![]() |
![]() |

శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ విజ్ఞప్తి మేరకు ఆయన బయోపిక్ '800' నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. ఆ సినిమా చేయడం వల్ల సేతుపతి కెరీర్‌కు హాని కలుగుతుందనే ఉద్దేశంతో, ఆ ప్రాజెక్టును వదిలేయమని తను చెప్పినట్లు ఓ ప్రకటనలో మురళీధరన్ వెల్లడించాడు. ఆ పాత్రకు నిర్మాతలు మరో నటుడిని తీసుకోనున్నారనీ, తన అభిమానులు, సాధారణ ప్రేక్షకుల కోసం త్వరలోనే తన బయోపిక్ అందుబాటులోకి వస్తుందనీ ఆయన పేర్కొన్నాడు.
మురళీధరన్ స్టేట్‌మెంట్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన సేతుపతి "థాంక్యూ అండ్ గుడ్‌బై" అని ట్వీట్ చేశాడు.
ముత్తయ్య మురళీధరన్ తన స్టేట్‌మెంట్‌లో ఏం చెప్పాడంటే..
"నా బయోపిక్ '800' చుట్టు కాంట్రవర్సీ నడుస్తుండటంతో నేను ఈ స్టేట్‌మెంట్ జారీ చేస్తున్నాను. ఒక దురభిప్రాయంతో, '800' ఫిల్మ్ నుంచి వైదొలగాల్సిందిగా అనేకమంది జనం విజయ్ సేతుపతిని ఒత్తిడి చేస్తున్నారు. తమిళనాడులోని చక్కని నటుల్లో ఒకరైన ఆయనకు ఎలాంటి ట్రబుల్ కలగకూడదనే ఉద్దేశంతో, ఆ ప్రాజెక్టును వదిలెయ్యమని ఆయనను రిక్వెస్ట్ చేశాను. ఈ మూవీ కారణంగా భవిష్యత్తులో విజయ్ సేతుపతికి ఎలాంటి ఆటంకాలు రాకూడదు.
అడ్డంకులతో నేనెప్పుడూ అలసిపోను. ఆటంకాలను ఎదుర్కొటూ, వాటిని అధిగమిస్తూ నేను ఈ స్థాయికి వచ్చాను. ఔత్సాహిక యంగ్ క్రికెటర్స్‌కు ఆత్మవిశ్వాసాన్నీ, ప్రేరణనూ ఇస్తుందనే ఆలోచనతోనే ఈ బయోపిక్‌కు నేను ఒప్పుకున్నాను. ఈ అడ్డంకుల్ని నిర్మాతలు తప్పకుండా అధిగమిస్తారు. ఈ విషయమై త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఇస్తామని వారు నాకు ప్రామిస్ చేశారు. వారి నిర్ణయాలకు నేను అండగా నిలుస్తాను. ఈ పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రెస్, పొలిటీషియన్స్, విజయ్ సేతుపతి ఫ్యాన్స్, మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రజానీకానికి మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా."
శ్రీలంక తమిళుడైన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800'లో ఆయన పాత్రను విజయ్ సేతుపతి చేస్తున్నాడనే ప్రకటన వచ్చిన క్షణం నుంచి వివాదం మొదలైంది. కారణం.. శ్రీలంకలో సింహళీయులకు, అక్కడి తమిళులకు మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధంలో మురళీధరన్ తమిళులకు కాకుండా సింహళీయులకు మద్దతుగా నిలిచాడనీ, అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స పక్షం వహించాడనే ఆరోపణలు. ఆ సివిల్ వార్‌లో వేలాది మంది శ్రీలంక తమిళులు హతమయ్యారు.
మొత్తానికి ఒక నటుడిని ఒక క్రికెటర్ పాత్ర చెయ్యకుండా సోషల్ మీడియా ట్రోల్స్ విజయం సాధించగా, సినిమా ఓడిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |