![]() |
![]() |

స్వాతంత్ర్యం కోసం అసమాన పోరాటం చేసి, ఆ పోరాటంలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచిన సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్. ఆ ఇద్దరి పాత్రలను ఆధారం చేసుకొని 'ఆర్ఆర్ఆర్' మూవీని రూపొందిస్తున్నానని యస్.యస్. రాజమౌళి అనౌన్స్ చేసినప్పుడు, ఆ సినిమా కథ ఎలా ఉంటుందోననే కుతూహలం అందరిలోనూ వ్యక్తమవుతూ వస్తోంది. స్వాతంత్ర్య పూర్వ కాలం నాటి కథ అనేది అందరికీ తెలుసు. ఇది చరిత్రలో రికార్డయిన కథ కాదనీ, సీతారామరాజు, భీమ్.. ఇద్దరూ యువకులుగా ఉన్నప్పుడు తమ తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయి, మూడేళ్లపాటు అజ్ఞాతంలో గడిపారని చరిత్రలో ఉంది కానీ, ఆ మూడేళ్ల కాలంలో వాళ్లెక్కడ ఉన్నారు, ఏం చేశారనేది మాత్రం నమోదు కాలేదనీ, ఆ కోణాన్ని తీసుకొని కాల్పనిక కథను సృష్టించి ఆర్ఆర్ఆర్ తీస్తున్నామని రాజమౌళి వెల్లడించాడు. ఆ కాలంలో ఆ ఇద్దరు యోధులు కలుసుకొని ఉంటే ఎలా ఉంటుందో ఊహించిన కథగా ఆయన చెప్పాడు.
అయినప్పటికీ స్వాతంత్ర్య సమరయోధులు కాబట్టి, ఆ యాంగిల్ తప్పకుండా ఉంటుందని అనుకుంటున్న వారి ఊహలు నిజం కావని నిర్మాతలు తేల్చేశారు. ఇది దేశభక్తి సినిమా కాదని వారు స్పష్టం చేశారు. అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఓ ఇంటరెస్టింగ్ లోగోను విడుదల చేశారు. అందులో రెండు చేతులు ఒకదానినొకటి పట్టుకొని ఉన్నాయి. ఆ రెండూ సీతారామరాజు, భీమ్ చేతులుగా ఎవరైనా ఊహించేస్తారు. ఆ లోగోకు ఓ అభిమాని, "ఈ ఇమేజ్‌కి అర్థం అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలుసుకుంటారనీ, స్వాతంత్ర్యం కోసం పోరాడతారనేగా" అని కామెంట్ పెట్టాడు.
జనంలో ఆ రకమైన అభిప్రాయం ప్రబలుతుందేమోనని అనుకున్న మూవీ టీమ్ వెంటనే రిప్లై ఇచ్చింది.. "అవును.. వాళ్లు కలుసుకుంటారు. అవి వాళ్ల చేతులే. కానీ సినిమాలో వారు స్వాతంత్ర్యం కోసం పోరాడరు. 'ఆర్ఆర్ఆర్' మూవీ పూర్తిగా కాల్పనికం.. ఇది ఏ మాత్రం దేశభక్తి సినిమా కాదు" అని.

అంటే జానపద సినిమాల తరహాలో కొమరం భీమ్, సీతారామరాజు మనకు కల్పిత పాత్రలుగా దర్శనమిచ్చి, తమకు ఎదురైన ఘటనలకు స్పందించి, అవసరమైతే వీరత్వం ప్రదర్శించి, తాము ప్రేమించిన వారి కోసం ఫైట్లు చేస్తారని అర్థం చేసుకోవాలి. చూద్దాం.. వాస్తవిక వ్యక్తులను ఫిక్షనల్ క్యారెక్టర్స్‌గా మార్చి రాజమౌళి ఆడే ఆటను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో.. మన్యం వీరుడు సీతారామరాజు అభిమానులు కానీ, గోండు యోధుడు కొమరం భీమ్ ఫ్యాన్స్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |