![]() |
![]() |

వచ్చే క్రిస్మస్‌కు రెండు క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకటి రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో నాని టైటిల్ రోల్ చేసిన 'శ్యామ్ సింగరాయ్' కాగా, మరొకటి - డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపకల్పనలో వరుణ్‌తేజ్ టైటిల్ రోల్ పోషించిన 'గని'. డిసెంబర్ 24న ఈ సినిమాలు విడుదలవుతున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన 'గని'లో బాక్సర్‌గా వరుణ్‌తేజ్ కనిపించనుండగా, బెంగాల్ నేపథ్యంలో పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన 'శ్యామ్ సింగరాయ్'లో దేవదాసీ వ్యవస్థపై పోరాడే యువకునిగా నాని నటించాడు.
2019లో వచ్చిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' తర్వాత థియేటర్లలో వస్తున్న నాని సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ మధ్యలో 'వి', 'టక్ జగదీష్' మూవీస్ నేరుగా ఓటీటీలో రిలీజయ్యాయి.
కాగా వచ్చే క్రిస్మస్ తనదేనని నాని తేల్చి చెబుతున్నాడు. గురువారం ఏఎంబీ మాల్‌లో జరిగిన 'శ్యామ్ సింగరాయ్' టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో అతను ఈ విషయం చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. "రెండేళ్ల తర్వాత కరెక్ట్ సినిమాతో థియేటర్లకు వస్తున్నా. క్రిస్మస్ మాత్రం మనదే. ఫిక్సయిపోవడమే. ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా భావిస్తున్నా. అన్ని డిపార్ట్‌మెంట్స్‌తో మంచి టీమ్ దొరికినప్పుడు ఒక మంచి సినిమా ఎలా బయటకు వస్తుందనటానికి ఎగ్జాంపుల్ 'శ్యామ్ సింగరాయ్'. నిర్మాత వెంకట్ బోయినపల్లికి ఇది టెర్రిఫిక్ డెబ్యూ. అందులో నేనుండటం హ్యాపీ. ఈ సినిమా ఆయనకూ, నాకూ ఎప్పటికీ ఒక స్పెషల్ ఫిల్మ్‌గా ఉండిపోతుంది. ఎప్పుడు ఈ సినిమాని ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తానా అని ఎదురుచూస్తున్నాను. క్రిస్మస్ మనదే. టీజర్‌కు వంద రెట్లు ఇంపాక్ట్ థియేటర్‌లో ఉంటుంది. ఈ అరుపులు, ఈ సౌండ్, ఈ ఎనర్జీని కాస్త దాచుకోండి. మన సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంటిన్యూస్‌గా ఎంజాయ్ చేస్తూనే వుంటారు. డిసెంబర్ 24 'శ్యామ్ సింగరాయ్'.. మనదే." అంటూ మాట్లాడాడు నాని.
"మనదే.. మనదే.. మనదే" అంటూ బల్లగుద్దినట్లు నాని నొక్కి చెప్తుండటాన్ని బట్టిచూస్తే.. ఈ మూవీపై అతనెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థమవుతోంది. మరి బాక్సింగ్ బరిలో 'శ్యామ్ సింగరాయ్'ను తట్టుకొని 'గని'గా వరుణ్‌తేజ్ ఎలా రింగ్‌లో నిలబడతాడో చూడాల్సిందే.
![]() |
![]() |