![]() |
![]() |

నాని టైటిల్ రోల్ పోషిస్తోన్న 'శ్యామ్ సింగరాయ్' మూవీ టీజర్ వచ్చేసింది. ఆ టీజర్ చూస్తే.. ఇది ఒక ఆర్డినరీ సినిమా కాదనేది స్పష్టంగా తెలుస్తోంది. టీజర్ ఆరంభంలో సముద్రంలో ఓ పడవ మంటల్లో దగ్ధమవుతూ కనిపించింది. ఆ తర్వాత ఒక స్త్రీని అందరి ముందూ జుట్టుపట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తుండగా, అడిగే అండలేదు.. కలబడే కండలేదని రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే, కాగితం కడుపు చీల్చుకుపుట్టి రాయడమే కాదు, కాలరాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే అని ఒక లేడీ వాయిస్ బ్యాగ్రౌండ్‌లో వినిపించిన తర్వాత 'శ్యామ్ సింగ రాయ్' టైటిల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమైంది.
ఆ మాటలు వినిపిచేటప్పుడు కొంతమంది అమ్మాయిలు వరుసగా నిల్చొని కనిపించారు. వారిలో సాయిపల్లవి కూడా ఉంది. తర్వాత సీన్‌లో కొంతమంది కూర్చున్నవాళ్లలా దేన్నో చూసి.. ఆశ్చర్యపోతూ లేచి నిల్చున్నారు. నాని చేయి పడవ నడిపే తెడ్డు పట్టుకుంది. కొంతమంది వ్యక్తులు దేవదాసి పద్ధతిని ఆపేయాలని, అందరు స్త్రీలను గౌరవించాలని డిమాండ్ చేసే స్లోగన్స్ ఉన్న ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో తిరుగుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతలో గోడపై నాని ఫొటో వున్న పేపర్ అంటించి, దానిపై బ్లాక్ కలర్ క్రాస్ మార్క్ గీసి ఉండటం కనిపించింది. ఏవో టైపు చేసుకుంటూ నాని ప్రత్యక్షమయ్యాడు.. అతను టైప్ చేస్తున్న వాటిలో "HIS PROSTITUTES" అనే అక్షరాలు కనిపించాయి.
సముద్రపు నీటిలోంచి సాయిపల్లవి లేచి రెండు చేతులతో తలనుంచి కారుతున్న నీటిని సవరించుకుంది. ఆమె వ్యూ నుంచి ఒడ్డున పడవ, దాని పక్కనే ఇసుకపై కూర్చుని ఆమె వంకే చూస్తున్న నాని అస్పష్టంగా కనిపించారు. అతని వెనుక బైక్ స్టాండ్ వేసి ఉంది. నెక్ట్స్ సీన్‌లో త్రిశూలం పట్టుకొని కాళికాదేవి విగ్రహం ముందు తోటి డాన్సర్ల మధ్య నాట్యం చేస్తూ కనిపించింది పల్లవి. అప్పుడే అక్కడకు మెట్లమీద నుంచి బైక్ మీద దూసుకువచ్చాడు నాని. జనం అతడి వద్దకు ఆవేశంగా రాబోతుంటే, "ఏయ్.. ఆడవాళ్లు ఎవరైనా కొనుక్కునే, ఖైదుచేసే బానిసలు కాదు, ఆఖరుకి ఆ దేవుడికి కూడా.. ఖబర్దార్" అని బెంగాలీలో హెచ్చరించి, చేత్తో మీసం దువ్వాడు.
కట్ చేస్తే.. సీన్ నేటి కాలానికి మారింది. నాని, కృతి శెట్టి ఎదురెదురుగా నిల్చొని, ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నారు. కృతి చప్పున నాని పెదాలపై తన పెదాలను ఆన్చి, కొద్ది క్షణాల తర్వాత వెనక్కి జరిగింది. నాని చటుక్కున ఆమెను తనవైపు లాక్కున్నాడు. కట్ చేస్తే.. మళ్లీ కాలం వెనక్కి వెళ్లింది. ఇప్పుడు నాని చేతుల్లో వుంది సాయిపల్లవి. తనను పొదివి పట్టుకున్న నాని ముఖానికి పల్లవి తన ముఖాన్ని దగ్గరకు తెస్తుండగా టీజర్ ముగిసింది.
1:45 నిమిషాల నిడివి వున్న 'శ్యామ్ సింగరాయ్' టీజర్ చాలా విషయాలే చెప్తోంది. రెండు కాలాల్లో ఈ సినిమా కథ నడుస్తుందనేది మొదటి విషయం. దేవదాసీ వ్యవస్థ నడుస్తున్న కాలానికి సంబంధించిన కథ ఒకటైతే, నేటి కాలానికి సంబంధించిన కథ రెండోది. దేవదాసీ కాలపు కథ బెంగాల్ నేపథ్యంలో నడుస్తుందని దర్శకుడు ఈ టీజర్‌తో తెలిపాడు.

