![]() |
![]() |

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో అతని రోల్‌ను చేయవద్దంటూ కోయంబత్తూర్‌లోని ఒక ద్రవిడ సంస్థ విజయ్ సేతుపతిని డిమాండ్ చేసింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మురళీధరన్ తమిళులకు కాకుండా సింహళీయులకు మద్దతు పలికాడనీ, అలాంటి వ్యక్తి రోల్‌ను సేతుపతి చేస్తే తమిళుల మనోభావాలు దెబ్బతింటాయని ఆ సంస్థ సభ్యులు అంటున్నారు. ఎం.ఎస్. శ్రీపతి డైరెక్ట్ చేయనున్న మురళీధరన్ బయోపిక్ '800'లో సేతుపతి అతని పాత్రను చేయనున్నాడనే అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత తందై పెరియార్ ద్రవిడార్ కళగమ్ (టీపీడీకే) సభ్యులు ఈ పిలుపునిచ్చారు. శ్రీలంక సివిల్ వార్‌లో అనేకమంది అమాయక తమిళులను చంపిన రాజపక్స ప్రభుత్వానికి మురళీధరన్ సపోర్ట్ చేశాడని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
ఆ సినిమా చేస్తున్నట్లు అక్టోబర్ 8న విజయ్ సేతుపతి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటించాడు. "ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టులో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. అప్డేట్ సూన్.. #మురళీధరన్‌బయోపిక్" అని అతను పోస్ట్ చేశాడు.
టీపీడీకే జనరల్ సెక్రటరీ కె. రామకృష్ణన్ మాట్లాడుతూ, ఒక తమిళ కుటుంబంలో జన్మించినప్పటికీ మురళీధరన్ ఎప్పుడూ రాజపక్సకూ, అతని సింహళ అనుకూల రాజకీయాలకూ మద్దతునిస్తూ వచ్చాడని ఆరోపించారు. సివిల్ వార్‌లో అమాయక తమిళులను ఊచకోత కోసినప్పుడు, మురళీధరన్ వారికోసం ఒక్క మాటా మాట్లాడకపోగా, సింహళీయులకే సపోర్ట్ చేశాడని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజానీకంలో మంచి పేరు ఉన్న విజయ్ సేతుపతి గనుక మురళీధరన్ క్యారెక్టర్ చేసినట్లయితే, అది తమిళుల్లో అసహనాన్ని రేకెత్తిస్తుందని ఆయన అన్నారు. చేజేతులా అతను తన పేరును చెడగొట్టుకున్నవాడవుతాడని ఆయన హెచ్చరించారు.
![]() |
![]() |