోళా శంకర్' తర్వాత చిరు-పూరి చిత్రం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో చిరుతో కలిసి ఓ సినిమా చేయాలని 'కేజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంతినీల్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఈ చిత్రం ఉండనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ప్రశాంత్ నీల్‌తో చిరు-చరణ్‌ల భేటీ ఇలాంటి ఊహగానాలకు తావిచ్చింది.

ప్రశాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్రభాస్‌తో 'స‌లార్' మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా మొదలు పెడతాడు. కానీ ఈ మధ్యలోనే చిరుకు తగ్గ బౌండ్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి ఆయనకు వినిపిస్తాడట. జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సమయంలోనే మెగా కాంపౌండ్‌లోకి ఆయన అడుగుపెట్టే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. అదలా ఉంచితే మంచి యూనివర్సల్ సబ్జెక్టుతో వస్తే పూరి కోసం ఛాన్స్ రెడీగా ఉంటుందని చెప్పవచ్చు. పూరీ రాసే కథలో బలం, స్క్రీన్‌ప్లే మ్యాజిక్, సంభాషణలు క‌నెక్ట్ అయితే పూరీకి చిరుతో చాన్స్ రావడం పెద్ద కష్టమేమీ కాదు. పూరీ తన డ్రీమ్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సరైన సమయం ఇదేనని పలువురు భావిస్తున్నారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.