శ్యామ్ సింగరాయ్ ఒక రచయితో లేదా జర్నలిస్టో అయివుండాలి. స్త్రీలను వేశ్యలుగా మార్చే దేవదాసీ వ్యవస్థను రూపుమాపాలని కంకణం కట్టుకున్న వ్యక్తి అతను. దానికై అభ్యుదయ భావాలున్న కొంతమందితో పోరాటం చేస్తాడు. సాయిపల్లవి తల్లి ఒక దేవదాసి. తల్లిబాటలో పల్లవిని కూడా దేవదాసిగా మార్చాలనుకుంటారు. కానీ ఆమె దీన్ని వ్యతిరేకిస్తుంది. ఆమెకు అండగా నిలుస్తాడు మనసిచ్చిన శ్యామ్ సింగరాయ్. కానీ కరడుకట్టిన ఫ్యూడల్ భావజాలంతో ఉన్న జమీందార్లు ఊరుకుంటారా? వారిని బతకనిస్తారా? ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, అతని ప్రియురాలి కథ ఏమైందో చూడాలి.
ఆ శ్యామ్ సింగరాయ్ నేటి కాలంలో మళ్లీ పుట్టాడా? ఆ సాయిపల్లవి ఈ కాలంలో కృతి శెట్టిగా జన్మించిందా? టీజర్‌లోని చివరి సీన్ దీన్ని సూచిస్తోందా? ఇవి తెలియాల్సిన విషయాలు. నేటి కాలంలో టీవీ జర్నలిస్ట్‌గా నాని కనిపించనున్నడని తెలుస్తోంది. ఇప్పుడతను దేనిపై పోరాటం చేశాడో చూడాలి.
'టాక్సీవాలా' (2018) లాంటి థ్రిల్లర్‌ను రూపొందించిన రాహుల్ సాంకృత్యాన్ ఈసారి దానికి పూర్తి భిన్నమైన ఎమోషనల్ లవ్ స్టోరీతో, అదీ పీరియాడికల్ స్టోరీతో మనముందుకు వస్తున్నాడు. టీజర్ చూస్తే చాలా ప్రామిసింగ్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. 'శ్యామ్ సింగరాయ్'తో అతను మనకో భావోద్వేగపూరితమైన అనుభవాన్ని ఇవ్వనున్నాడని అనిపిస్తోంది. సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్ఘీస్ అతనికి తన కెమెరా ప్రతిభతో అద్వితీయమైన సహకారాన్ని అందించాడనేది స్పష్టం. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్, అవినాశ్ కొల్లా ఆర్ట్ వర్క్ ఈ సినిమాకు ఎస్సెట్స్‌గా నిలవనున్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తోన్న 'శ్యామ్ సింగరాయ్' డిసెంబర్ 24న మన ముందుకు వస్తున్నాడు.

![]() |
![]() |